– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

సెప్టెంబర్‌ 2, 2022. ‌స్వతంత్ర భారత నౌకాదళ చరిత్రలో  సువర్ణాధ్యాయాన్ని ఆవిష్కరించింది. కేరళ తీరంలో ప్రతి భారతీయుడు ఈ రోజు సరికొత్త భవితవ్యాన్ని సూచిస్తున్న సూర్యోదయాన్ని దర్శించాడని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంలోని అంతరార్థం ఇదే. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నౌకాదళంలోకి చేరిన చరిత్రాత్మక ఘడియలు అవి. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ అం‌టే అలల మీద రూపు కట్టిన ఆత్మనిర్భర భారత్‌ ఆశయం. నేటి భారతావనికి ఏ సవాలు అధిగమించలేనిది కానేకాదన్న వాస్తవాన్ని ప్రకటించేదని కూడా మోదీ సగర్వంగా ప్రకటించారు. నిజంగా అదొక చరిత్రాత్మక సందర్భమే. సర్వశక్తిమంతమైన, దృఢమైన భారత్‌ ‌కోసం మన స్వరాజ్య సమరయోధులు కన్న కల ఇవాళ, ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల  వేళ నెరవేరిందని ఆయన ఉద్విగ్న భరితంగా చెప్పడం కూడా అందుకే. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌సేవలు మొదలు కావడమంటేనే బానిసత్వ భావన నుంచి, బానిసత్వం బరువు నుంచి కూడా విముక్తం కావడమేనని అన్నారు. అందుకు మరొక గొప్ప నిదర్శనం- ఈ సెప్టెంబర్‌ 2 ‌నుంచి భారతీయ నౌకాదళం కొత్త పతాకాన్ని అలంకరించుకుంది. అది ఛత్రపతి శివాజీ కాలం నాటి గుర్తుతో ఉన్న జెండా కావడం మరొక అద్భుతం. ఈ పతాకం స్ఫూర్తి నిస్సందేహంగా అంబరచుంబితమే.


ఆజాదీకా అమృతోత్సవ్‌లోని అమృతమే ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌గా రూపు కట్టిందని కూడా ప్రధాని చెప్పారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌భారత నౌకాదళ అమ్ములపొదిలో ఆ రోజే చేరింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను కమిషనింగ్‌ ‌చేయడం ద్వారా స్వంతంగా విమాన వాహక యుద్ధ నౌకలను తయారుచేయగల ఎలీట్‌ ‌గ్రూపు దేశాలలో భారత్‌ ఒకటిగా చేరింది. దిగంతాలకు ఆవల ఉన్న లక్ష్యాలను చేరుకోవడానికి, సుదూర తీరాల ప్రయాణాలకి, అనంతమైన సాగరాల సవాళ్లకి భారత్‌ ఇస్తున్న సమాధానం ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ అని ప్రధాని చెప్పారు. అయితే భారత్‌ ‌శక్తిమంతం కావడం కేవలం ప్రపంచంలో శాంతికి మార్గం ఏర్పరచడానికీ, ప్రపంచం క్షేమంగా ఉండ డానికేనని ప్రధాని స్పష్టం చేయడం స్వాగతించ దగినది.

భారత్‌ ‌స్వయం సమృద్ధమవుతున్నదన్న అద్భుత వాస్తవం ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌లో ప్రతిఫలిస్తున్నదని కూడా ప్రధాని చాటారు. అంతేకాదు, ఇంతటి శక్తి సంపన్న నౌకలో స్త్రీలకు కూడా సమున్నత స్థానం కల్పించారు. ఇందులో మహిళా సైనికులు కూడా ఉంటారు. ఈ సాగరపు అలల మాదిరిగానే మన దేశ సోదరీమణుల శక్తికి కూడా అవధులు లేవని ఆయన శ్లాఘించారు. వచ్చే పాతికేళ్లలో భారత్‌ ‌రక్షణ విషయంలో తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఈ ‌సందర్భంగా చెప్పారు. ఆత్మ నిర్భర భారత్‌ ‌విధానంలో ప్రభుత్వం ఎలాంటి వెనకంజ వేయదని ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నిర్మాణమే చాటి చెప్పిందని కూడా రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, వాణిజ్యం, రవాణా, సమాచార వ్యవస్థలలో తీసుకువచ్చినట్టే రక్షణ రంగంలోను భారత్‌ ‌సమూల మార్పులు తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.

దేశీయంగా ఇంతటి అత్యాధునిక సదుపాయాలతో అతిపెద్ద విమానవాహక నౌకను తయారు చేయడం ఇదే ప్రథమం. భారత నేవీకి చెందిన ‘‘వార్‌ ‌షిప్‌ ‌డిజైన్‌ ‌బ్యూరో’’ (డబ్ల్యుడీబీ) ఈ నౌకను డిజైన్‌ ‌చేయగా, ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్‌ ‌షిప్‌యార్డ్ ‌లిమిటెడ్‌ ‌దీన్ని నిర్మించింది. ఈ షిప్‌యార్డ్ ‌కేంద్ర పోర్టస్, ‌షిప్పింగ్‌, ‌వాటర్‌వేస్‌ ‌మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. మన దేశానికి చెందిన మొట్టమొదటి విమానవాహక యుద్ధ నౌక ‘‘విక్రాంత్‌’’ ‌పేరునే దీనికి కూడా పెట్టారు. 1971 పాక్‌ ‌యుద్ధంలో ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ఎం‌తో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత విక్రాంత్‌ ‌తయారీలో దేశీయంగా అనేక పరిశ్రమలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముఖ్యంగా వందకు పైగా ఎంఎస్‌ ఎంఈలు విక్రాంత్‌ ‌నిర్మాణంలో భాగస్వాము లయ్యాయి.

నిజానికి నౌకా నిర్మాణం, సముద్ర వ్యాపారం భారతదేశానికి కొత్తేమీ కాదు. ఎటొచ్చీ ఆ చారిత్రక వాస్తవాన్ని మనం విస్మరిస్తున్నాం. ఈ సంగతిని కూడా ప్రధాని గుర్తు చేశారు. గుర్తు చేయడం అవసరం కూడా. సముద్రయానం, తీర ప్రాంత రక్షణను ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ‌గొప్పగా గుర్తించారని ప్రధాని అన్నారు. ఆయన నౌకాబలంతోనే శత్రువుల వెన్నులో వణుకు పుట్టిందని గుర్తు చేశారు. ఆంగ్లేయులు మాత్రం మన నౌకాదళ ప్రతిభా సామర్థ్యాలకు భయపడి, ఆ వ్యవస్థను నాశనం చేసేశారని కూడా ప్రధాని చెప్పారు. భారతీయుల నౌకా నిర్మాణం మీద, నౌకల ప్రయాణాల మీద, వాణిజ్య నౌకల మీద బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ఎన్ని ఆంక్షలు విధించిందో గుర్తు చేసుకోవలసిన అవసరం కూడా ఉందని ప్రధాని అన్నారు. అలాంటి అవరోధాలను అధిగమించడానికి ఏడున్నర దశాబ్దాలు పట్టింది.

ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌దేశానికి సరికొత్త స్థయిర్యాన్ని ప్రసాదించిందని ప్రధాని వ్యాఖ్యానించడం వెనుక గొప్ప నేపథ్యమే ఉన్నది. ఇది నౌకాదళంలో ప్రవేశించడంతో భారత్‌కు ప్రస్తుతం రెండు విమాన వాహక యుద్ధనౌకలు సమకూరినట్లయింది. మొదటిది ఐఎన్‌ఎస్‌ ‌విక్రమాదిత్య కాగా రెండవది ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌. ఈ ‌నౌక తయారీకి మొత్తం రూ.20,000 కోట్లు ఖర్చు కాగా, చిట్టచివరి నాల్గవ సముద్ర ట్రైల్స్‌ను ఆగస్టు నెలలో పూర్తి చేసుకుంది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌లో మొత్తం 2300కు పైగా కంపార్ట్‌మెంట్‌లున్నాయి. 1700 మంది సిబ్బంది ఇందులో పనిచేయవచ్చు. వీరిలో 160 మంది అధికార్లు, 1400 మంది నావికులు ఉంటారు. ముఖ్యంగా మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక కేబిన్‌లను ఏర్పాటు చేయడం విశేషం. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌లో రెండు మెడికల్‌ ‌కాంప్లెక్స్‌లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. పూర్తి సదుపాయాలతో కూడిన రెండు ఆపరేషన్‌ ‌థియేటర్లు ఉన్నాయి. మొత్తం రెండువేల మంది సిబ్బందికి సరిపడా భోజన సదుపాయం ఉంది. విక్రాంత్‌ ‌గరిష్ఠ వేగం 28 నాట్‌లు (గంటకు 50 కిలోమీటర్లకు పైగా) కాగా సాధారణ వేగం 18 నాట్‌లు. 7500 నాటికల్‌ ‌మైళ్లదూరం ప్రయాణించగలదు. ఈ విమాన వాహక నౌక పొడవు 262 మీటర్లు కాగా, వెడల్పు 62 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు. దీన్ని వెన్నుపలక (•వవశ్రీ)ను 2009లో ఏర్పాటుచేశారు.

ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌పై మొత్తం 35 యుద్ధ విమానాలను నిలుపవచ్చు. అయితే బోయింగ్‌ ‌కంపెనీ తయారీ ఎఫ్‌-18 ‌సూపర్‌ ‌హార్నెట్‌ ‌లేదా దసాల్ట్ ‌తయారీ రఫేల్‌ ‌యుద్ధ విమానాల మధ్య ఇందుకు గట్టి పోటీ ఉంది. అయితే ప్రస్తుతానికి రష్యా తయారీ మిగ్‌-29 ‌యుద్ధ విమానాలను వినియోగించనున్నారు. రష్యా తయారీ నేవెల్‌ ‌వర్షన్‌ ‌మిగ్‌-29 ‌యుద్ధ విమానాలనే ‘బ్లాక్‌ ‌పాంథర్‌’ అని వ్యవహరిస్తారు. మిగ్‌-29 ‌కె/కెయుబి రకం 45 యుద్ధ విమానాలను ఇప్పటికే రష్యా మన దేశానికి రెండు బ్యాచ్‌లుగా సరఫరా చేసింది. మొదటి బ్యాచ్‌లో 16 విమానాలు 2011లో, రెండో బ్యాచ్‌ ‌కింద 29 విమానాలు 2016లో రష్యా మనదేశానికి సరఫరా చేసింది. మిగ్‌-29 ‌యుద్ధ విమానం నేవెల్‌ ‌వర్షన్‌ను మిగ్‌-29‌కె అని కూడా వ్యవహరిస్తారు. ఇవి యాంటీ ఎయిర్‌, ‌యాంటీ-సర్ఫేస్‌ , ‌భూతల దాడులకు ఉపయోగపడగలవు. ఈ విమానాలు శబ్దవేగం కంటే రెండు రెట్లు వేగంతో (2మ్యాచ్‌ ‌స్పీడ్‌) ‌ప్రయాణించగలవు. గాలిలో ఇంధనం నింపుకునే సదుపాయం ఉండటంవల్ల సుదూర ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించే సామర్థ్యం వీటి సొంతం. ఇవి భూమ్యాకర్షణ కంటే ఎనిమిది రెట్లు అధిక శక్తితో ముందుకు దూసుకెళ్లి, 65వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు. మిగ్‌ 29‌కె స్క్వాడ్రన్‌కు ‘‘ఐఎన్‌ఏఎస్‌ 303’’ అని పేరు పెట్టారు. ‘బ్లాక్‌ ‌పాంథర్‌’ అం‌టే ఇవే. గాలి నుంచి గాల్లో మిషన్లను నిర్వహించే మిగ్‌-29‌బికి ఇవి భిన్నం. మిగ్‌-29‌కె యుద్ధ విమానాలతో పాటు కమోవ్‌-31 ‌హెలికాప్టర్లు, అమెరికా తయారీ ఎంహెచ్‌-60ఆర్‌ ‌మల్టీ రోల్‌ ‌హెలికాప్టర్లు, దేశీయ తయారీ అడ్వాన్స్‌డ్‌ ‌లైట్‌ ‌హెలికాప్టర్లు, లైట్‌ ‌కంబాట్‌ ఎయిర్‌ ‌క్రాఫ్ట్(‌తేజస్‌)‌లు కూడా ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌పై వినియోగిస్తారు.

రెండు ఫుట్‌బాల్‌ ‌మైదానాల పరిమాణం

‘‘ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ అతిపెద్దది. ఇది యుద్ధనౌక మాత్రమే కాదు. 21వ శతాబ్దంలో భారత్‌ ‌ప్రదర్శించిన నిబద్ధతకు, పడిన కష్టానికి, చూపిన ప్రతిభకు, దేశీయ రక్షణరంగం స్వయం సమృద్ధి సాధిస్తున్నదనడానికి గొప్ప ఉదాహరణ’’, సెప్టెంబర్‌ 2‌న ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను కొచ్చిన్‌ (‌కేరళ)లో ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలివి. పరిమాణపరంగా విక్రాంత్‌ ‌రెండు ఫుట్‌బాల్‌ ‌మైదానాలంత పెద్దది. ఇందులో ఉపయోగించిన కేబుళ్ల పొడవు ‘‘కోచ్చిన్‌ ‌నుంచి కాశి’’ వరకు దూరంతో సమానం. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నిర్మాణంలో ఉపయోగించిన స్టీల్‌తో మూడు ఈఫిల్‌ ‌టవర్లను నిర్మించవచ్చు!! ఇందులో ఉపయోగించే విద్యుత్‌ ఐదువేల ఇళ్లను ప్రకాశమానం చేయగలదు. సగం కొచ్చిన్‌ ‌నగరానికి విద్యుత్‌ ‌సరఫరా చేయవచ్చు కూడా! అంతేకాదు ఇందులో ఉపయోగించిన ఉక్కు మొత్తం స్వదేశీయంగా తయారైందే. ఒక్కమాటలో చెప్పాలంటే ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ఒక ‘‘తేలియాడే వైమానిక స్థావరం!’’. దీని బరువు 40,000 టన్నులు. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను ఒకప్పుడు అతిపెద్ద నౌకాదళాన్ని నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్‌కి, ప్రధాని అంకితమిచ్చారు.

