– క్రాంతి

‌కొద్దికాలంగా చాలా రకాల జిహాద్‌ల పేర్లు సెక్యులర్‌ ‌భారత్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇస్లాం వ్యతిరేకుల తలల తీసే (సర్‌ ‌తన్‌ ‌సే జుదా) జిహాద్‌, ‌లవ్‌ ‌జిహాద్‌ ఈ ‌మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. భూ జిహాద్‌ అనే మరొక దురాక్రమణ యుద్ధం కూడా క్రమంగా భారతదేశంలో వేళ్లూనుతున్నదని కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ యుద్ధం చేస్తున్న సంస్థ పేరు వక్ఫ్ ‌బోర్డ్. ‌గ్రామాలకు గ్రామాలు, వందల కొద్దీ ఎకరాలు ఇస్లాం ఆస్తులుగా రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. 1300 సంవత్సరాల క్రితం పుట్టిన ఇస్లాం  పరిధిలోని వక్ఫ్‌కు 1500 ఏళ్ల నాటి హిందూ దేవాలయం మీద హక్కుభుక్తాలు పుట్టుకు రావడం ఇందుకు పరాకాష్ట.  వీటి పేరే వక్ఫ్ ఆస్తులు. తమిళనాడులో కొన్ని గ్రామాలకు చెందిన వందల ఎకరాలు తమవేనని వక్ఫ్ ‌బోర్డు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో వందల కోట్ల విలువైన 123 స్థలాలు వక్ఫ్ ‌బోర్డుకు కాంగ్రెస్‌-‌యూపీఏ ప్రభుత్వం కానుకగా సమర్పించుకుంది. హిందూ దేవాలయాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలలో క్రైస్తవ మిషనరీలు, సంస్థల ఆగడాలు కూడా తక్కువేమీ కాదు.

ఇప్పుడు భారతదేశమంతా గుర్తించవలసిన వాస్తవం ఒకటి ఉంది. దేశంలో ముస్లింలే నిరుపేద లన్న వాదన బలంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ భారతదేశంలో భద్రతా వ్యవస్థలు, రైల్వేల తరువాత అత్యంత భూ సంపద కలిగిన సంస్థ వక్ఫ్ ‌బోర్డు. ఇది ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాలు ఇచ్చిన నడమంత్రపు సిరి. ఇంకా, ఇస్లాంలో రోజురోజుకీ పెరుగుతున్న హిందూ వ్యతిరేకత. కాంగ్రెస్‌, ‌డీఎంకే, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, టీఆర్‌ఎస్‌, ‌వైఎస్‌ఆర్‌సీపీ వంటి కుహనా లౌకికవాద పార్టీల వైఖరి ఇందుకు అండా దండా ఇస్తున్నాయి. ఊళ్ల నుంచి హిందువులను తరిమివేస్తున్నారు. ఇళ్లను, భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. తమిళనాడు, రాజస్తాన్‌, ‌కేరళ, పశ్చిమ బెంగాల్‌లో గత కొంతకాలంగా జరుగుతున్నది ఇదే.

వక్ఫ్ అం‌టే?

అసలు వక్ఫ్ అం‌టే ఏమిటి? ఈ అరబ్బీ పదానికి అర్ధం- ఇస్లాం కోసం మతపరమైన వితరణ, అంకితం లేదా ఎండోమెంట్‌. ‌సాధారణంగా భవనాలను, భూములను, ఆస్తులను మత కార్యక్రమాలకు అంకిత మివ్వడం. 10 వ శతాబ్దంలో వక్ఫ్ ‌చట్టం ద్వారా మదర్సాలు, వైద్యశాలలు ఎక్కువగా ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణ ఖర్చు వక్ఫ్ ‌సంస్థలు భరించేవి. ఇంకా సులభంగా చెప్పాలంటే, ఒక మహమ్మదీయుడు దేవుని పేరు మీద విద్య, మత, ధార్మిక కార్యక్రమాల కోసం ఇచ్చిన విరాళం. వక్ఫ్ ‌చట్టంలోని సెక్షన్‌ 3(ఆర్‌) ‌ప్రకారం ఎవరైనా విరాళం ఇస్తే, స్థిర, చరాస్తులు ఏమైనా అవి శాశ్వతంగా అల్లాకు చెందుతాయి. కానీ వక్ఫ్ అం‌టే అసలు అర్ధం నిర్బంధం. ఈ అసలు అర్ధమే ఇప్పుడు చలామణిలో ఉంది.

టీఎన్‌ ‌వక్ఫ్ ‌బోర్డ్ ‌దాష్టీకం

తమిళనాడు వక్ఫ్ ‌బోర్డ్ ‌నిర్వాకంతో ఇప్పుడు కొన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి. అంతా విస్తుపోయే విధంగా తిరుచందురై అనే చోట ఉన్న 1500 ఏళ్ల నాటి సుందరేశ్వరర్‌ ఆలయ భూములు కూడా తమవేనని రాష్ట్ర వక్ఫ్ ‌బోర్డ్ ‌ప్రకటించింది. తిరుచ్చి జిల్లాలోని ఈ గ్రామం మొత్తం వక్ఫ్ ‌బోర్డుకే చెందుతుందని చెబుతున్నారు. ఇలా మొత్తం 18 గ్రామాలలోని 389 ఎకరాలు వక్ఫ్ ఆస్తులేనని కూడా వాదిస్తున్నారు. పైగా ఈ భూములను 1954లో రాష్ట్ర ప్రభుత్వమే సర్వే చేయించి తమకు దఖలు పరిచిందని బోర్డ్ ‌చైర్మన్‌ అబ్దుల్‌ ‌రహమాన్‌ ‌మీడియాకు చెప్పేశారు. హిందూ మతానికి కేంద్రబిందువులు దేవాలయాలు. గ్రామీణ వ్యవస్థ భారతదేశానికి ఆయువుపట్టు. ప్రాచీనకాలం నుంచి ఆలయాలే కేంద్రంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన విధానం ఇక్కడ కొనసాగుతోంది. హిందుత్వాన్ని దెబ్బ తీయాలంటే దేవాలయ వ్యవస్థను నిర్మూలించాలి. సాంస్కృతిక నిలయాలైన గ్రామీణ వ్యవస్థను ఛిద్రం చేయాలి. విదేశీ దురాక్రమణదారులు తమ మతాలను విస్తరించుకోడానికి శతాబ్దాలుగా ఇలాంటి కుట్రలు కొనసాగించినా పెద్దగా సఫలం కాలేదు. ఇప్పుడు స్వతంత్ర భారత, ప్రజాస్వామ్య దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఆ పని చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఆలయాలపై కుట్రలు చేస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నది ఇదే.

ఎలా బయటపడింది?

తిరుచ్చి జిల్లా తిరుచందురై రైతు రాజగోపాల్‌ ‌కుమార్తె పెళ్లి కోసం వ్యవసాయ భూమిని అమ్మడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషయం హఠాత్తుగా వెలుగు చూసి, అందరినీ నిశ్చేష్టులను చేసింది. ఇదంతా సెప్టెంబర్‌ 14‌న జరిగింది. తనకున్న 1.2 ఎకరం వ్యవసాయ భూమిని ఆ గ్రామానికే చెందిన రాజేశ్వరికి అమ్మాలని అనుకున్నాడు. రైట్‌ ‌టు ట్రాన్స్‌ఫర్‌ ‌సర్టిఫికెట్‌ (ఆర్టీసీ)తో సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయానికి వెళ్లాడు. ఈ భూమిని అమ్మే హక్కు నీకు లేదని అక్కడి రిజిస్ట్రార్‌ ‌మురళి చెప్పేసరికి దిగ్భ్రాంతికి గురయ్యాడు రాజగోపాల్‌. ‌కారణం అడిగితే ఇది వక్ఫ్ ‌బోర్డు ఆస్తి, నీకు అధికారం లేదని చెప్పారు. దానిని విక్రయించాలనుకుంటే, వక్ఫ్ ‌బోర్డు నుండి నో అబ్జెక్షన్‌ ‌సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసి) పొందాలని రాజగోపాల్‌కు సూచించారు.

రాజగోపాల్‌ 1992‌లో ఆ భూమిని కొనుగోలు చేశారు. అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పడు అమ్మే సమయంలో ఈ వక్ఫ్ ‌బోర్డు ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులను ప్రశ్నించాడు. దీంతో అధికారులు తమిళనాడు వక్ఫ్ ‌బోర్డు నుంచి వచ్చిన 250 పేజీల లేఖను చూపించారు. ఒక్క రాజగోపాల్‌ ‌భూమి మాత్రమే కాదు. గ్రామంలోని అన్ని భూములపై వక్ఫ్ ‌బోర్డుకే అధికారాలు ఉన్నాయని అందులో ఉంది.

గ్రామానికి వచ్చిన రాజగోపాల్‌ ‌విషయం చెప్పాడు. వారంతా అవాక్కై ఆరా తీస్తే ఇదే విషయం స్పష్టమైంది. తిరుచందురైతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు వేయి ఎకరాల భూమి తమిళనాడు వక్ఫ్ ‌బోర్డు పరిధిలో ఉంది. చోళుల కాలంలో కావేరీ ఒడ్డున నిర్మించిన 1500 ఏళ్లనాటి సుందరేశ్వరర్‌ ఆలయం అందులో ఒకటి. ప్రస్తుతం ఆలయ ట్రస్టు కింద ఉన్న 400 ఎకరాల భూమికి కూడా సొంతదారు వక్ఫ్ ‌బోర్డే అంటున్నారు. ఈ గ్రామంలో స్వాతంత్య్రం రాక ముందు నుంచే అనేక కుటుంబాలు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాయి. గ్రామంలో ఉన్నవారంతా హిందువులే. ఏనాడూ లేని ఈ వక్ఫ్ ‌బోర్డు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ 1927-28 మధ్య రీసెటిల్‌మెంట్‌ ‌జరిగినట్టు పత్రాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కడా ముస్లింలకు ఆస్తిపాస్తులు ఉన్నట్టు చూపే ఆధారాలు లేవని ఒక అధ్యయన పత్రం చెబుతోంది. అయినా చాలా జిల్లాలలో తమకు ఆస్తులు ఉన్నాయని చెప్పుకుంటూ వక్ఫ్ ‌బోర్డ్ ‌తిరుచ్చిలోని 12 రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయాలకు 250 పేజీల నోట్‌ ‌పంపించింది. వక్ఫ్ ‌చట్టం 1995 ప్రకారం బోర్డ్ ఈ ఆస్తుల మీద అధికారాన్ని ప్రకటించుకుంటున్నది. ఒకసారి వక్ఫ్ అయిందంటే అది ఎప్పటికీ వక్ఫ్ ‌మాత్రమే అన్నది తాజాగా బోర్డ్ అనుసరిస్తున్న సూత్రం. ఇంతకీ ఈ గ్రామాల భూములు ఏ ముస్లిం సంస్థకు ఎప్పుడు ధారాదత్తం చేసినదీ రుజువు చేసే ఒక్క పత్రం కూడా ప్రభుత్వ నిబంధనల పరిధిలో లేకపోవడం విశేషం. ఇవన్నీ 1850 దశకం నుంచి వక్ఫ్ ఆస్తులు కాబట్టి, ఇప్పుడు, అసలు ఎప్పటికీ కూడా వక్ఫ్ ఆస్తులే అన్నది బోర్డ్ ‌వాదన. ఈ సూత్రంతో కూడిన వక్ఫ్ ‌చట్టం నవంబర్‌ 22, 1995 ‌నుంచి అమలవుతున్నది. దీనిని సెంట్రల్‌ ‌వక్ఫ్ ‌బోర్డ్ ‌రూపొందించింది. చాలా సవరణల తరువాత (1959,1964, 1969,1984) నేటి రూపు సంతరించుకున్నదీ చట్టం.

నరనరాన హిందుత్వ వ్యతిరేకతను జీర్ణించుకున్న ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలో వచ్చి పచ్చి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తరుణంలోనే వక్ఫ్ ‌బోర్డ్ ఇలా రెచ్చిపోగలిగిందంటే అతిశయోక్తి కాదు. ద్రవిడ ఉద్యమమే పునాదిగా ఆవిర్భవించిన ఈ పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి హిందూత్వం మీద విషం చిమ్మడమే పనిగా అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేశారు. రాష్ట్రంలో మత మార్పిడులు, ఉగ్రవాద కార్య కలాపాలు, ఆలయ భూముల దురాక్రమణలు పెట్రేగి పోతున్నా అడ్డుకోకపోగా, పరోక్షంగా ప్రోత్సహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజకీయంగా అవసరం అనుకుంటే ఏ పార్టీతో అయినా చేతులు కలిపేవారు. హిందువులను కులాల పేరిట విభజించి ఓట్లు దండుకోవడం డీఎంకేకు వెన్నతో పెట్టిన విద్య. కరుణానిధి వారసుడు స్టాలిన్‌ ఈ ‌విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. దాని ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితుల•.

కరుణానిధి ఏనాడూ దేవాలయానికి వెళ్లలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిందువులను ఆకట్టుకునేందుకు ఆలయాల చుట్టూ తిరిగారు స్టాలిన్‌. ‌హిందువులు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ఆర్థిక సాయం చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది డీఎంకే. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ఆలయాలలో జీర్ణోద్ధరణ పనులు చేపడతామని, పూజారులకు పించన్లు ఇస్తామని వాగ్దానం చేయడం ద్వారా హిందూ వ్యతిరేకతను చెరిపేసుకోబోతున్నట్లు కనిపించారు. కానీ ఓడ దాటాక బోడి మల్లన్న అన్న చందాన, అధికారంలోకి రాగానే ముసుగు తొలగించి నిజరూపం చూపించింది డీఎంకే. ప్రభుత్వం గుడులను కూలగొడుతుంటే, వాటి ఆస్తులను వక్ఫ్ ‌బోర్డు, మిషనరీలు కబ్జా చేస్తున్నాయి. గతంలో పోలిస్తే డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళ నాడులో మత మార్పిడులు, క్రైస్తవ-ఇస్లాం శక్తుల ఆగడాలు పెరిగాయి. ఏకంగా పాఠశాలలో మత మార్పిడులు చేస్తూ చిన్నారుల మెదళ్లను కలుషితం చేస్తున్నారు. స్వతంత్రంగా ఉన్న దేవాలయాలపై పెత్తనానికి ప్రయత్నిస్తోంది స్టాలిన్‌ ‌ప్రభుత్వం.


మిషనరీలు చేస్తున్న దురాక్రమణలు

తమిళనాడులో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు ఆస్తులను దిగమింగడంలో క్రైస్తవులేమీ తక్కువ తినలేదు. చర్చిల నిర్మాణం కోసం విచ్చల విడిగా దురాక్రమణలకు పాల్పడుతున్నారు.

తిరువణ్ణామలైలో కొండపై ఉన్న ఐదెకరాల అటవీ భూమిని కేథలిక్‌ ‌చర్చి ఆక్రమించిన ఉదంతం ఈ జనవరిలో తెరపైకి వచ్చింది. అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా కలెక్టర్‌ ‌కొండకు వెళ్లినప్పుడు ఆ భూమి చదును చేసి నిర్మాణ పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆక్రమణలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 1961లో కొండ దిగువన ఉన్న ఇళయాంకన్ని గ్రామానికి చెందిన కొంతమంది చర్చి ఆదేశంతో కొండ పైభాగంలో సిలువను స్థాపించారని, ఆ తరువాత 1982లో పూర్తిస్థాయి చర్చిగా మారిందనీ గ్రామస్థులు చెబుతున్నారు.  2014లో కొంత భాగాన్ని డ్రిల్‌ ‌చేసి, రోడ్డు వేయడానికి చదును చేశారు. ఎగువన ఐదెకరాల స్థలాన్ని చదును చేసి పార్కింగ్‌ ‌స్థలాన్ని నిర్మించారు. మూడు నెలల క్రితం డీఎంకే ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రయత్నాలను చూసి విస్మయానికి గురైన కలెక్టర్‌ ‌దానిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. చర్చి ఆక్రమణకు గురైన స్థలం ఎవరికీ బదలాయించలేదని రెవెన్యూ, పంచాయతీ అధికారులు గుర్తించారు. డీఎంకే హిందూ వ్యతిరేక నిర్వాకాలలో ఇదొకటి మాత్రమే.

మరోవైపు కొత్తగా ఏర్పడిన జిల్లా కళ్లకురిచ్చిలోని  సవేరియార్‌పాళయం గ్రామంలో మరో కొండ కూడా ఆక్రమణకు గురైంది.  రోమన్‌ ‌కేథలిక్‌ ‌డియోసెస్‌ ‌కింద పని చేసే ఎఎల్‌సీ చర్చి దీనికి పాల్పడింది. జిల్లాలో అక్రమ చర్చిలు, ప్రార్థనా మందిరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, వాటిపై దర్యాప్తు జరిపించి ఆక్రమణలను తొగలించాలని హిందూ మున్నాని సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. చర్చిపై చర్యలు తీసుకోకుండా గ్రామస్థులను రక్షణ కవచంగా వాడుకుంటున్నారని హిందూ మున్నాని సభ్యులు ఆరోపించారు. కాగా చర్చి మినహా కొండపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్‌ ‌నోటీసులు జారీ చేశారు.

కొండలను ఆక్రమించడం చర్చిలకు ఇదే మొదటిసారి కాదు. చెన్నైకి సమీపంలోని అచ్చరపాక్కంలోని కొండను ఆక్రమించిన మలై మజ్హై మాత అనే చర్చిపై మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా సరైన సర్వే జరగలేదు. కాథలిక్‌ ‌చర్చి మొత్తం కొండను ఆక్రమించి, ఎగువన ఉన్న సహస్రాబ్దాల పురాతనమైన పశుపతీశ్వర దేవాలయానికి కూడా వెళ్లలేని విధంగా ఆక్రమించింది. ఈ కొండలో చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన పురావస్తు గుట్టలు కూడా ఉన్నాయని చెబుతారు. అయినప్పటికీ ఏ శాఖ నుండి సరైన అనుమతి పొందకుండానే చర్చి భూమిని దోచుకునే సాహసం చేసింది. హిందూ సంస్థలు చర్చిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. దీంతో వాస్తవాలను నిర్ధారించడానికి ఆస్తిని సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.

చర్చి నిర్మాణానికి 87 ఏళ్ల హిందువు భూమి ఆక్రమించిన ఘటన ఈ ఏడాది జూన్‌లో చెన్నైలోనే వెలుగు చూసింది. ఈశ్వరన్‌కు చెందిన 3,800చదరపు గజాల భూమిలో ఎకరం భూమిని భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తి 1960లో ఆయన సోదరుడు కొనుగోలు చేయగా వారసత్వంగా వచ్చింది. దానిని సవాల్‌ ‌చేస్తూ ఈశ్వరన్‌ ‌కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్వాధీనాన్ని రద్దు చేసింది. ఆ ఆస్తికి ఈశ్వరన్‌ ఏకైక యజమాని కాబట్టి భూ పత్రాలను మార్చాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుని ధనశేఖర, పాల్‌ ‌మోసెస్‌ ఆ ‌భూమిని ఆక్రమించి చర్చి నిర్మించారు. ఈశ్వరన్‌ ఈ ‌విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో కోర్టుకు వెళ్లాడు. మరోవైపు ఈ వ్యవహారంలో ఆక్రమణదారులు కూడా పిటిషన్‌ ‌పెట్టుకున్నా కోర్టు కొట్టివేసింది. అయినా వారు ఈశ్వరన్‌ ఆస్తిని విడిచిపెట్టలేదు. దీంతోనే ఈశ్వరన్‌ ‌మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి తహశీల్దార్‌ ఆస్తిని తనిఖీ చేసి, ఈశ్వరన్‌ ‌పేరు మీద పట్టా ఇచ్చారని, ఇది ఆస్తికి ఏకైక యజమాని అని స్పష్టంగా చూపుతుందని కోర్టు పేర్కొంది. ఆక్రమణలను తొలగించి ఆస్తిని తిరిగి ఈశ్వరన్‌కు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోర్టు ఆదేశించింది.

హిందూ దేవాలయాల ఆస్తులను, వాటి హక్కులను హరించడంలో సెక్యులరిస్టులమని చెప్పుకునే పార్టీల ప్రభుత్వాలు, వక్ఫ్ ‌బోర్డ్, ‌మిషనరీలు ఒకే తీరులో వ్యవహరిస్తున్నాయి. గ్రామాలను, దైవమాన్యాలను అపహరించేది ఒకరైతే, కొండలను కబ్జా చేస్తున్నవారు ఇంకొకరు. ఇలాంటి ఎడారి మతాల శాఖలకి సాష్టాంగ పడే ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. బ్రిటిష్‌ ఇం‌డియాలో 99 ఏళ్ల లీజు పేరుతో చర్చిలు దిగమింగిన భూముల సంగతిని ఎవరూ ఎత్తడం లేదు. వాటి గడువు నాలుగైదు దశాబ్దాల క్రితమే అయిపోయింది. కానీ తిరిగి స్వాధీనం చేసుకునే నాథుడే లేడు. కాబట్టి సెక్యులరిస్టు ప్రభుత్వాలు అంటే మన దేశంలో అర్ధం మత వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం లేకపోవడం కాదు. హిందూ ధర్మాన్ని నిర్మూలించే పనిని కొన్ని ప్రభుత్వాలు స్వయంగా చేపట్టడం.


గ్రామస్థుల వద్ద పక్కా పత్రాలు

తిరుచందురై వాసులంతా జిల్లా కలెక్టర్‌ ఎం. ‌ప్రదీప్‌ ‌కుమార్‌ ‌దగ్గరకు వెళ్లి తమ భూయాజమాన్య పత్రాలు చూపించి మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటా నని ఆయన హామీ అయితే ఇచ్చారు. గ్రామస్థులంతా ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారు. తమను వీధిన పడేసే హక్కు వక్ఫ్ ‌బోర్డు, ప్రభుత్వంతో సహా ఎవరికీ లేదని చెబుతున్నారు. తమ గ్రామంలో ముస్లింలకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్నారు. 1927-1928లో ఆస్తుల పరిధిని సూచిస్తూ పత్రాలు స్పష్టంగా ఉన్నాయని గ్రామ పంచాయితీ మాజీ అధ్యక్షుడు ధనపాల్‌ ‌చెబున్నారు. ఈ ఆస్తులు ముస్లింలవని చెప్పేందుకు ఎలాంటి పత్రాలు లేవని స్పష్టం చేశారు. సుందరేశ్వరర్‌ ఆలయంలో శ్రీరంగానికి సంబంధించిన అనేక ఆచారాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, వక్ఫ్ ‌బోర్డు తమ భూమిని దాని సొంతమని ఎలా చెబుతుందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.


చిదంబరం ఆలయం ఆస్తులపై రాద్ధాంతం

నాస్తికత్వాన్ని సమర్ధించే వారికి ఆలయాలపై మమకారం, పెత్తనం ఎందుకు? వారి మమకారం హిందూ దైవం మీద కాదు. ఆలయ ఆస్తుల మీద. చిదంబరంలోని సుప్రసిద్ధ నటరాజస్వామివారి ఆలయం విషయంలో స్టాలిన్‌ ‌ప్రభుత్వం దూకుడు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీక్షితార్ల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంపై పెత్తనం కోసం 2005లో డీఎంకే ప్రభుత్వం ట్రస్టీలను, దేవాదాయ కమిషనర్‌ను నియమించింది. ప్రభుత్వ జోక్యం సరికాదంటూ వంశ పారంపర్య ప్రధాన అర్చకులు హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేయగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అర్చకులు సుప్రీంకోర్టుకెళ్లారు. ఆలయ నిర్వహణపై సర్వహక్కులు వంశపారంపర్య దీక్షితార్లదేనంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ఆ ఆలయ వ్యవహారాలలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి ఈ ఆలయంపై కన్నేసింది.  పద్దులు సరిగా నిర్వహించడం లేదంటూ భక్తుల ముసుగులో కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదును ఆసరాగా చేసుకుంది. ఆలయంలో అసలేం జరుగుతున్నదో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ సంపద వివరాలు తెలపాల్సిందిగా దీక్షితార్ల వర్గానికి రాష్ట్ర హిందూ ధర్మాదాయ శాఖ నోటీసులు పంపించింది. రాష్ట్ర దేవాదాయ అధికారులు ఆలయానికి తనిఖీకి వచ్చినప్పుడు వివరాలు ఇచ్చేందుకు దీక్షితార్లు నిరాకరించారు. భక్తులు ఎలాంటి ఫిర్యాదులు చేశారన్న వివరాలను వెల్లడించలేదని, చట్టప్రకారం తమను సంప్రదించలేదని వారు వాదించారు. ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం దేవాదాయశాఖకు లేదని ప్రకటించారు. ద్రావిడన్‌ ‌మోడల్‌ ‌పాలన మాకు అక్కరలేదంటూ దీక్షితార్లు గట్టిగానే జవాబుచ్చారు.

దీక్షితార్లు వ్యతిరేకించినా తాము పట్టువదిలేది లేదని తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి  పీకే శేఖర్‌బాబు మీడియాకు చెప్పారు. దీక్షితార్లు లెక్కలు చెప్పకుండా వివరాలు దాచిపెట్టి అవినీతికి పాల్పడుతున్నారని డీఎంకే దుష్ప్రచారం మొదలు పెట్టింది. దీంతో తాము పారదర్శకంగా ఉన్నామని భక్తుల ముందు నిరూపించుకోవాలని నిర్ణయించారు దీక్షితార్లు.

దీక్షితార్లు అంగీకరించడంతో ఆలయ సంపద వివరాలను సేకరిస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. స్వామివారికి ఎన్నో ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాలన్నీ మొదట 1956లో లెక్కించి ఆ వివరాలు పొందుపరిచారు. అప్పటి నుండి, ఆభరణాలు వివిధ దశలలో ఆడిట్‌ ‌చేసినప్పటికీ వివరాలు తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది ప్రభుత్వం.

రాష్ట్ర ఆలయాల సంపదను డీఎంకే సర్కారు దోచుకుంటోందని  స్టాలిన్‌ ‌ప్రభుత్వం మీద కొద్ది నెలల క్రితం హిందూ పీఠాధిపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల అధీనంలో ఉన్న ఆలయాలలో హుండీలలో కానుకలు వేయరాదని భక్తులకు పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖను రద్దు చేయాలని  డిమాండ్‌ ‌చేశారు. ఆలయాల సంపద, ఆదాయంపై ప్రభుత్వ పెత్తనాన్ని ప్రశ్నించారు. శైవ క్షేత్ర ఆలయాల సంపదఫై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము రాజకీయాలు చేస్తే పరిస్థితి మారిపోతుందని స్వామీజీలు స్టాలిన్‌ ‌ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


వక్ఫ్ ‌బుకాయింపు

తిరుచందురై మాత్రమే కాదు. ఇక్కడి 18 గ్రామాలలోని భూములన్నీ వక్ఫ్ ‌బోర్డు పేరిట మారిన సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. ఈ భూములు తమవేనని వాదిస్తోంది తమిళనాడు వక్ఫ్‌బోర్డు. ‘ఈ ఆస్తులు అనేక వక్ఫ్ ‌సంస్థల క్రింద రిజిస్టర్‌ అయినాయి. బోర్డు భూమిని స్వచ్ఛందంగా ఉపయో గించుకోవడానికి ప్రజలను అనుమతిస్తుంది. అయితే, వివిధ ప్రదేశాలలో ఆక్రమణలు జరిగాయి. అందుకే లావాదేవీలను నిలిపివేయడానికి వక్ఫ్ ‌బోర్డు అధికారికంగా అన్ని వివరాలను 12 సబ్‌-‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాలకు ఇచ్చింది.’’ అని చెబుతున్నారు రాష్ట్ర బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ ‌రెహమాన్‌.

‌తిరుచందురై వంటి కొన్ని గ్రామాల్లో చాలా వరకు ప్రైవేట్‌ ‌లావాదేవీలు పూర్తిగా నిలిచి పోయాయని స్థానికులు చెప్పారు. గ్రామస్తులంతా వక్ఫ్‌కు చెందిన ఆస్తులలో నివసిస్తున్నారని, వారు ఎలాంటి లావాదేవీలు చేయలేరని రెహమాన్‌ ‌చెబుతున్నారు. పైగా ‘‘వక్ఫ్ ఆస్తుల విషయంలో మత కోణం చాలా దురదృష్టకరం’’ అంటూ తెంపరితనం ప్రదర్శిస్తున్నారు. గ్రామస్థులు మతపరమైన సమస్యలను ప్రస్తావించేలా ప్రకటనలు చేస్తున్నారని వాపోయారు. బీజేపీ నేత అల్లూరు ప్రకాశ్‌ ‌గ్రామాన్ని సందర్శిం చారు. హిందువులు నివసించే గ్రామంలో వక్ఫ్ ‌బోర్డుకు సంబంధం ఏమి•ని ప్రశ్నించారు. ఇస్లాం పుట్టిందే 1300 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత భారతదేశానికి ఆ మతం వచ్చింది. మరి 1500 ఏళ్ల నాటి ఆలయం మీద ఆ మతానికి హక్కు ఎలా వచ్చింది అనే ప్రశ్నకు అధికారులతో పాటు వక్ఫ్ ‌బోర్డు దగ్గరా సమాధానం లేదు.

