– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ –

‘మేధోపరంగా మీడియాను, యుద్ధభూమిలో ఆయుధాలను ఉపయోగించుకోండి..’ కొద్ది నెలల క్రితం భారత్‌లో హిజాబ్‌కు మద్దతుగా పోరాడుతున్న వారికి అల్‌ ‌జవాహరీ ఇచ్చిన పిలుపు.. కర్ణాటకలో ముస్కాన్‌ అనే యువతి అల్లాహో అక్బర్‌ అం‌టూ హిజాబ్‌తో నిరసన వ్యక్తం చేయడాన్ని ప్రశంసిస్తూ ఏకంగా కవిత కూడా రాశాడు. కశ్మీర్‌ ‌విషయంలో కూడా తరచూ వ్యాఖ్యలు చేసేవాడు.  మన దేశానికి చెందిన దాదాపు 400 మంది అల్‌ఖైదాలో చేరి శిక్షణ పొందుతున్నారని నిఘా నివేదికలు కూడా ఉన్నాయి. అమెరికా సైన్యం అఫ్ఘనిస్తాన్‌లో  ఇస్లామిక్‌ ‌జిహాదీ మూకలకు పెద్దన్న అల్‌ఖైదా చీఫ్‌ ‌జవాహరీని మట్టుపెట్టడం మన దేశానికి ఉపశమనాన్ని ఇచ్చింది. కానీ జవాహరీ లాంటి ఉగ్రోన్మాదులు నాటిన విష బీజాలు కొనసాగడం ఆందోళనకరం.

హిజాబ్‌ ‌విషయంలో దేశమంతా రగడ కొన సాగుతున్న రోజుల్లో మీడియాలో వచ్చిన ఓ వార్త అందరికీ గుర్తుండే ఉండాలి. కర్ణాటకలో ‘అల్లాహు అక్బర్‌’ అం‌టూ నినాదాలు చేస్తూ వేగంగా దూసుకు పోతున్న ముస్కాన్‌ అనే యువతిని అభినందిస్తూ అల్‌ఖైదా చీఫ్‌ అయిమన్‌ అల్‌ ‌జవాహరీ 9 నిమిషాల ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. ఆమెను తన సోదరిగా అభివర్ణిస్తూ ముస్కాన్‌ ‌ధైర్యంపై పొగడ్తలు కురిపించాడు. ‘ది నోబెల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ‌ది ఇండియా’ అని ప్రశంసించాడు. ముస్కాన్‌ ‌వాస్తవాన్ని ముందుకు తెచ్చిందన్నాడు. ఆమె జిహాద్‌ ‌స్ఫూర్తిని కొనసాగించిందని, ముస్లిం సమాజాన్ని మేల్కొల్పిం దని జవాహరీ ప్రశంసలు గుప్పించాడు. ‘ముస్కాన్‌ ‌ముస్లింలకు, బహుదైవారాధకులకు నడుమ శత్రుత్వాన్ని బట్టబయలు చేసింది. భారతదేశంలోని మోసపూరిత అన్యమత ప్రజాస్వామ్యాన్ని వెలుగులోకి తెచ్చినందుకు దేవుడు ఆమెకు తగిన ప్రతిఫలం ఇవ్వుగాక’ అని జవాహరీ ఆ వీడియోలో పేర్కొన్నాడు. భారత్‌లోని ముస్లింలపై దమనకాండ కొనసాగు తోందని ఆరోపిస్తూ, దీన్ని తిప్పికొట్టేందుకు దేశం లోని ముస్లింలంతా యుద్ధం చేయాలని పిలుపు నిచ్చాడు. మేధోపరంగా మీడియానూ ఉపయోగించు కోవాలని, ఆయుధాలతోనూ యుద్ధరంగంలోకి దిగాలని పిలుపునిచ్చాడు జవాహరీ..