రెండువేల మందికి ప్రత్యక్ష ఉపాధి

 ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌పై ప్రత్యక్షంగా రెండువేల మందికి ఉపాధి లభిస్తుండగా, మరో 40వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తోంది.ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌లో ఉపయోగించే 76శాతం మెటీరియల్‌ ‌దేశీయమే. ఇందులో దేశీయంగా తయారుచేసిన స్పెషల్‌ ‌గ్రేడ్‌ ‌స్టీల్‌ 21,500 ‌టన్నులు. దీన్ని దేశీయ యుద్ధ నౌకలో ఉపయోగించడం ఇదే ప్రథమం. ఒక్కమాటలో చెప్పాలంటే ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌మన దేశానికి కలికితురాయి వంటిది. ఎందుకంటే, ఈవిధంగా విమానవాహక యుద్ధ నౌకలను నిర్మించే సామర్థ్యం ప్రపంచంలో కేవలం ఐదారు దేశాలకే ఉంది. వీటిల్లో మన దేశం ఒకటి!!

2009లో నిర్మాణం ప్రారంభం

భారత్‌ ‌నిర్మించాలనుకుంటున్న రెండు ‘విక్రాంత్‌ ‌క్లాస్‌’‌కు చెందిన ఉపరితల యుద్ధ నౌకల్లో ఈ విక్రాంత్‌ ఒకటి. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నిర్మాణం 2009లో కొచ్చిన్‌ (‌కేరళ) షిప్‌యార్డులో ప్రారంభ మైంది. దేశంలోని 50 తయారీ పరిశ్రమలు ప్రత్యక్షంగా ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. దేశీయంగా నిర్మించిన అత్యంత క్లిష్టమైన యుద్ధనౌక కూడా ఇదే. ప్రస్తుతం దీన్ని ఐఏసీ-1 (దేశీయ విమానవాహక యుద్ధనౌక-1) అనే కోడ్‌ ‌పేరుతో వ్యవహరించి, భారత నేవీలో ప్రవేశం తర్వాత దీన్ని ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌పేరుతో పిలుస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌సముద్రంలో ఒంటరిగా ప్రయాణించదు. దీనికి ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు రక్షణగా నిలిచి దాడులనుంచి ఎప్పటికప్పుడు కాపాడతాయి. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌సముద్ర జలాల్లోకి ప్రవేశం భారత నేవీని ‘బ్లూ వాటర్‌ ‌ఫోర్స్’‌గా వ్యవస్థీకృతం చేసింది. అంటే ఇకనుంచి భారత్‌ ‌సుదూర సముద్రాల్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించగలదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను కల్పించే దేశంగా భారత్‌ ‌తనను తాను రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చైనా తన ఆధిపత్యం కోసం దూకుడుగా వ్యవహరించడమే కాదు, ఇందుకోసం ఇప్పటికే రెండు విమానవాహక యుద్ధనౌకలను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది కూడా. మూడోదాన్ని నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశ సామర్థ్యాన్ని ఇనుమడింపజేసుకోవడానికి విమానవాహక యుద్ధనౌకలు చాలా అవసరం. భారత్‌కు మరిన్ని జలాంతర్గాములు, విమానవాహక యుద్ధ నౌకలు అవసరమన్న దానిపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి భారత్‌ ‌వద్ద 15 సంప్రదాయిక జలాంతర్గాములు, ఒక బాలిస్టిక్‌ ‌మిస్సైల్‌ ‌సబ్‌ ‌మెరైన్‌, ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ఉన్నాయి. ఇప్పుడు మూడో విమానవాహక యుద్ధ నౌక అవసరమన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ఉన్న రెండింటిలో ఒకటి మెయింటెనెన్స్‌కు వెళ్లితే, అప్పుడు ఈ మూడోది రంగంలో ఉండటం వల్ల రెండు ఎయిర్‌ ‌క్రాఫ్ట్ ‌కెరీర్‌లు విధుల్లో ఉంటాయన్నది ఈ వాదన సారాంశం. ఐఎన్‌ఎస్‌ ‌నిశాల్‌ ‌పేరుతో దీన్ని తయారుచేయాలన్నది నేవీ అభిప్రాయం.

కొత్తవాటికి పాతపేర్లు

తండ్రులు తాతల పేర్లు తమ కింది తరాలవారికి పెట్టుకోవడమనేది అన్ని సంస్కృతుల్లో సర్వ సాధారణం. ఉదాహరణకు మన దేశంలో విక్రమా దిత్యుడి పేరును ఆయన అనంతరం పాలించిన రాజులు చాలామంది పెట్టుకున్నారు. పశ్చిమ దేశా సంస్కృతిలో కూడా కనిపించే ఈ ప్రవృత్తి, ప్రపంచ వ్యాప్తంగా సైనిక దళాల్లో ముఖ్యంగా నౌకాదళాలలో అనుసరిస్తుండటం కద్దు. ఉదాహరణకు యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌కు చెందిన తర్వాతి తరాలకు చెందిన నౌకలకు కూడా హెచ్‌ ఎంఎస్‌ ఆర్క్ ‌రాయల్‌ ‌పేరు పెట్టుకున్నారు. అదేవిధంగా అమెరికా నౌకలకు కూడా ఎంటర్‌‌ప్రైజెస్‌, ‌కొలంబియా వంటి పేర్లు తర్వాతి కాలంలో నిర్మించిన నౌకలకు కూడా పెట్టడం కనిపిస్తుంది. అంతరిక్ష నౌకలకు కూడా పాత పేర్లు పెట్టుకునే సంస్కృతి వాడుకలో ఉన్నదే.

మన దేశంలోను సోవియట్‌ ‌యూనియన్‌లో నిర్మించి తెచ్చిన ఐఎన్‌ఎస్‌ ‌కల్వరి, ఐఎన్‌ఎస్‌ ‌కాంధారి, ఐఎన్‌ఎస్‌ ‌కరంజ్‌ ‌వంటి జలాంతర్గాములను 1967 నుంచి 1969 మధ్యకాలంలో నేవీలోకి ప్రవేశపెట్టారు. ఇవన్నీ 1996, 2003 మధ్య కాలంలో డికమిషన్‌ అయ్యాయి. ఫ్రాన్స్ ‌సహకారంతో తర్వాత నిర్మించిన మూడు జలాంతర్గాములకు ఇవే పేర్లు పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఇవి సేవలు అందిస్తున్నాయి. అదేవిధంగా సోవియట్‌ ‌యూనియన్‌ ‌కాలం నాటి ఐఎన్‌ఎస్‌ ‌వేలా, ఐఎన్‌ఎస్‌ ‌వగిర్‌, ఐఎన్‌ఎస్‌ ‌వాగ్‌షీర్‌లు 1973-75 మధ్యకాలంలో కమిషనింగ్‌ అయ్యాయి. ఇవి 1997-2010 మధ్య డికమిషనింగ్‌ ‌చేశారు. తర్వాతి తరంలో తయారు చేసిన మరో మూడు జలాంతర్గాములకు ఇవే పేర్లు పెట్టారు. ఇప్పుడు తాజాగా ఇందుకు ఉదాహరణ ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌!

ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ 1971‌లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కీలకపాత్ర పోషించడమే కాదు, బంగ్లాదేశ్‌ ఏర్పాటుకు దోహదం చేసింది. ఈ విక్రాంత్‌ ‌యుద్ధనౌకను అప్పట్లో భారత్‌ ‌బంగాళాఖాతంలో మోహరించింది. ఇది పోర్టులు, వాణిజ్యనౌకలు వంటి వాటిపై దాడులు జరపడం ద్వారా పాక్‌ ‌సైన్యాలు సముద్ర మార్గాల ద్వారా తప్పించుకుపోకుండా కట్టడి చేసింది. 1971లో ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌కు స్వరాజ్‌ ‌పర్కష్‌ ‌కెప్టెన్‌గా వ్యవహరించారు. దీనిపై మూడు ఎయిర్‌ ‌స్క్వాడ్రన్లుండేవి. వీటికి వరుసగా లెఫ్ట్‌నెంట్‌ ‌కమాండర్‌ ‌సంతోష్‌కుమార్‌ ‘‌గిరి’ గుప్తా, లెఫ్ట్‌నెంట్‌ ‌కమాండర్‌ ‌రవీంద్రదాస్‌ ‘‌రవి’ ధీర్‌, ‌లెఫ్ట్‌నెంట్‌ ‌కమాండర్‌ ‌వి. రవీంద్రనాథ్‌లు నేతృత్వం వహించే వారు. దురదృష్టమేమంటే, అందుబాటులో ఉన్న ఆయుధాలతో ప్రాణాలకు తెగించి విజయాన్ని సమకూర్చిన నాటి సైనికులపై నాటి మీడియా పెద్దగా దృష్టిపెట్టక పోవడం. కేవలం మనవద్ద ఉన్న సాయుధ సంపత్తిపైనే అవి దృష్టి కేంద్రీకరించాయి. నిజం చెప్పాలంటే అప్పట్లో ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ అత్యంత ప్రమాదకరమైన జలాల్లో తన కార్యకలాపాలు నిర్వహించింది. కెప్టెన్‌ ‌స్వరాజ్‌ ‌పర్కష్‌, ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను కంటికి రెప్పలా కాపాడటానికి నిద్రలేని రాత్రులే గడిపారు. లెఫ్ట్‌నెంట్‌ ‌కమాండర్‌ ‌సంతోష్‌కుమార్‌ ‘‌గిరి’ గుప్తా పదకొండు మిషన్లను విజయవంతంగా పూర్తిచేశారు. లెఫ్ట్‌నెంట్‌ ‌కమాండర్‌ ‌వి. రవీంద్రనాథ్‌ అన్ని రకాల భద్రతను కల్పించారు. అప్పట్లో ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌సిబ్బందిలోని వారికి రెండు మహా వీరచక్రలు, 12 వీరచక్రలు లభించాయి. తొలి ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌కు ఇంతటి ఘనచరిత్ర ఉంది. 1961 మార్చి 4న కమిషనింగ్‌ అయిన ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ 1997, ‌జనవరి 31న డికమిషనింగ్‌ అయింది. 2014లో ఇంతటి గొప్ప యుద్ధ నౌకను భారత ప్రభుత్వం తుక్కు కింద అమ్మేసినప్పుడు, ఎంతోమంది హృదయాలు బాధతో బరువెక్కాయి. కానీ ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మరో విమాన వాహక యుద్ధ నౌక, ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌పేరుతో కొత్త అవతారంతో మన ముందుకు వచ్చింది. నాటి జ్ఞాపకాలను కనుమరుగు కానివ్వకుండా తన వీరోచిత సేవలతో సజీవంగా నిలిపేందుకు సముద్ర జలాల్లోకి సగర్వంగా ప్రవేశించింది.

తొలినాటి యుద్ధ నౌకలు

భారత్‌కు చెందిన తొలినాళ్ల యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ ‌విరాట్‌లు నిజానికి బ్రిటన్‌లో నిర్మితమైన హెచ్‌ఎంఎస్‌-‌హెర్క్యులస్‌, ‌హెచ్‌ఎంఎస్‌- ‌హెర్మస్ ‌నౌకలు. ఈ రెండు విమాన వాహక యుద్ధనౌకలను భారత్‌లో 1961, 1987లో మన నేవీలో ప్రవేశపెట్టారు. 1997లో ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌, 2017‌లో ఐఎన్‌ఎస్‌ ‌విరాట్‌లు డీకమిషనింగ్‌ అయ్యాయి. ఐఎన్‌ఎస్‌ ‌విక్రమాదిత్యను 2013లో భారత్‌ ‌నేవీలో ప్రవేశప్టెడానికి ముందు ఐఎన్‌ఎస్‌ ‌విరాట్‌ ‌మనకు ఫ్లాగ్‌షిప్‌గా ఉండేది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రమాదిత్య ఒకప్పటి యుఎస్‌ఎస్‌ఆర్‌కు ‘అడ్మిరల్‌ ‌గోరష్కోవ్‌’ ‌పేరుతో సేవలందించింది. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌కమిషనింగ్‌ ‌కార్యక్రమానికి ఎంతోమంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విమానవాహక యుద్ధ నౌకను నిర్మించడం ద్వారా భారత్‌ ‌గ్లోబల్‌ ‌పవర్‌గా ఎదుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌, ‌ఫ్రాన్స్ ‌రాయబారి ఎమాన్యువల్‌ ‌లెనైన్‌, ఇ‌జ్రాయెల్‌ ‌రాయబారి నోర్‌ ‌గిలోన్‌, ‌భారత్‌లో బ్రిటిష్‌ ‌హై కమిషనర్‌ ఎలెక్స్ ఇల్లిస్‌, ‌భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌ ‌బార్రీ ఓ ఫెర్రెల్‌లు భారత్‌ ‌స్వయం సమృద్ధి సాధిస్తున్నదంటూ, ప్రశంసించడం వెనుక, ప్రపంచానికి ఇబ్బందికరంగా తయారైన చైనాను దీటుగా ఎదుర్కొనే సత్తా భారత్‌ ‌సంతరించుకోవడం వాటికి చాలా అవసరం! తన నయా ఆర్థిక వలసవాద విధానాలతో అంతర్జాతీయ యవనికపై చైనా క్రమంగా ఏకాకిగా మిగిలిపో తుండటం, దుష్టదేశంగా పేరు తెచ్చుకొంటుండటం, భారత్‌కు కలిసొచ్చే అంశాలు.


