సుధీర్‌

‌విజయదశమి (5 అక్టోబర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

ఇన్ని సంవత్సరాల నిరంతర కృషి కారణంగా సంఘ(ఆర్‌ఎస్‌ఎస్‌) ‌కార్యం పట్ల సమాజంలో ఒక ఉత్తమ ప్రతిబింబం ఏర్పడింది. ఏ సమస్యనైనా సంఘం పరిష్కరించగలదనే విశ్వాసం సమాజంలో బలపడుతోంది. రోజూ వందలాది యువకులు ‘జాయిన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’ (join rss registration form – Rashtriya Swayamsevak Sanghhttps://www.rss.org) వెబ్‌సైట్‌ ‌ద్వారా సంఘకార్యంలో పాలుపంచు కోవడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే ఒక ఆశాకిరణం

సామాన్య వ్యక్తులే కాదు, దేశంలోని ప్రముఖులు, సమాజ చింతకులు, ప్రతిష్ఠిత వ్యక్తులు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ఆశాకిరణం అనే అభిప్రాయానికి వస్తున్నారు. సంఘ భావాలను గట్టిగా విరోధించిన లోక్‌నాయక్‌ ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌కూడా 1970 దశకంలో ‘సంఘ సిద్ధాంతం’లో ఏదో ఔన్నత్యం ఉంది’ అని అన్నారు. అప్పటి సర్‌ ‌కార్యవాహ మాననీయ రజ్జూ భయ్యా బెంగళూరులోని వైట్‌ ‌ఫీల్డ్‌లో ఉండే పూజ్య సాయిబాబా ఆశ్రమానికి వెళ్లినపుడు.. మాటల సందర్భంలో పూజ్య బాబా ‘సమర్పిత కార్యకర్తలను కేవలం సంఘంలో మాత్రమే చూడవచ్చు’ (we can see dedicated workers only in RSS) అని పొగిడారట. ఈ మధ్యకాలంలో ‘విశేష సంపర్క యోజన కార్యక్రమం’లో భాగంగా సమాజంలోని గొప్ప వ్యక్తులను కలిసినపుడు సర్వసాధారణంగా అందరూ ఇవే భావాలను వ్యక్తం చేస్తున్నారు.  సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా సంఘం వేదికలపైన, కార్యక్రమాల్లోనూ పాల్గొనడమే కాక మనకు కావలసిన సహకారాన్ని అందిస్తున్నారు. 2015లో ఢిల్లీలో జరిగిన జాతీయ సేవాభారతి కార్యక్రమానికి ప్రఖ్యాత పారిశ్రామికవేత్త అజీమ్‌ ‌ప్రేమ్‌జీ ముఖ్యఅతిథిగా రావటమే ఇందుకు ఉదాహరణ.

విశిష్ట కార్యపద్ధతి

దైనందిన శాఖయే సంఘ కార్య విశేషత. ‘ఈ దేశం నాది, ఈ సమాజం నాది. నేను దీనికి రుణపడి ఉన్నాను’ అనే భావనను సామాన్య వ్యక్తుల అంతఃకర ణాలలో అంకితం చేయటంతో, మన దైనిక శాఖా పద్ధతి యశస్సును పొందింది. ఇప్పటివరకు వేల కార్యకర్తలు ఈ విధంగా తయారైన వారే. ఆటల ఆకర్షణవల్ల ఒకగంటసేపు శాఖకివచ్చేవాళ్లు క్రమంగా దేశం కోసం తమ జీవితాలను అంకితం చేయటానికి సిద్ధమయ్యేటట్టుగా మార్చేది ఈ పద్ధతియే.

2016లో నాగపూర్‌ ‌కేంద్ర కార్యాలయంలో పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌జీని కలవటానికి వచ్చిన రతన్‌టాటా, ‘మీరు చేస్తున్న ఈ వ్యక్తి నిర్మాణ కార్యం అత్యద్భుతంగా ఉంద’ని ముక్త కంఠంతో పొగిడారు. ఈ కార్యపద్ధతిలో నిరంతరం కార్యకర్తల నిర్మాణం జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ కార్యకర్తల కొరతే లేదు. శిశువు మొదలు ప్రౌఢుల వరకు అందరికీ ప్రవేశ అవకాశం ఉంది. అజీమ్‌ ‌ప్రేమ్‌జీ ఒకసారి మోహన్‌జీతో ‘మీరు చాలా అదృష్టవంతులు. మీ వద్ద మీ తరువాతి తరం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది’ అని అన్నప్పుడు.. మోహన్‌జీ నవ్వుతూ ‘కేవలం నా తరువాత తరమే కాదు, తరువాతి నాలుగు తరాల కార్యకర్తలను నేను దేశంలోని అన్ని ప్రాంతాలలో చూడగలుగుతున్నాను’ అని సమాధానం చెప్పారు. ఎంతటి అర్థగర్భిత మాటలు కదా అవి!

కార్యకర్తే ఆధారం

సంఘకార్యానికి కార్యకర్తలే ఆధారం. ఈ కార్యానికి శక్తి-గౌరవం కార్యకర్తల వల్లే లభిస్తుంది. కార్య విస్తరణకు కూడా కార్యకర్తే మాధ్యమం. సంఘ కార్యానికి గల అవసరాలన్నీ స్వయంసేవకుడే పూరిస్తాడు. సంఘటనా కార్యం సాగడానికి డబ్బు అవసరం. సంఘం ప్రారంభం నుండి ‘గురుదక్షిణ’ రూపంలో స్వయంసేవకులే దాన్ని పూరిస్తున్నారు. దానివల్ల సంఘానికి ఏ ధనికుడి హంగుల ముందు తలవంచాల్సిన అవసరం రాలేదు. ఆరంభ దశలో సంఘకార్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్లే అవసరం ఉండింది. అప్పుడు కూడా స్వయంసేవకులే ముందుకు వచ్చారు. భావూరావు దేవరస్‌ ‌బి.కాం. చదివేందుకు లక్నో వెళ్లారు. అదేవిధంగా భయ్యాజీ దాణీ వారణాసికి, రాజాభావూ పాతూర్‌కర్‌ ‌లాహోర్‌కి, బాబా కల్యాణ్‌ ‌రావల్పిండికి వెళ్లారు. ఈ యువకులు తాము వెళ్లిన చోటల్లా శాఖలను ప్రారంభించారు. ఆ విధంగా సంఘకార్యం విస్తరించింది. వీరందరి కర్తృత్వం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారణాసికి చదువుకోవటానికి వెళ్లిన భయ్యాజీ దాణీ తమ అధ్యాపకులైన గురూజీని సంఘ శాఖకి తీసుకుని వచ్చారు. అటల్‌బిహారీ వాజపేయి, సుందర్‌సింగ్‌ ‌భండారి, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వంటి వారు భావూరావ్‌ ‌దేవరస్‌ ‌కార్యసాధన ఫలితంగా లభించిన వారే. స్వయంసేవక్‌ ‌తాను వెళ్లిన చోటల్లా సంఘాన్ని వెంటబెట్టుకుని వెళ్లాలి అన్న భావన డాక్టర్జీ ద్వారా లభించిన వారసత్వం. ఈ దృష్టియే సంఘకార్య విస్తరణకు ముఖ్య కారణం. సంఘ కార్యం విశ్వవ్యాప్తం కావటానికి కూడా ఇదే కారణం. 1948లో ఆఫ్రికా, కెన్యాకి వెళ్లిన గుజరాత్‌ ‌వ్యాపారస్తులు అక్కడ సంఘకార్యాన్ని ప్రారంభిం చారు. విదేశంలో ప్రారంభమైన మొట్టమొదటి శాఖ అదే. ఈ రోజు 40కి మించి దేశాలలో సంఘకార్యం నడుస్తోంది.

దేశ సేవే ప్రథమ కర్తవ్యం

సంఘకార్యం అంటేనే సమాజ సంఘటన అని అర్థం. సామాజిక వ్యవస్థలో అనేక కోణాలున్నాయి. శిక్షణ, కృషి, వ్యాపారం, ధార్మిక రంగం, రాజకీయ రంగం మొదలైనవి. అంతేకాకుండా సమాజంలో అనేక ఘటకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు విద్యార్థులు, కార్మికులు, మహిళలు, మఠాధిపతులు, గిరిజనులు, న్యాయవాదులు మొదలైనవాళ్లు. సమాజ సంఘటన అంటే ఈ అన్ని ఘటకాల సంఘటన అని అర్థం. ప్రతి క్షేత్రం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలూ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటి కార్యపద్ధతి కూడా వాటికనుగుణంగా ఉండాలి. కానీ మూలతత్త్వం మాత్రం ఒకటే ‘దేశ సేవే ప్రథమ కర్తవ్యం’ (nation first) అనే భావనతో పనిచేయాలి.

