అక్టోబర్‌ 2 ‌గాంధీ జయంతి

గాంధీజీ భారతదేశమంతా విశేషంగా పర్యటించారు. మారుమూల గ్రామాలను కూడా ఆయన సందర్శించారు. ఆ యాత్రలలోనే కొద్దికాలం ఆయన వెంట మామిడిమొక్క ఉన్న చిన్న మట్టికుండ తప్పనిసరిగా ఉండేది. అది ఆయనకు చాలా అపురూపం. దాని వెనకాల చిన్న గాథ ఉంది. గాంధీ గారికి మామిడిపళ్లంటే ఎంతో ఇష్టం. యరవాడ కారాగారంలో (పుణే దగ్గర) ఉన్నప్పుడు ఆయన ఒక మామిడిపండు తిని, టెంక పడేశారు. కొన్నాళ్లకి ఆ టెంక నుంచి ఒక మొలక వచ్చింది. దానిని గమనించినప్పటినుంచి గాంధీజీ మురిపెంగా చూసుకున్నారు. ఆ జైలు నుంచి విడుదలైన తరువాత ఒక మట్టిపాత్రలో ఆ మొక్కను పెట్టుకుని భద్రంగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి గాంధీజీ వెంటనే ఉంది. వారమో, పక్షమో, ఒక నెలో కాదు, 18 మాసాల పాటు కూడా మోసుకువెళ్లారు. ఎందుకో మరి, కొద్దికాలం తరువాత ఆ మొక్క ప్రకృతి ఒడిలోనే సహజంగా పెరగాలన్న యోచన వచ్చింది గాంధీజీకి. దానిని ఒకచోట పాతి పెట్టారు. ఆ స్థలమే హైదరాబాద్‌లోని నాంపల్లి స్టేషన్‌ ‌రోడ్డులో ఉన్న గోల్డెన్‌ ‌త్రెష్‌హోల్డ్ ‌ప్రాంగణం. అది సరోజినీ నాయుడి స్వంత భవనం. ఇది గాంధీజీ 1934లో హైదరాబాద్‌కు రెండోసారి వచ్చినప్పుడు జరిగిన ముచ్చట. ఆయన తరువాతి గమ్యం పట్నా. సికింద్రాబాద్‌లో రైలు ఎక్కే ముందు ఆ ప్రాంగణంలో ఆ మొక్కను శ్రద్ధగా నాటి వెళ్లిపోయారు. ఆ మొక్క ఎంతో ఎదిగింది. అదే ఆయన ఆఖరి హైదరాబాద్‌ ‌యాత్ర. మొత్తం నాలుగుసార్లు బాపూజీ భాగ్యనగర్‌ ‌వచ్చారని చెబుతారు.

1929,1934-నిజాం సంస్థానానికి వచ్చారు. వీటికి చాలా ప్రసిద్ధి ఉంది. అది ఏప్రిల్‌ 6, 1929. ‌కృష్ణస్వామి ముదిరాజ్‌ ‌తన ఆంధ్ర స్వచ్ఛంద సేవకుల దళంతో వాడి వెళ్లి గాంధీజీని కలుసుకుని, వెంట తీసుకువచ్చారు. గాంధీజీ వెంట కస్తూర్బా గాంధీ కూడా ఉన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలోని నాంపల్లి స్టేషన్‌లో వివేకవర్ధిని ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ వ్యవస్థాపకుడు వామన్‌ ‌రామచంద్ర నాయక్‌, ‌మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగరావు, ఆర్‌ఎస్‌• ‌నాయక్‌, ‌రాజ్‌ ‌బన్సీలాల్‌, ‌ముకుందదాస్‌ ‌వంటి పెద్దలు స్వాగతం పలికారు. స్టేషన్‌ ‌బయట అశేష జనవాహిని ఆయన కోసం చూసింది. 1929 నాటి ఆ యాత్ర వేళ స్టేషన్‌ ‌నుంచి తన కోసం తీసుకువచ్చిన కారు దగ్గరకు రావడానికి ఆయనకు 45 నిమిషాలు పట్టింది.

