నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు

– కాశింశెట్టి సత్యనారాయణ, 9704935660

శ్రీరామచంద్రుడు సర్వ భారతీయులకు సమాన దైవమైనప్పటికీ భద్రగిరి క్షేత్రంలో వెలసిన కారణంగా తెలుగు వారికి ప్రత్యేక దైవంగా పూజలందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలలోని సుప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటైన భద్రాచలం పేరు వినగానే భక్త శిఖామణి రామదాసు స్మృతిపథంలో నిలుస్తాడు. ప్రభుత్వ ధనంతో ఆయన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నిర్మించడం, ఫలితంగా కారాగృహ శిక్ష అనుభవిస్తూ శ్రీరామునిపై కీర్తనలు చెప్పడం, శ్రీరాముడు తానీషాకు ధనం చెల్లించి రామదాసుకు కారాగృహ విమోచనం కలిగించాడనే చారిత్రిక అంశాలను భక్తులు నిరంతరం స్మరించుకుంటుంటారు.

గోదావరికి ఉత్తర తీరంలోని తూర్పు కనుములలో భద్రుడనే ముని తపస్సు చేసి పర్వత రూపం దాల్చాడు. పితృవాక్య పరిపాలనతో సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి వచ్చిన రాముడు పర్వతాకృతిలో ఉన్న భద్రుని శిలపై కూర్చున్నాడు. భద్రుడు ముని రూపధారుడై ఆయన పాదాలకు భక్తితో నమస్కరించాడు. ‘నీకేమి కావాలో కోరుకో’ అని రాముడు అడగగా, ‘శ్రీరామా! నాపై శాశ్వతంగా నిల్చి భక్తులకు మోక్షసంపద ప్రసాదించు’ ప్రార్థించాడు. రాముడు భద్రుడి కోరికను మన్నిం చాడు. శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరాడు. భద్రుని రూపమైన పర్వతం కావడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. ‘రామ భద్రం పదాం కత్వాత్‌ ‌భదాద్రిరితి విశ్రుతః’ శ్లోకాన్ని బట్టి శ్రీరామభద్రుని పాద చిహ్నములు ధరించడం వల్ల దానికి ఆ పేరు కలిగినట్లు చెబుతారు.

భద్రాచలానికి సుమారు ఒక మైలు దూరంలో బద్రిరెడ్డిపాలెం అనే పల్లెకు చెందిన సవర జాతి స్త్రీ పోకల దమ్మక్కనే భక్తురాలికి ఒకనాటి రాత్రి కలలో కన్పించిన రామచంద్రుడు తాను భద్రగిరిపై కొలువై ఉన్నట్లుగా చెప్పాడని, అలా భద్రగిరి వెలుగులోకి వచ్చిందని అంటారు. కంచర్ల గోపన్న (అనంతర కాలంలో రామదాసుగా ప్రసిద్ధుడు) గోల్కొండ నవాబు అబుల్‌ ‌హసన్‌ ‌షా (తానీషా) కొలువులో నాటి ఖమ్మంమెట్టు పేష్కారుగా నియమితులయ్యారు. ఆ తరువాత హాసనాబాదు (పాల్వంచ) పరగణాకు శిస్తు వసూలు అధికారిగా నియమితులయ్యారు. ఆయన భక్తి ప్రపత్తులు, గుణగణాల గురించి విన్న దమ్మక్క ఆయనను కలసి భద్రగిరిలోని శ్రీసీతారామలక్ష్మణుల విషయాన్ని వివరించింది. గోపన్న ఆ ప్రాంతాన్ని, విగ్రహాలను సందర్శించి భక్తి పారవశ్యంతో ‘దాశరథీ కరుణా పయోనిధి’ లనే మకుటంతో శతకం (దాశథి శతకం) రాశారు. అక్కడ విగ్రహాలకు అర్చనాదులు, పేదలకు అన్నదానాలు ప్రారంభించారు ఒకనాడు అన్నదాన సమయంలో గోపన్న కుమారుడు ‘రఘురాముడు’ వేడి గంజిగుంటలోపడి మరణించాడు. రామదాసు ‘కోదండరామా’ అనే కీర్తన పాడగా బాలుడు పునరుజ్జీవుడయ్యాడని చెబుతారు.

కుటీరంలో ప్రతిష్ఠితమైన సీతారామ లక్ష్మణులకు శాశ్వత ఆలయాన్ని నిర్మించాలని గోపన్న సంకల్పిం చారు. అయితే అందుకు తగినంత ఆదాయము సమకూరలేదు. దాంతో తన వద్ద గల ప్రభుత్వ ధనంతో పనికి పూనుకొని సుమారు రెండు సంవత్సరాల్లో పూర్తి చేశాడు. అయితే, సర్కార్‌ ‌నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఆలయ నిర్మాణం చేపట్టి సుమారు ఆరు లక్షల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశాడన్న నేరంపై నవాబు, గోల్కొండ కోటలో సుమారు పన్నెండేళ్లు (1674-1686) కారాగార శిక్ష విధించారు. ఆ సమయంలో రామదాసు తాను పడిన పాట్లన్నీ కీర్తనలుగా పాడు కున్నాడు. సీతారామ లక్ష్మణులకోసం తాను చేయించిన ఆభరణాను, అందుకైన ఖర్చును ఒక కీర్తనలో వివరిస్తూ, ‘ఇది నీ యబ్బ సొమ్మా – తాత సొమ్మా’ అంటూ నిందాపూర్వకంగా ప్రశ్నించాడు. ఎంత మొరపెట్టుకున్నా లాభం లేక దయార్ద్ర హృదయయైన సీతమ్మను సంబోధిస్తూ, ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’ అని వేడుకున్నాడు. ఎట్టకేలకు మొరలాలకించిన శ్రీరాముడు తమ్ముడితో కలసి దేవాలయ భటుల రూపంలో తానీషా పడకగదిలో కలసి, ఆలయ నిర్మాణానికి రామదాసు వెచ్చించిన ధనాన్ని చెల్లించి, రశీదును చెరసాలలో నిద్రిస్తున్న రామదాసు తలకిందపెట్టి అదృశ్య మయ్యారు. రాత్రి ధనాన్ని అందుకున్న తానీషా ఆ అద్భుత సంఘటనను మననం చేసుకుంటూ ఉదయాన్నే రామదాసుకు విముక్తి కలిగించాడు. ‘జాతస్య మరణం ధ్రువమ్‌’ అన్నట్లు మహాభక్తుడు రామదాసు కొంతకాలానికి శ్రీరామచంద్రునిలో ఐక్యమయ్యాడు. ఇంతవరకూ అందరికీ తెలిసిందే.

1769-70 ప్రాంతంలో భద్రాచలంపై ‘తురకలు’ (కవి వాడిన పదం) దండెత్తినప్పుడు ఆ ఆపద నుండి తప్పించాలని బల్ల పేరయ్య కవి రాముడిని వేడుకుంటూ శతకాన్ని వ్యాజస్తుతిగా రాశాడని ప్రతీతి. యవన సైన్యం అనేక హిందూ దేవాలయాలను నాశనం చేసింది. సింహాచల క్షేత్రంలో గోగులపాటి కూర్మనాథ కవి ‘నారసింహ శతకం’, తిరుపతిలో ఒక అజ్ఞాత కవి రాసిన ‘శ్రీ వేంకటాచల విహార శతకం’ ఈ కోవలేనివే. దాంసా (జఫర్‌ ‌బేగ్‌ ‌ఖాన్‌) అనే యవనుడు అనేక రాజ్యాలను ఆక్రమిస్తూ అనేక దురాగతాలు చేస్తూ భద్రాచలాన్ని ముట్టడించారు, విగ్రహాలను ధ్వంసం చేస్తాడనే భయంతో అప్పటి పూజారులు ఆ విగ్రహాలను ‘పట్టిసీమ’ పోలవరానికి చేర్చి (1770) సుమారు ఐదు సంవత్సరాలు అక్కడే ఉంచారు. తరువాత పూసపాటి విజయ రామరాజు కాలంలో బొబ్బిలి యుద్ధం (1757) అనంతరం భద్రాచలంలో ప్రతిష్ఠించిన ట్లు అక్కడ దొరికిన శాసనాలు పేర్కొంటున్నాయి. బహుశా విగ్రహాలను ‘పట్టిసీమ’ తీసుకువెళ్లిన కాలంలో పేరయ్య కవి ఈ శతకాన్ని ఆరంభించి, విగ్రహాలను వెనుకకు తెచ్చిన కాలంలో పూర్తి చేసి ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉంది. ‘భద్రగిరివాసా శ్రీరామచంద్ర దాస’ అనే మకుటం గల ఈ శతకం ఆనాటి దేశ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపుతుంది.

భద్రాచల దేవాలయం ‘తురకల’ పాలయిందని, ఇక ఆ మతాన్ని అవలంబించాలని ఒత్తిడి వచ్చిందని కవి మరో పద్యంలో చెప్పారు. విజయనామ సంవత్సరంలో వారి అలజడి తగ్గి శ్రీరాముడు భద్రగిరిలో పట్టాభిషిక్తుడైనట్లు కవి శతకాంతంలో రాశారు. అయితే 1776లో ఆ విగ్రహాలను బస్తర్‌ ‌రాష్ట్రం లోని కమలాపురానికి మార్చవలసి వచ్చింది. 1782లో దాస మరణించాడు, 1785లో విగ్రహాలను మళ్లీ భద్రాచలానికి చేర్చారు. ఇలా రామదాసు మరణానంతరం భద్రాచల దేవాలయ అనేక చిక్కు పరిస్థితులను ఎదుర్కొంది.

ఆ తరువాత గుంటూరు వాసి తూముల లక్ష్మీనరసింహదాసు, చెన్నపట్టణవాసి భద్రగిరి వరద రామదాసు స్నేహితులు దేవాలయాన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని పూనుకున్నారు. నరసింహ దాసు గొప్ప కవి, వ్యవహారదక్షుడు కాగా, వరద రామదాసు సంపన్నుడు. తన ఆస్తినంతా వెచ్చించి దేవాలయోద్ధర ణకు నడుం కట్టారు. నరసింహదాసు హైదరాబాద్‌ ‌వెళ్లి నాలుగవ నిజాం నజరుద్దేలా మంత్రి చందూ లాల్‌ను దర్శించి భద్రాచల దేవాలయ దుస్థితిని విన్నవించారు. దాంతో దేవాలయ నిర్వహణకు రామదాసుకు తానీషా ఇచ్చిన అధికారాన్ని పునరుద్ధరించారు. నరసింహదాసును ‘రాజా’ బిరుదుతో సత్కరించి, సంస్థను నిర్వహించా లని కోరారు. అయితే తన బదులు ఆలయ జీర్ణోద్ధరణకు సర్వం ధారపోసిన వరద రామదాసు ఆ బాధ్యతలు నిర్వహించడం సమంజసమని భావించిన నరసింహ దాసు అయన పేరున ఫర్మానా చేయించారు. ఆలయంలోని స్తంభంపై గల శాసనం ఈ విషయాన్ని పేర్కొం టోంది.

అంతేగాక 1831లో అర్చకులకు ఆజ్ఞాపత్రం కూడా ఇచ్చారు. అది ఇప్పటికీ దేవాలయంలో ఉంది. నరసింహదాసు దక్షిణదేశ యాత్ర చేస్తున్న త్యాగరాజ స్వామి వారిని దర్శించి, వారిని భద్రాచలానికి గౌరవ పూర్వక•ంగా ఆహ్వానించారు. త్యాగరాజస్వామి ఆయన ఆహ్వానాన్ని మన్నించి భదాద్రికి వచ్చి శ్రీరామ దర్శనానందంలో దేవాలయ ప్రాంగణంలో ‘మోహనరామ’, ‘ఎన్నగాను రామభజన, ‘గిరిపై నెలకొన్న’, ‘క్షీరసాగర శయనా’ మున్నగు కీర్తనలను గానం చేశారట. రామదాసు స్మరించారని పెద్దలు చెబుతారు. 1832లో భయంకరమైన కరవు వచ్చినప్పుడు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆ మిత్రులిద్దరు ‘లేదనకుండా’ అన్నదానము చేసి ప్రాణాలను కాపాడారు వరద రామదాసు 1833లో మరణించడంతో, విరక్తి చెందిన నరసింహదాసు మిత్రుడితో సహ తనువు చాలింప నిశ్చయించు కున్నారు. తన మిత్రునికి గోదావరి అంటే చాలా ఇష్టం గనుక ఆయన భౌతికకాయాన్ని ఆ ప్రవాహంలో కలిపివేయడానికి నిర్ణయించి వరద రామదాసు మహా ప్రస్థానం వైకుంఠ యాత్రోత్సవంగా నిర్వహించారు. 1833 సెప్టెంబర్‌ 18‌న (బుధవారం) వరద రామదాసు భౌతిక కాయాన్ని గోదావరికి అర్పించిన నరసింహదాసు పాటలు పాడుతూ తాను కూడా గోదావరిలో దూకేశారు. ఆయన వెంట ఉన్న 18 మంది భక్తులు కూడా అయనను అనుసరించారు. అయితే, నదిలో కొట్టుకుపోయేవారిని కాపాడేందుకు అప్పటికే ఏర్పాటైన గజ ఈతగాళ్ల బృందం వారిని రక్షించింది. నరసింహదాసు మాత్రం దొరకలే•దు. వారి కుటుంబపోషణ కోసం మంత్రి చందూలాల్‌ ఐదు ఊళ్ల శిస్తును విరాళంగా ప్రకటించారు. వైకుంఠ యాత్ర సమయంలో నరసింహదాసు పాడిన గీతాలను ఇప్పటికీ భ•క్తజనులు గానం చేస్తుంటారు.