తాత ముత్తాతల కాలం నుంచి తమ స్వేదాన్ని చిందించి పండించుకున్న భూములన్నీ ఒక్కసారిగా తమవి కావని తెలిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం తిరుచందురై గ్రామస్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. హిందూ మెజారిటీ ఉన్న గ్రామాల్లో ఆలయాలతో సహా భూములన్నీ తమిళనాడు వక్ఫ్ ‌బోర్డు ఆస్తిగా ఎలా ప్రకటించుకుంటుంది? ఇందుకు ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా అనుమతించారు? నివాస, వ్యవసాయ భూములకు సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నప్పుడు వక్ఫ్ ‌బోర్డు మొత్తం దీనికి అసలైన యజమాని అని ఎలా చెప్పగలదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఈ భూమి తమదేనని వక్ఫ్ ‌బోర్డు ఎలా ప్రకటిస్తుంది? దీనికి వెనుక ఉన్న అండ ఎవరిది? ఈ ఘటనలో వక్ఫ్ ‌బోర్డు నిరంకుశంగా వ్యవహరిస్తోంది. అధికారంలో ఉన్న స్టాలిన్‌ ‌ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్


ఢిల్లీ వక్ఫ్ ‌బోర్డ్‌కు కాంగ్రెస్‌ ‌కానుక

తిరుచిరాపల్లిలోని 1500 ఏళ్ల నాటి ఒక హిందూ దేవాలయంతో పాటు, హిందువులు ఎక్కువగా నివసించే గ్రామాలు తమ ఆస్తేనని ఇటీవల తమిళనాడు వక్ఫ్ ‌బోర్డ్ ‌ప్రకటించిన వెంటనే అలాంటిదే మరొక నిర్వాకం కూడా బయటపడింది. అదేమిటంటే- లుటియెన్స్ ‌ఢిల్లీలోని 123 ప్రభుత్వ స్థలాలను 2014లో నాటి యూపీఏ-కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వక్ఫ్ ‌బోర్డుకు ‘కానుక’గా సమర్పించు కుంది. టైమ్స్ ‌నౌ జాతీయ వార్తా చానల్‌ ‌కథనం ప్రకారం దీనికి నాటి కేంద్ర మంత్రిమండలి ఆమోదం కూడా ఉంది. తరువాత ఒక రహస్య నోట్‌ ‌ద్వారా కానుక అప్పగింతకు మార్గం ఏర్పరిచారు. అది కూడా 2014 లోక్‌సభ ఎన్నికలు జరగడానికి కొంచెం ముందు. ఈ స్థలాలన్నీ ఎలాంటి చోట ఉన్నాయి? ఏవో సరిహద్దులలోనో, నిర్మానుష్య ప్రదేశాలలోనో లేవు. కన్నాట్‌ ‌ప్లేస్‌, అశోకా రోడ్‌, ‌మధురా రోడ్‌లతో పాటు వీవీఐపీ నివాసాలు ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. ఒక్క ఫోన్‌ ‌కాల్‌తోనే ఇదంతా సజావుగా సాగిపోయింది. ముందు చెప్పుకున్న మార్చి 5, 2014 నాటి ఆ రహస్య నోట్‌ను కూడా చానల్‌ ‌సంపాదించింది. దీని మీద అదనపు కార్యదర్శి జేపీ ప్రకాశ్‌ ‌సంతకం కూడా ఉంది. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఉద్దేశించిన ఆ నోట్‌లో, ల్యాండ్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్యాలయం, డీడీఏ అధీనంలో ఉన్న ఆ 123 స్థలాల ఆధిపత్యం ఢిల్లీ వక్ఫ్ ‌బోర్డుకు దఖలు పరచాలని ఉంది.

అంతకు ముందు వక్ఫ్ ‌బోర్డ్ ఒక సప్లిమెంటరీ నోట్‌ ‌కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఫిబ్రవరి 27,2014లో పంపించిన ఆ నోట్‌లో ఆ 123 స్థలాల మీద తమకు అధికారం కావాలని కోరింది. బోర్డు కోరిన వారానికి ఆ స్థలాల మీద దానికి అధికారం అప్పగించే విధంగా నాటి కేంద్ర మంత్రిమండలి ఆ రహస్య నోట్‌ ‌విడుదల చేసింది. ఎల్‌ఎన్‌డివో, డీడీఏ అధీనంలో ఉన్న ఈ కింది వక్ఫ్ ఆస్తుల మీద కేంద్రం తన అజమాయిషీని ఉపసంహరించుకుంటున్నదని ప్రకటించిన ఒక నోటీసును కూడా ఆ చానల్‌ ‌సంపాదించింది. అందులో ఇలా పేర్కొన్నారు. ఆ 123 స్థలాలు వక్ఫ్ ‌బోర్డుకే చెందుతాయని, కాబట్టి అవి కేంద్రానివి కావని యూపీఏ-కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అంగీకరిస్తున్నదని చెప్పారు. ఆ స్థలాలన్నీ బ్రిటిష్‌ ‌కాలం ప్రభుత్వం నుంచి సంక్రమించాయని, వాటి స్థితి మార్చి 5, 2014 వరకు కూడా మారలేదని కూడా పేర్కొన్నారు.

అయితే 2014 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఎన్‌డీఏ-బీజేపీ ప్రభుత్వం ఎన్నిక కావడంతో ఈ కానుకల కథ అడ్డం తిరిగింది. ఫిబ్రవరి, 2015లోనే ఈ నాటకం మీద దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్‌ ‌ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తరువాత మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భూసేకరణ చట్టంలోని 48వ సెక్షన్‌ ‌ప్రకారం కానుకల పేరుతో ధారాదత్తం చేసిన ఈ స్థలాలను స్వాధీనం చేయరాదని హిందూ సంఘాలు కూడా వాదన లేవదీశాయి. నాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఈ విషయం మీద మాట్లాడారు. సల్మాన్‌ ‌ఖుర్షీద్‌కు వ్యతిరేకంగా తనకు వినతి అందిందని, ఆయన నిర్వహించిన మంత్రిత్వ శాఖ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే చివరిదశలో ఈ పని చేసిందని అన్నారు.

యూపీఏ ప్రభుత్వం అధికారం ఇచ్చింది కాబట్టి ఆ స్థలాలను అభివృద్ధి చేసుకునే అధికారం వక్ఫ్‌బోర్డుకు వచ్చింది. దీనితో ఈ స్థలాలలో మసీదులు, దర్గాలు, స్మశానవాటికలు నిర్మిస్తామని నోడల్‌ అధికారి ఆలం ఫారూకీ ప్రకటించారు కూడా. ప్రభుత్వం తీసుకున్న కానుకల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ముస్లింల అభివృద్ధి కుంటుపడుతుందని బెదిరించారు. వక్ఫ్ ఆస్తుల మీద వచ్చిన డబ్బును ముస్లింల అభ్యున్నతికే ఖర్చు చేస్తామని చెప్పారు. పైగా 123 స్థలాలలో అతి కొద్దిగా మాత్రమే ఖాళీగా ఉన్నాయనీ, మిగిలినవన్నీ ఆక్రమణలలోనే ఉన్నాయని, ఆక్రమణలు తొలగించే అధికారం ఇప్పుడు తమదని కూడా ఫారూకీ చెప్పారు.

చివరికి బీజేపీ ప్రభుత్వం కానుకల వ్యవహారం మీద ఢిల్లీ న్యాయశాఖ ఉన్నతాధికారి జేఆర్‌ ఆర్యన్‌ ‌నాయకత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది. మే, 2016లో నియమించిన ఈ సంఘం ఆరు మాసాలకే నివేదిక ఇవ్వాలని గడువు విధించారు. కానీ ఈ ఆస్తులు వక్ఫ్ ‌బోర్డుకు చెందుతాయా లేదా అనే కీలక అంశాన్ని నిర్ధారించడంలో ఆర్యన్‌ ‌బృందం విఫలమైందని విమర్శ వచ్చింది. మరొక ఆరు మాసాలు ఇచ్చాక కూడా ఆ బృందాన్ని లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీని పరిష్కార బాధ్యత నాటి వక్ఫ్‌బోర్డు కమిషన్‌కు అప్పగించారు. ఇతడు ఆప్‌ ‌ప్రభుత్వం నియమించిన వ్యక్తి. దీనితో కథ మళ్లీ అడ్డం తిరిగింది.

ఈ అంశం మీద ఇదే చానల్‌ ‌నిర్వహించిన చర్చలో పాల్గొన్న ప్రముఖ కాలమిస్ట్ ‌ప్రొఫెసర్‌ అతీక్‌ ఉర్‌ ‌రహమాన్‌, ‘‌వక్ఫ్ అం‌టే పవిత్ర ఖురాన్‌ ‌ప్రాతిపదికగా నడుస్తుంది. ఏదైనా ఆస్తి సందేహాస్పద మైనదని అనుకుంటే ఇస్లాం చట్టాల పరీక్షలో నిలబడదు’ అని అన్నారు. 2005లో తాజ్‌మహల్‌ ‌తమదేనని వక్ఫ్ ‌బోర్డ్ ‌ప్రకటించింది. అందుకు సుప్రీం కోర్టు ఇది ఎప్పుడు దఖలు పడిందని ప్రశ్నించింది. అంతేకాదు, షాజహాన్‌ ‌మీకు ఎప్పుడు దఖలు పరిచాడో చెప్పే పత్రం చూపాలని ఆదేశించింది. అంతా మౌనం దాల్చారని విష్ణు జైన్‌ ఇదే చర్చలో అన్నారు. వక్ఫ్ ఆస్తులకు ఎన్ని కోణాలో కదా!

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram