– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాల పాత్ర అత్యంత కీలకం. ఎంత కీలకమో అంత బాధ్యతాయుతం కూడా. ఈ రెండూ ప్రజాస్వామ్యం అనే బండికి రెండు చక్రాల వంటివి. వీటిల్లో ఏ ఒక్కటి తన పాత్రను సరిగా నిర్వహించక పోయినా ప్రజాస్వామ్యం గాడి తప్పుతుంది. పాలన దెబ్బ తింటుంది. అంతిమంగా ప్రజలకు మేలు జరగదు. అందువల్ల ఈ రెండూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇతర చిన్నాచితక పార్టీలను పక్కనపెడితే కీలక అంశాల్లో ప్రధాన ప్రతిపక్షం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అత్యంత సంయమనంతో అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం అనాలోచితంగా వ్యవహరించినా దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అంతిమంగా ఆ పరిణామాలు ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. గత ఎనిమిదేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‌తీరే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడు అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టి ఇంకా పట్టుమని పది రోజులు కూడా పూర్తికాలేదు. ఎన్నిక, ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలు ఇంకా ప్రజల మది నుంచి చెరిగిపోలేదు. దేశం యావత్తు ఆ సంతోష, సంబరాలతో మునిగి ఉంది. ఆ సంతోషంలో భాగం కావాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ అం‌దుకు విరుద్ధంగా వ్యవహరించి అభాసుపాలైంది. ఆ పార్టీ నాయకుడు అధీర్‌ ‌రంజన్‌ ‌చౌధురీ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. రాష్ట్రపతిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో చోటుచేసుకున్న అభ్యంతరకర పదాల (రాష్ట్రపతిని రాష్ట్రపత్నిగా సంబోధించడం)పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. దేశ ప్రథమ పౌరురాలిని ఉద్దేశించి అనాలోచితంగా, అన్‌ ‌పార్లమెంటరీ భాషలో మాట్లాడటం అధీర్‌ ‌రంజన్‌ ‌స్థాయిని, ఆ పార్టీ తీరునూ చెప్పకనే చెబుతోంది. అసలు రాష్ట్రపతి, రాష్ట్రపత్ని.. అన్న మాటలకు అర్థాలు, ఆ రెండింటికి మధ్య గల వ్యత్యాసాలు ఆయనకు తెలుసా అన్న అనుమానాలు కలగక మానవు. ఇంతచేసి తన పొరపాటును అధీర్‌ ‌సమర్థించుకున్న తీరూ ఆవేదన, ఆందోళన కలిగిస్తున్నాయి. స్వతహాగా బెంగాలీ అయిన తనకు హిందీపై అంతగా పట్టులేదని, అప్రయ త్నంగా, పొరపాటున మాట్లాడానని, అంతకు మించి తనకు వేరే దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.

హిందీ, బెంగాలీకి మధ్య పెద్దగా తేడా లేదు. మాతృభాష బెంగాలీలో ప్రావీణ్యం గల అధీర్‌కు హిందీపై అసలు అవగాహన లేదని చెప్పలేం. అందునా రాష్ట్రపతికి, రాష్ట్రపత్నికి మధ్య గల తేడా తెలియదని అసలు అనుకోలేం. అధీర్‌ ‌రంజన్‌ ఏమీ అమాయకుడు కాదు. నిన్న కాక మొన్న రాజకీయా ల్లోకి వచ్చిన జూనియర్‌ ‌నాయకుడు ఏమీ కాదు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. పశ్చిమ బెంగాల్‌ ‌పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నాయకుడు. 1991లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 1996లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం బెంగాల్లోని ముర్షీదాబాద్‌ ‌జిల్లా బెరహంపుర్‌ ‌నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్‌ ‌నాయకుడు. గతంలో మన్మోహన్‌ ‌మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన నాయకుడు. అన్నింటికీ మించి చట్టసభ అయిన పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షానికి సారథ్యం వహిస్తున్న సీనియర్‌ ‌నేత. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీకి నాయకుడు. అధికారిక హోదా లేనప్పటికీ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహ రించాలి? ఎంత హుందాగా మాట్లాడాలి. ఎంత ఆచితూచి ప్రసంగించాలి. తన ప్రసంగాన్ని యావద్దేశం పరికిస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. తాను మాట్లాడుతున్నది దేశ ప్రథమ పౌరురాలు, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించిన మహిళ గురించి అన్న తెలివిడి ఉండాలి కదా.

ప్రజాస్వామ్యంలో విమర్శ సహజం. ఇందుకు ఎవరూ అతీతం కాదు. కానీ మాట్లాడే అంశం, వాడే భాష పట్ల అవగాహన కలిగి ఉండటం అవసరం. లేకపోతే జరిగేది ఇదే. ఇక్కడ అధీర్‌ ‌రంజన్‌ ‌గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన పేరుకు పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ దేశం ఎదుర్కొనే సమస్యలు, వాటికి గల పరిష్కార మార్గాలపై ఆయనకు సరైన అవగాహన లేదు. అసలు జాతీయ స్థాయి నాయకుడు కానే కాదు. రాష్ట్రస్థాయి, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఒక ప్రాంతీయ నాయకుడు. ఇలా చెప్పడం ఒకింత కఠినంగా ఉన్నప్పటికీ అది చేదునిజం.

 ఎవరైనా తప్పులు చేయడం సహజం. అందరూ మానవ మాత్రులే. ఒక్కోసారి ఒత్తిడిలో, హడావిడిలో మాట దొర్లడం మాములే. ఇందుకు రాజకీయ నాయకులు అతీతులు ఏమీ కారు. అయితే జరిగిన పొరపాటును గుర్తించి తనంతట తాను పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం, క్షమాపణ కోరడం హుందాతనం, గౌరవం అనిపించుకుంటుంది. అలా కాకుండా మొండిగా మాట్లాడితే తనతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ పరువు బజారున పడుతుంది. అధీర్‌ ‌రంజన్‌ ‌వ్యాఖ్యలపై ఇంత దుమారం చెలరేగినా పార్టీ ఏమన్నా దిద్దుబాటు చర్యలు చేపట్టిందా అంటే అదీ లేదు. నోరు జారిన నాయకుడిని మందలించిందా అంటే ఆ ఊసే లేదు. నాయకుడి తరఫున పార్టీ క్షమాపణ కోరిందా అన్న ప్రశ్నకు సమాధానం లభించదు. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వ్యవహార శైలి సైతం హుందాగా లేదు. అధీర్‌ ‌తరఫున, పార్టీ తరఫున సోనియా క్షమాపణ చెప్పి ఉంటే టీ కప్పులో తుపానులా సమస్య సమసిపోయేది. ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. కానీ పార్టీ అధినేత్రిలో ఈపాటి వివేకం కొరవడింది. తాను ఒక మహిళ అయి ఉండి ఒక మహిళా రాష్ట్రపతి పట్ల, అత్యున్నత పదవిలో ఉన్న మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించిన తమ పార్టీ నాయకుడిపై తగిన చర్యలు తీసుకున్నా, క్షమాపణ కోరినా వ్యక్తిగతంగా సోనియా ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట పెరిగేది.

 అసలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించిన తీరు ఎంతమాత్రం హుందాగా లేదన్న విమర్శలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ఎలక్ట్రోరల్‌ ‌కాలేజీ గణాంకాల ప్రకారం అధికార ఎన్డీఏ కూటమి ఎవరిని బరిలోకి దించినా గెలుపు ఖాయం. విపక్షాలన్నీ ఒక్కటైనా ఆ అభ్యర్థి విజయాన్ని అడ్డుకోలేవు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం. అదే సమయంలో ఒక మహిళను, అదీ గిరిజన మహిళ అత్యున్నత పీఠానికి పోటీ పడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఆమెను సమ ర్థించడం హుందాతనంగా ఉంటుంది. ఏ రకంగా చూసినా ముర్ము అభ్యర్థిత్వాన్ని వంక పెట్టలేం. కేవలం మహిళ, గిరిజన మహిళ అన్న కోణంలో కాకుండా ఆమె వివాద రహితురాలు. రాజకీయాల్లో కింది స్థాయి నుంచి పనిచేసి పైకి వచ్చిన నాయకురాలు. విద్యా వంతురాలు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఇంతకు మించిన అర్హతలు అవసరం లేదు. అయినా విపక్షాలు ఈ దిశగా ఆలోచించక లేకపోవడం విచారకరం. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడైన అధీర్‌ ‌రంజన్‌ ‌పాత్ర గురించి కూడా కొంత చెప్పుకోవాలి. ఆయనకు చట్టం కేబినెట్‌ ‌హోదా కల్పించింది. మనం బ్రిటిష్‌ ‌తరహా పార్లమెంటరీ వ్యవస్థను ఫుణికి పుచ్చుకున్నాం. బ్రిటన్‌లో ప్రతిపక్షం షాడో కేబినెట్‌ ‌పాత్రను పోషిస్తుంది. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలపై లోతుగా అధ్యయనం చేస్తుంది. ఆయా అంశాల్లో నిపుణులైన నాయకులు శాఖల వారీగా ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తారు. వాటిలోని లోపాలను పార్లమెంటు లోపల, వెలుపలా ఎండగడతారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మన ప్రతిపక్షాల్లో ఆ స్ఫూర్తి లోపించిందన్న వాదన ఉంది. ముఖ్యంగా 2014లో నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్‌లో ఈ స్ఫూర్తి కొరవడటం ఆవేదన కలిగిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆరోపణలు సంధించడం అనే ఏకైక సూత్రంతోనే విపక్షాలు పని చేస్తున్నాయడంలో అతిశయోక్తి లేదు. అంతిమంగా ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తాయి. దానికి చేటు కలిగిస్తాయి. వందేళ్లకు పైగా చరిత్ర గల, దేశంలో అత్యంత పురాతన పార్టీగా, సుదీర్ఘ కాలం పాలన సాగించిన పార్టీగా కాంగ్రెస్‌ ఈ ‌విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే దానికీ, దేశానికీ అంత మంచిది. అయితే ఈ విషయాన్ని హస్తం పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న?

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE