– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ –

దేశాన్ని అస్థిర పరచడానికి, విధ్వంసం సృష్టించడానికి, ఒక వర్గం ప్రజల్లో అనైక్యత, విద్వేషభావనను కలిగించడానికి, వారిని రెచ్చగొట్టడానికి కొన్ని ఇస్లామిక్‌ ఉ‌గ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం కొత్తేమీ కాదు. ఇది నిరంతర పక్రియే. కానీ ఇటీవల కాలంలో వాటి కార్యకలాపాలు మరింత తీవ్రమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మన నిఘా విభాగం, పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. దాయాది దేశమైన పాకిస్తాన్‌ ‌గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇం‌టర్‌ ‌సర్వీస్‌ ఇం‌టలిజెన్స్) ఆధ్వర్యంలో ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఒకటి ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియా). భారతదేశాన్ని ముక్కలు చేయడమే దీని లక్ష్యం. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ సంస్థ కార్యకలాపాలు ఇటీవల కాలంలో దక్షిణ, పశ్చిమ భారత్‌కు విస్తరించాయి.


తాజాగా రాజధాని ఢిల్లీ నగరంలో మొహిసిన్‌ అహ్మద్‌ అనే నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ  (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఇతను బిహార్‌ ‌రాజధాని పట్నా నివాసి. ఐఎస్‌ఐఎస్‌ ‌క్రియాశీల సభ్యుడు. భారత్‌తో పాటు విదేశాల్లోని సానుభూతిపరుల నుంచి ఐఎస్‌ఐఎస్‌కు నిధులు సేకరించేవాడు. ఈ నిధులను సిరియా తదితర దేశాలకు క్రిప్టో కరెన్సీ రూపంలో పంపేవాడు. ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో నివసిస్తున్న ఇతన్ని ఈ నెల 6న వలవేసి పన్నుకున్నారు. ఈ ఘటనతో తెలంగాణ నిఘా విభాగం కూడా అప్రమత్త మైంది. తెలంగాణలోనూ గతంలో ఎన్‌ఐఏ అనేక మంది ఐఎస్‌ఐఎస్‌ ‌సానుభూతిపరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజధాని హైదరా బాద్‌ ‌నగరంలోని వివిధ షాపింగ్‌ ‌మాల్స్‌తో పాటు రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలని పన్నిన కుట్ర లను ఎన్‌ఐఏ ‌భగ్నం చేసింది. దీంతో మొహిసిన్‌కు ఇక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న విష యమై రాష్ట్ర పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఎన్‌ఐఏ అధికారులతో సంప్రదిం పులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది జూలై మొదటి వారంలో తెలంగాణలోని నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో ఉగ్రవాద లింకులను పోలీసులు గుర్తిం చారు. పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. యువతకు కరాటే శిక్షణ పేరుతో ఒక సంస్థను ఓ వ్యక్తి నడుపు తున్నాడు. దీనిపై పోలీసులు నిఘా ఉంచగా కరాటే ముసుగులో తీవ్రవాద భావజాలాన్ని అక్కడ నూరి పోస్తున్నట్లు వెల్లడైంది. అంతేకాక ఉగ్రవాద కార్య కలాపాలపై శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం అందింది.

కర్ణాటకలో కూడా ఐఎస్‌ఐఎస్‌ ఉనికిని గుర్తిం చారు. రాష్ట్రంలో ముగ్గురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ ‌పట్టణంలో ఆ సంస్థకు చెందిన కార్యకర్త జుఫ్రీ జవాహర్‌ని ఎన్‌ఐఏ అధికా రులు ఆగస్ట్ ‌మొదటి వారంలో అరెస్టుచేశారు. ఇతను నకిలీ ఐడీలను సృష్టించి సమాచారాన్ని ఐఎస్‌ఐకి చేరవేస్తున్నాడు. అబు హజీర్‌ అల్బద్రి అనే సంస్థ పేరుతో సమాచారాన్ని దక్షిణాది భాషల్లోకి అనువ దించి పంపుతున్నాడు. తుంకూరులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక్కడ గల యునానీ వైద్య కళాశా లలో మూడో సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని అరెస్టు చేశారు. మంగళూరులో దీప్తి మార్లా అలియాస్‌ ‌మర్యం అనే ఒక ఐఎస్‌ఐఎస్‌ ‌కార్యకర్తను అరెస్టు చేశారు. ఈమె అనస్‌ అబ్దుల్‌ ‌రహిమాన్‌ ‌భార్య. ఆమె బావ అయిన ఉల్లాల్‌కు చెందిన ఒమర్‌ అబ్దుల్‌ ‌రెహమాన్‌ ‌సహా ఐఎస్‌ ఐఎస్‌తో సంబంధం ఉన్న నలుగురినీ అరెస్టు చేశారు. మస్తికట్టకు చెందిన కాంగ్రెస్‌ ‌మాజీ ఎమ్మెల్యే బీఎం ఈదినబ్బ బంధువైన నింతుడిని కూడా అరెస్టు చేశారు. అంతకుముందు మరో 11 మందిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కర్ణాటకతో పాటు మహా రాష్ట్ర, బిహార్‌, ‌గుజరాత్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌ల్లోని 13 అనుమానిత ప్రదేశాల్లో ఎన్‌ఐఏ ‌దాడులు చేసింది. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌లోని 153ఏ, 153 బీ, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టంలోని 18, 18బీ, 38, 39, 40 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ‌సెరెస్‌, ‌గుజరాత్‌లోని సూరత్‌, ‌భరూచ్‌, ‌నవవ్రీ, అహమ్మదాబాద్‌, ‌బిహార్‌లోని అరారియా, మహారాష్ట్రలోని నాందేడ్‌, ‌కొల్హాపూర్‌, ‌యూపీలోని దేవబంద్‌ ‌జిల్లాల్లో దాడులు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో అరెస్టయిన సాదిక్‌ ‌బట్సా అనే వ్యక్తిని అరెస్టు చేసిన కేసులో తిరువనంతపురంలో కూడా సోదాలు చేశారు. నిందితులు సాధారణ ప్రజలతో పాటు పోలీసు అధికారులను బెదిరించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. నిందితులు ఖిలాఫత్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా, ఖిలాపత్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా, మేధావి విద్యార్థులు వంటి సంస్థలను ఏర్పాటుచేసి భారతదేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించేందుకు కుట్రలు పన్నారు. నిషేధిత ఐఎస్‌ఐఎస్‌, ‌డానిష్‌, అల్‌ఖైదా తదితర ఉగ్రవాద సంస్థలతో నిందితులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