సమాజంలోని అన్ని ఘటకాలలోకి స్వయంసేవ కులు వెళ్లారు. అక్కడ సంఘటనా కార్యాన్ని ప్రారంభించారు. ఆయా క్షేత్రాలనూ ప్రభావితం చేశారు. అలా ఉద్భవించిన మొదటి సంఘటన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌. ‌దేశంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఇది. దత్తోపంత్‌జీ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ (‌బీఎంఎస్‌)‌ని స్థాపించి, పెంచి పోషించారు. అది ఇప్పుడు అతిపెద్ద కార్మిక సంస్థ. అంతేకాదు, భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌, ‌స్వదేశీ జాగరణ మంచ్‌, ‌సామాజిక సమరసతా మంచ్‌ ‌కూడా ఆయన ప్రేరణతో ప్రారంభమైనవే. శిక్షణ క్షేత్రంలో మొట్టమొదట ఉత్తరప్రదేశ్‌లో సరస్వతీ శిశుమందిర్‌ ‌ప్రారంభించారు. ఈనాడు విద్యాభారతి సంస్థ ఆధ్వర్యంలో కొన్నివేల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వనవాసీ క్షేత్రంలో వనవాసీ కల్యాణ ఆశ్రమం సక్రియంగా ఉంది. ధార్మిక క్షేత్రంలో గురూజీ స్వతహాగా ముందుండి స్థాపింపచేసిన సంస్థ విశ్వహిందూ పరిషత్‌. ‌కానీ గురూజీ ఎప్పుడూ విశ్వహిందూ పరిషత్‌ ‌పదాధికారిగా లేరు. న్యాయ వాద రంగంలో అధివక్త పరిషత్‌, ‌వైద్యరంగంలో ఆరోగ్య భారతి పనిచేస్తున్నాయి. సేవాభారతి పేర నడుస్తున్న సేవా కార్యక్రమాలు లక్షన్నర వరకు ఉన్నాయి. ఇలా 35 కన్నా ఎక్కువ క్షేత్రాలలో స్వయంసేవకులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా 40కి మించి దేశాలలో ‘హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌’ ‌పేరుతో సంఘకార్యం నడుస్తోంది.

దేశభక్తికి ప్రతీక-ఆర్‌ఎస్‌ఎస్‌

‘‌భారత భవిష్యత్తు దివ్యంగా ఉండాలంటే, జాతీయతలో ఆధ్యాత్మిక భావన, వ్యక్తిలో జాతీయ భావనతో జాగృతం చేయాల్సి ఉంటుంది.’ (spiritualise the nation and nationalise the person) అని భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ ‌కలాం అనేవారు. ధార్మిక, ఆధ్యాత్మిక భావ జాగరణ కార్యాన్ని అనాదిగా సాధుసంతులు, కథాకారులు, హరిదాసులు, కవులు చేస్తూ వచ్చారు. వర్తమానంలో కూడా పూజ్య శ్రీ సత్యసాయిబాబా, పండిట్‌ ‌రవిశంకర్‌ ‌గురూజీ, మాతా అమృతానందమయి వంటివారు తమ తమ ఆశ్రమాల ద్వారా లక్షలాది ప్రజలకు ఈ మార్గాన్నే బోధించారు, బోధిస్తున్నారు. సామాన్య ప్రజలలో జాతీయతా భావాన్ని జాగృతం చేసే మహత్తర కార్యాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌చేపట్టింది. అందుకే సంఘం దేశభక్తికి పర్యాయ పదంగా మారింది. స్వయంసేవక్‌ అం‌టే ఒక నికార్సైన దేశభక్తుడని సంఘ విరోధులు కూడా ఒప్పుకుంటారు.

నిరంతర పరివర్తన

వేల కార్యకర్తల నిరంతర పరిశ్రమ పరిణామంగా దేశం యావత్తూ నవ హిందూ చైతన్య జాగృతి మనకు కనిపిస్తుంది. దీని ఫలితమే రామమందిర నిర్మాణం, ప్రపంచ యోగా దినం, స్వదేశీ జీవన శైలి, గోహత్య నిషేధం వంటివి సాధ్యం కాసాగాయి. దీనివల్ల ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠ పెరిగింది. అమెరికా లాంటి దేశాలు భారతదేశాన్ని గౌరవభావంతో చూడసాగాయి. అయితే ఇదంతా మన సిద్ధాంత విరోధులకు మాత్రం మింగుడు పడటంలేదు.

విశ్వకల్యాణం కోసమే..

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ప్రపంచంలోనే ఒక అద్వితీయమైన ప్రయోగం. తన అస్తిత్వం, చరిత్ర వల్ల ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేస్తున్న ఒక గొప్ప సంఘటన అంటే అతిశయోక్తి కాదేమో. వేల మందిని సమాజ సంఘటన కార్యానికి జోడిస్తూ, జీవన రంగాలన్నిటినీ ప్రభావితం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దిగ్విజయ గమనాన్ని చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం, అభిమానం కలుగుతాయి. భారతదేశం పరమ వైభవంతోపాటు విశ్వకల్యాణం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యం. ఈ మహత్తర కార్యంలో అందరూ తమవంతు చేయూతనిచ్చి, సంపూర్ణ శక్తితో పని చేయాల్సిన సమయం ఇది. అలా చేస్తారు, చేయాలన్నదే ఈ విజయదశమి సందేశం.

వ్యాసకర్త: క్షేత్ర ప్రచారక్‌

అను: పరిమళ

About Author

By editor

Twitter
Instagram