కొత్త ‘నిషాన్‌’

‌భారత ప్రధాని నరేంద్రమోదీ, ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను జలప్రవేశ కార్యక్రమం తోపాటు, నేవీకి కొత్త పతాకాన్ని ‘నిషాన్‌’ ‌పేరుతో ఆవిష్కరించారు. గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు నివాళిగా ఈ నిషాన్‌ ‌గుర్తును నేవీ పతాకంలో ఏర్పాటుచేశారు. దీని అడుగు భాగంలో ‘శం నో వరుణః’ అని ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా నేవీ పతాకానికి తెలుపు బ్యాక్‌ ‌గ్రౌండ్‌తో కూడిన ‘రెడ్‌ ‌క్రాస్‌’ ‌గుర్తు ఉండేది. ఈ క్రాస్‌కు ఒక మూలన భారత త్రివర్ణ పతాకం, క్రాస్‌ ‌మధ్యలో మూడు సింహాల గుర్తుతో అశోక స్తంభం ఉండేవి. బ్రిటిష్‌ ‌మిషనరీ యుద్ధవీరుడు సెయిట్‌ ‌జార్జ్ ‌యుద్ధాల్లో సాధించిన విజయాలకు ఈ ‘క్రాస్‌’ ‌గుర్తుగా ఉండేది. పవిత్ర యుద్ధాలలోని మూడో దానికి (క్రూసేడ్‌) ‌బ్రిటిష్‌కు చెందిన సెయింట్‌ ‌జార్జ్ ‌నాయకత్వం వహించాడని చెబుతారు. ఈ క్రాస్‌ను రాయల్‌ ‌నేవీ ఉపయోగించింది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనవరి 20, 1950న దీనికి సంబంధించిన దేశీయ గుర్తును వాడేవరకు ఈ క్రాస్‌ ‌కొనసాగింది. భారతీయ కొత్త వర్షన్‌ ‌ప్రకారం నేవీ పతాకంపై ఉన్న బ్రిటన్‌కు చెందిన ‘యూనియన్‌ ‌జాక్‌’‌ను తొలగించి దాని స్థానంలో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. సెయింట్‌ ‌జార్జ్ ‌క్రాస్‌ను యథాతథంగా కొనసాగించారు. అయితే 2001లో ఈ క్రాస్‌ను తొలగించి దాని స్థానంలో ‘నేవీ క్రెస్ట్’‌ను ప్రవేశపెట్టారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక నేవీ క్రెస్ట్ ‌స్థానంలో యథావిధిగా సెయింట్‌ ‌జార్జ్ ‌క్రాస్‌ను ఉపయోగించడం మొదలైంది. 2014లో మళ్లీ నేవెల్‌ ‌పతాకం మధ్యభాగంలో జాతీయ చిహ్నాన్ని-అశోక స్తంభం, సత్యమేవ జయతే-ప్రవేశపెట్టారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ‌కెనడా, పాకిస్తాన్‌, ‌సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ‌కామన్‌వెల్త్ ‌దేశాలు ఈ సెయింట్‌ ‌జార్జ్ ‌క్రాస్‌ ‌గుర్తును ఎప్పుడో తొలగించాయి. ఈ వలసవాద గుర్తును తొలగించాలని ఎప్పటినుంచో కొనసాగుతున్న డిమాండ్‌. అది ఇప్పటికి, బీజేపీ నేతృత్వంలో నెరవేరింది.


చైనాకు ఎందుకు భయం?

ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను సముద్ర జలాల్లో ప్రవేశపెట్టడం పశ్చిమ దేశాలకు ఒకింత ఆనందం కలిగిస్తే, చైనాకు మాత్రం ఆందోళన కారక అంశం. ఎందుకంటే ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో తన విస్తరణ కాంక్షకు ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌చెక్‌ ‌పెడుతుందని చైనా భయపడుతోంది. ఇప్పటికే మూడో విమాన వాహక యుద్ధ నౌక తయారీకి భారత్‌ అడుగులు ముందుకేస్తోంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌ల గుంటనక్క విధానాలను సమర్థవంతంగా ఎదుర్కొ నేందుకు భారత్‌ ‘‘‌పోరాట సన్నద్ధత’’ వాటిని కలవరపాటుకు గురిచేస్తున్నది. ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న ఐఎన్‌ఎస్‌ ‌విక్రమాదిత్యకు ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌తోడు కావడంతో ప్రాంతీయ సముద్ర జలాల భద్రతకు సంబంధించి భారత్‌ ‌మరింత బలోపేతం కాగలదు. నిజం చెప్పాలంటే ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ఒక గేమ్‌ ‌ఛేంజర్‌. ఇప్పటికే లద్దాఖ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ల వద్ద భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దురుసుగా వ్యవహరిస్తోంది. దీనికితోడు హిందూ మహా సముద్ర ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలన్న కుయుక్తులతో మన దేశాన్ని అష్ట దిగ్బంధం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దిగ్బౌటీ వద్ద నేవెల్‌ ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటుచేసింది. పాక్‌లోని గ్వదార్‌ ‌పోర్టును తన గుప్పిట్లో పెట్టుకుంది. తన నౌకలకు ఈ రెండు పోర్టుల ద్వారా చైనా మద్దతు ఇవ్వగలుగుతుంది.