ఐఎస్‌ఐఎస్‌ ఉ‌గ్రవాదులు దేశంలో విధ్వంసం సృష్టించడానికి యత్నించడంతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులపైనా దాడులు జరుపుతున్నారు. జూలై 26న దక్షిణ కన్నడ జిల్లా బెల్లారే గ్రామంలో బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్‌ ‌నెట్టూరిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. మోటారు సైకిలుపై వచ్చిన దుండగులు పౌల్ట్రీ దుకాణం నుంచి బయటకు వస్తున్న ప్రవీణ్‌పై మూకుమ్మడిగా దాడి చేసి కర్కశంగా నరికి చంపారు. ఈ కేసుకు సంబంధించి మహ్మద్‌ ‌షఫిక్‌, ‌జాకీర్‌ ‌నవనూర్‌, ‌సద్దాం, హారిస్‌ అనే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది. దక్షిణాదిన గల ఏకైక బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దాడుల పేరుతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేసి కమలం పార్టీ పేరుప్రతిష్టలను దెబ్బతీయాలన్నది వారి అసలు లక్ష్యం. అందుకే కర్ణాటకపై వారు దృష్టి సారించారు. పాకిస్తాన్‌ ‌సరిహద్దు రాష్ట్రమైన జమ్ముకశ్మీరులో ఐఎస్‌ఐఎస్‌ ‌కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా కశ్మీర్‌ ‌లోయలోని అనంతనాగ్‌ ‌జిల్లాలో ఒక ఉగ్రవాద సానుభూతిపరుడిని అరెస్టు చేశారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా దేశవ్యా ప్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. విద్యకు దూరమైన, పేద యువకులను ప్రలోభపెట్టి, వారిలో ద్వేషభావాన్ని రెచ్చగొట్టి విధ్వంసానికి పురిగొల్పుతున్నాయి. తద్వారా జాతి నిర్మాణంలో భాగస్వామ పాత్రను పోషించాల్సిన, ఎంతో భవిష్యత్తు గల అమాయక యువత బలి అవుతోంది.

అంతర్జాతీయంగా అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు ఐఎస్‌ ఐఎస్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి. దీంతో దానికి ఊపిరాడటం లేదు. నిఘా, దాడుల కారణంగా కొత్తగా యువకులు దీనిలో చేరేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఐఎస్‌ఎస్‌ ‌క్రమంగా బలహీనపడుతోంది. ఇటీవల ఆఫ్ఘానిస్తాన్‌ ‌రాజధాని కాబూల్‌లో ఉగ్రవాద సంస్థ అధినేత అల్‌ ‌జవాహరీని అమెరికా మట్టుబెట్టింది. దీంతో ఐఎస్‌ఐఎస్‌ ‌శ్రేణుల్లో నిరాశ, నిరాసక్తత ఏర్పడింది. దీనికితోడు నిధుల కొరత వెంటాడుతోంది. ఫలితంగా కొత్త నియామకాలు, నిధుల సేకరణ వంటి అంశాలపై అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. బలహీనమవుతున్న సంస్థను తిరిగి గాడిలో పెట్టి, శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే భారత్‌పై దృష్టి సారించింది. మన నిఘా వ్యవస్థలు అప్రమత్తంగా ఉండటం, వివిధ విభాగాల మధ్య సమన్వయం కారణంగా దాని ఎత్తులు పారడం లేదు.

About Author

By editor

Twitter
Instagram