– డా. మన్మోహన్‌ ‌వైద్య, సహ సర్‌కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌

‌భారతదేశం మినహా, ప్రపంచంలోని మరే ఇతర దేశానికి చెందిన ప్రజల మనసుల్లో ‘మనం ఎవరం? మన పూర్వికులు ఎవరు? మన చరిత్ర ఏదై ఉంటుంది?’ అనే దానిపై కొన్ని సంభ్రమాశ్చర్యకరమైన లేదా రకరకాల సందేహాలు ఉండి ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత పురాతన దేశంగా, సంపన్నమైన సమాజంగా విలసిల్లుతున్న భారతదేశంలో, మనదైన ఈ విషయంపై ఏకాభిప్రాయం లేదు. దీనికి ఏకైక కారణం మనల్ని మనం ఒక సమాజంగా, ఒక దేశంగా మన ‘స్వ’ను గుర్తించి, ఆత్మగతం చేసుకోవాలని ఆకాంక్షించక పోవడమేనని అనిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన కొన్ని తార్కాణాలను చూద్దాం.


రెండవ ప్రపంచ యుద్ధ వినాశనం తర్వాత (1945) బ్రిటన్‌, ‌జర్మనీ, జపాన్‌ ‌నవ నిర్మాణానికి నాంది పలికాయి. వందల సంవత్సరాల పోరాటం తర్వాత – ఇజ్రాయెల్‌ ‌కూడా 1948లో తన దేశాన్ని తిరిగి దక్కించుకుంది. భారతదేశం సైతం శతాబ్దాల తరబడి బానిసత్వం, దోపిడీలో మగ్గి 1947లో స్వాతంత్య్రం పొందింది. దాదాపు ఏకకాలంలో నవ నిర్మాణానికి నాంది పలికిన ఈ దేశాల పరిస్థితిని నేడు మనం భారతదేశంతో పోలిస్తే వాటి పరిస్థితి చాలా బాగుంది. ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది?

ఒక సామాజిక ఆలోచన ప్రకారం ‘ఒక సమాజంగా మనం ఎవరో మనమే నిర్ణయించుకోక పోతే, మన దిశ, ప్రాధాన్యాలను మనం నిర్ణయించలేం.’ దాదాపు ఒకేసారి ప్రారంభమైన భారత్‌, ‌మిగతా దేశాల అభివృద్ధి ప్రయాణానికి మధ్య ఉన్న తేడా ఇదే.

గురుదేవులు రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌రచించిన ‘స్వదేశీ సమాజ్‌’ అనే చారిత్రక వ్యాసంలో, ‘మనం ఆరంభంలో ఎలా ఉన్నామో అలా తయారు కావాలి’ అని రాసుకొచ్చారు. ఈ రోజు మన దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, భారతదేశం ఒక జాతిగా తన ‘స్వ’ ఆధారంగా కొత్త గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న కాలం ఆసన్నమైంది – ఇదొక యాదృచ్ఛికమైన అద్భుతం – కానీ దీనిపట్ల కూడా వ్యతిరేకత ఎందుకు వస్తున్నదీ విచారించాలి.

ఆధునిక భారతదేశ చరిత్రలో, భారత్‌కు సంబంధించిన ఈ గుర్తింపు, శతాబ్దాల నాటి ఈ దేశ సర్వవిదితమైన, స్పష్టమైన ‘స్వ’ నిరాకరణకు గురైంది. అలా నిరాకరించిన వారిని ఉదారవాదులు, మేధావులు, ప్రగతిశీలురు అని పిలవడం ఫ్యాషన్‌గా మారింది. భారతదేశం ‘స్వ’ వెలుగులో తన అభివృద్ధి ప్రయాణ దిశను నిర్ణయించుకోలేదు కాబట్టి, దాని సామర్థ్యానికి తగ్గట్టుగా అభివృద్ధి చెందాల్సినంతగా మనం అభివృద్ధి చేయలేదని స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశ ‘స్వ’ సంబంధించి అభివ్యక్తికి అనేక అవకాశాలు ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు అవి నిరంతరాయంగా నిరాకరణకు గురయ్యాయి.

1905లో ‘వందేమాతరం’ గీతం బెంగాల్‌ ‌విభజనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాఉద్యమ ప్రకటన అని మనకు తెలుసు. ‘వందేమాతరం’ వేలాది యువకులను, విప్లవకారులను స్వాతంత్య్రో ద్యమంలో ప్రవేశించడానికి, దేశం కోసం బలిదానం చేయడానికి ప్రేరణ ఇచ్చింది. ‘వందేమాతరం’ భారతదేశపు ‘స్వ’ తాలూకు అభివ్యక్తిగా, ఆకస్మికంగా ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్‌ అఖిల భారత సమావేశాలకు ఇది గర్వించదగిన గీతంగా వాసికెక్కింది. పండిట్‌ ఓం‌కారనాథ్‌ ‌ఠాకూర్‌, ‌పండిట్‌ ‌విష్ణు దిగంబర్‌ ‌పలుస్కర్‌ ‌వంటి ప్రముఖ గాయకులు దీనిని కాంగ్రెస్‌ ‌సమావేశాలలో ఆలపించేవారు. హిందువులు, ముస్లింలు దాని నుంచి సరి సమానంగా ప్రేరణ పొందారు. కానీ 1921 నుంచి ఇది కేవలం హిందూ గీతంగా, మతపరమైనదిగా అకస్మాత్తుగా ఎలా మారింది? దీని వెనుక ఉన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. 1905 నుంచి 15 సంవత్సరాల పాటు సహజంగా వెల్లువెత్తిన దేశభక్తి అకస్మాత్తుగా మతతత్వమని ఎలా నిరాకరణకు గురైనదీ అర్థం చేసుకోవాలి.

మరొక తార్కాణం. స్వతంత్ర భారత్‌ ‌కోసం ఒక పతాకం నమూనాను స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత మొట్టమొదట1905లో రూపొందిం చారు. దధీచి మహర్షి దేహత్యాగం చేసిన తరువాత రూపొందించిన వజ్రాయుధం చిహ్నంగా ఆమె ఒక పతాకాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఆమె ఇలా రాసుకొచ్చారు, ‘‘దురదృష్టవశాత్తు మన ముంగిట ఒక నమూనాగా చైనా దేశపు సమర పతాకం ఉన్న కారణంగా మనం పతాకాన్ని నలుపు, ఎరుపు రంగులతో రూపొందించాం. కానీ అది భారతీయు లకు ఏ మాత్రం సరిపోయేది కాదు. కనుక, పసుపు, కాషాయ వర్ణాలతో పతాక రూపకల్పన చేసుకోవాలి.’’ 1906లో జరిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ సదస్సులో కాషాయ రంగు వస్త్రంపై పసుపు రంగు వజ్రాయుధ చిహ్నంతో కూడుకున్న పతాకాన్ని చిత్రించారు.

దీని తరువాత అనేక నమూనాలతో జెండాలు పరిశీలనకు వచ్చాయి. 1921లో భారతదేశంలోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే చరఖా చిహ్నంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందిం చారు. 1929లో మాస్టర్‌ ‌తారాసింగ్‌ ‌నేతృత్వంలోని సిక్కు ప్రతినిధి బృందం మహాత్మా గాంధీని కలుసు కుంది. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా జెండా రూపకల్పనను ఆ బృందం వ్యతిరేకించింది. అందరి మధ్య ఐక్యతను ప్రదర్శించే జాతీయ జెండా రూపకల్పన కోసం ఆయన పట్టుబట్టారు. వేర్వేరు సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకున్న పక్షంలో సిక్కు సామాజిక వర్గానికి చెందిన పసుపు రంగును జాతీయ పతాకానికి జోడించాలని కోరారు. దీనిపై సమగ్ర అభిప్రాయాన్ని స్వీకరించి, తగు సూచనలు చేయడానికి ఒక ఫ్లాగ్‌ ‌కమిటీని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో పండిట్‌ ‌జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, సర్దార్‌ ‌పటేల్‌, ‌మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌, ‌మాస్టర్‌ ‌తారాసింగ్‌, ‌పట్టాభి సీతారామయ్య (కన్వీనర్‌), ‌కాకా కాలేల్కర్‌, ‌డాక్టర్‌ ‌హార్దికర్‌ ఉన్నారు. జాతీయ జెండా రూపకల్పన జాతీయ కాంగ్రెస్‌ ‌కమిటీ, సాధారణ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఫ్లాగ్‌ ‌కమిటీ ఆహ్వానించింది.

అందరి అభిప్రాయాలను విన్న ఫ్లాగ్‌ ‌కమిటీ అందరకీ ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయాన్ని ముందు ఉంచింది. అదేమిటంటే.. ‘భారతదేశ జెండా విభిన్నంగా, కళాత్మకంగా, మతాలకు అతీతమైనదిగా ఉండాలి. అది ఒకే రంగులో ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అలాగే భారతీయులందరికీ సమానంగా ఆమోదయోగ్యమైనది, భారత్‌ ‌వంటి పురాతన దేశంతో దీర్ఘకాలికంగా ముడిపడివున్న అత్యంత విలక్షణమైన వర్ణం ఏదైనా ఉందంటే అది కాషాయం లేదా భగవా రంగు. ఆ కారణంగానే దీర్ఘచతురస్రాకారపు కాషాయ వస్త్రంపై నీల వర్ణంలో చరఖా భారత్‌ ‌జెండా అవుతుందనే ఒక ఏకగ్రీవ నిర్ణయాన్ని ఫ్లాగ్‌ ‌కమిటీ తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఎందుకు స్వీకరించలేదు? ఈ స్వాభావికమైన, చక్కగా ఆలోచించిన ‘స్వ’ ను నిరాకరించిన మనస్తత్వం ఎలాంటిది? ఇది కూడా ఆలోచించదగినది.

1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శాంతి, పరాక్రమాలను వర్ణిస్తూ ధర్మచక్రంతో కూడుకున్న త్రివర్ణ పతాకాన్ని మన జాతీయ జెండాగా రాజ్యాంగం ఆమోదించింది. ఇది మన జాతీయ జెండా. త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం, రక్షించడంతో పాటుగా మన చర్యల ద్వారా పతాక ప్రతిష్ఠను ఇనుమడింప జేయడం భారతీయులమైన మనందరి కర్తవ్యం. ఇది నిర్వివాదమైన అంశం.

అదేవిధంగా, స్వాతంత్య్రం తర్వాత భారతదేశ విద్యలో ఆశించిన ప్రాథమిక సంస్కరణలు కూడా జరగలేదు. 1948లో డాక్టర్‌ ‌సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌నేతృత్వంలోని ఎడ్యుకేషన్‌ ‌కమిషన్‌ ‌నివేదికలో ‘‘విద్యా విధానంలోని భారతీయేతర లక్షణం’’ గురించి ఆయన ఇలా స్పష్టంగా చెప్పారు..

‘‘ఒక శతాబ్దానికి పైగా ఈ దేశంలో కొనసాగు తున్న విద్యావ్యవస్థపై తీవ్రమైన ఫిర్యాదులలో ఒకటి ఏమిటంటే, అది భారతదేశ గతాన్ని విస్మరించిందని, భారతీయ విద్యార్థులకు వారి స్వంత సంస్కృతి గురించి అవగాహన కల్పించలేదని. ఇది కొన్ని సందర్భాల్లో మనం మూలాలు లేకుండా ఉన్నాము అనే భావనను కలిగించింది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే మన, మూలాలు మన చుట్టూ ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన ప్రపంచానికి మనలను కట్టిపడవేయడం.’’

‘‘ఏ ప్రజలకైనా వారి ఆధ్యాత్మిక పరిపోషణకు ప్రధాన మూలంగా వారిదైన గతం తిరిగి తెలుసుకొని, పునరుద్ధరణకు నోచుకొని ఉండాలి. గతం పట్ల అవగాహన లేని సమాజం దాని గంభీరత, హుందాతనాన్ని కోల్పోతుంది.’’

‘‘విద్య మేధోశక్తుల అభివృద్ధితో ఆగిపోకూడదని, విద్యార్థికి తన వ్యక్తిగత సామాజిక జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి, నైతికత, మతం ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఒక ప్రవర్తనా నియమావళిని విద్య అందించాలని భావించడమైనది. జాగృతమైన ప్రయోజనం లేనిచోట, వ్యక్తిగత పూర్ణత్వము, స్థిరమైన ప్రవర్తన సాధ్యం కాదు.’’

భారతీయ ఆలోచనకు ఆధ్యాత్మికత ఆధారమని ఇది స్పష్టం చేస్తున్నది. ఆ వెలుగులో విద్యావ్యవస్థ ఉండాలి. కానీ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్లు చేసిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. సాక్షాత్తూ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే సదరు విద్యా కమిషన్లను నియమించింది. అయినప్పటికీ, కమిషన్‌ ‌సిఫార్సులు అమలు కాకుండా అడ్డుకున్న వ్యక్తులు ఎవరు? అది ఏ రకమైన మనస్తత్వం? నేటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ విద్యను కాషాయీకరణ చేస్తున్నారనే పేరుతో వ్యతిరేకిస్తు న్నారు. దాని వెనుక ఎలాంటి మనస్తత్వం దాగి ఉందో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

సంస్కృతం భారతదేశంలోని అన్ని భాషలకు తల్లి అనేది నిర్వివాదమైన అంశం. భారతీయ భాషలు మాట్లాడే వారందరికీ సులభంగా అర్థమయ్యే భాష సంస్కృతం. మలేషియాలో తమిళం మాట్లాడే భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడి హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌ప్రచారక్‌ ‌శ్రీరామ చంద్రన్‌ ‌మాతృభాష తమిళం. వారు ప్రథమ, ద్వితీయ వర్ష సంఘ్‌ ‌శిక్షా వర్గలను తమిళనాడు ప్రాంతంలో పొందారు. తృతీయ శిక్షణ (25 రోజులు) కోసం వారు నాగపూర్‌ ‌వెళ్లారు. అక్కడ ఉపన్యాసాలన్ని హిందీలోనే సాగాయి. వారికి ఏ మాత్రమూ అర్థం కాలేదు. ఆ తర్వాత తమిళ భాషకు చెందిన శిక్షార్థుల కోసం తమిళంలో అనువాదం చేసినప్పుడు మాత్రమే వారికి అర్థమైంది. 25 రోజుల శిక్షావర్గలో ఒక్క ప్రసంగం మాత్రమే తనకు అనువాదంతో పనిలేకుండా అర్థం అయిందని, అందుకు ప్రసంగం సంస్కృత భాషలో ఉండటమే కారణమని వారు నాతో అన్నారు. సంస్కృత భాష అన్ని భాషలకు దగ్గరగా ఉందనడానికి ఇదే నిదర్శనం. భారతరత్న డా.బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌సహా నాటి అనేకమంది నాయకులు భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ సంస్కృత విద్యను అందించాలనే స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ విజ్ఞాన నిధి అంతా సంస్కృతంలో ఉంది. భారతీయ భాషలన్నీ సంస్కృతానికి దగ్గరగా ఉన్నాయి. అవన్నీ సంస్కృతం నుంచి ఉద్భవించాయి. సంస్కృత భాష భారత్‌ ఏకాత్మత సాకారానికి సైతం ఉపకరిస్తుంది. కానీ ఏ మనస్తత్వం కారణంగా ఈ గొప్ప సూచన ఆమోదానికి నోచుకోలేదు?

ప్రపంచంలోని విద్యావేత్తలందరూ పిల్లల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని నమ్ముతారు. కొత్త విషయాలను అర్థం చేసుకోవ డానికి, పిల్లల మానసిక, మేధో వికాసానికి విద్య మాతృభాషలో ఉండటం అవసరం. మంచి ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం కోసం అన్ని సబ్జెక్టులను ఆ భాషలోనే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ జనాభాలో కేవలం 9% మంది తమ మాతృభాష కాకుండా వేరే భాషలో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అటువంటి కొన్ని దేశాలలో భారత్‌ ‌కూడా ఉంది. ఆంగ్లంలో అన్ని సబ్జెక్టుల విద్యాబోధన పేరుతో ఆంగ్ల భాష ఆధిపత్యం ఎంతగా పెరిగిపోయిందంటే అది మాతృభాషలో విద్యనభ్యసించేవారిలో ఆత్మన్యూనతా భావానికి దారి తీస్తున్నది.ఇది భారత్‌ ‘‌స్వ’ స్ఫూర్తికి విరుద్ధమైనది. మహాత్మా గాంధీ సహా అనేకమంది ఆలోచనాపరులు మాతృభాషలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ, ఈ విషయం ఎందుకు విస్మరణకు గురైంది?

సుదీర్ఘకాలం పాటు భారత్‌ ‌సుసంపన్నంగా ఉన్నది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ భాగస్వామ్యం అత్యధికంగా ఉండేది. మనం ధాన్యాన్ని విక్రయించలేదు. తోళ్లు, లోహాలు, కలప, రాతి వస్తువులు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు మొదలైన వాటితో వ్యాపారం చేయడానికి భారతీయులు ప్రపంచమంతటా పర్యటిస్తుండేవారు. కాబట్టి భారతదేశం వ్యవసాయాధారిత దేశం అని చెప్పడానికి బదులు, భారతదేశం పారిశ్రామిక దేశమని చెప్పడం మరింత సముచితంగా ఉంటుంది. ఈ పరిశ్రమలన్నీ కుటీర పరిశ్రమలు. కుటుంబ ఆధారితమైన ఈ పరిశ్రమలు గ్రామాలలో ఉండేవి.

భారతదేశంలోని గ్రామాలు సుభిక్షంగా ఉండేవి. కానీ యూరప్‌ ‌ప్రభావం కారణంగా, భారతదేశం స్వాతంత్య్రం తర్వాత నగరాల కేంద్రంగా అభివృద్ధి పంధాను చేపట్టింది. నగరాలలో సమూహాలు, పోటీతత్వం, నేరాలు, కకావికలైపోతున్న పరస్పర సంబంధాలకు తోడు నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు వెనుకబాటుకు లోనై సౌకర్యాల లేమితో అవస్థలు పడసాగాయి. నగరంలో స్థిరపడటం ప్రతిష్టకు, గ్రామీణ ప్రాంతంలో స్థిరపడటం వెనుకబాటుతనానికి సంకేతంగా భావించేవారు. యాంత్రిక యుగం కారణంగా మనిషి గరిష్ఠ లాభం పొందాలనే ప్రలోభాల వలలో చిక్కుకున్నాడు.

భారతదేశంలో భౌతిక సమృద్ధి, ఆధ్యాత్మిక వికాసం ఈ రెండింటిలోనూ ఒక్కదానికి మాత్రమే ప్రాధాన్యమివ్వకుండా రెండింటికి సమాన ప్రాధాన్యం కల్పించడమే భారతీయ జీవనానికి సంబంధించిన విశిష్టతగా విరాజిల్లుతున్నది. కేవలం భౌతిక సమృద్ధి వెనుక పరుగులు తీసిన పక్షంలో అది అంధకారం లోకి దారి తీస్తుందని ఈశావాస్య ఉపనిషత్తులోని ఒక శ్లోకం స్పష్టం చేసింది. అలాగే కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే ఉండిపోతే అది మరింత అంధకారంలోకి తీసుకువెళుతుందని అదే శ్లోకంలో చెప్పారు. భౌతిక సమృద్ధి, ఆధ్యాత్మిక ఉన్నతి ఇలా ఈ రెండింటినీ సాధన చేయడమే జీవితమని ఉపనిషత్తు తెలిపింది. ఏకకాలంలో ఈ రెండింటిని సాధన చేసేందుకు అనువైన వాతావరణం గ్రామీణ జీవనంలో ఉన్నది. గ్రామంలో ఆదాయం తక్కువ. అలాగే ఖర్చు కూడా తక్కువ. అందుకనే మంచి జీవితాన్ని సాగించడానికి తోడు సంపాదించడానికి ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. సంపాదనతో పాటుగా ఆధ్యాత్మిక సాధనకు తగిన వాతావరణం గ్రామీణ జీవనంలో ఉంటుంది. అందుకనే అభివృద్ధి కోసం స్వతంత్ర భారత్‌ ‌సాగించే యాత్ర గ్రామీణాభివృద్ధి దిశగా ఉండాలని మహాత్మా గాంధీ కూడా ఆకాంక్షించారు. వారి ‘‘హింద్‌ ‌స్వరాజ్‌’’ ‌ప్రధానంగా ఈ అంశంపైనే కేంద్రీకృతమైంది. రాజ్యాంగాన్ని స్వీకరించే సమయంలో సైతం అంటే 1948 సంవత్సరం నవంబర్‌ 19 ‌నుంచి 22వ తేదీ వరకు రాజ్యాంగ సభ జరిపిన చర్చల్లోనూ సాధ్యమైనంత త్వరగా గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకు సాగాలనే ఆకాంక్ష వ్యక్తమైంది. కానీ పశ్చిమ దేశాల సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం మధ్య నెలకొన్న సంఘర్షణలో చిక్కుకున్న మనం మనదైన సంఘటితమైన పర్యావరణహితమైన అభివృద్ధి పథాన్ని విస్మరించాం.

నగరాల తరహాలో గ్రామీణ భారతంలోనూ అన్ని సౌకర్యాలు కల్పించాలని మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ ‌కలాం సైతం ప్రతిపాదించారు. సుసంపన్న మైన, సుఖమయమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైపోయిన జీవనమే భారతదేశ విలక్షణమైన ఆలోచన, అస్తిత్వం. ఇది భారతదేశపు ‘స్వ’ సంబంధించి వ్యక్తీకరణ. మనం ఈ మార్గాన్ని ఎందుకు స్వీకరించలేదు?

స్వదేశీ సమాజం గురించి గురుదేవులు రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌మాట్లాడుతూ ‘‘సంక్షేమ రాజ్యం అనే మాట పశ్చిమ దేశాలు సృష్టించినది. అది భారతీయ పదం కాదు. తరతరాలుగా భారతీయ సమాజం ఒక్కనాడు కూడా రాజ్యశక్తి మీద ఆధారపడింది లేదు. ఏ సమాజమైతే తన అవసరాల కోసం రాజ్యం మీద అతి తక్కువగా ఆధారపడు తుందో అదే స్వదేశీ సమాజం అవుతుంది. తరతరాలుగా న్యాయపరమైన అంశాలు, విదేశీ సంబంధాలు, రక్షణ అనే అంశాలు మాత్రమే రాజ్యం అధీనంలో ఉండేవి. మిగిలిన విద్యా విధానం, ఆరోగ్యం, వ్యాపారం, సంపద సృష్టి, సంగీతం, కళలు, మందిరాలు, కథ లాంటి అంశాలు సమాజం అధీనంలోనే ఉండేవి’’ అని అన్నారు.

సోదరి నివేదిత ఇలా అన్నారు.. ‘ఏ సమాజంలో నైతే ప్రజలు తమ శ్రమకు పొందిన ప్రతిఫలాన్ని వారి దగ్గర ఉంచుకోకుండా సమాజానికి ఇస్తారో అలాంటి ఒక సమాజంలో ఆ విధంగా పోగుపడిన సంపద ఆధారంగా సమాజం సుసంపన్నమవుతుంది, సుభిక్షమవుతుంది. అలాంటి సమాజంలోని ప్రతి వ్యక్తి సుసంపన్నంగా ఉంటారు. కానీ ప్రజలు తమ శ్రమకు పొందిన ప్రతిఫలాన్ని సమాజానికి ఇవ్వకుండా వారి వద్దనే ఉంచుకుంటే అలాంటి సమాజంలో కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే సుసంపన్నమవుతారు. సమాజం నిరుపేదగా ఉండిపోతుంది’’.

సమాజాన్ని మనదిగా భావించి ఇవ్వాలి. ఇది సమాజానికి చెందినది, దానిని తిరిగి ఇవ్వడంతో జీవితం సార్థకమవుతుందని భావించాలి. అందుకే వివేకానంద కేంద్రంలో చేసే ప్రార్థనలో ఇలా అంటారు –

జీవనే యావదాదానం స్యాత్‌ ‌ప్రదానం తతోధికమ్‌!

ఇత్యేషాం ప్రార్థనాస్మాకం భగవన్‌ ‌పరిపూర్యతామ్‌!!

(అర్థం- జీవితంలో మేం ఎంతగా అయితే స్వీకరిస్తామో అంతకన్నా అధికంగా మేము తిరిగి ఇవ్వాలని ఓ భగవంతుడా! మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనను మన్నించు.)

మనకు సమాజం నుంచి చాలా లభిస్తుంటుంది. అలా లభించినవాటిని తిరిగి ఇవ్వడాన్నే ధర్మం అంటారు. మతం లేదా ఆరాధన ధర్మానికి భిన్నమైనది. ధర్మం కోసమే ఆరాధన జరుగుతుంది. ప్రత్యక్షంగా ఆచరించడం, సమాజానికి తిరిగి ఇవ్వడాన్ని ధర్మం అంటారు. సమాజానికి ఇవ్వడాన్ని దానం అంటారు. సమాజానికి తిరిగి ఇవ్వడమే ధర్మం అవుతుంది. సోదరి నివేదిత చెప్పినదాన్ని బట్టి ధర్మం అంటే సమాజాన్ని సుసంపన్నం చేయడం. ధర్మానికి భేదభావం ఉండదు. అది అందరిని కలిపి ఉంచుతుంది. సహాయం చేస్తుంది. అందరినీ ఒక్కటిగా చేస్తుంది. ఇదే స్వదేశీ సమాజానికి ఆధారం.

స్వరాజ్యం సిద్ధించిన సమయంలో, ఈ ‘ధర్మం’కు సంబంధించిన భావన భారతదేశ నిర్మాతల మనసులలో స్పష్టంగా ఉండి ఉండాలి. అందుకే మన లోక్‌సభలో ‘ధర్మచక్ర ప్రవర్తనాయ’ అని, రాజ్యసభలో ‘సత్యం వద ధర్మం చర’ అని, సుప్రీం కోర్టులో ‘యతో ధర్మస్తతో జయః’ అని లిఖించి ఉండగా, జాతీయ పతాకంపై ప్రతిష్ఠితమైన చక్రంగా ‘‘ధర్మచక్రం’’ వెలుగొందుతున్నది. చక్రం తిరగడానికి మాత్రమే ఉన్నది. సమాజాన్ని దారిలో పెట్టడం కోసం చేసే ఒక ప్రత్యేకమైన చిన్న కార్యం సైతం ధర్మకార్యమే అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న కార్యాలతోనే ధర్మచక్రం కదులుతుంది, చలిస్తుంది, ప్రవర్థ మానవుతుంది.

లోక్‌సభ, దేశ పరిపాలన, సుప్రీంకోర్టు, జాతీయ జెండా తదితర విశిష్ట అంశాల్లో ‘ధర్మం’ గురించి మహత్వపూర్ణమైన ప్రస్తావన ఉన్నది. అలాంటి ‘ధర్మం’ గురించిన చర్చ ఎక్కడా లేదు. దానికి బదులుగా ధర్మాన్ని గురించి మాట్లాడటం అంటే మతపర మైనదిగా భావించడం మొదలైంది. చర్చల అనంతరం ఏ లౌకికవాదాన్ని అయితే భారతీయ రాజ్యాంగంలో పొందుపరచకూడని ఏకగ్రీవంగా నిర్ణయించారో అదే లౌకికవాదాన్ని ఎలాంటి చర్చకు తావులేకుండా రాజ్యాంగం పీఠికలో (రాజ్యాంగమే పీఠికలో మార్పు చేయకూడదని చెప్పింది) రహస్యంగా చేర్చడం జరిగింది. అలాంటి లౌకిక వాదం వంటి పదానికి అర్థాన్ని నిర్వచించకుండా విచక్షణారహితంగా వినియోగిస్తున్నారు.

ఇదంతా కూడా ఏ మనస్తత్వం నుంచి ఉద్భ వించింది? ఈ విషయం ఆలోచించాలి. ఆ భారతీయేతర మనస్తత్వం నుంచి విముక్తి పొంది, స్వచ్ఛమైన భారతీయ ఆలోచనను ప్రతిష్టించడం ద్వారా, ఇప్పటివరకు తిరస్కారానికి గురైన భారతదేశపు ‘స్వ’ తనదైన పురుషార్థంతో సంపూర్ణంగా విరాజిల్లుతుంది, అప్పుడే భారతదేశం తన స్వ-గౌరవంతో ప్రభావవంతంగా ప్రపంచం పట్ల తన కర్తవ్యాన్ని దృఢంగా నెరవేర్చడానికి సంసిద్ధ మవుతుంది.

అనువాదం: మహేష్‌ ‌ధూళిపాళ్ల

About Author

By editor

Twitter
Instagram