ఇటీవలే చైనా తన మూడో విమానవాహక యుద్ధనౌక ‘ఫ్యుజియన్‌’‌ను ప్రవేశపెట్టింది. మరో రెండు విమానవాహక నౌకలను నిర్మిస్తోంది. ఈ మూడో యుద్ధనౌక 320 మీటర్ల పొడవు, 80 మీటర్ల వెడల్పు ఉన్నట్లు చెబుతున్నారు. సముద్ర తీర ప్రాంత దేశాలకు భద్రత కల్పించే దేశంగా భారత్‌ ‌రూపుదిద్దుకుంటున్నప్పటికీ, ఆగ్నేయాసియా దేశాలకు చైనా మాదిరి స్థాయికి ఇంకా చేరుకోవాల్సి ఉంది. మరి చైనా హిందూ మహాసముద్రంపై పట్టుకోసం ప్రయత్నించడానికి ప్రధాన కారణం మలక్కా, హర్ముజ్‌ ‌జలసంధుల ద్వారా ప్రయాణించే తన వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడం. చైనా చమురు దిగుమతుల్లో 82% మక్కా జలసంధి గుండానే జరుగుతాయి. ‘మలక్కా-హర్ముజ్‌ ‌డైలమా’గా ప్రాచుర్యం పొందిన ఈ సందిగ్ధత కారణంగానే చైనా, భారత్‌ను అష్టదిగ్బంధం చేస్తోంది. ఇందుకోసమే చుట్టుపక్కల దేశాల్లో తన నౌకాస్థావరాల నిర్మాణం చేపడుతోంది. ప్రస్తుతం ఇవి చైనా ప్రధాన భూభాగం నుంచి, హార్న్ ఆ‌ఫ్రికాలోని పోర్ట్ ‌సూడాన్‌ ‌వరకు విస్తరించిఉన్నాయి. ‘స్ట్రింగ్‌ ఆఫ్‌ ‌పెర్లస్’ ‌పేరుతో చైనా ఏర్పాటుచేస్తున్న ఈ నెట్‌వర్క్ ‌మలక్కా జలసంధి, హర్ముజ్‌ ‌జలసంధి, మండెబ్‌ ‌జలసంధి, పాకిస్తాన్‌లోని గ్వదార్‌ ‌పోర్టు, శ్రీలంకలోని హంబన్‌ ‌తోట పోర్టుల గుండా విస్తరించి ఉంది. తన వాణిజ్య నౌకల భద్రత కోసం ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో తన పట్టు కొన సాగాలని చైనా భావిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో భారత్‌ ‌ప్రవేశపెట్టిన ‘ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌’‌కు చైనా స్ట్రింగ్‌ ‌పెర్లస్ ‌వ్యూహానికి గండికొట్టే సామర్థ్యం కలిగివుండటం, చైనాకు మింగుడు పడని అంశం.

మోదీ తనదైన శైలిలో ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌నిర్మాణంలో భాగస్వాములైన నౌకాదళ అధికారులను, సిబ్బందిని, కొచ్చిన్‌ ‌నౌకా నిర్మాణ సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, మరీ ముఖ్యంగా కార్మికులను వేనోళ్ల అభినందించారు. అటు ఓనమ్‌ ‌పండుగ, ఇటు ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌సేవలు ప్రారంభం కావడం ఒకేసారి జరిగాయని, ఇది మరింత శుభ ప్రదమని కూడా ఆయన అన్నారు. ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌లోని ప్రతి భాగం మన సొంతమని ప్రధాని గుర్తు చేశారు. దాని శక్తి, ప్రయాణం అన్నీ కూడా విశిష్టమేనని, అసలు ఈ నౌక దేశీయమైన పరిజ్ఞానా నికి ప్రతిబింబమని ఆయన చెప్పారు. ఏది ఏమైనా ఇరుగు పొరుగు దేశాల కుట్రలకు, కుయుక్తులకు ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ ‌సరైన సమాధానం.

About Author

By editor

Twitter
Instagram