– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 ‌న నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రసంగం మొత్తం స్వోత్కర్ష, ఆత్మ సంతుష్టీకరణ గానే సాగింది. ఆయన వెల్లడించిన అంశాలన్నీ అసత్యాలేనని ప్రజలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తు న్నారు. ఆయన పాలన తీరు పట్ల తీవ్ర అసహనం వక్తం చేస్తున్నారు. అన్నివర్గాల ఆకాంక్షలు నెరవేర్చామని, సామాజిక న్యాయం అమలు చేశామని, మహిళలకు సాధికారత కల్పించామని, రైతులకు భరోసా అందించామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, పేదలకు గృహ సదుపాయం కల్పించామని అట్టహాసంగా మాట్లాడారు. కాని ఇవన్నీ వట్టి మాటలేనని, అందులో రవంత కూడా వాస్తవం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నిర్మించిన ఇళ్లను ఇవ్వకుండా ఊరికి దూరంగా ఎలాంటి భద్రత లేని ప్రాంతంలో సెంటు చొప్పున స్థలం కేటాయించి, అక్కడకు వెళ్లిపొమ్మని చెప్పడమే గృహవసతి కల్పించడమా? అని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లుగా తమపై సాగుతున్న అత్యాచారాలు, దాడులు, అవమానాలను నియంత్రించకపోవడాన్ని అండగా ఉంటున్నట్లు భావించాలా? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. తమకు భరోసా కాదు కదా… లేని ఆర్ధిక సమస్యలు సృష్టిస్తున్నారని రైతులే ఆరోపిస్తున్నారు. ఆర్ధిక ప్రయోజనాలు కల్పించే పథకాలు కల్పించక పోవడాన్ని ఏ రకంగా సామాజిక సంక్షేమంగా పేర్కొంటారని వెనుకబడిన వర్గాలు, షెడ్యూలు కులాలు, తరగతుల వారు ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండగా,మరోవంక పన్నులతో ఆర్థిక భారాలు మోపడమే ఆనందంగా ఉన్నట్లుగా భావించాలా? అని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన పార్టీలు, చైతన్యవంతులపై రౌడీలతో దాడులు చేయించడం, పోలీసు కేసులు పెట్టించడాన్ని శాంతిగా భావించాలా? అని విమర్శిస్తున్నారు. వెరసి ‘ముఖ్యమంత్రి మాటలకు అర్థాలే వేరులే’ అనేది జనమెరిగిన సత్యమే. స్వాతంత్య్రదిన వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగంలో చెప్పిన కొన్ని అంశాల్లోని అసత్యలు ఇవే…

ఆర్థిక భారంగా సచివాలయాలు

పరిపాలన వికేంద్రీకరణ పేరుతో సచివాలయాలు ఏర్పాటుచేసి పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చామంటున్నారు. గతంలో ఈ-సేవా కేంద్రాలుండేవి. వాటిని తీసేసి వాటి స్థానంలో ఏర్పాటైన సచివాలయాలు రాష్ట్రానికి ఆర్థిక భారంగా మారాయి. సచివాలయాలు కేవలం నవరత్నాలు అమలుచేసే కేంద్రాలుగా తప్పించి మరే విధంగానూ ఉపయోగపడటం లేదు. ఇక్కడ ఒక సచివాలయ కార్యదర్శితో పాటు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఇం‌జనీరింగ్‌ అసిస్టెంట్‌, ‌డిజిటల్‌ అసిస్టెంట్‌, ‌మహిళా కానిస్టేబుల్‌, ఎఎన్‌ఎం, ‌సర్వేయర్‌, అ‌గ్రికల్చరల్‌ అసిస్టెంట్‌, ‌ఫిషరీస్‌ అసిస్టెంట్‌ అనే పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల్లో ఎఎన్‌ఎం‌కు తప్ప ఎవరికీ ప్రస్తుతం పనిలేకుండా పోయింది. ఉదాహరణకు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ‌పంచాయతీల పరిధిలో అన్ని రకాల గ్రామీణాభివృద్ధి పనులు చేయడంలో బాధ్యత వహించాలి. కాని నిధులే లేక వీరంతా రెండేళ్లుగా ఖాళీగా కూర్చుంటున్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ‌డిజిటల్‌ అసిస్టెంట్‌ ‌మాత్రం అప్పుడప్పుడు పని చేస్తున్నారు. మిగతా వారికి పని ఉండటం లేదని ఉద్యోగులే చెప్పడం విశేషం.

రైతుల సమస్యలు

విత్తనం కొనుగోలు దగ్గర నుంచి పంట అమ్మకం వరకూ ఆర్‌బీకేల ద్వారా సేవలు చేస్తున్నామని, అన్నదాతలకు ‘రైతు భరోసా’ అందిస్తున్నామని, ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని, రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదంతా అసత్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు కలుగలేదు సరికదా పలు సమస్యలు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్‌ ‌సబ్సిడీని కూడా వైకాపా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద అయిదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని, ఏడాదికి రూ. 12,500 చెల్లిస్తామని చెప్పి, రూ.7,500 మాత్రమే ఇస్తోంది. కేందప్రభుత్వం ఏటా రైతులకు ఇచ్చే ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ రూ.6 వేలు, రూ.7,500 లతో కలిపి మొత్తం రూ.13,500 తానే చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేసుకుంటోంది. వరికి గిట్టుబాటు ధర కల్పించడం లేదనేది రైతుల ఆరోపణ. తమ వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి నెలల తరబడి డబ్బు చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో మిల్లర్లకు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ము కుంటున్నామని రైతులు అంటున్నారు. ప్రభుత్వం, మిల్లర్లు, మధ్యదళారులు కుమ్మకై తమను నష్టపరుస్తున్నారని వాపోతున్నారు. భరోసా కేంద్రాల్లో అవసరమైనన్ని విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం లేదు. వ్యవసాయ సహాయక పరికరాలు, సూక్ష్మ ఎరువులు, బోరుబావుల నిర్మాణం వంటి ఏ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదంటున్నారు.

ఆరోగ్య సమస్యలు

ఆరోగ్య సౌకర్యం కల్పించామనడం పెద్ద బూటకంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసు పత్రుల్లో అన్నీ సమస్యలే తిష్టవేశాయి. ఎక్కడా పూర్తిస్థాయిలో మందులు ఇవ్వడం లేదు. చాలా ఆసుపత్రుల్లో వైద్యుల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడం లేదు. అట్టహాసంగా శంకుస్థాపన చేసిన బోధనాసుపత్రులకు కనీసం పునాదులు కూడా తీయలేదు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌పీలు తీసుకొచ్చామంటున్నారు కాని వీటిల్లో సగం పిహెచ్‌సీల్లో వైద్యులే లేరని గ్రామస్థులంటున్నారు. నర్సులే చిన్న చిన్న మందులిచ్చేసి పంపుతున్నారు. వైద్యరంగంలో రూ.16 వేల కోట్లతో ‘నాడు నేడు’ను అమలుచేస్తూ మూడేళ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం రాగానే గతంలో పనిచేస్తున్న సిబ్బందిని తీసేశారు. కోవిడ్‌ ‌సమయంలో ఆరోగ్య కేంద్రాలకు వైద్య సిబ్బందిని నియమించుకుని పనిచేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. వారినే కొత్తగా నియమించినట్లు ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. అలాగే పాత పీ•హెచ్‌సీలకు కొత్త రంగులు వేసి ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకంలోని వెల్‌నెస్‌ ‌సెంటర్లుగా పేర్లు మార్చేశారు. ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టరును నియమిస్తామన్న ప్రకటన అమలు కాలేదు.

ఉత్తుత్తి కార్పొరేషన్లు

సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, నామినేటెడ్‌ ‌పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ ‌కల్పిస్తూ చట్టం చేశామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు న్యాయం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది కూడా అసత్యమేనని బీసీ వర్గాలంటున్నాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు ఆర్థిక సహకారం అందించేందుకు ఆయా కులాల పేరుతో వెల్ఫేర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్‌లకు ఛైర్మన్లు, సభ్యులను నియమించారు. కాని కార్పొరేషన్లు పనిచేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించక పోవడంతో ఆయా కులాల్లో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం లభించలేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఒక్కటే ఉండేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక మాల, మాదిగ, రెల్లి వెల్‌ఫేర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏ విధమైన లబ్ధిని చేకూర్చలేదు సరికదా పాత పథకాలను కూడా అమలు చేయలేదు. జాతీయ ఎస్సీ వెల్‌ఫేర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ఇచ్చే మ్యాచింగ్‌ ‌గ్రాంట్‌లను వినియో గించక, లబ్ధిదారులకు మేలు చేకూర్చలేదు. గతంలో అన్ని బీసీ వర్గాలకు ఆర్థిక సహకారానికి బీసీ వెల్ఫేర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ఉం‌డేది. వైకాపా ప్రభుత్వం దానిని విభజించి వివిధ కులాల పేరుతో వెల్ఫేర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కాని వేటికీ నిధులు ఇవ్వలేదు. లబ్ధ్దిదారులకు ఏ విధమైన ప్రయోజనం చేకూరలేదు.

భద్రత అంటే అరాచకమా?

మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ప్రభుత్వం మనదని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలకు ఎందులో 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారో స్పష్టత లేదు. ఆయన చెప్పిన ప్రకారం 175 ఎమ్మెల్యే సీట్లకు గాను 87 సీట్లు మహిళలకు కేటాయించాలి. మరి ఎన్ని కేటాయించారో ముఖ్యమంత్రే చెప్పాలి. ఇక ఈ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. శాంతిభద్రతలు అమలు కాకపోవడంతో రౌడీలు రెచ్చిపోతున్నారు. మూడేళ్లుగా మహిళలపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారిపట్ల వివక్ష కొనసాగుతోంది. పార్టీ నాయకులు, స్వయంగా మంత్రులు, ఎంపీలు మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతూ, అవమానిస్తునారు. ‘అరగంట, గంటకొస్తారా’ అంటూ నీచపు మాటలు మాట్లాడుతుంటే ఒక ఎంపీ తన నగ్న దేహాన్ని వీడియోలో చూపినట్లు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం విచారణకు ఆదేశించకపోవడం శోచనీయం.

ఇళ్లేవి?

రూ.2 లక్షల కోట్ల విలువైన 31 ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు ఇచ్చామంటున్నారు. మరో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇంటి నిర్మాణం పూర్తయితే వాటి విలువ రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందన్నారు. సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన సంపదను మహిళల చేతుల్లో పెట్టామన్నారు. కాని ఇదంతా అసత్యమని లబ్ధ్దిదారులంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఇప్పటికే నిర్మించిన రెండున్నర లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించలేదు. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించక, వాటిని పాడుపెట్టేశారు. రూ.7 వేల కోట్లతో చేసిన భూముల కొనుగోలులో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కొండ ప్రాంతాలు, సముద్ర, నదీ తీర లోతట్టు ప్రాంతాలు, ఊరికి పది కిలోమీటర్ల దూరంలోని బీళ్లను సేకరించారు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవాలంటున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల సబ్సిడీని, మౌలిక సదుపాయాలకు ఇంటికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికిప్పుడు ఇళ్లు నిర్మించుకోవాలని, లేకుంటే పట్టాలు రద్దుచేస్తామని ఒత్తిడి చేస్తోంది. రక్షణ లభించని ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు వెళ్లి ఇళ్లు కట్టుకునేందుకు జనాలు సిద్ధంగా లేరు. తమ వద్ద డబ్బు కూడా లేదంటున్నారు.

About Author

By editor

Twitter
Instagram