గాంధీజీ గోల్డెన్‌ ‌త్రెష్‌హోల్డ్‌లో బస చేసేవారు. అప్పుడు అక్కడ నుంచి గౌలిగూడలోని వివేకవర్ధిని సభామందిరం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన సభకు వామన్‌నాయక్‌ అధ్యక్షత వహించారు. నిజాం ఆంక్షల వల్ల కావచ్చు. ఆ సభ నిరాడంబరంగా జరిగింది. గాంధీజీ ఉపన్యాసం కూడా క్లుప్తంగానే సాగింది. రాట్నం గురించీ, భారతీయులు అనుభవిస్తున్న దుర్భర దారిద్య్రం గురించీ గాంధీజీ నాలుగు మాటలు చెప్పారు. ‘రాట్నం కామధేనువు. మన దేశానికి సకల వరప్రదా యిని. ఖద్దరు ఉత్పత్తికి హైదరాబాద్‌ ‌సంస్థానంలో మంచి పరిస్థితులు ఉన్నాయని నాకు తెలిసింది. ఇక్కడ నుంచి నాణ్యమైన ఖాదీ ఉత్పత్తి చేస్తున్నారని సరోజినీ నాయుడు చెప్పారు. నాకు వేసిన దండ హరిజనులు వడికినదని తెలుసుకొని ఎంతో సంతోషించాను. హిందూదేశం కన్నా పేద దేశం మరొకటి లేదు. దేశంలో రోజుకు ఒక్క పూట అయినా అన్నం దొరకని వారి సంఖ్య మూడు కోట్లు పైనే ఉంది. అలాంటి వారికి రాట్నం కామధేనువు. రాట్నం వడకడం వల్ల లక్షమంది స్త్రీలకి జీవనోపాధి దొరుకు తుంది. మీకు సన్నని నాజూకైన విదేశీ దుస్తుల మీద మోజు ఉన్న సంగతి నాకు తెలుసు. కానీ సోదర భారతీయుల కోసం ముతక దుస్తులు ధరిస్తే వారికి సహాయపడినవారవుతారు’ అని గాంధీ అన్నారు. ఈ ఉపన్యాసం తరువాత రాజ్‌ ‌ధన్‌రాజ్‌ ‌గిరి రూ.2,000 రూపాయల చెక్కు, ముకుంద దాస్‌ ‌నూరు రూపాయలు గాంధీకి అందించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న తన శ్రేయోభిలాషుల నుంచి భారత స్వాతంత్య్రోద్యమం కోసం రూ. 15,000 విరాళాలు సేకరించారు. ‘మన స్వాతంత్య్రోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించ డానికి కావలసిన విరాళాలు మీ దగ్గర నుంచి సేకరించడానికి నేను ఇక్కడికి రావలసి వచ్చింది. మన లక్ష్య సాధనకు మీరు నాతో సహకరించాలి’ అని ఆయన అప్పుడు కోరారు. ఈ పర్యటనలోనే గాంధీజీ ప్రేమా థియేటర్‌లో ఏర్పాటు చేసిన మహిళల సమావేశంలో మాట్లాడారు. మూడు వేలమంది హాజరయ్యారు. అక్కడే రూ. 639 రూపాయల 14 అణాల, రెండు పైసల విరాళం వచ్చింది. నిజాం నిరంకుశత్వాన్ని కూడా లెక్కచేయ కుండా 1940 ప్రాంతంలో వివేకవర్ధిని విద్యా సంస్థ కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నది. 1948లో నిజాం నుంచి విముక్తి వరకు ఆ విద్యా సంస్థను గాంధీజీ సహా ఎందరో జాతీయ నాయకులు సందర్శించారు కూడా. అయితే నిజాం రాజ్యంలో మత సామరస్యం వెల్లివిరుస్తున్నదని, హిందువులు ముస్లింలు కలసి ఉన్నారని భ్రమ పడుతూనే, గోవధ నిషేధానికి నిజాం కృషి చేయడం గురించి గాంధీజీ అబ్బురపడ్డారు. ఈ యాత్ర తరువాత సబర్మతి ఆశ్రమం నుంచి హైదరాబాద్‌ ‌వాసులు తన పట్ల చూపిన ఆదరానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆయన లేఖ రాశారు.

రెండోసారి గాంధీజీ హరిజన (ఎస్‌సీలు) అభ్యున్నతి కోసం మార్చి 9, 1934న హైదరాబాద్‌ ‌వచ్చారు. ఈ యాత్రలో ఆయన వెంటనే మీరాబెన్‌ ఉన్నారు. 1929 నాటి అనుభవం వల్ల కావచ్చు. నిర్వాహకులు గాంధీజీని నాంపల్లికి 15 మైళ్ల దూరంలో ఉన్న లింగంపల్లి స్టేషన్‌లో దించారు. ఈ సంగతిని ముందుగానే తెలియచేయడం వల్ల సరోజినీ నాయుడు, కుమారి లీలామణి, మేజర్‌ ఎం‌జీ నాయుడు, వామన్‌ ‌నాయక్‌, ‌సిరాజుల్‌ ‌హసన్‌ ‌తిర్మిజి, వినాయక్‌రావ్‌ ‌విద్యాలంకార్‌, ‌కె.తాతాచారి అప్పటికే అక్కడి చేరుకున్నారు. సరోజిని అంతకు రెండు రోజుల ముందే గాంధీజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించ డానికి నగరానికి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకు గాంధీజీ లింగంపల్లిలో రైలు దిగారు. సరోజిని ఆయనకు ఖద్దరుమాల వేసి స్వాగతం చెప్పారు. నాంపల్లి స్టేషన్‌ ‌దగ్గర వేచి ఉన్న తీర్థప్రజను నిరాశపరచకుండా ఆ దారి నుంచే కారును తీసుకుపోదామని సరోజిని సూచించారు.

లింగంపల్లి స్టేషన్‌ ఎదుట గాంధీజీ కారు ఎక్కుతుండగా ఒక బాలిక జనాన్ని తోసుకుంటూ గాంధీజీ దగ్గరకు రాగలిగింది. తన కాలికి ఉన్న వెండి మువ్వల పట్టీలు తీసి గాంధీజీ చేతిలో పెట్టింది. అదే సమయంలో ఒక పేద మహిళ కూడా గాంధీజీని చేరుకుంది. చినిగిన దుస్తులతో ఉన్న ఆ పల్లెటూరి వృద్ధురాలు ఒక రూపాయి ఇచ్చింది. మరొక పేదరాలు ఆయనను ‘లోకరక్షకుడా’ అని సంబోధిస్తూ చేతిలో డబ్బులు పెట్టింది. అవి రెండు అణాలు. అంటే పన్నెండు పైసలు. లేదా బేడ అనేవారు. వారి దాతృత్వానికి గాంధీజీ చలించిపోయారు. అనుకున్నట్టే నాంపల్లి దగ్గర గాంధీజీ కారు దిగి జనానికి అభివాదం చేశారు. ఈ యాత్రలోనే ఆయన అసోసియేటెడ్‌ ‌ప్రెస్‌ ఆఫ్‌ ఇం‌డియాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు.

 ఈ యాత్రలో గాంధీజీకి ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని నిజాం ప్రభుత్వం ముందే పోలీసులను ఆదేశించింది. అడ్డుకునే కొద్దీ ఆయన ప్రతిష్ట పెరిగిపోతూ ఉండడమే ఇందుకు కారణం. గాంధీజీ బహిరంగ సభలలోనే మాట్లాడాలనీ, అది కూడా నిమ్నజాతుల గురించే మాట్లాడాలనీ శాసనసభలో చర్చ తరువాత నిర్దేశించారు. ఇందులో మెహదియార్‌ ‌జంగ్‌ అనే రాజకీయ సభ్యుని వ్యూహం చిత్రమని పిస్తుంది. నిమ్నజాతి అభ్యున్నతి పేరుతో వస్తున్న గాంధీజీకి అటంకాలు కల్పించకుండా ఉంటే, ఆ జాతులలో మనకు కూడా సానుభూతి ఉంటుందని ఆయన రాశారు. అయితే షరతుల మధ్యనే గాంధీ యాత్ర సాగింది. కాచిగూడలోని చెప్పల్‌బస్తీకి హరిజనబస్తీ అని గాంధీ పేరు పెట్టినా దానిని అధికారులు అంగీకరించలేదు.

 అంతకు ముందు సంవత్సరమే గాంధీజీ అంట రానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం ఆరంభించారు. ఇప్పుడు ఎస్‌సీలుగా పిలుస్తున్నవారికి ఆయన 1933లో హరిజనులని పేరు పెట్టారు. అంటే హరి సంతానమని. ఇతర అట్టడుగువర్గాలకు కూడా ఆ పేరు వర్తించేది. అంటరానితనం నిర్మూలనోద్యమం కోసం గాంధీజీ వార్థా ఆశ్రమం నుంచి యాత్ర పారంభించి 9 మాసాలు సాగించారు. ఆ యాత్రలో భాగంగానే 1934లో హైదరాబాద్‌ ‌వచ్చారు.

హిందీ, ఉర్దూ ఒకటే అన్న తీరులో గాంధీజీ రెండు భాషలలోను మాట్లాడారు. సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో ఏర్పాటు చేసిన బహి రంగ సభకు వెళ్లారు. ఈ సభలోనే ముగ్గురు హరిజన బాలికలు వేదంలోని ఒక పనసను పఠించడం విశేషం. ఇక్కడ గాంధీజీకి వచ్చిన కానుకలను ఆర్‌ఎస్‌ ‌నాయక్‌ ‌ద్వారా వేలం వేయించారు. ఆ రాత్రే సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో సరోజిని, పద్మజా నాయుడు, తాతాచారి గాంధీజీకి వీడ్కోలు పలికారు.

1920 నాటి నాగపూర్‌ ‌కాంగ్రెస్‌ ‌సమావేశాల తరువాత గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకర ణోద్యమం జాడ హైదరాబాద్‌ ‌సంస్థానం మీద కూడా పడింది. హైదరాబాద్‌ ‌కార్య నిర్వాహక సంఘాద్యక్షుడు జుల్‌ ‌ఖదర్‌జంగ్‌ ‌పోలీసు, న్యాయశాఖల అధికారులకు రాసిన విషయాల ద్వారా ఇది తెలుస్తుంది. ఖిలాఫత్‌ ఉద్యమం, రాజకీయ ఉపన్యాసాలు, గాంధీ, అలీ సోదరుల పటాలు, గాంధీ టోపీలు, జాతీయ పాఠశాలలు, గోరక్షణ, సహాయ నిరాకరణ వంటి పిలుపులు, అలజడులు కనిపిస్తున్నాయని, ఇవి ప్రమాదమని అందులో రాశారు. అలాగే గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి మహబూబ్‌నగర్‌ ‌నుంచి ముగ్గురు ఖాదీ దుస్తులతో, గాంధీ టోపీలతో వచ్చారు. వారిలో ఇద్దరు హిందువులు, ఒక మహమ్మదీయుడు ఉన్నాడు. వీరు ఖిలాఫత్‌ ఉద్యమ కారులని అధికారులు చర్చించుకున్నారు. హైదరా బాద్‌లో మస్లేకర్‌ అనే వ్యక్తి చరఖాలు విక్రయిస్తు న్నాడని, చాలా ఇళ్లలో అవి కనిపిస్తున్నాయని కూడా అధికారులు కనుగొన్నారు. బదురుల్‌ ‌హసన్‌ అనే వ్యక్తి బొంబాయిలో వాటిని కొని హైదరాబాద్‌కు తెస్తున్నాడని తెలిసింది. చరఖాలు, నూలు వడకడం చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో కూడా కనిపించింది. గాంధీ, షౌకత్‌ అలీ చిత్రపటాలను ఔరంగాబాద్‌లో రహస్యంగా విక్రయించారు.

(తెలుగు అకాడమి ప్రచురణ ‘ఆంధప్రదేశ్‌లో గాంధీజీ’, 1978, సమాచారం ఆధారంగా. సంపాదకుడు కొడాలి ఆంజనేయులు)

About Author

By editor

Twitter
Instagram