నరసింహ, వరద రామదాసుల అనంతరం దేవాలయ నిర్వహణ బాధ్యతలను చందూలాల్‌ ‌దేవాలయ ప్రధానుల కప్పగించి రూ.18,500 శ్రీరాముని పేరిటి జమచేశారు. ఆ తరువాత నిజాం కాలంలో ఈ మొత్తం రూ.40 వేలకు పెరిగి, క్రమంగా రూ.9,500కు తగ్గింది. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణోత్సవ సందర్భంగా త•లంబ్రాలుగా నిజాం నవాబులు మంచి ముత్యాలను పంపేవారు. నేటి ప్రజాప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది..

భద్రాచలం సమీపంలో పర్ణశాల ఉంది. అరణ్యవాస సందర్భంలో సీతారామలక్ష్మణులు దానిని కట్టుకుని నివసించడం వల్ల ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. రావణుడు సీతను అపహ రించుకుని పోయిన స్థలానికి పక్కనే దేవాలయం నిర్మితమై ఉంది. దానికి ఆరు మైళ్ల దూరంలో దుమ్ముగూడెం గ్రామం ఉంది. శ్రీరాముని చేతిలో మడిసిన ఖరదూషణాది చతుర్దశ సహస్ర రాక్షసుల బూడిద (దుమ్ము)పై నిర్మించిన గ్రామం అనే పేరు వచ్చిందట. పర్ణశాల నుండి భద్రాచలం వెళ్లే దారిలో ‘యేటపాక’ గ్రామం ఉంది. ఇది ‘జటాయుపాక’ అనే దానికి రూపాంతరమని, జటాయువు రావణునితో పోరాడి మరణించిన ప్రదేశం కావడం వలన దానికా పేరు వచ్చినదని ప్రతీతి. భద్రాచలానికి రెండు మైళ్ళ దూరంలో గోదావరిలో ఉష్ణజల గుండాలున్నాయి అక్కడ ఇసుక తవ్వితే వేడి నీరు వస్తుంది. సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో నివసించినప్పుడు శీతకాలంలో అక్కడే స్నానమాచరించేవారట. ఇలా ఎన్నో విశేషాలు ఈ పవిత్ర క్షేత్రము చుట్టూ ఉన్నాయి.

ఆధారాలు :

  1. అచ్చంగా తెలుగు మాసపత్రికభద్రగిరి శతకము బల్లా పేరయ్యకవి, దేవరకొండ సుబ్రహ్మణ్యం
  2. శ్రీ వెంకటేశ్వర వ్యాసం లఘుకృతులు, వేటూరి ప్రభాకర శాస్త్రి శతక కవి నల్లకాల్వ వరకవి సీతాపతి . 6-47
  3. భద్రాచల క్షేత్ర మహిమ  సంపాదకేయుడు : డి. సుదర్శన్‌
  1. శ్రీ ‌భద్రాచల క్షేత్రము, డా. దివాకర్ల వేంకటావధాని వ్యాసం 1 – 15

About Author

By editor

Twitter
Instagram