– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌దశాబ్దాల ఉద్యమ ఫలితమే  పరపాలకుల నుంచి  తెలంగాణకు  విముక్తి. ఈ  ధీరోచిత పోరాటం నెలల తరబడి కొనసాగింది. పలు రకాల దోపిడీలు, అణచివేతలకు నిరసనగా తిరుగుబాటు, సాయుధ పోరు చరిత్రపుటలకెక్కి ఈనాటికీ మహోత్తేజం నింపుతోంది. నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ ‌సహా ఖమ్మం, మెదక్‌, ‌నల్గొండ, నిజామాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌వరంగల్‌ ‌ప్రాంతాల్లో సమరభేరి నినాదం ప్రతిధ్వనించింది. అరాచకాల పనిపట్టిన తెలంగాణ సమాజం పరిపూర్ణ జనస్వామ్య వ్యవస్థగా వెలుగొందడానికి ఎన్నింటినో ఎదుర్కొంది. ఆ అనుభవాలు, పరిణామాలు ఇన్నీఅన్నీ కావు. ‘హింస పాపమని ఎంచు దేశాన హిట్లరిత్వం ఇంకెన్నాళ్లు’ అని గర్జించారు కాళోజీ. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నినదించారు దాశరథి. ‘ఈ భూమి నీదిరా, ఆ నిజాం ఎవడురా’ అని ప్రశ్నాస్త్రం ప్రయోగించారు సుద్దాల. కలాలూ గళాలూ ఖడ్గాలుగా మారి కదం తొక్కడంతో నియంతృత్వం తోకముడిచింది. ఇందులో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, ఇంకా అజ్ఞాత వీరనారీమణులు మరెందరో!!

దేశమంతటా స్వాతంత్య్ర సంరంభం. నిజాం సంస్థాన పరిధి ప్రాంతంలో మాత్రం విరుద్ధ వాతావరణం. అప్పట్లో హైదరాబాద్‌ ‌కేంద్రంగా పరి పాలించిన నిజాంరాజు సమస్తాన్నీ ఆక్రమించడానికి రజాకార్లను ఉసిగొల్పడమే హింసకు దారితీసింది. బలవంతపు వసూళ్లు, పల్లెలపై తెగబడి దోపిడీ సాగించడాలు, గృహదహనాలు నిత్యకృత్యంగా మారాయి. నిరసనాగ్ని మొదట నల్గొండలో రేగి, అటు తర్వాత అంతటా విస్తరించింది. సాయుధ పోరాట యోధులు ఒకరా ఇద్దరా…అనేకమంది! ఎవరి స్థాయిలో వారు, ఎవరి మార్గంలో వారు, ఎవరి పంథా వారిదీ!! ఆ ఉద్యమాగ్ని సర్వత్రా వ్యాపించి, భారత ప్రభుత్వ స్పందన చర్యకు మూలమైంది. నిజాం సంస్థానమంతా ఇండియన్‌ ‌యూనియన్‌లో లీనమవడానికి కారకులైన ధీరవనితలు సదా ప్రాతఃస్మరణీయులు. రజాకార్ల దౌర్జన్యాలను నిలువరించడానికి ఆ రోజుల్లోనే అతివల గెరిల్లా దళాన్ని స్థాపించారు ఆరుట్ల కమలాదేవి. పోలీసులు తూటాల వర్షం కురిపించినా లెక్కచేయకుండా ముందుకు దూకారు. సమరంగాన నిలిచి, ముష్కరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. మహాసభల్లో ప్రసంగాలతో కార్యకర్తలందరినీ కార్యోన్ముఖుల్ని చేశారు. పలుసార్లు కారాగారాలపాలైనా పట్టు వీడలేదు, మడమ తిప్పలేదు. చల్లూరు పరిసరాల్ని రిజర్వు దళాలు చుట్టుముట్టి కాల్పులు సాగిస్తుంటే, గుట్టల మాటున నక్కి తుపాకుల మోత మోగిస్తుంటే, అదరకుండా బెదరకుండా ముందు నిలిచారామె. తమ బృందానికి ఎక్కడా ఎటువంటి హాని కలగ కుండా కవచంలా ఉన్నారు. ఉద్యమబావుటా పట్టిన ఆమె ఏనాడూ వెనుదిరగలేదు. పట్టిన ఆయుధాన్ని పక్కన పెట్టనూ లేదు. ఆమె పోరాట పటిమ పోలీసులనే ఉక్కిరిబిక్కిరి చేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లో జైలు జీవితం ఆ యోధురాలి ఉక్కు సంకల్పాన్ని మరింత పెంచింది. స్త్రీ శక్తి అంటే ఏమిటో, లక్ష్య సాధనకు ఎంతగా తెగిస్తుందో కనబరచిన దీక్షాదక్షతలు చాలా గొప్పవి. అందుకే రుద్రమగా కీర్తి గడించారు. తెలంణాణ వీరనారిగా తరతరాలకూ చెక్కు చెదరని ఖ్యాతిని సొంతం చేసుకున్నారు కమలాదేవి.

ఆ ఆదర్శనీయ మాటల్లో చేతల్లోనూ సాహసం ప్రతిఫలించేది. దండి సత్యాగ్రహ స్ఫూర్తి, విద్యాభ్యాస కాలంలో వెల్లివిరిసిన స్వేచ్ఛా దీప్తి, మహాసభలూ కీలక సమావేశాల్లో నాయకరీతి కమలాదేవిని రణోన్ముఖం చేశాయి. పోరు యోధుల ఆత్మ బలిదానాలు నిరంతరం మదిలో మెదులుతుంటే, ప్రచండ శక్తిగా తనను తాను రూపుదిద్దుకున్నారు. స్థానిక భాషల్ని, సంస్కృతుల్ని అవమానపరిచే దుష్కృత్యాలను అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొ న్నారు. బానిసత్వాన్ని, బానిసతత్త్వాన్ని సహించకుండా అన్ని దశల్లోనూ ఎదురుతిరిగారు. ఆ ధీరురాలి మాటలూ చేతలే ప్రజలను ఉత్తేజితులను చేశాయి. రజాకార్ల మూకలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తిప్పికొట్టారు. అప్పంపల్లి, నిర్మల్‌, ‌సిర్పూర్‌, ‌మంథని, మల్లారెడ్డిగూడెం, ఇందూరు తదితర ప్రాంతాల్లో విముక్తోద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. ఇదే సందర్భంలో నల్గొండ ప్రాంతానికి సంబంధించి చాకలి ఐలమ్మ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ముఖ్యంగా విసునూరు పరిసరాల్లో ఆమె పాలకుల గుండెల్ని దడదడలాడించారు. మల్లారెడ్డిగూడెంలో అలుగుల వీరమ్మ ఎంతైనా సాహసి. తుపాకులకు ఎదురొడ్డిన యోధ. వీటన్నింటి నేప థ్యంలో, కదలను పాక ప్రాంతాన్ని స్థావరంగా చేసుకున్న కమలాదేవి అక్కడి వారందరినీ ఎంతగానో జాగృత పరచారు.

‘నిజామనగా ఎంత… వాడి తాహతెంత?

ఓ నిజాము పిశాచమా! కానరాడు నిను బోలిన రాజు!!’

ఇటువంటి వాక్యాలే అంకుశాలై దుష్పరిపాలనను తూట్లు పొడిచాయి. మెదక్‌ ‌ప్రాంతం జోగిపేటలో మహాసభ, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ‘వందేమాతరం’ ఆలాపన, వీటితో పాటు నాయకీ మణుల వ్యూహ చాతుర్యం విమోచనోద్యమానికి బాసట అయ్యాయి. ప్రజల భావవ్యక్తీకరణపై ఆంక్షలు, వెట్టిచాకిరి ద్వారా శ్రమశక్తిని దోచుకోవడం, ప్రతీకార వైఖరితో పోలీసు దళాల్ని అడ్డగోలుగా వినియోగించటం- వనితానేతల ఆగ్రహావేశాలకు కారణాలయ్యాయి. భూమి, భుక్తి కోసమే పోరాటాలు నడిచాయి. ఈ అన్ని సందర్భాల్లోనూ ముదితలదే నేతృత్వం అనేసరికి తప్పనిసరిగా గుర్తుకొచ్చే పేరు మల్లు స్వరాజ్యం.

నా మాటే తుపాకీ తూటా – ఈ ఆత్మకథా కర్త స్వరాజ్యం. రాతలోనే కాదు, చేతలోనూ దిట్ట. అందువల్లనే నిజాం రాజులు గజగజ వణికారు. రజాకార్లు అదిరిపోయి, బెదిరిపోయి పరుగులంకించు కున్నారు. క్రియాశీలతకు మారు పేరైన ఆమె-ఒకటీ రెండు కాదు… మూడేళ్లకు పైగా వియుక్తోద్యమం కొనసాగించారు. ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌ప్రాంతాలు గిరిజనులను సమీకరించి నిరంకుశుల మీద సమరం ప్రకటించారు. ఆ మార్గంలో తాను ఎంచుకున్నది పాటనే. జానపదానికే వన్నె తెచ్చిన ఉయ్యాలోపాట గుర్తుండే ఉంటుంది.

‘ఓర్వదీ ప్రభుత్వంబు ఉయ్యాలో

పాత సూర్యాపేట ఉయ్యాలో

పోరాటమును చూడు ఉయ్యాలో

ప్రజల బలమును చూసి ఉయ్యాలో

పారిపోయిరి వాళ్లు ఉయ్యాలో!’

ఇటువంటి పాటలే ఈటెలయ్యాయి. స్వరాజ్యం గొంతులో పదునెక్కాయి. ఈమెది సూర్యాపేట ప్రాంతంలోని కొత్తగూడెం. సోదరుడి స్ఫూర్తితో పోరుబాట పట్టారు. పల్లె సీమల్లో ప్రసంగాల ద్వారా ప్రజల్ని ఉర్రూతలూపారు. ఆమె ఆధ్వర్యంలోనే వందల కొద్దీ మహిళలు సాయుధ శిక్షణ అందు కున్నారు. ‘దొరల’ అహంకారాన్ని తునాతునకలు చేసింది వారి పోరాట పటిమే! పల్లెల్లో ఉద్యమమంటే కొలనుపాకను తప్పకుండా ప్రస్తావించాలి. అది ఆలేరుకు సమీపంలోని గ్రామం. చుట్టూ ఉన్న మరికొన్ని ఊళ్లు సైతం జాగీరు పాలనలోనివే. అక్కడి జాగీర్దారు చేయని అకృత్యాలంటూ లేవు. కొంతకాలానికి తిరుగుబాటు చోటు చేసుకుంది. గ్రామాల వారీగా రైతులందరూ ఒక్కటై ఉద్యమం సాగించడం తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధానదశ. మల్లు స్వరాజ్యం నాయకత్వ దక్షత ఎందరెందరినో ముందుకు నడిపింది.

మరొక యోధురాలు కొంజేటి సత్యవతి. నల్లమలలోని ఒక దళానికి నాయకురాలు. పెత్తందార్ల పనిపట్టిన, వాళ్ల దురగాతాల ఆటకట్టించిన సాహసి కురాలు. రంగక్కగా అందరికీ తెలుసు. పదిహేనేళ్ల ప్రాయంలోనే సాయుధ దళ కమాండర్‌ అయ్యారు. మహబూబ్‌నగర్‌, ‌చంచల్‌గూడ జైళ్లలో శిక్ష అనుభ వించారు. ఆ సమయంలోనూ హక్కుల సాధనకు సహఖైదీలతో కలిసి ఉద్యమించారు. రెండేళ్లయినా నిండని పసికందుతో జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

ఎందరు ఎంతగా బాధించినా, నానా విధాలుగా హింసించినా బెదరని తత్వం ఆమెది. అచ్చంపేట, అమ్రాబాద్‌లను నిరంకుశుల నుంచి విడిపించడానికి ఎంతగానో పోరాడారు. ఓ రోజు… నల్లమలలో గుట్ట దగ్గర తలదాచుకున్న ఆమెకు తూటాల మోత వినిపించింది. కాసేపట్లోనే పోలీసు బలగం చుట్టుముట్టింది. ‘కాళ్లూచేతులూ ఆడలేదు. రైఫిల్‌తోనే అక్కడి నుంచి ఉరికిన, ఎక్కడికి పోతున్ననో తెల్వటం లేదు. దళం వాళ్లమంతా అప్పటికే చీలినం. ఆ రోజంతా అడవిలోనే ఒంటరిగా దాక్కొని ఒక గూడేనికి చేరిన. అక్కడివాళ్లు నా కాళ్ల గాయాలకు లేపనం పూసి, నన్ను మనిషిని చేసిన్రు’ అంటూ అప్పట్లోనే తన అనుభవాన్ని వివరించారామె.

బడబాగ్నిలా రగిలిన విప్లవాగ్ని ఐలమ్మ. ప్రజా పోరాటస్ఫూర్తి. తూర్పు గూడెంలో పుట్టిన వీరవనిత. సిద్ధాంత నిబద్ధత కలిగిన వ్యక్తి. రాయపాడు, అనాసపురం, భక్తవత్సలాపురం గ్రామాలవారిని ఏకం చేసిన వనితానేత. ఖమ్మం మహాసభకు చిన్ననాటనే హాజరైన క్రియాశీలి. తెలంగాణ విముక్తోద్యమంలో ఈమె కుటుంబీకులెందరో ఉన్నారు. మహబూబా బాద్‌ ‌ప్రాంతం నైనాల గ్రామవాసి కమలమ్మ. ఇంటిపేరు చెన్నబోయిన. జానపద గీతికలతో జనచైతన్యం పెంచిన కళాకారిణి కూడా. విశిష్ట వనిత కాబట్టే ఈమె చరిత్ర తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకుంది. పలు నిర్బంధాలు ఎదుర్కొని అటు తర్వాత అజ్ఞాత జీవితం గడిపిన వ్యక్తి పద్మ. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పాటను అంతటా ప్రచారంచేసిన గత చరిత్ర ఉంది. ‘సుట్టు ముట్టూ సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ; నువ్వుండేది హైదరాబాదు, దానిపక్క గోలుకొండ; గోలుకొండ ఖిల్లా కిందా నీ గోరికడతం’ అంటూ ఉద్యమావేశాన్ని రగుల్కొలిపిన నారి. వీరందరినీ స్మరించుకోవడమే పౌరులుగా మన కర్తవ్యం, ధర్మం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram