ఆనందమఠం వచ్చే వారం నుంచే…


భారతీయ వాఙ్మయంలో మహా కావ్యాలు ఉన్నాయి. దేని ఘనత దానిదే. అవి ఎన్ని ఉన్నా ఒక్క గ్రంథానికి మాత్రం భారత జాతి రుణపడి ఉంటుంది. అదొక నవల. అది కూడా చిన్న నవల. పేరు ‘ఆనందమఠం’. అందులో ఒక సన్నివేశంలో వినిపించే గీతమే ‘వందేమాతరమ్‌… ‌సుజలాం సుఫలాం… మలయజ శీతలాం.. సస్యశ్యామలాం .. మాతరమ్‌… ఆ ‌నవలా కర్తే బంకించంద్ర చటోపాధ్యాయ. అదే భారత స్వాతంత్య్ర సమరానికి కవాతు గీతమైంది. స్వతంత్ర భారతావనికి జాతీయ గీతమైంది. కొన్ని సంస్కృత పదబంధాలను కలిపి వంగ భాషలో రాసిన ఈ గీతం కొన్ని కోట్ల మంది భారతీయులకి ప్రేరణ ఇచ్చింది. నేటికీ ఇస్తున్నది. జాతీయోద్యమంలోని అన్ని పంథాల వారికీ ఆదరణీయమైంది. గాంధీజీ ఎంత ప్రేమించారో, అరవిందులు కూడా అంతే ఆరాధించారు. అరవిందులు ఏమన్నారు? ‘బంకించంద్ర ఒక భాషను, ఒక సాహిత్యాన్ని, ఒక జాతిని సృష్టించారు?’ నిజంగా అద్భుతం. ఆ నవల, ఆ గీతాల విషయంలో ఇది పూర్తి నిజం.

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల సంద ర్భంగా సమర యోధులను స్మరించుకుంటున్నాం. చరిత్ర పుటలలో సరైన స్థానం దక్కకుండా ఉండి పోయిన వారికి కైమోడ్పులు ఘటించాం. వీటన్నిటితో పాటే ఈ చారిత్రక సందర్భంలో నిర్వహించవలసిన కర్తవ్యం వందేమాతరమ్‌ ‌గీతంతో భారతజాతికి ఉన్న అమృతోపమానమైన బంధం గురించి కూడా సమీక్షించుకోవాలి. సాంస్కృతిక ఐక్యత బలంగానే ఉన్నా, రాజకీయ, సామాజిక ఐక్యత లేకపోవడంతో ఈ జాతి బానిసత్వంలోకి పోయింది. ఆత్మహత్యా సదృశమైన ఆ పరిణామంతో జాతికీ, దేశానికీ జరిగిన నష్టం ఎప్పటికీ, ఎవరికీ అంచనాకు అందదు. గతంలోని మహోన్నత మేధస్సు, తపస్సు ఈ దేశానికి ఇచ్చిన సంపదలన్నీ లుప్తమైపోయాయి. చేజారి పోయాయి అనడం మరింత వాస్తవం. అలాంటి దేశంలో స్వాతంత్య్రోద్యమం జరిగింది. ఆ ఉద్యమా నికి గొంతుకైంది వందేమాతర గీతం. ఆ ఉద్యమమే దేశానికి రాజకీయ ఐక్యతను సంతరించి పెట్టింది. కాబట్టి దేశంలో సాంస్కృతిక ఏకత్వానికి పరిపూర్ణతను కల్పిస్తూ రాజకీయ ఏకత్వాన్ని తెచ్చినది పరోక్షంగా వందేమాతర గేయమే. ఆ పరమ పవిత్రమైన గేయానికి వ్యాసపీఠం వంటిది ‘ఆనందమఠం’. కొందరు కొన్ని మాటలలోనే నవల గొప్పతనం చెప్పారు. అందులో ఎంచదగిన వ్యాఖ్య- ఆ నవల భారతీయ జాతీయవాదాన్ని అర్థం చేసుకోవ డానికి దోహదపడే పెద్ద బాలశిక్ష.

భారతీయులకు జాతి అనే సమున్నత సామాజిక దృష్టిని, అందుకు సంబంధించిన కల్పనను ప్రసాదిం చిన ఈ నవల ఇతివృత్తం, అందులో బంకింబాబు నిక్షిప్తం చేసిన తాత్త్వికతలలో ఎన్నో లోతులు ఉన్నాయని విమర్శకులు చెబుతారు. ఆధునిక యుగ జాతీయ దృక్పథం గురించి భారతీయులకి ఆ నవల ఓనమాలు నేర్పింది. ఆ అంశమే ఈ నవలకు ఆత్మ. ముర్షిదాబాద్‌ ‌నవాబు సేనల మీద ఒక హిందూ సన్యాసి తిరుగుబాటు చేయడం ఇందులో కనిపిస్తుంది. టర్కీ-అఫ్ఘాన్‌ ‌మూలాలు ఉన్న పాలకులను మట్టి కరిపించాలన్న సందేశం వినిపించారు. దీనితో పాటు ఈస్టిండియా కంపెనీ పాలన అంతం చేయడానికి హిందువులు, ముస్లిం పకీర్లు కలసి పోరాడడం కూడా ఇందులో కనిపిస్తుంది. ఒక సందర్బంలో రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌తో మాట్లాడుతూ ముల్క్‌రాజ్‌ ఆనంద్‌, ‘ఈ ‌నవల స్వతంత్ర భారతం గురించి బంకించంద్ర దృష్టిని తెలియచేస్తుంద’ని అన్నారు. అంటే 18వ శతాబ్దంలోనే స్వతంత్ర భారతం గురించి స్వప్నించిన మహనీయుడు బంకించంద్ర. భారతీయుల రాజకీయ బానిసత్వం గురించి, సామాజిక దోపిడీ గురించి, బ్రిటిష్‌ ‌పాలనలోని అకృత్యాల గురించి చాటి చెప్పిన ఆనందమఠం దేశవాసులను మేల్కొల్పిందని కూడా విమర్శకులు చెబుతారు. మొత్తంగా చూస్తే జాతీయవాదాన్ని చర్చించిన తొలి భారతీయ నవలగా కూడా ఆనందమఠం గౌరవం పొందింది.

నవల అనే ఒక పాశ్యాత్య పక్రియను జాతీయ భావాలను విస్తరింప చేయడానికి వినియోగించు కోవడం బంకించంద్ర దూరదృష్టికి నిదర్శనంగానే కనిపిస్తుంది. నిజానికి ఆనందమఠంలోనే కాదు, బంకించంద్ర ఇతర రచనలలోనూ భారతీయుల మధ్య సహోదరత్వాన్ని ఆకాంక్షించడం కనిపిస్తుందని విమర్శకులు అంటారు.

ఈ నవల స్వాతంత్య్ర సమరయోధులకు ఆ మహా రచయిత ఇచ్చిన వెలకట్టలేని బహుమానంగా కూడా చెబుతారు. దేశాన్ని తల్లిగా గౌరవించే సంస్కారాన్ని అందించిన నవల ఇది. ఆ భావన పరమార్థం ఏమిటి? బెంగాలీలు కావచ్చు, లేదా మొత్తం హిందువులు కావచ్చు. యావన్మంది భారతీయులు మన పురాతన వాఙ్మయంలో కనిపించే ధర్మాగ్రహం కలిగిన, శౌర్యవంతులైన సాధువుల వలె అవతరించాలని బంకింబాబు ఆశయమనిపిస్తుంది. వందేమాతర గేయంలోని భావం అదే. విలువలను మన పూర్వికుల నుంచి అందిపుచ్చుకోవాలని ఆయన నిశ్చితాభిప్రాయం. ఒక పాలక వ్యవస్థ తరఫున అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ, గొప్పగా శిక్షణ పొందిన వారిని కూడా, ఎలాంటి శిక్షణ లేని సాధారణ ప్రజలు ఓడించవచ్చు. ఎలాగంటే, నా జన్మభూమి కోసం సర్వం త్యాగం చేయడానికి సిద్ధం అనుకున్నవాళ్ల వల్ల ఇది సాధ్యమే అన్నది ఆ తాత్త్వికత. అంటే మాతృభూమి ఎడల అవ్యాజమైన ప్రేమతో ఉన్నవారు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం ఎక్కుపెట్టే బాయ్‌నెట్లనీ, ట్యాంకులనీ కూడా ఛేదించగలరు. నవల ఇతివృత్తం మొత్తం ఇదే చింతనతో సర్వం త్యాగం చేసిన ఒక సన్యాసి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఎదురుగాలిలో, ప్రతికూలతల మధ్య ప్రజలు ఎలా వ్యవహరించాలో కర్తవ్య బోధ చేయగల రచన ఇది. వలసపాలన నేపథ్యంలో హిందుత్వలో అనివార్యంగా రావలసిన మార్పును రచయిత సూచించడం ఈ నవలలో కీలకమైన అంశం. హిందూ జాతీయ వాదాన్ని ఆయన ప్రతిపాదించారని విమర్శకులు చెబుతున్నారు. నిజానికి దేశాన్ని లేదా ఈ నేలలో మాతృమూర్తిని దర్శించడం భారతీయులకు పూర్వం నుంచి ఉన్నదే. ‘జననీ జన్మభూమిశ్చ’ అన్న భావన అదే కదా! దాని అవసరం తన కాలం నాటి సమాజానికి ఎంతగా ఉన్నదో బంకింబాబు గుర్తు చేశారని అనిపిస్తుంది.

‘ఆనందమఠం’ ఆధునిక భారతీయ సాహిత్యంలో మహోన్నతమైన నవలగా పరిగణిస్తారు. బెంగాలీ భాషలో లిఖించిన ఈ నవల మొదటిసారి 1882లో అచ్చయింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్‌ ‌స్థాపనకు మూడేళ్ల ముందే. ఆ తరువాత ఎన్నిసార్లు పునర్ముద్రణకు నోచుకున్నదో, ఎన్ని భాషలలోకి అనూదితమైందో లెక్కకు అందదు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. నిజానికి బంకించంద్ర వందేమాతరం గేయాన్ని 1876లోనే రాసుకున్నారు. దానికే ఆనందమఠంలో చోటు కల్పించారు. బంకించంద్రను ఎప్పటికీ భారతీయ మహోన్నత రచయితగా, కవిగా సమ్మానించుకుంటూనే ఉంటాం. ఆయనొక సాహిత్య సమ్రాట్‌. ఈ ‌నవలతో బంకింబాబు ఆధునిక నవలా పక్రియకు పితామహుడు అన్న ఖ్యాతిని కూడా తెచ్చుకున్నారు. వలసపాలన తరువాతి యుగాలకు చెందిన విద్యార్థులు ఆ కాలంలో ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఉపకరించే నవల కూడా ఇదేనని కొందరు విమర్శకులు చెబుతారు. జాతీయ భావాలు సాధారణ ప్రజలకి కూడా చేరడానికి సరళమైన భాషను ఉపయోగించాలన్న బంకించంద్ర విప్లవాత్మక దృష్టి ఎప్పటికీ ఆచరణీయమే. తన రచనల ద్వారా విదేశీయుల పాలన నుంచి విముక్తం కావాలన్న చింతన ప్రజలలో రావాలని ఆయన ఆశించడం కూడా అద్భుతమే అనిపిస్తుంది. మనం ఆంగ్ల భాషా బంధం నుంచి విముక్తం కావాలనీ, సాధారణ ప్రజలకు మన రచనలు చేరాలనీ 1872లోనే తన మిత్రుడు శంభుచంద్ర ముఖర్జీకి ఆయన రాసిన లేఖలో చెప్పిన సంగతి చదివితే వారి పట్ల మరింత గౌరవం పెరుగుతుంది.

ఆనందమఠం ప్రధానంగా ఒక సృజనాత్మక రచనే కావచ్చు. అయినా అది కేవలం భారతీయ సాహిత్య వినీలాకాశంలో ఓ అద్భుత శకలం మాత్రమే కాదు. అది భారతదేశంలో వెలువడిన తొలి రాజకీయ నవల. కేవలం సాహిత్య విభాగానికే ఆ రచనను పరిమితం చేయలేం. రాజకీయ చైతన్యం వెల్లువెత్తుతున్న భారతీయులకు జాతీయతా భావాలను బోధించిన నవల ఆనందమఠం. ఇందులో తీసుకున్న ఇతివృత్తంలో అంకురిస్తున్న జాతీయవాద చిత్రణ, నిష్కామ దేశభక్తి ఇమిడి ఉన్నాయి. గురుదేవ్‌ ‌రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ఒక సందర్భంలో ఈ నవలను ‘బంకిం మహాభారతం’ అని కీర్తిస్తూ సమున్నత స్థానం కల్పించారు. మహాభారతంలోని పాత్రల వలెనే ఆనందమఠం నవలలో తారసిల్లే సన్యాసుల పాత్రలు కూడా మహోన్నతమైనవని అన్నారు ఆ సాహిత్య నోబెల్‌ ‌గ్రహీత. తరువాతి కాలాలలో రవీంద్ర కవీంద్రుడే ఈ గేయానికి బాణీ కట్టడం చరిత్రాత్మకమే.

బెంగాల్‌ ‌ప్రాంతంలో జాన్‌ ‌కంపెనీ లేదా ఈస్టిండియా కంపెనీ జలగలు కూడా సిగ్గుపడే విధంగా పాలన పేరుతో భారతీయుల రక్తం తాగిన తీరును వర్ణించేదే ఈ నవల. ఆ దుష్టపాలనకు వ్యతిరేకంగా అక్కడ ఆరంభమైన పోరాటాలను ఈ నవల అక్షరబద్ధం చేసింది. 1770 నాటి దుర్భిక్షం నేపథ్యంలో అక్కడి మత, పాలన, సామాజిక సంక్షోభాలకు అక్షరరూపం ఇచ్చింది. సంస్కృతి పరంగా హిందువులకూ, ముస్లింలకూ ఉన్న వైరుధ్యాలు, పాలకులకూ, పాలితులకూ ఉన్న ఘర్షణలు బంకింబాబు ఆవిష్కరించారు. విదేశీయు లకూ, దేశవాసులకూ మధ్య వచ్చిన అగాధం గురించి ఈ నవల చర్చిస్తుంది. అంతేనా! ఆర్యులు, ఆర్యేతరులు; పట్టణవాసులు, గ్రామీణులూ వంటి కొన్ని అపోహలు, అంతరాల గురించి; బ్రహ్మచర్యం, లైంగిక జీవితాల గురించి అది ప్రస్తావిస్తుంది. అయితే ఈ అంశాలూ, పాత్రలూ అన్నీ స్వాతంత్య్రో ద్యమం అనే ఆలోచన పరిధిలోనే ఒదిగి ఉంటాయి.

చరిత్రకీ, వర్తమానానికీ నడుమ ఉన్న బంధం గురించి బంకించంద్ర అభిప్రాయాలను గమనించిన తరువాత ఆయన గొప్ప రచయిత కావడంలో వింతేమీ లేదనిపిస్తుంది. కాబట్టే ఆనందమఠం వంటి రచన ఆయన చేయగలిగారు. వర్తమానానికి గతం ద్వారా సంక్రమించే మనోబలాన్ని గుర్తించినవారు బంకించంద్ర. బహుశా ఇంతవరకు ఏ రచయిత, భారతీయ మేధావి గుర్తించని ఒక అంశాన్ని ఆ మహానుభావుడు గుర్తించారు. ఆధునిక భారతీయులు ఇప్పటికీ ఆ అతి పెద్ద లోపంతో బాధపడుతున్నారు. హిందువులలో జాతీయ భావాలు లుప్తమైపోతుండ డానికి ప్రధాన కారణం-హిందువులు తమ చరిత్రను రాసుకోవడం గురించి పట్టింపు లేని వారు కావడమే అన్నారు బంకింబాబు. ఎంత గొప్ప వాస్తవమిది. ఈ భావాన్నే వేరే మాటతో ఇటీవలి నోబెల్‌ ‌గ్రహీత వీఎస్‌ ‌నయీపాల్‌ ‌కూడా చెప్పలేదా! భారతీయులకు చారిత్రక స్పృహ, దృష్టి లేవని నయీపాల్‌ ‌నిర్మొహ మాటంగానే చెప్పారు. బంకింబాబు దృష్టిలో గతమంటే ఎప్పుడో కన్నుమూసిన వారి కథ కాదు. అది వర్తమానానికి రూపురేఖలను ఇచ్చే, వర్తమానాన్ని ఆవిష్కరించే, శిల్పించే వ్యవస్థ. బంకించంద్ర రచనలన్నీ గతంలోని వీరోచిత వ్యక్తిత్వాలను, జీవితాలను అన్వేషించి తీసుకువచ్చి, వర్తమాన తరం చేత భారతీయ అస్తిత్వాన్ని గుర్తించేటట్టు చేస్తాయని అంటారు విమర్శకులు. ఒక దేశం విదేశీ పాలన నుంచి విముక్తం కావాలని ఆశించినప్పుడు మొదట జరగవలసిన పరిణామం తమ అస్తిత్వాన్ని తాము వ్యక్తీకరించడమే. స్త్రీ పాత్రలను కూడా ఆయన ఇదే పంథాలో చిత్రించారు. రాజ్‌మోహన్‌ ‌భార్య, దుర్గేశనందిని, మృణాళిని, దేవి చౌధురాణి నవలల్లో కథానాయికలే కీలకం. వీరంతా జీవితమంతా తమ అస్తిత్వాన్ని అన్వేషించడం కనిపిస్తుంది.

ఆధునిక భారతీయ జీవనాన్ని నిర్వచించిన, స్వాతంత్య్ర కాంక్షకు భాష్యం చెప్పిన నవలను ప్రతితరం చదవాలి. ప్రతి భారతీయుడు పఠించాలి. ఒకసారి చదివి ఉంటే, రెండోసారి చదవాలి. మన కుటుంబంతో చదివించాలి. అందుకే ‘జాగృతి’ ఆ నవల తెలుగు అనువాదాన్ని అందించబోతున్నదని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం.

By editor

Twitter
Instagram