సెప్టెంబర్‌ 17, 1948.. ‌హైదరాబాద్‌ ‌సంస్థానం భారతదేశంలో కలిసిన రోజు. ఆగస్ట్ 15, 1947‌న బ్రిటిష్‌ ‌పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ హైదరాబాద్‌ ‌సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్‌ ‌వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్‌ ‌నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.. ‌తమది స్వతంత్ర రాజ్యమని, హైదరాబాద్‌ అటు భారత్‌లో, ఇటు పాకిస్తాన్‌లోనూ కలవదని ప్రకటించాడు. అప్పటికే నిజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేర్గాంచాడు. ఆనాడే 236 బిలియన్ల సంపద కలిగి ఉన్నాడు. ఐదు టన్నుల బంగారమూ ఆయన వద్ద ఉంది. హైదరాబాద్‌ ‌సంస్థానం స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు ఆయన 1947లో ఫర్మానా కూడా జారీ చేశాడు.

కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారత దేశంలో కలవాలని కోరుకున్నారు. ఎందుకంటే దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోని విధంగా రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్లు తీవ్ర భయానక వాతావరణం సృష్టించారు. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యా కాండను కొనసాగించారు. వారి చేతిలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నిజాం నిరంకుశ పాలన గురించి, రజాకర్ల అకృత్యాల గురించి, వాటిని ఎదుర్కోవడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి నేటితరం కచ్చితంగా తెలుసుకోవాలి. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎందరో వీరుల ప్రాణత్యాగాల ఫలితమే.
హైదరాబాద్‌తో పాటు మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాలు నిజాం నవాబు పాలనలో ఉండేవి. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్‌లో చేరకపోతే అది దేశ మనుగడకే ముప్పు అని భావించిన నాటి హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌పటేల్‌ ‌హైదరాబాద్‌ ‌సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నిర్ణయించారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్‌ ‌సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.
నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకుందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకున్నారు. కానీ సైనికచర్య ద్వారా వెంటనే నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని భారత్‌లో విలీనం చేసి రజాకార్లని అరికట్టడం అత్యవసరం అని నాటి హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌పటేల్‌ ‌పట్టుపట్టి నెహ్రూని ఒప్పించారు. భారత ప్రభుత్వం తమపైకి యుద్ధానికి సిద్ధం అవుతోందని తెలిసిన నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏ ‌మాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించడంతో భారత్‌-‌నిజాం సేనల మధ్య యుద్ధం అనివార్యమైంది.

‘ఆపరేషన్‌ ‌పోలో’ విజయవంతం

సెప్టెంబర్‌ 13, 1948‌న భారత సైన్యం ‘ఆపరేషన్‌ ‌పోలో’ పేరిట హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి ‘పోలీస్‌ ‌యాక్షన్‌’ అనే పేరు కూడా ఉంది. ఈ సైనిక చర్య కేవలం ఐదు రోజుల్లోనే ముగిసిపోయింది. భారతసేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
హైదరాబాద్‌ ‌నలువైపుల నుంచి భారత సైన్యం ముట్టడిని ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి నల్‌దుర్గ్ అనే సైన్యాధికారి నాయకత్వం వహించారు. సెప్టెంబర్‌ 14‌న ఔరంగా బాద్‌, ‌జాల్నా, నిర్మల్‌, ‌వరంగల్‌, ‌సూర్యాపేటను అధీనంలోకి తీసుకోని హైదరాబాద్‌ ‌వైపు వచ్చారు.
తుల్జాపూర్‌, ‌తల్ముమడి నుంచి బయల్దేరిన సైన్యానికి జనరల్‌ ‌డీఎస్‌ ‌బ్రార్‌ ‌నాయకత్వం వహించారు. మద్రాస్‌ ‌వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఎ.ఎ. రుద్ర, కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్‌ ‌శివదత్త నాయకత్వం వహించారు. హైదరాబాద్‌కు నలుదిశల నుంచి భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని అధీనంలోకి తీసుకుంటుంటే.. ఆయా గ్రామాల్లోని ప్రజలు సైన్యానికి స్వాగతాలు పలికారు. భారత సైన్యం ముందు రజాకార్లు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. మూడు రోజుల్లోనే దక్కన్‌ ‌భాగాన్ని పూర్తిగా భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.

16వ తేదీ మధ్యాహ్నానానికి భారత సైన్యం హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాలలో మోహరించింది. భారత సైనిక సంపత్తికి భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రూస్‌ ‌లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17‌న సాయంత్రం సుమారు 5 గంటల సమయాని కల్లా భారత ఆర్మీ హైదరాబాద్‌ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. కాసేపటికి ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్‌ ‌పోలో పూర్తైంది. దీంతో రెండు శతాబ్దాల అసఫ్‌జాహీల పాలన అంతమైంది. నాడు హైదరాబాద్‌ ‌స్టేట్‌కు ప్రధానిగా ఉన్న లాయక్‌ అలీ తప్పించుకుని పాకిస్తాన్‌ ‌పారిపోయాడు. రజాకార్ల నాయకుడైన కాసీం రజ్వీ జైలు పాలయ్యాడు. నిజాం సంస్థానంలో ఉన్న ఔరంగాబాద్‌, ‌నాందేడ్‌, ‌పర్బనీ, బీడ్‌ ‌మహారాష్ట్రలో; గుల్బర్గా, బీదర్‌, ఉస్మానాబాద్‌, ‌రాయచూర్‌ ‌కర్నాటకలో విలీనం అయ్యాయి. అందుకే సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విముక్త దినోత్సవంగా పాటిస్తున్నాం.

అనంతర పరిణామాలు

నిజాం లొంగుబాటు అనంతరం చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌ ‌స్టేట్‌లో పరిపాలన బాధ్యతలను నాటి మేజర్‌ ‌జనరల్‌ ‌జేఎన్‌ ‌చౌదురీకి అప్పగించారు. సైనిక పాలకుడిగా సెప్టెంబర్‌ 19, 1948‌న ఆయన బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో రాష్ట్ర వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా ఉన్న ఎంకే వెల్లోడిని భారత ప్రభుత్వం డిసెంబర్‌ 1, 1949‌న హైదరాబాద్‌ ‌తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించింది. సైనిక పాలన అంతమై తాత్కాలిక ప్రజా ప్రభుత్వం మొదటిసారి ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు, వీవీ రాజు, విద్యాలంకర్‌లు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. జనవరి 26, 1950న హైదరాబాద్‌ ‌స్టేట్‌లో భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ ఉత్సవం నిర్వహించారు. భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని నిజాం చవివి వినిపించారు. అదేరోజున ఆయనను రాజ్‌‌ప్రముఖ్‌గా భారత ప్రభుత్వం నియమించింది. 1952లో హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1956 వరకు కొనసాగారు.
రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణతో భాషా ప్రాతిపదికన నవంబర్‌ 1, 1956‌న ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్‌ ‌స్టేట్‌లోని మరాఠా ప్రాంతాలైన 5 జిల్లాలను మహారాష్ట్ర, కన్నడ మాట్లాడే మూడు జిల్లాలను కర్ణాటకలో కలిపారు. తెలంగాణలోని 8 జిల్లాలు, మద్రాస్‌ ‌నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలను కలిపి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయంపై ఆరు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటంతో 2014 జూన్‌ 2‌న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

విలీనమా? విమోచనమా?

ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఆ ఊసే మరిచారు. దీనికి కారణం ఆ పార్టీకి, అసదుద్దీన్‌ ‌నేతృత్వంలోని ఎంఐఎంతో ఉన్న దోస్తీనే కారణమని అందరికి తెలిసిందే. మరికొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం సంతుష్టీకరణ కోసం ఈ రోజును విమోచనం దినంగా కాకుండా విలీన దినంగా జరుపుకోవాలని చెబుతున్నాయి. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించిన సెప్టెంబర్‌ 17‌ను భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తోంది.

——————
వివాదం ఎక్కడ మొదలైంది?

భారత యూనియన్‌లో చేరేది లేదని నవాబు 1947లో ఫర్మానా విడుదల చేయటంతో హైదరా బాద్‌ ‌స్టేట్‌ ‌భవిష్యత్తుపై సందిగ్ధతకు బీజాలు పడ్డాయి. ఆ తర్వాత భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌దేంట్లోనూ చేరబోదని ఆగస్ట్ 8‌న నిజాం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. గవర్నర్‌ ‌జనరల్‌గా ఉన్న మౌంట్‌బాటన్‌ ‌చాలా చెప్పి చూశారు. స్వతంత్రంగా ఉండటం అసాధ్యమని, చివరకు అన్ని అధికారాలు పోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. బ్రిటిష్‌ అధికారుల నేతృ త్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దామని కూడా బాటన్‌ ‌ప్రతిపాదించారు. నవాబు ససేమిరా అన్నారు. సంస్థానాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అన్నది ఆనాటి కాంగ్రెస్‌ ‌విధానంలో ఒక భాగం. సంస్థానాల్లో భిన్న మతాలకు చెందిన ప్రజలున్న చోట దీన్ని ఇంకా బలంగా నొక్కిచెప్పారు. కశ్మీర్‌లో కూడా ప్రజాభి ప్రాయ సేకరణకు అందుకే అంగీకరించారు. హైదరా బాద్‌లో ప్రతిపాదన కూడా అందులో భాగమే. సర్దార్‌ ‌పటేల్‌ ‌వీటన్నిటికీ అంగీకరించారు. ఏ సంస్థానానికి ఇవ్వని కొన్ని కీలక మినహాయింపులు హైదరాబాద్‌కు ఇచ్చారు. నైజాం-భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఇందుకో ఉదాహరణ. విలీనానికి అంగీకరిస్తే బెరార్‌ ‌ప్రాంతాన్ని హైదరాబాద్‌ ‌సంస్థానంలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఒక దశలో అంగీకరించారు. రజాకార్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి నిజాం యథాతథ ఒప్పందానికి తూట్లు పొడవటంతో భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్‌ ‌కరెన్సీని సంస్థానంలో నిషేధించటం, ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించటం, రైళ్లపై దాడులు, గ్రామాల్లో రజాకార్ల దారుణాలతో పరిస్థితి విషమించింది. 1948 సెప్టెంబర్‌ 9‌న సైన్యాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు వారాల పాటు నిజాం సైన్యాల నుంచి ప్రతిఘటన ఉంటుందని భావించారు. కానీ మూడో రోజుకే నిజాం సైన్యం తోకముడిచింది. ఈ సైనిక చర్యలో మేనన్‌ అం‌చనా ప్రకారం 800 మందికి పైగా చనిపోయారు. 108 గంటల్లోనే భారత సైన్యం అదుపులోకి పరిస్థితి వచ్చింది. వీపీ మేనన్‌ ‌హైదరాబాద్‌ ‌వచ్చి స్వయంగా పరిస్థితిని అంచనా వేశారు.
నిజాంకు ముస్లింలలో ఉన్న పలుకుబడిని, ఒక సంస్థానంగా హైదరాబాద్‌కున్న ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ అధిపతిగా నవాబుని కొనసాగిస్తే బాగుంటుదని పటేల్‌కు మేనన్‌ ‌సూచించారు. నెహ్రూను సంప్రదించిన తర్వాతే ఏ సంగతి చెబుతానని పటేల్‌ అన్నారు. ఆ మరుసటి రోజే నెహ్రూ అంగీకారం తెలిపినట్లు పటేల్‌ ‌మేనన్‌కి చెప్పారు. కక్ష సాధింపు దృష్టితో కానీ, మతపరమైన దృష్టితో కానీ నిజాం నవాబు పట్ల నెహ్రూ-పటేల్‌ ‌ద్వయం వ్యవహరించలేదు.
————————–
జమ్ముకశ్మీర్‌, ‌నిజాం సంస్థానాల ప్రత్యేకత

సెప్టెంబర్‌ 17, 1948‌న నిజాం నవాబుకు చెందిన సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. దీనితో భారత్‌ ‌నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద సంస్థానం చరిత్ర ముగిసింది. దేశంలో జమ్ముకశ్మీర్‌, ‌నిజాం సంస్థానాలది ప్రత్యేక చరిత్ర. ఆ రెండింటికి సరితూగే సంస్థానాలు ఆనాడు లేవు. 550 పైచిలుకు ఉన్న సంస్థానాల్లో ఆ రెండే భారత నాయకత్వ పటిమను పరీక్షించాయి. ఆగస్ట్ 15, 1947 ‌నాటికి భారత యూనియన్‌లో చేరకుండా విపరీత తాత్సారం చేసి తీవ్ర ఉత్కంఠను, ఉద్రిక్తతను సృష్టించినవి ఈ రెండే. పాకిస్తాన్‌ అనుకూల శక్తులు ఒక వైపు నుంచి జమ్ముకశ్మీర్‌ను ముట్టడిస్తూ రావటం వల్ల ఆ సంస్థానం మహారాజా హరిసింగ్‌ అక్టోబర్‌ 27, 1947‌న భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. కశ్మీర్‌ ‌మహారాజు లాగానే నిజాం కూడా చివరి వరకూ స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాడు. అనివార్య పరిస్థితుల్లోనే ఇద్దరూ విలీనానికి అంగీకరించారు.

About Author

By editor

Twitter
Instagram