‘అనుకోవడం, అనడం, అదే చేయడం- ఈ మూడు మన ప్రాథమిక అవసరాలు’ అంటారు రుచిరా కంబోజ్‌. ‌ప్రత్యేకించి వనితలు మనసా వాచా కర్మణా చిత్తశుద్ధిగా ఉంటారు కాబట్టే, విజయాల్ని అవలీలగా సొంతం చేసుకుంటారని కూడా చెప్తుంటారు. ఇంతకీ ఎవరీ రుచిరా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ సందర్భంలో అలా అన్నారు? అనే కదా మీ ప్రశ్నలు! మరో రెండేళ్లకు 60వ పడిలో ప్రవేశిస్తున్న ఆమె మన దేశం తరఫున మహిళా శాశ్వత ప్రతినిధిగా మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో అడుగుపెట్టారు. సీనియర్‌ ‌రాయబారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అతివల శక్తిసామర్థ్యాలను ప్రస్తా వించారు. ‘మనం అనుకుంటే ఏదైనా చేయగలం, ఎంతైనా సాధిస్తాం’ అంటూ మధుర సందేశమిచ్చారు. ‘రుచిర’ అంటే మనోహరం. ఐరాస సెక్రటరీ జనరల్‌కు సమర్పించిన తన నియామక పత్రంలోని ప్రతీ అక్షరంలోనూ భారతీయతను అభివ్యక్తం చేశారు. ఇండియన్‌ ‌ఫారిన్‌ ‌సర్వీసుకు చెందిన 1987 బ్యాచ్‌ అధికారిణి ఆమె. అంటే, అప్పటికి ఆమెకు 23 ఏళ్లు. నిర్ణీత బృందంలో మార్కుల రీత్యా తానే టాపర్‌. ‌విదేశ రాయబారిగా తొలిగా విధి నిర్వహణ చేపట్టింది ఫ్రాన్సులో. ఆ తర్వాత భారత రాజధానికి తిరిగొచ్చారు. ఐరోపాకు సంబంధించి, పశ్చిమ డివిజన్‌ ‌విదేశీ వ్యవహారాల శాఖ నియమిత కార్యదర్శిగా వ్యవహరించారు. అనంతర కాలంలో మారిషస్‌లో బాధ్యతలు నిర్వహించారు. అక్కడ ఆమె మూడేళ్లపాటు ఫస్ట్ ‌సెక్రటరీ. తదుపరి దక్షిణాఫ్రికాలో హై కమిషనర్‌, ‌పూర్వానుభవం భూటాన్‌ ‌దేశంలో కూడా ఉంది. అక్కడా ఆమే భారత్‌కు రాయబారి. సరికొత్తగా ఐరాసలో భారత ప్రాతినిధ్యం. న్యూయార్క్ ‌దాకా కొనసాగిన, సాగుతున్న ఆ విజయ ప్రస్థానం వెనక ఉత్కంఠ భరిత అంశాలెన్నో!


రాయబారం అంటే సంధి చేయడం, సయోధ్య కుదర్చడం. రాయబారికి రాజదౌత్యం, ప్రభుత్వ ప్రాతినిధ్యమన్న అర్థాలూ ఉన్నాయి. సమితి వంటి అంతర్జాతీయ మహాసంస్థలో సువిశాల భారత ప్రయోజనాలకు కృషి చేయడమనేది మాటలతో అయ్యే పనికాదు. పరిపూర్ణ ప్రపంచ పరిజ్ఞానం, చారిత్రక సంపూర్ణ అవగాహన, సకాలంలో స్పందించి చర్యలు చేపట్టే క్రియాశీలత ఉంటేనే రాయబారిత్వం ఫలప్రదమైనట్లు. వీటన్నింటినీ పరిగణించిన ఫలితంగానే, రుచిర పేరు ఖాయమై కేంద్రం నుంచి ప్రకటన జారీ అయింది. ఐరాసలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, ‌మరికొన్ని దేశాల నుంచి మహిళా రాయబారు లున్నారు. భారత్‌ ‌నుంచి ఆమె చేరికతో నూతన వెలుగు ప్రసరించినట్లయ్యింది. ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రస్‌ ‌సమక్షంలో బాధ్యతలు చేపట్టిన ఆమెకు తొలి ప్రశంస అందింది ఆయన నుంచే! ‘మీ రాకతో నవ్యకాంతి విస్తరించిందం’టూ అభివాదాలందించారు. ప్రధాన కార్యాలయ మున్న న్యూయార్క్ ‌భవన ప్రాంగణ అధికారిక గదులలోకి భారత్‌ ‌నవీన దౌత్యవేత్తను తోడ్కొని వెళ్లి పరిచయం చేశారాయన. ఇంతవరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన తిరుమూర్తి ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ‘రాజకీయ, సామా జిక పరిణామాలు వేగవంతంగా మారుతున్న రోజు లివి. ఎప్పుడు ఎటువంటి చోటు చేసుకుంటాయో ఊహకైనా అందని ఈ పరిస్థితుల్లో మీ (రుచిర) నియామకం వినూత్న ఆశలను రేకెత్తిస్తోంది. మీదైన ఒరవడిని ప్రవేశపెట్టి ముందుకు సాగుతారని అందరి ఆకాంక్ష!’ కాదా మరి? ఇప్పటిదా ఐరాస! దాదాపు ఏడున్నర దశాబ్దాల సంస్థాగత చరిత్ర. ప్రపంచ దేశాలన్నీ రూపొందించుకున్న పరమోన్నతస్థాయి వేదిక. వచ్చే అక్టోబరులోనే వ్యవస్థాపక దినోత్సవం. ఆరు ప్రధాన విభాగాల (సర్వప్రతినిధి సభ, భద్రతా మండలి, కార్యనిర్వాహక వ్యవస్థ, ధర్మకర్తృత్వ, ఆర్థిక- సాంఘిక మండళ్లు, అంతర్జాతీయ న్యాయస్థానం) కూడలి. వీటితోపాటు అనుబంధ సంస్థలు మరెన్నో. రెండొందలకు చేరువలో సభ్య దేశాలు. ప్రారంభం లోని వాటికి ఇప్పుడున్నవి నాలుగు రెట్లు ఎక్కువ. అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలూ సమంగా గౌరవించేలా చేయడమే సమితి కీలక లక్ష్యం. వీటికి అదనంగా స్త్రీమూర్తుల అవకాశాల విస్తరణకు ‘యూఎన్‌ ‌విమెన్‌’ ‌పేరిట సంస్థాపనకూ గతంలోనే ప్రకటన వెలువడింది. వీటి నేపథ్యంలో రుచిర రంగ ప్రవేశం సహజంగానే భారతేతర దేశాలకూ ఆసక్తి కరం. అయితే, ఐరాసలో నియమితులు కావడం ఆమెకిది కొత్తేమీ కాదు. ఎప్పుడో రెండు దశాబ్దాలనాడే సమితికి శాశ్వత బృంద కౌన్సిలర్‌గా ఉన్నారు. శాంతి పరిరక్షణ, మధ్య ప్రాచ్య సంక్షోభ నివారణ, భద్రతా మండలికి సంబంధించిన సంస్కరణల అమలు బృందాల సభ్యురాలిగా విధులు నిర్వహించారు.

ఎప్పుడూ గట్టిపట్టే

విదేశీ వ్యవహారాల స్థితిగతులపైన రుచిరకు మొదటి నుంచి పూర్తిస్థాయి అవగాహన ఉంది. తన దౌత్యా యానాన్ని ఫ్రాన్స్‌లో ఆరంభించినప్పుడు, అక్కడి పూర్వాపరాలన్నిటినీ సమగ్ర అధ్యయనం చేశారు. భద్రతామండలిలో వీటో హక్కు ఉన్న శాశ్వత సభ్యదేశం అది. ఐరోపా సమాఖ్య సభ్యత్వ కారణంగా, తన విదేశాంగ పనితీరును నవీకరించుకుంటూ వస్తోంది. ఆ మార్పు చేర్పులను అవగతం చేసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడంలో రుచిరది అందె వేసిన చెయ్యి. ద్వీపదేశమైన మారిషస్‌లో పనిచేసినప్పుడు భౌగోళిక, ఆర్థిక అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలిస్తూ వచ్చారు. దౌత్యవేత్తగా కర్తవ్య నిర్వహణను ఏనాడూ విస్మ రించలేదు. అక్కడి జన సంఖ్యలో రమారమి సగం ఉన్న హిందూ మతావలం బికుల జీవనరీతుల విశ్లేషణ జరిపారామె. దక్షిణాఫ్రికాలో రాయబార అనుభవం పూర్తిగా విభిన్నం. బహుళ సాంస్కృతిక వైవిధ్యం కలిగిన ప్రాంతంగా అది ప్రసిద్ధం. సంప్రదాయాల ఆచరణకే అక్కడ మొదటి ప్రాధాన్యం. ఎన్ని సమస్యలు చుట్టు ముట్టినా, ఆ దేశానికి ఇతరత్రా మధ్యవర్తిత్వ కాంక్ష ఎక్కువ. ప్రపంచ వ్యవ హారాల పరిజ్ఞానంతో, తనకుతానే ప్రాంతీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అందుకే ఆ దేశ పరిస్థితులనీ సదవ గాహన చేసుకుని, తాను విధులు నిర్వహించినంత కాలమూ సముచిత నిర్ణాయక పాత్ర వహించారు రుచిర. తరువాత విధులు నిర్వర్తించిన భూటాన్‌లో నైతే అంతా వైవిధ్యమే, విభిన్నమే. దక్షిణాసియాలోని ప్రాచీన, ఆధునికతల కలయిక. పరిసరాల పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చే దేశం. సమితితో పాటు ప్రాంతీయ సహకారానికి సంబంధించిన ఆసియా అసోసియేషన్‌ ‌లోనూ సభ్యత్వముంది. అంతకుమించి, అదే దేశం ప్రత్యేక రక్షణ వ్యవస్థను నెలకొల్పుకుంది. భారత్‌తో దీర్ఘకాలిక ఒప్పందంవల్ల, ఉభయ దేశాలవారు కేవలం జాతీయ గుర్తింపు పత్రాల ఆసరాతో ప్రయాణాలు చేయవచ్చు. అయితే, ఉత్తర సరిహద్దు ప్రదేశంలో ఉన్న చైనాతో ఎటువంటి దౌత్య సంబంధాలూ పెంచుకోలేదు భూటాన్‌. ఈ ‌ప్రధాన విషయాల పరంగా, రుచిర వ్యవహార సరళి ప్రశంసలందుకుంది.

సమర్థతతో ముందుకు

ఇతర దేశాల పోకడలపై ఇంతటి పట్టు ఉన్న ఆమె స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లఖనవూ. రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌. ‌భర్త దివాకర కంబోజ్‌ది వ్యాపార వృత్తి. వీరికి ఏకైక కుమార్తె. రుచిర తండ్రి భారత సైనిక దళంలో పనిచేసేవారు. తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో సంస్కృత ప్రొఫెసర్‌. అనేక రచనలు చేశారు. తల్లిదండ్రుల మేధ, పోరాట పటిమ ఆమెకీ వారసత్వంగా వచ్చాయి. అపార మేధస్సుతో పాటు అనంత కార్యశీలతనూ సొంతం చేసుకున్న ఆమెకు మాతృభాష హిందీతో పాటు ఆంగ్లం, ఫ్రెంచి భాషల్లోనూ ఎంతో నైపుణ్యముంది. నిశితమైన చూపులు, ప్రసన్న వదనంతో ఎప్పుడూ కళకళ లాడుతుంటే ఆమె అరుదైన ఘనతనే సంపాదించు కున్నారు. తొలినుంచే ఎంతటి ప్రతిభావంతు రాలంటే… అఖిల భారత స్థాయిలో 1987 పోటీ పరీక్షల్లో మహిళల అగ్రేసరిగా నిలిచిన ఆమె వర్ణచిత్రాన్ని పలు పత్రికలు ముఖచిత్రంగా ప్రచురించాయి. విఖ్యాత సంస్థలెన్నో అలనాడే అంటే మూడున్నర పదుల ఏళ్ళ క్రితమే ఆమెను ఘనంగా సత్కరించాయి. ఇంత ఘన చరిత్ర ఉన్నందునే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి కితాబు అందుకున్నారు ఆమె.

తాను పనిచేసిన దేశాల ప్రధాన పాలనాధిపతుల ప్రశంసలకు పాత్రురాలయ్యారు. తన ఉద్యోగ కాలంలో మరపురాని సంఘటన 2014లో చోటు చేసుకుందంటారు రుచిర. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార సందర్భంలో, మారిషస్‌తోపాటు సార్క్ ‌దేశాల కూటమి (దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలిలో పాకిస్థాన్‌తోపాటు భూటాన్‌, అఫ్గనిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, శ్రీ‌లంక, నేపాల్‌, ‌మాల్దీవులు) అధిపతుల్ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించే ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. వాటిని సమర్థంగా నిర్వర్తించి శభాష్‌ అనిపించుకున్నారు.

సిసలైన వారసత్వం ఇదే

అన్నట్లు, రుచిర మాతృమూర్తి జన్మదినోత్సవం సెప్టెంబరు ఐదున. తనను అన్ని విధాలా ప్రోత్స హించి ఉత్సాహపరచి ఉన్నతికి చేర్చిన తల్లికి ఆమె సహస్రాధిక వందనాలందించారు. ‘అమ్మా! నువ్వే నాకు ఆదర్శం. విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఇంత దాన్ని చేశావు. నీకు ఎన్ని నమస్సులందించినా తక్కువే మరి. నాన్నను కోల్పోయినా, ఆయన ఆర్మీ అధికారిగా ఇప్పటికీ నాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. తన శక్తినీ, నీ యుక్తినీ పొందినందుకే నాకు ఇన్నిన్ని విజయాలు’ అంటూ 2015లోనే ట్వీట్‌ ‌చేశారు రుచిర. అమ్మా నాన్నాల పెంపకం, తనదైన ఆత్మవిశ్వాసం, కఠోర పరిశ్రమ ఆమెను ఇప్పుడిలా అంతర్జాతీయ స్థాయికి అదీ ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి దశకు చేర్చాయి. రుచిర వారసత్వాన్ని తన తనయా అందుకుని భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటుందని మనం ఆశిద్దాం. పిల్లలకు పెద్దలిచ్చే ఆస్తులు ధన కనక వస్తు వాహనాలు ఏవీ కావు. క్రమశిక్షణ, దృఢవర్తన, అంకిత భావాలే ఎవరినైనా ఉన్న స్థితి నుంచి మహోన్నత దశకు చేరుస్తాయ నేందుకు రుచిరే ఉదాహరణ. అందుకే ఆమెకు జన హృదయాభినందన.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram