అయోధ్య పరిణామాలు భారతీయులకు ఎంతటి మనో ధైర్యాన్ని ఇచ్చాయో కొత్తగా చెప్పనక్కరలేదు. రామ మందిరం, ఆధారాలు, ఉద్యమం ఆధునిక భారత సామాజిక, సాంస్కృతిక చైతన్యానికి గొప్ప మలుపును ఇచ్చాయి. ఇందులో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన మహనీయుడు ఆచార్య బీబీ లాల్‌. ‌రామ జన్మభూమి ప్రాంతంలో 1970 దశకంలో తవ్వకాలు జరిపి హిందూ దేవాలయానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నవారు ఆయనే. రామాయణ గాథలతో అనుబంధం ఉన్న ఆయా ప్రాంతాలలో కూడా తవ్వకాలు జరిపిన వారు లాల్‌. ఈ ‌సెప్టెంబర్‌ 10‌న తన 101వ ఏట ఆచార్య లాల్‌ ‌తుదిశ్వాస విడిచారు. ఆచార్య లాల్‌ ఒక అసాధారణ వ్యక్తి,  సంస్కృతికీ, పురావస్తు శాఖకీ ఆయన చేసిన సేవలు అసాధారణమైనవని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళి ఘటించారు. గాంధీనగర్‌ ఐఐటీ విజిటింగ్‌ ‌ప్రొఫెసర్‌ ‌మైకేల్‌ ‌డానినో మరొక అద్భుత వ్యాఖ్య చేశారు. ప్రొఫెసర్‌ ‌లాల్‌ ‌పదవీ విరమణానంతరం పురావస్తు శాస్త్రానికి చేసిన సేవలు సైతం మరింత ఉన్నతమైనవని వ్యాఖ్యానించారు.  ఏడున్నర దశాబ్దాల పాటు భారతీయ పురావస్తు శాస్త్రానికి సేవలు అందించిన ఆచార్య లాల్‌ ‌నిజంగానే అరుదైన భారతీయుడు. 

ఆచార్య బ్రజ్‌ ‌బసిలాల్‌ను అయోధ్య ఉద్యమానికి కొత్త ఊపిరులు ఇచ్చినవారిగా భారతీయులు గౌరవించుకోవాలి. అంతేకాదు, మహాభారత గాథలతో సంబంధం ఉన్న ప్రదేశాలలో కూడా ఆయన పురావస్తు తవ్వకాలు జరిపారు. ఈ దేశానికి శిరోధార్యమైన రెండు పురాణ గాథలకూ, చరిత్రకూ ఉన్న బంధాన్ని ఆయన వెలికి తీయడానికి జీవితాన్ని అంకితం చేశారని చెప్పవచ్చు. అలా, ఈ దేశంలో పుట్టిన గొప్ప పురావస్తు శాస్త్రవేత్తలలో ఆచార్య లాల్‌కు అగ్రతాంబూలం దక్కుతుంది. 1921లో ఝాన్సీ (ఉత్తర ప్రదేశ్‌)‌లో జన్మించిన లాల్‌ ‌భారత పురావస్తు సర్వే శాఖకు 1968 నుంచి 1972 వరకు సంచాలకులుగా పని చేశారు. హరప్పా తవ్వకాల పనిలోనే కాదు, యునెస్కో చేపట్టిన పలు కార్యక్రమాలలోనూ తన వంతు సేవలు అందించారు. 101 సంవత్సరాల పరిపూర్ణ, ప్రయోజనకర జీవితంలో ఎక్కువ భాగం పురావస్తు శాస్త్ర అధ్యయనంలో, తవ్వకాలలో ఆయన వినియోగించారు. అలాంటి విశిష్ట సేవలకు గాను 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌ ‌పురస్కారంతో సత్కరించింది. ఇవన్నీ ఉన్నా అయోధ్యలో బాబ్రీ మసీదు పేరుతో ఉన్న కట్టడం కింద తవ్వకాలు చేపట్టడం ఆయన కీర్తికి మరింత వన్నె తెచ్చింది. ఆయన కృషితోనే అయోధ్య ఉద్యమానికి ఆధారాల కోణం నుంచి గొప్ప ఊపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. న్యాయ పోరాటానికి  బలం చేకూర్చినవి కూడా అవే. ఆయన కన్నుమూసి ఉండవచ్చు. కానీ తవ్వకాల ద్వారా ఆయన వెలికి తెచ్చిన అవశేషాలు, అవి ఇచ్చిన సమాచారం శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటాయని భారత పురావస్తు పరిశోధన శాఖ ఇచ్చిన నివాళిలో సరైన అంచనా ఇచ్చింది.

భారతదేశ చరిత్రకూ, పురావస్తు శాస్త్రానికీ కూడా మూలాధారం సంస్కృత భాష. కానీ ఆ భాషలో కనీస ప్రవేశం లేకుండానే ప్రాచీన భారతదేశ చరిత్రను రచించినవారే ఎక్కువ అన్న విమర్శ ఉన్నది. దానితో మన ప్రాచీన చరిత్రకు, రచనకు, పరిశోధనకు జరిగిన నష్టం అంచనాకు అందదు. కానీ లాల్‌కు ఆ విమర్శ వర్తించదు. ఆయన మొదట అలహాబాద్‌ ‌విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత సాహిత్యంలోనే మాస్టర్స్ ‌చేశారు. ఆపై పురావస్తు శాస్త్రం మీద అభిరుచి పెరిగి ఆ అంశాన్ని కూడా చదువుకున్నారు. తరువాత ప్రముఖ బ్రిటిష్‌ ‌పురావస్తు శాస్త్ర నిపుణుడు మోర్టిమర్‌ ‌వీలర్‌ ‌దగ్గర సహాయకునిగా చేరారు. అలుపన్నదే లేకుండా సాగిన లాల్‌ ‌పురావస్తు శాస్త్ర అన్వేషణలో మొదటి అడుగు తక్షశిల తవ్వకాల (1943) దగ్గర పడింది. తరువాత హరప్పా తవ్వకాలలో  పనిచేశారు. 1950-52 మధ్య మహా భారత గాథకు సంబంధించిన ప్రాంతాలలో తవ్వకాలు జరిపించారు. తన సుదీర్ఘ పురావస్తు పరిశోధన ఫలితాలతో ఆయన దాదాపు 50 గ్రంథాలు రచించారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో 150 పరిశోధక పత్రాలను ప్రచురించారు. ‘సరస్వతి నది ప్రవహిస్తూనే ఉంది: భారతీయ సంస్కృతి ప్రస్థానం’, ‘రాముడు ఆయన చారిత్రకత, మందిర్‌, ‌సేతు: వాఙ్మయ ఆధారాలు, పురావస్తు శాస్త్రం, ఇతర శాస్త్రాలు’ అన్న పుస్తకాలు ఎంతో ప్రఖ్యాత గాంచాయి.

భారతీయ పురావస్తు శాస్త్రానికి ఆచార్య లాల్‌ ‌చేసిన అపూర్వ సేవలను మూడు కోణాలుగా పరిశీలించవచ్చునని గాంధీనగర్‌ ఐఐటీ విజిటింగ్‌ ‌ప్రొఫెసర్‌ ‌మైకేల్‌ ‌డానినో అన్నారు. అందులో మొదటిది- భారతీయ సంస్కృతిలోని వివిధ దశలను తెలుసుకునేందుకు వీలుకల్పించే పలు ప్రాంతాలలో తవ్వకాలు జరిపినవారు లాల్‌. ఆరావళి పర్వతాల నుంచి ఒడిశా వరకూ, ఉత్తర ప్రదేశ్‌ ‌నుంచి రాజస్తాన్‌ ‌వరకు తవ్వకాల పని సాగించారు. రెండోది- తన శోధనను పరిశోధక పత్రాలలో నమోదు చేయడాన్ని ఒక యజ్ఞంగా భావించడం. ఆలోచనాత్మకంగా ఉండే ఆ పత్రాలు కాపర్‌హోర్డ్ ‌సంస్కృతి, పెయింటెడ్‌ ‌గ్రే వేర్‌, ‌హస్తినాపురి తవ్వకాల విశేషాలు, హరప్పా సంస్కృతి నాటి లిపికీ, మెగాలితిక్‌ అక్షరాలకీ ఉన్న బంధంపై విశ్లేషణతో పాటు భారతీయులు పరమ పవిత్రంగా భావించే రెండు పురాణాలతో పురావస్తు శాస్త్రానికి ఉన్న బంధాన్ని శోధించే పని ఆయన చేశారు. మూడు- పురావస్తు శాస్త్రంలో చిరకాలంగా ఉన్న మౌలిక ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే పని. అందుకు ఉదాహరణ, కాలిబంగన్‌ (‌రాజస్తాన్‌) ‌తవ్వకాలలో బయల్పడిన హరప్పా సంస్కృతి తూర్పు దిశగా ఎంతవరకు విస్తరించింది? అన్న అంశం.

ఆర్‌ఎస్‌ ‌శర్మ అనే చరిత్రకారుడు ప్రతిపాదించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని ఆచార్య లాల్‌ ‌ఖండించడం కూడా మరొక మౌలిక ప్రశ్నకు సమాధానం చెప్పడమే. రుగ్వేద కాలం నాటి ప్రజలదీ, హరప్సా నాగరికత నాటి ప్రజలదీ ఒకే రకమైన జీవన విధానమని  లాల్‌ ‌వాదన. దీని మీద చాలా వాదోపవాదాలు ఉన్నాయి. ‘దక్షిణాసియా తొలినాళ్ల నాగరికత’ అన్న పుస్తకంలో ఆచార్య లాల్‌ ‌హరప్పా కాలం నాటి భారతీయ జీవనం గురించి లోతైన విశ్లేషణ ఇచ్చారు.‘సరస్వతి నది ప్రవహిస్తూనే ఉంది: భారతీయ సంస్కృతి ప్రస్థానం’లో ఆర్యుల దండయాత్ర వాదాన్ని ఆయన చీల్చి చెండాడారు. నిజానికి దక్షిణాసియా తొలినాళ్ల నాగరికత పుస్తకంలోనే ఆయన ఇందుకు బీజాలు వేశారు. ఇది పునరాలోచించుకోవలసిన సమయం అన్న శీర్షిక కింద ఈ పరిచయం ఉంది. ఆర్యుల దండయాత్ర ఎంత మిథ్యో తెలియచేయడానికి 2002-2015 మధ్య ఆయన నాలుగు పుస్తకాలు వెలువరించారు.

1975లో బీబీ లాల్‌ ఒక అపురూపమైన కార్యక్రమం ప్రారంభించారు. దాని పేరు- రామాయణ కాలం నాటి స్థలాలలో పురావస్తు ఆధారాల అన్వేషణ. దీనికి భారత పురావస్తు శాఖ ఆర్థిక సాయం చేసింది కూడా. ఆ శాఖతో పాటు గ్వాలియర్‌లోని జివాజి విశ్వవిద్యాలయం, ఉత్తర ప్రదేశ్‌ ‌పురావస్తు శాఖ కూడా తోడ్పడ్డాయి. ఈ కార్యక్రమం కిందనే లాల్‌ అయోధ్య, భరద్వాజ ఆశ్రమం, నందిగ్రామం, చిత్రకూట్‌, ‌శృంగవేరా పురలలో తవ్వకాలు నిర్వహించారు. ఆ సంవత్సరమే లాల్‌ ‌మరొక చిర స్మరణీయమైన గ్రంథం వెలువరించారు. అదే, ‘హరప్పా నుంచి అయోధ్య వరకు సాగిన తవ్వకాలలో వెలుగు చూసిన అంశాలు: సాంప్రదాయక భారతీయ గతం’. వీటి తరువాత భారతీయులు ఏనాటికీ మరవలేని సేవ ఆయన ద్వారా జరిగింది. అయోధ్యలో బాబ్రీ మసీదు పేరుతో పిలుస్తున్న కట్టడం అడుగున గుడి స్తంభాలను పోలిన అవశేషాలను తాను కనుగొన్నానని వెల్లడించారు. తన గ్రంథం ‘రాముడు ఆయన చారిత్రకత, మందిర్‌, ‌సేతు: వాఙ్మయ ఆధారాలు, పురావస్తు శాస్త్రం, ఇతర శాస్త్రాలు’లో ఈ అంశాలను పొందు పరిచారు కూడా. మసీదు కింద తవ్వకాలలో 12 స్తంభాలు కనిపించాయని, వాటి మీద హిందూ ధర్మానికి సంబంధించిన చిహ్నాలు, హిందూ దేవతల బొమ్మలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటికీ మసీదుకీ ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన తెలియచేశారు.

కారణాలు ఏమైనప్పటికి పురావస్తు తవ్వకాల ఆధారంగా ఆచార్య లాల్‌ ‌సమర్పించిన పత్రాలకు వచ్చినంత ఆదరణ, ఆర్యుల దండయాత్ర గురించి చేసిన పరిశోధనకు రాలేదు. ఈ అంశంపై పెద్దగా చర్చ జరగలేదు. వామపక్ష చరిత్రకారుల వాదనలు ఆచార్య లాల్‌ ‌వాదనకు అడ్డుగోడలయ్యాయి. ఆర్యుల దండయాత్ర వాదాన్ని ఖండించడమంటే జాతీయత, మతం వంటి అంశాలను సమర్థించడమేనన్న వాదన కూడా లేవదీశారు. ఇలాంటి సమయంలో ఆచార్య లాల్‌ ఎదురీదుతూ తన వాదనను వినిపించారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram