– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర సమయం ఉండగానే వలసల పర్వం జోరందుకుంది. ఇది అధికార టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా పరిణమించింది. కాంగ్రెస్‌ ‌పార్టీలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. కానీ ఈ పరిణామం భారతీయ జనతా పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహం నింపుతోంది. బీజేపీ జాతీయ అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించడం, దక్షిణాదిలో పాతుకుపోయేందుకు అడ్డాగా తెలంగాణను గుర్తించడం, జాతీయ స్థాయి ముఖ్యనేతలు తరచూ పర్యటించడం, రాష్ట్ర పార్టీకి పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇవ్వడం, ఎప్పటికప్పుడు పరిస్థితులను విశ్లేషించడం, పార్టీలో చేరికల కోసమే ప్రత్యేకంగా కమిటీని నియమించి సమీక్షిస్తుండటం వంటి పరిణామాలు రాష్ట్రంలో ఆ పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర స్థాయి కేడర్‌ ‌నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్తల గణం దాకా సంతోషంలో మునిగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు.


బీజేపీ అధిష్టానం గత కొన్నేళ్లుగా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపు తోంది. తీసుకునే ప్రతి నిర్ణయం, రాష్ట్ర కేడర్‌కు ఇచ్చే ప్రతి ఆదేశం ఆ దిశగానే ఉండేలా చూస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రాన్ని తామే సాధించామని, ఆ క్రెడిట్‌ను ఏకపక్షంగా అనుభవిస్తోన్న, ప్రజల్లోకి నాటుకు పోయేలా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని టార్గెట్‌ ‌చేసింది. పక్కా ప్రణాళికతో, కార్యాచరణను అమలు చేస్తోంది. రాజకీయ చతురుడిగా పేర్గాంచిన కేసీఆర్‌కే బీజేపీ వ్యూహాలు చెమటలు పట్టిస్తున్నాయి. ఎక్కడ, ఏ స్థాయిలో, టీఆర్‌ఎస్‌ను ఎలా దెబ్బకొట్టాలో అంచనాలు వేసి మరీ వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తా నికి 2023 ఎన్నికల్లో ప్రగతి భవన్‌లో కాషాయ జెండా ఎగురవేయడమే ఆశయంగా ముందు కెళ్తున్నారు.

ఈ క్రమంలోనే బీజేపీ ఘర్‌ ‌వాపసీ, ఆపరేషన్‌ ఆకర్ష్ ‌కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రాజకీయాల్లో సహజంగా మారిపోయిన వలసల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుం టోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవాళ్లు, తమ అనుభవానికి, పార్టీకి చేసిన సేవకు గుర్తింపు లభించక ఆవేదన చెందుతున్న వాళ్లు, ఇతర పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవాళ్ల గురించి ఆరా తీస్తోంది. ప్రత్యేకంగా వాళ్లతో సంప్రదింపులు జరిపి బీజేపీ కండువా కప్పేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఆ రెండు పార్టీల్లో పొమ్మనలేక పొగబెడుతున్న పరిణామాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. వాళ్లను కూడా బీజేపీలోకి చేర్చుకునేందుకు కార్యాచరణను రూపొందించు కుంది. ప్రస్తుతం తెలంగాణలో వలసల రాజకీయం ఏ స్థాయిలో ఉందంటే బీజేపీ, కాంగ్రెస్‌లు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చేవాళ్లను ఒప్పించేందుకే ప్రత్యేకంగా కమిటీలు వేశాయి. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తన జీవిత లక్ష్యమంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కే బీజేపీ చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ పెద్దల డైరెక్షన్‌లోనే ఆపరేషన్‌ ఆకర్ష్ ‌కొనసాగిస్తున్నారు ఈటల. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆ బాధ్యతలను సీనియర్‌ ‌నేత జానారెడ్డి భుజస్కంధాలపై వేసింది. అయితే, బీజేపీ చేరికల కమిటీ వ్యవహరిస్తున్నంత చురుగ్గా.. కాంగ్రెస్‌ ‌కమిటీ పనిచేయడం లేదన్నది జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.

ఆగస్టులో తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ‌కొంతకాలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లిన ఈటల, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ పెద్దలను కలిశారు. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నుంచి బీజేపీలో చేరబోయే జాబితాను రూపొందించిన ఈటల.. దానిని హైకమాండ్‌కు సమర్పించారు. చేరికలను ఎలా కొనసాగించాలన్న అంశంపై అమిత్‌షాతో చర్చించారు. ఆ జాబితాలోని పేర్లు తెలంగాణ రాజకీయాల్లో షికార్లు చేశాయి. వారిలో మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి, రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ ఎం‌పీ, ఎమ్మెల్యే; ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి; మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ‌తరపున టీవీ చర్చల్లో పాల్గొనే ఇద్దరు కీలక నేతలు, వరంగల్‌ ‌జిల్లాకు చెందిన కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, ‌పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ‌గట్టిముక్కల సురేశ్‌ ‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఇంకా పలువురు టీఆర్‌ఎస్‌ ‌స్థానిక ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరే జాబితాలో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగింది.

తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ జాబితా నూటికి నూరుపాళ్లు నిజమే అన్న విషయం అవగతమవుతోంది. ఎందుకంటే, ఈ సమయంలోనే కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. ఆ వెంటనే ఎమ్మెల్యేగా రాజీనామా లేఖను సైతం స్పీకర్‌కు సమర్పించారు. ఆగస్ట్ 21‌న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను పలు సార్లు కలిశారు. అలాగే, హస్తం పార్టీ అధికార ప్రతినిధి, ముఖ్యనేత దాసోజు శ్రవణ్‌ ‌కూడా పార్టీకి రాజీనామా చేసి వెంటనే బీజేపీ కండువా కప్పు కున్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు.. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీళ్లే కాదు.. ఇంకొంతమంది పేర్లు కూడా జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. వాళ్లు కూడా అధికార పార్టీపైనా, సీఎం కేసీఆర్‌పైనా విమర్శలకు దిగుతున్నారు. ఇక, ఈటల రాజేందర్‌ ‌జాబితా ప్రకారమే కన్నెబోయిన రాజయ్య యాదవ్‌తో పాటు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నర్సాపూర్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌మురళీయాదవ్‌ ‌వంటి నేతలు బీజేపీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. ఒక సందర్భంలో బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సంచనల ప్రకటన చేయడంతో టీఆర్‌ఎస్‌లో అలజడులు మొదలయ్యాయి. నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతం నమ్మి.. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతి స్తామని సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తాము సాగిస్తున్న అలు పెరుగని పోరాటాన్ని చూసే బీజేపీలోకి రావాలని చాలామంది నేతలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టిం చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా తర్వాత పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డిని కూడా పరోక్షంగా విమర్శించడంతో కాంగ్రెస్‌లో కలకలం చెలరేగింది. దీంతో, మరుసటిరోజే రేవంత్‌ ‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆ తర్వాత అద్దంకి దయాకర్‌ ‌కూడా మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలందరి సమక్షంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పరి ణామాలు అందరినీ విస్తుపరిచాయి. పార్టీకి నష్టం కలిగించేలా ఉన్న ఆ పరిణామంపై కాంగ్రెస్‌ ‌పెద్దలు అప్రమత్తం అయ్యారు. అద్దంకి దయాకర్‌కు నోటీ సులు ఇచ్చారు. ఆ వెంటనే స్పందించిన దయాకర్‌ ‌కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. వీటికి తోడు రేవంత్‌రెడ్డి వ్యూహం మరింత బెడిసికొట్టేలా తయారైంది. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌ ‌పార్టీలో చేర్చుకున్నారు. ఆయనే స్వయంగా సుధాకర్‌ను పార్టీ ముఖ్యనేత మల్లికార్జున ఖర్గే దగ్గరికి తీసుకు వెళ్లి కండువా కప్పించారు. ఆ సందర్భంలోనే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చెరుకు సుధాకర్‌ ‌ప్రకటించారు. ఇది కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరింత కాక పుట్టించింది. ఎవరితో చర్చించకుండా చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌ ‌పార్టీలో ఎలా చేర్చు కుంటారని వెంకట్‌రెడ్డి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను గత ఎన్నికల్లో ఓడించాలని చూసిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో ఎలా చేర్చు కుంటారని ప్రశ్నించారు. అంతేకాదు, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన రోజే వెంకటర్‌రెడ్డి కూడా వేర్వేరుగా అమిత్‌షాతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ్ముడి బాటలోనే అన్న నడుస్తు న్నారని, ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే, తాను కేవలం నియోజకవర్గంలో సమస్యలు, వరద కష్టాల గురించి మాట్లాడేందుకే అమిత్‌షాను కలిశానని, తన భేటీలో రాజకీయ అంశాల ప్రస్తావన లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించడం గమ నార్హం. కాంగ్రెస్‌ ‌పార్టీ మరో ముఖ్యనేత దాసోజు శ్రవణ్‌ ‌రాజీనామాకు ముందు రేవంత్‌రెడ్డి, టీ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యుహాకర్త సునీల్‌, ‌మాణిక్కాం ఠాగూర్లపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌ ‌పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీపీసీసీలో దుర్మార్గమైన పరిస్ధితులు చోటుచేసుకున్నా యన్నారు. ఎన్నికల వ్యూహకర్త సునీల్‌, ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌మాణిక్యం ఠాగూర్‌, ‌పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని శ్రవణ్‌ ఆరోపించారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో టీ కాంగ్రెస్‌లో పరిస్థితి అయోమయంగా తయారైంది. ఎవరు పార్టీలోకి వస్తున్నారో, ఎవరు పార్టీని వీడుతారో తెలియని గందరగోళం నెలకొంది.

About Author

By editor

Twitter
Instagram