– డా।। గోపరాజు నారాయణరావు

కోడిజాము వేళ….నెగళ్లు శాంతిస్తున్నాయి. పొయ్యిల్లో చిరుజ్వాలలు పైకొస్తున్నాయి. ఎవరి చేతిలో పడతాయి డబ్బులు? ఎవరి చేతులు ఖాళీగా ఉండిపోతాయి? వాళ్లందరి ముఖంలోను అదే ఉత్కంఠ.

కొండమ్మకే కాదు, అందరికీ చింతపల్లి రోడ్డు అనుభవం గుర్తుకు వచ్చినట్టుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టం లేనట్టు, మాటలు లేనట్టు కూర్చున్నారు. ఈసారి గప్పీ దొర బంగ్లాకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి రమ్మన్నారు కూలీలని. అరుగు మీద వేసిన కుర్చీలో కూర్చుని ఉన్నాడు బాస్టియన్‌. ఆ ‌బంగ్లా మెట్లలో ఓ మెట్టు మీద కూర్చుని మస్తర్లు పరిశీలిస్తున్నాడు పిళ్లై•. అతడు కూర్చున్న మెట్టుకు ఇంకో రెండు మెట్ల కింద కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు కిష్టయ్య. వంట సామగ్రి, పనికి ఇచ్చిన బియ్యంలో వండుకోగా మిగిలిన బియ్యం మూటలతో ఆ ప్రాంతం నిండిపోయి ఉంది.

మళ్లీ అదే తంతు. మస్తరులో నాలుగు పేజీలు తిప్పడం, పది నిమిషాలకి ఒకసారి బాస్టియన్‌ ‌దగ్గరకెళ్లి చెవిలో ఏదో చెప్పడం. అలా అరగంట గడిచింది. ఇప్పటికీ పిలవడం మొదలు పెట్టలేదు సంతానం పిళ్లై. మూగయ్య నిస్సహాయంగా చూస్తు న్నాడు పిళ్లై వైపు. నిన్న రాత్రి కూడా తన గొంగడిలో చోటిచ్చి చలి నుంచి కాపాడిన కిముడు కంటం దొర రెండడుగుల అవతలే కూర్చుని ఉన్నా, ఎరగనట్టే ఉన్నాడు మూగయ్య. బాస్టియన్‌ ‌కొట్టినప్పుడు కింద పడిపోతే లేపి, చొంగతో పాటు నోట్లోంచి కారుతున్న రక్తాన్ని ఒక తోబుట్టువు తుడిచినంత ప్రేమగా కొంగుతో తుడిచిన కొండమ్మ కేసి సన్యాసమ్మ చూస్తోందో లేదో మాత్రం తెలియడం లేదు. ముందుకు పడిపోవడంతో నుదురు మీద, పెదవుల మీద, గెడ్డం మీద తగిలిన దెబ్బలు, వాటి వాపు కనిపించకుండా చీర చెంగుతో మూసుకుని కూర్చుని ఉంది. గంగపూజారి సోమినాయుడు, కిముడు కంటం దొర ఒకే ఊరివారు. బాల్యస్నేహితులు. అయినా మాటల్లేనట్టే చెరో దిక్కున కూర్చున్నారు. కారణం ఒక్కటే-డబ్బులు పడినవాళ్లకి పడనివాళ్లు శత్రువులు.

అంతా దేవతలకి మొక్కుతున్నవాళ్లే. కాపాడమని మాత్రం కాదు. అదిగో, కొద్దిసేపట్లో ఆ లోయ కంటే పెద్దగా కనిపించే నిరాశ నుంచి కాపాడమని. సాధ్య మైనంత తక్కువగా నిరాశ ఎదురయ్యేటట్టు చేయమని కోరుకుంటున్నారు. కొందరి కళ్లు తడుస్తున్నాయి. కొందరి ముఖాలు మాడిపోతున్నాయి. కొందరి గొంతులు బాధతో మూసుకుపోతున్నాయి. నిస్సా హాయత… అదే నిస్సాహాయత…. తనకు ఎదురుగా నేల మీద కూర్చున్న కూలీ జనం కేసి ఒకసారి చూశాడు పిళ్లై. పక్కనే ఉన్న రూపాయల సంచి కట్టు విప్పుతూ, పిలవవలసిన తొలిపేరు కోసం మస్తర్‌లోకి చూస్తున్నాడతడు.

*****

కొత్త రోడ్డు. అడుగులు మాత్రం నెత్తుటి చుక్కల మీద, కన్నీటి చారికల మీద పడుతున్నాయనిపిస్తోంది. మంచు తేలి నెమ్మదిగా పడుతున్నాయి సూర్య కిరణాలు. పదిరోజుల అలుపు, వేకువనే మంచులో బయలుదేరడం… తలంతా నాదుగా అనిపిస్తోంది డాక్టర్‌ ‌మూర్తికి. ఎత్తు నుంచి పల్లానికి దిగుతున్నారు, ఆ ముగ్గురు. ముందు తల మీద సామానుతో ఇద్దరు సహాయకులు. వెనుక కొన్ని అడుగుల దూరంలో డాక్టర్‌ ‌మూర్తి, చేతిలో తన బ్యాగ్‌తో. ఇక్కడ తపస్సు చేసిన మహారుషులే మాకు ఆదర్శం అన్నట్టు వర్ణించడానికి వీలులేనంత నిశ్చలంగా నిలబడి ఉంది మహావృక్షావళి. రెండో వైపు లోయ. లోయ మీద మేలి ముసుగులా ఉన్న మంచు తెర పలచబడు తోంది, లేత ఎండకి. మళ్లీ గుర్తుకొచ్చింది డాక్టర్‌ ‌మూర్తికి, ఇవాళ కూలీలంతా వాళ్ల వాళ్ల ఊళ్లకి వెళ్లిపోతారు. వాళ్లకి వైద్య పరీక్షలు చేయాలనే ఉంది డాక్టర్‌ ‌మూర్తికి. వాళ్ల వాళ్ల ఊళ్లకి వెళ్లయినా చూడాలని ఉంది.

కానీ ఎంత క్రూరంగా ఉన్నాడు బాస్టియన్‌! ‌మందంగా పడుతున్నాయి అడుగులు. ఒక సంధి గ్ధావస్థలో నడుస్తున్నారాయన. నిజమే, ఆ ఘటనలు మరచిపోవడం బహుశా జీవిత పర్యంతం సాధ్యం కాదు. ఒక ప్రభుత్వాధికారి ఆఫీసు పనికి ఎగనామం పెట్టి బినామీ పేరుతో కాంట్రాక్టు పనులు చేసు కోవడం. అసలు చట్టమే లేనట్టు ఆరు అణాల కూలి అని చెప్పి రప్పించి, సగటున రెండు అణాలు కూడా కూలీలకి చెల్లించకపోవడం. రోడ్డు పనంటే హడలి పోయిన మన్యానికి తాళం పడడం. నాగలి లాగు తున్న ఎద్దులనో, గానుగకి కట్టిన ఎద్దునో, స్వారీ చేస్తున్న గుర్రాలనో కొట్టి, అదిలించి పనిచేయించి  నట్టు సాటి మనుషులని అలా కొట్టి హీనంగా పని చేయించడం… ఇదంతా మనుషులన్నవాళ్లు చేయరు. విన్నా, కన్నా మనసున్నవాళ్లు మరచిపోలేరు. వైద్య పరీక్షల కోసం ఈ దఫా తనకు ఇచ్చిన కాల పరిమితి ముగిసింది. నర్సీపట్నంలో రిపోర్ట్ ‌చేయవలసింది కూడా రేపే. మన్యాన్ని వదలక తప్పడం లేదు.

ఆయన మెదడును కలచి వేస్తున్న ప్రశ్న ఒక్కటే – ఈ దశ రోడ్డు పని పూర్తయ్యాక, మంచం పట్టి చావు కోసం ఎదరు చూస్తూ బతికే అడవి బిడ్డలు ఎందరు? ఇంకెన్ని ఇళ్లకి తాళాలు పడతాయి? ఎందరు దిక్కు లేని పక్షుల్లా తిరుగుతారు? తాజంగి దాటి రెండు కిలోమీటర్లు వచ్చారు. రోడ్డు మీద తలొంచుకుని నెమ్మదిగా నడుస్తున్నారు డాక్టర్‌ ‌మూర్తి. అది కంకర ఎరుపంటే నమ్మాలని అనిపించడం లేదు. కొండవాళ్ల నెత్తుటి చుక్కలతో వచ్చిన ఎరుపేనే  మోననిపిస్తోంది. మంచు వల్ల గొంతెండిపోతున్నట్టే ఉంది. ఆ ముగ్గురినీ చూసి పక్కకి తప్పుకుంటున్నారు వనవాసులు. డౌనూరు వెళ్లిపోతే ఏదో ఒక వాహనం దొరుకుతుంది, నర్సీపట్నానికి. ఆకాశం నుంచి దిగి ఆకుపచ్చటి చెట్ల మీద పరుచుకుని, ఆకుల మీద శాఖల మీద కొద్దిసేపు నిలిచి తరువాత బొట్లు బొట్లుగా పడుతున్న ఆ బుగ్గిమంచుతో ఆ ఎర్రకంకర రోడ్డు ఉపరితలం తేమగా ఉంది. వారం క్రితమే రోలర్‌ ‌చదును చేసిన రోడ్డు. నడుస్తున్నవాడల్లా, చటుక్కున ఆగి వెనక్కి తిరిగి చూశారు డాక్టర్‌ ‌మూర్తి. దీర్ఘమైన రోడ్డు…. చిన్న చిన్న ఒంపులతో. మంచు బిందువులని పీల్చుకున్న ఆ ఎర్రకంకర రోడ్డు పచ్చటి మన్యభూమి మీద పెద్దగాయంలా కనిపిస్తోంది.

