‘ఇంకా సంతకాలు కావాలంటే కొంచెం సేపు వేచి ఉండు’ ఇంత చిన్న వ్యాఖ్య. అది కూడా స్నానం చేసే నీళ్ల తొట్టి నుంచే సంతకం చేసిన కాగితాలు తెరకు అవతల ఉన్న వ్యక్తికి అందిస్తూ అంటారు. ఆ నీళ్ల తొట్టిలో ఉన్నవారు  ఎవరో కాదు, నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌. అత్యవసర పరిస్థితి (1975) కమ్ముకొస్తున్న వేళ అబూ అబ్రహాం అనే గొప్ప కార్టూనిస్ట్ అం‌దించిన కార్టూన్‌ ఇది. అత్యవసర పరిస్థితి భారత సామాజిక, రాజకీయ ఆత్మను ఛిద్రం చేసిన సంగతి మొద• తెలిస్తే, ఈ కార్టూన్‌ ‌లోతుపాతులు తెలుస్తాయి. అది కార్టూన్‌ ‌లక్షణం. రాజకీయ వ్యంగ్య చిత్రం, లేదా ఎడిటోరియల్‌ ‌కార్టూన్‌ ‌బలమైన మాధ్యమ పక్రియ. అరపేజీ వ్యాసం, లేదా పేజీ వార్త వ్యక్తీకరించలేని లోతైన భావనను మూడు కాలాల కార్టూన్‌ ‌వ్యక్తీకరిస్తుందని అంటారు నండూరి రామమోహనరావు.

వ్యంగ్య చిత్రానికి ఉన్న శక్తి అపరిమితమైనది. ఇప్పుడు దిన పత్రికలలో ఎడమవైపు కింది భాగంలో పాకెట్‌ ‌కార్టూన్లు మాత్రం కనిపిస్తున్నాయి. కొద్దికాలం క్రితం వరకు మూడు కాలాల కార్టూన్లు, మొదటి పేజీని అలంకరించి ఉండేవి. కార్టూన్‌ ‌చిన్నదైనా పెద్దదైనా.. ఏదైనా కావచ్చు. కొందరు కన్నెర్ర చేస్తారు. తప్పదు. ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి కూడా అలాంటి కార్టూన్‌ను సృష్టించిన వాడి శిరస్సు మీద నాయకులు మోజు పడే అవకాశం కూడా ఉంది. తన మీద వరస పెట్టి వస్తున్న కార్టూన్‌లను చూసి ఆ కార్టూనిస్టు తల కావాలని అడిగాడు హిట్లర్‌. ‌నాజీజం అనే రైలింజన్‌ ‌కొలిమిలోకి జర్మనేతరులు, యూదుల సమూహాలను బొగ్గు మాదిరిగా పార పెట్టి విసిరివేస్తున్నట్టు చిత్రించిన కార్టూన్‌ ‌హిట్లర్‌ ఆ‌గ్రహానికి కారణాలైన వాటిలో ఒకటి. కార్టూన్‌ ‌రాజకీయాలకే పరిమితం కాదు. సామాజిక జీవనం, సాంస్కృతిక జీవనం, ప్రజా జీవనంలో వస్తున్న వక్రధోరణులను వెక్కిరించగలుగుతుంది. కార్టూన్‌ ‌లక్ష్యమే అది. ఏ సమాజమైనా పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండాలంటే తనను తాను ఆత్మవిమర్శ చేసుకునే తత్త్వం కలిగి ఉండాలి. వ్యంగ్య రచనలు, వ్యంగ్య చిత్రాలు అందుకు దోహదం చేస్తాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగి ఉంది కార్టూన్‌. ‌కార్టూన్‌ ‌కళకు విశ్వవ్యాప్తంగా ఉన్న ఆదరణకు, గౌరవానికి నిదర్శనంగా మే 5వ తేదీని అంతర్జాతీయ కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ప్రథమ బహుమతి పొందిన కార్టూన్

కానీ విషాదం ఏమిటంటే, మన దినపత్రికలు, వార, మాస పత్రికల నుంచి రాజకీయ వ్యంగ్య చిత్రాలు దాదాపు, దాదాపు ఏమిటి పూర్తిగా కనుమరుగైపోయాయి అని ది టెలిగ్రాఫ్‌కు రాసిన ఒక వ్యాసంలో మంజుల్‌ అనే ప్రముఖ కార్టూనిస్ట్ ‌వ్యాఖ్యానించారు. పుణే విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్టూన్‌ ‌ప్రదర్శన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా రాసిన వ్యాసంలో అన్నమాటలివి. ఆయనతో విభేదించడానికి పెద్దగా అవకాశాలు లేవు మరి. కానీ గుర్తించవలసిన పెద్ద వాస్తవం ఒకటి ఉంది. ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్నదీ అనడానికి నిదర్శనం పత్రికలలో కనిపించే కార్టూన్లే. మరి, మనది ప్రజాస్వామిక దేశం. కార్టూన్లు సమకాలీన సమాజాన్ని చిత్రించడమే కాదు, అందులోని వక్రతను కొంటె రేఖలతో ఆవిష్కరిస్తాయని సందీప్‌ అధవార్యు అనే మరొక కార్టూనిస్ట్ ‌చెప్పారు. ఇంతకీ ఒక మంచి రాజకీయ వ్యంగ్య చిత్రకారుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? ఒక మంచి కార్టూన్‌ ఎలా వస్తుంది? ఇందుకు మొదట కావలసినది రాజకీయాల మీద మంచి అవగాహన. దానికి సమపాళ్లలో హాస్య చతురత. రాజకీయాల మీద బాగా దృష్టి పెడితే హాస్య చతురత దానికదే వస్తుందంటే అది వేరే విషయం. దీనితో పాటు అదుపుతో కూడిన వ్యంగ్యాన్ని చిందించే నేర్పు కూడా కావాలి. ఒక కార్టూనిస్టుకి కేవలం రాజకీయ స్పృహ ఉండి, హాస్య చతురత, వ్యంగ్యం లేకుంటే కాస్త ప్రమాదమే. చిత్రకళలో నేర్పు ఉంటే కార్టూనింగ్‌కు శోభ చేకూరుతుంది. అలా అని చిత్రకళలో నేర్పు ఉండి, హాస్య చతురత వ్యంగ్యం లేని కార్టూన్‌ ‌ప్రజలను నవ్వించలేదు. పైగా కార్టూనిస్టును ఏడిపించే సందర్భం దాపురించే అవకాశం కూడా ఉంది.

ద్వితీయ బహుమతి పొందిన కార్టూన్

నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగానే రాజకీయ వ్యంగ్య చిత్రాలకు కాలం చెల్లిపోతున్న తీరు కనిపిస్తున్నదని చాలామంది ఆవేదన పడుతున్నారు. ఒకప్పుడు కార్టూనింగ్‌ ‌పట్ల ఎంతో అభిరుచి కనపరచిన ఇంగ్లండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం తరువాత అది మెల్లగా పతనం కావడం మొదలైంది. ఫలితమే ‘పంచ్‌’, ‘‌టిట్‌బిట్‌’ ‌వంటి పత్రికల మూత. భారత్‌లో కూడా అత్యవసర పరిస్థితి పుణ్యమా అని 1975లో పంచ్‌ ‌తరహాలోనే నడిచిన కార్టూన్ల పత్రిక ‘శంకర్స్ ‌వీక్లీ’ ప్రచురణ నిలిచిపోయింది.

పంచ్‌, ‌ఫన్‌, ‌పాల్‌ ‌మాన్‌ ‌గజెట్‌ ‌వంటి బ్రిటిష్‌ ‌కార్టూన్‌ ‌పత్రికలే భారతదేశంలో రాజకీయ కార్టూన్లకి ప్రేరణ అని ఒప్పుకోవచ్చు. అసలు పత్రికలనే మనం ఇంగ్లండ్‌ ‌నుంచి తెచ్చుకున్నాం. కానీ వ్యంగ్య చిత్ర అభిరుచినీ, కళనీ విదేశాల నుంచి తెచ్చుకున్నా దానిని భారతీయమైన శైలిలోకి తేవడంలో మనవారు మిక్కిలి విజయం సాధించారు. ‘పంచ్‌’ 1841‌లో అక్కడ ప్రారంభమైంది. మన దేశంలో 1850లో బెంగాల్‌ ‌హర్కారు, ఇండియా గజెట్‌ ‌పత్రికలు కార్టూన్లకు చోటు కల్పించాయి. కాబట్టి మన కార్టూన్‌ ‌చరిత్ర కూడా చిన్నదేమీ కాదు. ఢిల్లీ స్కెచ్‌ ‌బుక్‌ ‌కూడా భారతీయమైన కార్టూన్‌లతో 1850-57 మధ్య అలరారింది. ఇవన్నీ ఇంగ్లిష్‌ ‌పత్రికలు, ఇంగ్లిష్‌ ‌వాళ్లే స్థాపించుకున్న పత్రికలని మరచిపోరాదు. భారతీయ భాషా పత్రికలలో తొలిసారి కార్టూన్‌ ‌దర్శనం చేయించింది బెంగాల్‌ ‌వారి ‘అమృత్‌ ‌బజార్‌ ‌పత్రిక’.

తృతీయ బహుమతి పొందిన కార్టూన్‌

మరీ తొలితరం కార్టూనిస్టుల సంగతి ఏమో కానీ, ఆ తరువాతి తరం మాత్రం కార్టూన్‌ ‌కళను సుసంపన్నం చేసింది. శంకర్‌ ‌పిళ్లై అందులో అగ్రగణ్యులు. ఎందుకంటే ఎడిటోరియల్‌ ‌కార్టూన్‌ అం‌టే, రాజకీయ వ్యంగ్య చిత్రానికి ఆయన అంకురార్పణ చేశారు. ఖ్యాతి తెచ్చారు. అబూ అబ్రహాం, రంగ, కుట్టి, లచ్కె, విజయన్‌ ఇం‌దులోకి వస్తారు. తరువాత వచ్చిన తరం తమ ముందుతరం ప్రతిభకు మెరుగులు పెట్టింది. ఆర్‌కె లక్ష్మణ్‌ అం‌దులో ఒకరు. ఇంకా మారియో మరిండా, అజిత్‌ ‌నైనన్‌, ‌జీజే యశుదాసన్‌, ‌సుధీర్‌ ‌ధర్‌, ఈయూ ఉన్ని,  పీకేఎస్‌ ‌కుట్టి, ఓవీ విజయన్‌, ‌రాజిందర్‌ ‌పురి, జి. అరవిందన్‌, ‌పీకే మంత్రి, బాల్‌ ‌ఠాక్రే, బీవీ రమణమూర్తి, మయా కామత్‌, ‌కాక్‌ ‌వీళ్లంతా మన కార్టూన్‌ ‌కళకి వన్నె తెచ్చారు. వీరంతా ప్రధానంగా రాజకీయ వ్యంగ్య చిత్రకారులే. పెద్ద పెద్ద పత్రికలలో పని చేసిన వారే. కానీ రాజకీయేతర కార్టూన్లకు పరిమితమైన వారికి ఇంత ఖ్యాతి రాలేదు. బహుశా బలమైన వివాదాలు చుట్టుముట్టడానికి రాజకీయ వ్యంగ్య చిత్రకారులకు ఉన్న అవకాశం వీరికి లేకపోవడమే అందుకు ఒక కారణమని అనుకోవచ్చునేమో! తెలుగు నాట తలిశెట్టి రామారావు, బాపు, పాపా, శ్రీధర్‌, ‌జయదేవ్‌, ‌సరసీ వంటి వారి కృషి మరువలేనిది.

కార్టూనిస్టులతో వేగడం కష్టమని దాదాపు అన్ని పత్రికలు నాడు ఏదో ఒక క్షణంలో భావించాయంటే అతిశయోక్తి కాదు. కానీ కొన్ని పత్రికలు కార్టూనిస్టు కారణంగా ఖ్యాతిగాంచాయన్న మాట కూడా యదార్థం. కేశవ్‌ ‌శంకర్‌ ‌పిళ్లై ‘హిందూస్తాన్‌ ‌టైమ్స్’ ‌పత్రికలో కార్టూనిస్టు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. తరువాత ఎప్పుడో గాంధీజీని కలుసుకున్నారు. అప్పుడు గాంధీజీ అడిగారట, ‘హిందూస్తాన్‌ ‌టైమ్స్ ‌కారణంగా నువ్వు ప్రసిద్ధుడవయ్యావా? లేకపోతే నీ కారణంగా హిందుస్తాన్‌ ‌టైమ్స్ ‌ప్రసిద్ధమయిందా?’ అని.

అయితే కుట్టీ అనే కార్టూనిస్టు అంటారు, ‘నిజమే, హిందుస్తాన్‌ ‌టైమ్స్ అం‌త ప్రసిద్ధి చెందడానికి కారణం శంకర్‌’ అని. అలాగే నాటి నేతలలో రాజకీయ వ్యంగ్య చిత్రాల పట్ల ఒక గౌరవం కనిపించే మాట నిజం. శంకర్‌ ‌పిళ్లైతో  ఒకసారి నెహ్రూ అన్నారట. నన్ను కూడా ఉపేక్షించనక్కరలేదు. నన్ను కూడా కార్టూనించు అని. ఇలాంటి కోరిక నాడు చాలామంది నేతలకు ఉండేది. శంకర్‌ ‌వేల కార్టూన్లు వేశారు. అందులో నాలుగు వేల కార్టూన్లలో నెహ్రూ కనిపిస్తారు. కానీ ఆయన కుమార్తె ఇందిర హయాంలో పత్రికలు స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి స్వేచ్ఛను కోల్పోయాయి. అంతకుముందు వరకు అవి అనుభవించిన రాజకీయ స్వేచ్ఛ తరువాత సాధ్యం కాలేదు కూడా. కారణాలు అనేకం.

దానిని సాధ్యం చేయవలసిన అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. కార్టూనిస్టులకు స్వేచ్ఛను ఇవ్వవలసిన సమయం వచ్చింది. ప్రతి పత్రిక ఇందుకు సిద్ధం కావాలి. రాజకీయ నాయకులు కూడా తమను కార్టూనించే అవకాశం వారికి ఇవ్వాలి. కానీ ఇవాళ్టి చాలామంది రాజకీయ నేతలలో, ప్రధానంగా ప్రాంతీయ పార్టీల వారిలో ఈ అభిరుచి మృగ్యం. దాని వలన జరిగే నష్టాన్ని వారు గుర్తిస్తే మంచిది. అలాగే కార్టూనిస్టులు కూడా తమ బాధ్యత, ప్రతిభల ఆధారంగా అందుకు తగిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. కార్టూన్‌ ‌కళ ఇవాళ్టి అవసరం. మారిన పరిస్థితులో అన్ని వ్యవస్థలు తమలో తాము కుమిలిపోతున్నాయి. ఆ లోపాలను చతురతతో చూపించి, ఆ బాధ నుంచి నవ్వుకుంటూనే అవి బయటపడవేసే అవకాశం కార్టూన్‌కి ఉంది అది నిరూపించాలి. నిజానికి ఇప్పుడున్న వాతావరణం కార్టూన్‌ ‌కళకు పెద్ద వనరు. ఎటొచ్చీ దానిని కార్టూనిస్టులు ఉపయోగించుకుంటే కన్నెర్ర చేయకుండా స్వాగతించే సహృదయత అందరికీ ఉండాలి.

జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ ఆర్థిక సహకారంతో  జాగృతి నిర్వహించిన – 2022  –  కార్టూన్‌ ‌పోటీ ఫలితాలు

 1. మొదటి బహుమతి రూ.5000 – పైడి శ్రీనివాస్‌, ‌వరంగల్‌
 2. ‌రెండవ బహుమతి రూ.3000 – గోపాలకృష్ణ, హైదరాబాద్‌
 3. ‌మూడవ బహుమతి రూ.2000 – కృష్ణ, హైదరాబాద్‌

‌ప్రోత్సాహక బహుమతి రూ.500 పొందినవి

 1. వడ్డేపల్లి వెంకటేశ్‌
 2. ఓం‌ప్రకాశ్‌ ‌నారాయణ్‌
 3. ఎస్వీ రమణ
 4. వి. బాలకృష్ణ
 5. తోపల్లి ఆనంద్‌
 6. ‌సుధాకర్‌
 7. ‌బీవీఎస్‌
 8. ‌జె. శేఖర్‌బాబు

సాధారణ ప్రచురణకు ఎంపికైనవి

 1. పుష్ప
 2. భాను
 3. డి. శంకర్‌
 4. ‌సంతోష్‌ ‌కౌటం
 5. శర్మ
 6. సౌమ్య
 7. క్రివ్‌
 8. ఎన్‌. ‌ధీరజ

About Author

By editor

Twitter
Instagram