నిజాం సంస్థానం మీద జరిగిన పోలీసు చర్య (ఆపరేషన్‌ ‌పోలో) స్వతంత్రం  వచ్చిన తొలినాళ్లలో  భారతదేశం చూసిన పెను సంచలనం. 1948, సెప్టెంబర్‌ 13-17 ‌తేదీల మధ్య పోలీస్‌ ‌చర్య జరిగిందని అందరికీ తెలుసు. ఈ చర్య నాటి కేంద్ర హోం శాఖామాత్యులు, ఉపప్రధాని సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయి పటేల్‌ ఆలోచనల మేరకు, ఆయన పర్యవేక్షణలోనే  జరిగిందని కూడా మనందరికీ తెలుసు. కానీ, చరిత్రలో మరుగున పడిన విషయం ఒకటి ఉంది. చరిత్ర మీద ఎప్పటికీ ఆరని నెత్తుటి మరకలు చిందించిన రజాకార్ల మీద, ఈ రక్కసి మూకలకు అండగా ఉన్న నిజాం మీద చర్య అనివార్యమని సూచించినవారు కొండా వెంకట రంగారెడ్డి. ఆ చారిత్రక వాస్తవం మీద వెలుగును ప్రసరింప చేయడమే  ఈ వ్యాసం ఉద్దేశం. 

ఆగస్ట్ 15, 1947 ‌నుంచి భారత్‌ ‌స్వతంత్ర దేశమవుతుందని జూన్‌ 3, 1947‌న ఆఖరి వైస్రాయి లార్డ్ ‌మౌంట్‌బాటన్‌ ‌ప్రకటించారు. భారత స్వాతంత్య్ర చట్టం (ఇండియన్‌ ఇం‌డిపెండెంట్‌ ఆక్ట్) 1947 ‌ప్రకారం, దేశంలోని అన్ని స్వదేశీ సంస్థానాల మాదిరిగానే, నిజాం ఎదుట మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిది భారత యూనియన్‌లో తన హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని విలీనం చేయడం. రెండవది ఈ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయడం. మూడ•వది స్వతంత్రంగా ఉండడం. భౌగోళిక ప్రాధాన్యాన్ని బట్టి హైదరాబాద్‌ ‌స్వతంత్రంగా ఉండడం లేదా పాకిస్తాన్‌లో విలీనం కావడం- ఈ రెండింటిలో దేనిని ఎన్నుకున్నా భారతదేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి హైదరాబాద్‌ ఎట్టి పరిస్థితులలోను భారతదేశంలో విలీనం కావలసిందే. కానీ నిజాం హైదరాబాద్‌ని భారతదేశంలో విలీనం చేయడానికి మొగ్గు చూపడం లేదు. కొంచెం సమయం ఇవ్వమని కోరాడు. ఉదార స్వభావంతో భారత ప్రభుత్వం నిజాంకు సంవత్సరం గడువు ఇస్తూ నవంబర్‌ 29, 1947‌న యథాతథ ఒడంబడికను కుదుర్చుకుంది. ఈ ఒడంబడిక ఏడాది పాటు అమలులో ఉంటుంది.

దీనికి తోడు, సికింద్రాబాద్‌లో ఉన్న తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోమని ఆఖరి నిజాం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇదే అదనుగా నిజాం తన సైన్యాన్ని బలపరుచుకుంటూ, ఆయుధాలను సమకూర్చుకుంటూ భారతదేశంపైనే యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. పైగా కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు నిజాంకి అండగా నిలిచారు. హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని ఒక ముస్లిం రాజ్యంగా మార్చాలని చూశారు. అందుకే ఇక్కడి హిందువులకు మూడు ప్రత్యామ్నాయాలు ఇచ్చాడు. మొదటిది మతం మార్చుకోవడం, లేకుంటే పారిపోవడం, అదీ కాకుంటే రజాకార్ల కత్తులకు బలికావడం.

నిజాం అండతోనే రజాకార్ల దౌర్జన్యాలు, అరాచ కాలు మితిమీరిపోతున్నాయి. వాళ్ల రక్తదాహానికి అంతు లేకుండా పోయింది. అమాయక హిందువుల ప్రాణాలు వందలలో రాలిపోతున్నాయి. సంస్థాన మంతా కనీవినీ ఎరుగని సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నది కూడా. ఈ సందర్భంలోనే భారత ప్రభుత్వం హైదరాబాద్‌ ‌సంస్థానం కోసం నియ మించిన ఏజెంట్‌ ‌జనరల్‌ ‌కె.ఎం.మున్షీ పోరాట యోధులు కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు తదితరులను పిలిచి భవిష్యత్‌ ‌కార్యాచరణ గురించి చర్చించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న విద్రోహం, రజాకార్‌ ‌నెత్తుటి కాండ గురించి తాను ఎంత చెప్పినప్పటికి పండిత్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ పట్టించుకోవడం లేదనీ, ఒక్కసారి మీరు ఆయనను కలసి వాస్తవ పరిస్థితులు వివరించడం మంచిదనీ సూచించారు.

ఏప్రిల్‌ 24, 1948‌న కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఇతర నాయకులు బొంబాయి (నేటి ముంబై)లో పండిట్‌ ‌నెహ్రూను కలుసుకుని రజాకార్లు హిందువులపై సాగిస్తున్న దౌర్జన్యాలు, అత్యాచారాలు, మూకుమ్మడి హత్యల గురించి వివరించారు. తక్షణమే చర్య తీసుకోమని, సంస్థానంలోని హిందువులను, ఆ ఆపద నుండి విముక్తి చేయమని కోరారు.