ముస్కాన్‌ ‌తనకు ప్రేరణ కలిగించిందని, తాను కవిని కాకున్నా ఆమెపై కవిత్వం కూడా రాశానని చదివి వినిపించాడు జవాహరీ. తన బహుమతిగా ఆ పద్యాన్ని ఆమె స్వీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జవాహరీ వీడియోతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. హిజాబ్‌ ‌వంటి భావోద్వేగ అంశాన్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఉపయో గించుకుంటున్నాయని ఇంటెలిజెన్స్ ‌వర్గాలు పేర్కొన్నాయి. అయితే జవాహరీ ఎవరో తనకు తెలియదని, తమకు ఎవరి సాయం వద్దని, విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అని ముస్కాన్‌ ‌తండ్రి మొహమ్మద్‌ ‌హుస్సేన్‌ ‌ఖాన్‌ ‌మీడియాకు విన్న వించారు. తమను ప్రశాం తంగా బతకనివ్వాలని కోరారు. ‘ఆ వీడియోలో అతనేదో అరబీలో మాట్లా డాడు. మనమంతా ఈ దేశంలో శాంతియు తంగా జీవిస్తున్నాం. మనలో విభేదాలు సృష్టించే ప్రయత్నమే ఇది’ అన్నారు.

ప్రమాదకర ఉగ్రవాది అల్‌ ‌జవాహరీ

రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌ ‌రాజధాని కాబూల్‌లోని ఓ మేడ బాల్కానీలో కూర్చున్న ఓ వృద్దుని మీదకు డ్రోన్‌ ‌ద్వారా ప్రయోగించిన క్షిపణులు దూసుకెళ్లాయి.. మరణించింది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత అల్‌ ‌జవాహరీ అనే వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాన్ని అమెరికా చక్కగా ఉపయో గించుకుంది. జవాహరీ కోసం 21 ఏళ్లుగా సాగించిన వేటకు ఇలా ముగింపు పలికింది..

అమెరికాలో 2001 సెప్టెంబర్‌ 11‌న మారణ హోమానికి కుట్ర రచించడంలో కీలక వ్యక్తి అల్‌ ‌జవాహరీ. 2,977 మందిని బలిగొన్న దాడులకు బాధ్యుల్లో ముఖ్యుడు. అమెరికన్లే లక్ష్యంగా దశాబ్దాలుగా జరుగుతున్న అనేక దాడులకు సూత్రధారి అతడు. ఆనాటి మారణహోమానికి ప్రధాన సూత్రధారి అయిన ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌ఫొటోల్లో అతడి పక్కనే కళ్లజోడుతో, నవ్వుతూ కనిపించే వ్యక్తే జవాహరీ. ఆ నవ్వు వెనుక అమెరికా సహా అనేక దేశాలపై విద్వేషాగ్ని, పైశాచికం దాగి ఉన్నాయి. లాడెన్‌ను వెతికి వేటాడి పాకిస్తాన్‌లో మట్టుబెట్టింది అమెరికా. లాడెన్‌ ‌మృతి తర్వాత అల్‌ఖై దాకు జవాహరీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.

అల్‌ ‌జవాహరీ స్వస్థలం ఈజిప్ట్ ‌రాజధాని కైరో.. 1951 జూన్‌ 19‌న పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఈజిప్ట్ ‌సహా ఇతర అరబ్‌ ‌దేశాల్లో ప్రభుత్వాల్ని గద్దె దించి ఇస్లామిక్‌ ‌పాలన తీసుకురావాలని అనుకునే హింసాయుత భావజాలంతో పెరిగాడు. కళ్ల శస్త్ర చికిత్స నిపుణుడిగా పనిచేశాడు. 1981లో ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్‌ ‌సాదత్‌ ‌హత్య తర్వాత వందల మంది మిలిటెంట్లను జైలులో వేశారు. వారిలో జవాహరీ ఒకడు. అప్పుడే అతడిలోని అతివాద భావజాలం మరింత తీవ్రమైంది. మధ్య, పశ్చిమా సియాలో విస్తృతంగా పర్యటించాడు. అప్పుడే బిన్‌ ‌లాడెన్‌తో అఫ్ఘనిస్థాన్‌తో స్నేహం కుదిరింది. సోవియట్‌ ‌దళాల్ని వెళ్లగొట్టేందుకు 21 ఏళ్లుగా అఫ్ఘనిస్థాన్‌•కు సాయం చేస్తున్న అరబ్‌ ‌మిలిటెంట్లనూ కలిశాడు. బిన్‌ ‌లాడెన్‌ ‌స్థాపించిన అల్‌ ‌ఖైదాలో తన మిలిటెంట్‌ ‌గ్రూప్‌ను విలీనం చేసేశాడు. తన అనుభవం, నైపుణ్యాలతో అల్‌ఖైదా శ్రేణులకు శిక్షణ ఇచ్చాడు. ఫలితంగా అల్‌ఖైదా అనేక దేశాల్లో అనుచరుల్ని పెంచుకుని, దాడులు చేయగలిగింది. లాడెన్‌ ‌హతమైన తర్వాత కూడా అల్‌ఖైదా ఉనికిని కొనసాగించాడు. అఫ్ఘనిస్థాన్‌•-‌పాకిస్థాన్‌ ‌సరిహద్దులో అల్‌ఖైదా నాయకత్వాన్ని, స్థావరాన్ని తిరిగి నిర్మించాడు. బాలి, మొంబాసా, రియాద్‌, ‌జకార్తా, ఇస్తాంబుల్‌, ‌మాడ్రిడ్‌, ‌లండన్‌ ‌సహా అనేక నగరాల్లో ఉగ్రదాడులు చేయించాడు. 2005లో లండన్లో 52 మందిని బలిగొన్న దాడులకు జవాహరీనే సూత్రధారి. ఇటీవలి కాలంలో అల్‌ఖైదాకు తోడుగా ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఉ‌గ్రవాద సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూ వస్తోంది.

జవాహరీ హతం భారత్‌కు ఊరట

అల్‌ ‌జవాహరీ మతం అమెరికాతో పాటు భారత్‌కు కూడా అత్యంత ముఖ్యమైన విషయమే. ఉగ్రవాద బాధిత దేశాల్లో మన దేశం మొదటి స్థానంలో ఉండటం కొత్తేమీ కాదు. అమెరికా జవాహరీని మట్టుబెట్టడం మన దేశంలోని అల్‌ఖైదా మద్దతుదారులు, అనుబంధ సంస్థలకు పిడుగుపాటు వంటిదే. మరోవైపు ఇటీవల భారత్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న తాలిబన్లు కాబూల్‌లో జవాహరీకి ఆశ్రయం కల్పించడం ఆందోళన కలిగించే అంశం. తాలిబన్ల మద్దతుతో ఆల్‌ఖైదా భారత్‌లో తన ఉగ్రవాద కార్యకలాపాలకు పథకాలు రచిస్తోందనే వార్తలున్నాయి. మరోవైపు అఫ్ఘనిస్థాన్‌• ‌తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు జవాహరీ సమాచారాన్ని వ్యూహాత్మకంగా లీక్‌ ‌చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.

అల్‌ ‌జవాహరీ ఉనికి చాలా కాలాంగా కని పించకపోవడంతో అతను మరణించి ఉండొచ్చని అనుమానాలు కూడా వచ్చాయి. అయితే భారత్‌లో హిజాబ్‌కు మద్దతుగా వీడియో విడుదల చేసి తన ఉనికిని చాటుకున్నాడు జవాహరీ. గతంలో కూడా ఆయన మాట్లాడిన వీడియోల్లో భారత్‌ ‌ప్రస్థావన అక్కడక్కడా వచ్చేది. ముఖ్యంగా కశ్మీర్‌ అం‌శంపై చాలాసార్లు మాట్లాడాడు. కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా యువత జిహాదీ కార్యకలాపాలపై ఆసక్తి చూపడంలేదు. దీంతో భారతీయ ముస్లింలను తమ నెట్‌వర్క్‌లో చేర్చుకునేందుకు అల్‌ఖైదా ప్రయత్నాలు చేస్తోందని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. మన దేశంలో అల్‌ఖైదాకు ప్రాంతీయ శాఖగా ఐక్యూఐఎస్‌ ‌పని చేస్తోందని, అందులో 400 మంది ఫైటర్లు ఉన్నట్లు ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌, ‌పాకిస్తాన్‌లకు చెందిన వీరంతా ఘాంజీ, హెల్మాండ్‌, ‌కాందహార్‌, ‌నిమ్రుజ్‌, ‌పక్టికా, జబుల్‌ ‌ప్రావిన్స్‌లలో శిక్షణ పొందుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

అప్రమత్తంగా ఉండాల్సిందే

అల్‌ ‌జవాహరీ అంతమైన వార్త భారత్‌కు మంచిదే అయినా, ప్రస్తుతం తాలిబన్లతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌ ‌నుంచి అమెరికా వైదొలగి, తాలిబన్లులు పాలనా పగ్గాలు చేపట్టాక భారత ప్రభుత్వం మన పౌరులు, అధికారులను దాదాపుగా వెనక్కి తీసుకొ చ్చింది. తాలిబన్లు ఇతర ఉగ్రవాద మూకలకు ఇంకా ఆశ్రయం కొనసాగిస్తున్నారనే జవాహరీ ఉదంతం చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ ‌మానవతా సాయం కొనసాగిస్తూనే అఫ్ఘాన్‌ ‌భూభాగం నుంచి నడుస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలపై కన్నేసి ఉంచాలి. 1990లలో అల్‌ ‌ఖైదా నేతలకు ఆశ్రయ మిచ్చి, సెప్టెంబర్‌ 11 ‌దాడులకు ప్రణాళికలు రచించేందుకు సాయం చేసింది అఫ్ఘనిస్తాన్లో అప్పటి తాలిబన్ల ప్రభుత్వమేనని మరిచిపోరాదు. ఇప్పుడు అదే తరహాలో అతివాద సంస్థలకు అఫ్ఘనిస్తానో తాలిబన్లు ఆశ్రయమిస్తున్నారా అనేది అమెరికా సహా అనేక దేశాల ఆందోళన.

మరోవైపు జవాహరీ మరణించినట్లు తమ దగ్గర ఆధారాలు లేవని అఫ్ఘనిస్తాన్‌ ‌చెప్పడం అనుమానా లకు తావిస్తోంది. ఆయన మృతి చెందినట్లు వచ్చిన వార్తపై దర్యాప్తు జరుపుతామని చెబుతున్నారు. అతన్ని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ‌స్వయంగా ప్రకటించినా తాలిబన్లు ఇలా చెప్పడం వెనుక కారాణాలు ఏమై ఉండొచ్చో ఊహించడం కష్టమేదీ కాదు. ఏదేమైనప్పటికీ అప్ఘనిస్తాన్‌లో జవా హరీ ఉనికి కనిపించడంతో తాలిబన్లు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారనేది సుస్పష్టం. కాందహార్‌ ‌విమానం హైజాక్‌ ఉదంతంలో తాలిబన్ల పాత్ర, భారత్‌ ‌మీద వారి ఆలోచన విధానం ఏమిటో  తేలిపోయింది.

జవాహరీ వారసుడు ఎవరన్న దానిపైనే అల్‌ ‌ఖైదా భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. అమెరికా, ఇతర దేశాలు అనేక ఏళ్లుగా చేస్తున్న దాడులతో ఇప్పటికే ఆ ఉగ్రమూక చాలావరకు దెబ్బతింది. అల్‌ ‌ఖైదా మనుగడ కష్టమేనన్నది నిపుణుల అభిప్రాయం. జవాహరీ హతమవడంతో తదుపరి అధినేతగా బాధ్యతలు చేపట్టబోయేదెవరన్న ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. అల్‌ఖైదాలో అగ్ర నేతలుగా ఉన్న సైఫ్‌ అల్‌ అదెల్‌, అబ్దుల్‌ ‌రెహ్మాన్‌ అల్‌ ‌మఘ్రేబీ, యాజిద్‌ ‌మెబ్రాక్‌, అల్‌ ‌షబాబ్‌ ‌సంస్థకు చెందిన అహ్మద్‌ ‌దిరియేల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో సైఫ్‌ అల్‌ అదెల్‌ ‌ముందు వరుసలో ఉన్నాడు. 1998లో దారుస్సలాం, టాంజానియా, నైరోబీ, కెన్యాల్లో అమెరికా రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినవారిలో సైఫ్‌ ఒకడు. నాటి దాడుల్లో దాదాపు 250 మంది దుర్మరణం పాలయ్యారు. సైఫ్‌ ‌తలపై అమెరికా కోటి డాలర్ల రివార్డు ప్రకటించింది. సైఫ్‌ అల్‌ఖైదాకు కొత్త అధినేతగా వచ్చినా, ఇప్పట్లో ఆ సంస్థ పెద్దగా పుంజుకునే ఆనవాళ్లు కనిపించడం లేదు. అయినా మన దేశం అప్రమత్తంగా ఉండక తప్పదు..

About Author

By editor

Twitter
Instagram