– గుగులోతు వెంకన్ననాయక్‌, 9573555700

అం‌తర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ‌తాజా గణాంకాల ప్రకారం భారతదేశం బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్‌ ఆరో స్థానానికి పడిపోయింది. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న మన దేశం కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాలను, సవాళ్లను తట్టుకొని మరీ నిలబడింది.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతా ఆజాదీ కా అమృతోత్సవాలు జరుపుకుంటున్న శుభ తరుణంలో ఈ విషయం మనకు మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి, సుమారు రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసి పాలించిన బ్రిటన్‌ను వెనక్కి నెట్టడం పట్ల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వక్తం చేస్తున్నారు. మన దేశాన్ని ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా నిలపడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం, కృషి ఎనలేనిదని పలువురు కేంద్రమంత్రులు, ఆర్థికవేత్తలు అభినందనలు తెలుపుతున్నారు.

కోటక్‌ ‌మహీంద్రా బ్యాంక్‌ ‌సీఈవో ఉదయ్‌ ‌కోటక్‌, ‌మోదీ మంత్రం ఫలించిందని ట్వీట్‌ ‌చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్‌ ‌మహీంద్రా ‘కర్మ సిద్ధాంతం’ పని చేసిందని, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భారతీయులందరికీ ఇది నిజమైన నివాళి’ అని ట్వీట్‌ ‌చేశారు. కేంద్ర మంత్రి మన్సుక్‌ ‌మాండవీయ సంస్కరణలు, పనితీరు, పరివర్తన అన్న మంత్రంతోనే విజయం సాధించామని, ఈ గొప్పదనం భారత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని ట్విటర్లో పేర్కొన్నారు.

దశాబ్దం క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్‌ ‌డాలర్లు. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్‌ ‌డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత రూపాయితో పోల్చితే బ్రిటన్‌ ‌పౌండ్‌ ‌విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు ఈ ఏడాది భారత్‌ ఆర్థికవృద్ధి 7 శాతానికి పైగా నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. 2021-22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచీలో మాత్రం మనం బ్రిటన్‌ ‌కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను పరిగణనలోనికి తీసుకొని దీనిని రూపొందిస్తారు.

2022 మార్చి చివరి నాటికి భారత్‌ ‌ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్సబర్గ్ ఎకనామిక్‌ ‌న్యూస్‌ ‌సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా సంస్థ లెక్కలు వేసి నివేదికను రూపొందించింది. ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండు, జపాన్‌, ‌జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

ఆర్థిక సుడిగుండంలో బ్రిటన్‌!

‌ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌ ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుందనే చెప్పాలి. రోజురోజుకి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ధరల మీద నియంత్రణ లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతోంది. మున్ముందు పరిస్థితి మరింత చేజారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆ దేశ నూతన ప్రధాని లిజ్‌ ‌ట్రస్‌కు అతిపెద్ద సవాళ్లుగా మారనున్నాయి. వీటన్నింటిని ఆమె ఎలా అధిగమిస్తారో వేచిచూడాలి!

వ్యాసకర్త : ‘అఖిల భారత గిరిజన సమాఖ్య’ జాతీయ అధ్యక్షుడు

About Author

By editor

Twitter
Instagram