 అంతా విని ప్రధానమంత్రి నెహ్రూ ఇలా అన్నారు.

‘‘మీరు హైదరాబాద్‌ను ఇండియా పటంలో భాగంగా చూడటం లేదు. మనకు స్వాతంత్య్రం లభించి కొద్దిరోజులే అయింది. మనం తొందర పడినట్లయితే దేశం మొత్తం మీద హిందువులకు, ముస్లింలకు మధ్య ఘర్షణలు జరిగి దురంతాలు చోటు చేసుకోవడమే కాదు, దీనితో ముస్లిం దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనవచ్చు. కనుక మీరు ఓర్పుతో పరిస్థితులను గమనించండి. తొందర పడ కడి. సమయం వచ్చినప్పుడు చర్య తీసుకుంటాం. అంతవరకు ఓర్పుతో నష్టాన్ని భరించండి’’ అని చెప్పారు. వెంకటరంగారెడ్డి బృందం ఆ మాటలతో సహజంగానే తీవ్ర నిరాశకు లోనయింది. వీరంతా మళ్లీ కె.ఎం.మున్షిని కలుసుకుని నెహ్రూ చెప్పింది వివరించారు. అది విన్న మున్షీ, వెంకట రంగారెడ్డి బృందాన్ని డెహ్రాడూన్‌లో ఉన్న ఉప ప్రధాని పటేల్‌తో సమావేశం కావలసిందనీ, జరిగిందంతా వివరించ మనీ మరొక సలహా ఇచ్చారు.

దీనితో కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, ఇతరులు పటేల్‌ ‌దగ్గరకు వెళ్లారు. అప్పుడే అస్వస్థత నుండి కోలుకుంటున్న సర్దార్‌ ‌పటేల్‌ ‌బిర్లా హౌస్‌లో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటు న్నారు. వెంకట రంగారెడ్డి బృందాన్ని ఆహ్వానించి, మంచం చుట్టు కుర్చీలు వేయించారు. అక్కడే తాము నెహ్రూను కలసి వచ్చిన సంగతి, ఆయన చెప్పిన మాటలు అన్నీ వెంకట రంగారెడ్డి పటేల్‌కు వివరించారు.

సర్దార్‌ ‌పటేల్‌ ఓపికతో అంతా విన్నారు. ఆపై, ‘‘ముస్లింలు, ముస్లిం దేశాలు (బల్ల గుద్ది) ఏమి చేయలేవు. సాధ్యమయినంత తొందరలో నిజాం మీద, రజాకార్ల మీద చర్య తీసుకుంటా’’ నని ధైర్యం చెప్పారు.

పటేల్‌ ‌చెప్పిన ధైర్యవచనాలతో వెంకట రంగారెడ్డి బృందం ఉత్సాహంతో హైదరాబాదుకు తిరిగి వచ్చింది. ఆ సమయంలోనే కశ్మీర్‌ ‌సరిహద్దులలో పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతోంది. అయినా కూడా సమయం దొరికిన వెంటనే సెప్టెంబర్‌ 13, 1948‌న భారత సైన్యం ఆపరేషన్‌ ‌పోలో పేరుతో హైదరాబాద్‌ ‌నిజాం, రజాకార్లపై పోలీస్‌ ‌చర్య మొదలుపెట్టింది. సెప్టెంబర్‌ 17 ‌సాయంత్రం నిజాం లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్‌ ‌విమోచన జరిగింది. తర్వాత అది భారతదేశంలో విలీనమైంది.

కొండా వెంకట రంగారెడ్డి, ఆయన బృందంతో చర్చించిన తర్వాతనే సర్దార్‌ ‌పటేల్‌ ‌పోలీస్‌ ‌చర్యకు ఉపక్రమించారని చాలామందికి తెలియదు. నిజానికి కొండా వెంకట రంగారెడ్డి పటేల్‌ని కలుసుకుని, హైదరాబాద్‌లో రజాకార్లు చేస్తున్న దౌర్జన్యాలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లకపోయి ఉంటే అసలు పోలీస్‌ ‌చర్య జరిగేదే కాదేమో కూడా. నిజాం సంస్థా నంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు, సాంస్కృతిక చైతన్యం వంటి అంశాలలో కేవీ రంగా రెడ్డి పాత్రను చర్చించడం అంతా ఒక ఎత్తు. పటేల్‌ను కలసి వాస్తవాలు వెల్లడించి ఆపరేషన్‌ ‌పోలోకు మార్గం ఏర్పరిచి, ఒక పెద్ద చారిత్రక సవాలుకు సమాధానం వెతికిన వైనం మరొక ఎత్తు. హైదరా బాద్‌ ‌విమోచన దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో కొండా వెంకట రంగారెడ్డిని ఆ కోణం నుంచి కూడా స్మరించుకోవడం మన బాధ్యత.

ఆధారాలు : స్వీయ చరిత్ర-కొండా వెంకట రంగారెడ్డి, విజ్ఞాన సరోవర్‌ ‌ప్రచురణలు.

బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర- ఉమ్మెత్తల కేశవరావు, నవచేతన పబ్లిషింగ్‌ ‌హౌస్‌.

‌ది ఎండ్‌ ఆఫ్‌ ‌యాన్‌ ఎరా : హైదరాబాద్‌ ‌మెమరీస్‌/‌మెమాయిర్స్-‌కె.ఎం. మున్షి, భారతీయ విద్యాభవన్‌

‌జాగృతి డెస్క్

By editor

Twitter
Instagram