*****

ఉపసంహారం

కొన్ని నెలల తరువాత… మన్యవాసుల రక్తపు చుక్కలతో తడిసిన ఆ లంబసింగి రోడ్డు మీదనే నడిచి వెళ్లింది ధర్మాగ్రహం. అల్లూరి శ్రీరామరాజు నాయక త్వంలో మూడు వందల మంది సాయుధ వన వాసులు చింతపల్లి పోలీసు స్టేషన్‌ ‌మీద దాడి చేసి ఆయుధాలు తీసుకుపోయారు. చింతపల్లి పోలీసు స్టేషన్‌నే మొదటి దాడి కోసం ఎంచుకొని, అందుకు గిరిజనుల రక్తమాంసాలు పిండి నిర్మించిన లంబసింగి రోడ్డు మీద తలెత్తుకు నడిచి శ్రీరామరాజు నాయకత్వంలో ఏలికలకు తిరుగులేని సమాధానమే చెప్పారు వనవాసులు. ఏ రోడ్డు నిర్మాణం మన్య వాసులను తరతరాల పాటు క్షోభ పడేటట్టు చేసిందో, అదే రోడ్డు మీద వెళ్లి రవి అస్తమించని సామ్రాజ్యానికి ప్రతీకగా ఉన్న పోలీస్‌ ‌స్టేషన్‌ను నిలువునా దహనం చేసింది కొండదళం. తెల్లజాతికి ప్రతినిధులుగా ఉన్న పోలీసు మూకల పొగరుని నిట్టనిలువునా పాతేసింది. ఆ తరువాత చరిత్ర తెలిసిందే. చింతపల్లి తరువాత కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ల మీద కూడా శ్రీరామరాజు దాడులు చేశాడు. మొత్తం 62 పర్యాయాలు కొండదళం, బ్రిటిష్‌ ‌సేనలు తలప డ్డాయి. అది 23 మాసాల సుదీర్ఘ యుద్ధం. భారతీయ గిరిజన పోరాటాల చరిత్రలోనే సమున్నతమైన గాథ. ఒంజేరి ఘాట్‌ ‌దగ్గర ట్రేమన్‌ ‌హేర్‌ ‌నాయకత్వంలో వచ్చిన పోలీసు బలగం కొండదళం చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ట్రీమన్‌ ‌హేర్‌ ‌చెవికి పెద్ద గాయమైంది. అప్పుడే దారి చూపించడానికి ఆ బలగాలతో వెళ్లాడు బాస్టియన్‌.

‌రామరాజు వెంటే ఉన్న ఎండు పడాలు, గాం గంతన్న, గాం మల్లు వంటి వాళ్లకి బాస్టియన్‌ను చూడగానే రక్తం ఉడికిపోయింది. భారతీయుల మీద ఆయుధం ఎత్తరాదన్న శ్రీరామరాజు నియమం కూడా కొద్ది లిప్తలు మరచిపోయారు. వారిలో ఎవరో విసిరిన అలుగు (మొరటుగా, బలంగా ఉండే చిన్న కత్తి) దాడి నుంచి బాస్టియన్‌ అక్షరాలా వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. తరువాత గూడెం నుంచి 1922 డిసెంబర్‌లో అక్షరాలా పారిపోయాడు. ఆ పలా యనం పేరే పొట్టంగి బదలీ. ఆపై కార్మిక శాఖకు నెల్లూరు బదలీ చేశారు. రోడ్డు నిర్మాణం, అందులో అల్ఫ్ ‌బాస్టియన్‌ అరాచకాలు శ్రీరామరాజు ఉద్య మానికి ప్రధాన కారణమని ఏజే హెపెల్‌ అనే ఆంగ్ల అధికారి తన నివేదికలో నిగ్గు తేల్చాడు.

కానీ విశాఖ కలెక్టర్‌ (ఏజెన్సీ వ్యవహారాలకు సంబంధించి గవర్నర్‌ ఏజెంట్‌) ‌సి. హ్యాండర్సన్‌ ‌బాస్టియన్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు. మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శికి పంపించిన నివేదికలో (జూలై 28, 1923), ‘ఈ ఫిర్యాదుల (బాస్టియన్‌ ‌మీద వచ్చినవి) తీరు నాకు సంతృప్తికరంగా అనిపించ లేదు’ అని రాశాడు. సంతలో అన్ని వందలమంది ఉంటే బాస్టియన్‌ ‌చేసిన పనికి ఒక్కరి సాక్ష్యమే ఎలా తీసుకున్నారో అర్థం కాదు అంటాడు హ్యాండర్సన్‌. అయినా బాస్టియన్‌ ‌మీద ఫిర్యాదులలో అసలు నిజం లేదని మాత్రం చెప్పను అన్నాడు. అరాచకాలు జరిగినా అవి బాస్టియన్‌కు ఆపాదించలేమని, ‘మేస్త్రీ కిష్టయ్య’ అందుకు బాధ్యుడని కూడా నేరం అతడి మీదకు నెట్టడానికి హాండర్సన్‌ ‌శతధా యత్నించాడు. ఒక ప్రభుత్వ అధికారి బినామీ పేరుతో రోడ్డు కాంట్రాక్టు పనులు తీసుకున్న సంగతిని పక్కన పెట్టిన కలెక్టర్‌, ‌బాస్టియన్‌ను తప్పు పట్టకపోగా, మరిన్ని సాక్ష్యాలు ఉంటే తప్ప బాస్టియన్‌ ‌మీద క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవడం కుదరని రాశాడు. బాస్టియన్‌ అరాచకాల గురించి మద్రాస్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ ‌లో 1924 ఏప్రిల్‌ ఆఖరులో చర్చ కూడా జరిగింది. గూడెం డిప్యూటీ తహసీల్దారు బాస్టియన్‌ ‌చేసిన అకృత్యాలు, లంచగొండితనం మీద నియమించిన దర్యాప్తు సంఘం పని ఎంతవరకు వచ్చిందో చెప్పాలని జస్టిస్‌ ‌పార్టీ సభ్యుడు కట్టమంచి రామ లింగారెడ్డి కోరారు. ఏప్రిల్‌ 5, 1924 ‌తేదీతో బాస్టియన్‌ ‌పంపిన నివేదిక చూశాక విశాఖపట్నంలో ఉన్న గవర్నర్‌ ఏజెంట్‌కు చుక్కలు కనిపించాయి. తాను మూడువేల రూపాయలతోనే నర్సీపట్నంలో భవనం కట్టుకున్నానని, తనంటే గిట్టని మనుషులు, సహాయ నిరాకరణ ఉద్యమకారులు ఆ నిర్మాణం ఖర్చు పాతికవేల రూపాయలు ఉంటుందంటూ దుష్ప్ర చారం చేస్తున్నారని బాస్టియన్‌ ‌వివరణ ఇచ్చాడు. బాస్టియన్‌కు వ్యతిరేకంగా నమోదు చేసిన వాంగ్మూ లాలు ఎన్ని? రంప ఏజెన్సీ డివిజినల్‌ ఆఫీసర్‌ ఎం. అప్పారావు పంతులు అక్టోబర్‌ 11, 1924‌న పంపిన ఒక నివేదికలో ‘206 సాక్ష్యాలు సేకరించినట్టు’ స్పష్టంగా చెప్పారు. పొట్టంగి వెళ్లిన బాస్టియన్‌ ‌తిరిగి వస్తాడని చాలా మంది బాధితులు విచారణకు రాకుండా తప్పించుకున్నారు. ఇది కూడా ఆయనే రాశారు. చాలామంది నోరు విప్పి చెప్పడానికి సిగ్గు పడ్డారు. బాస్టియన్‌ ‌చేతిలో అంత హింసకు, అవమా నాలకు గురైన డోలా లచ్చిమి కూడా విచారణలో పాల్గొనలేదు. విచారణ సమయానికి ఆమె పునర్‌ ‌వివాహం చేసుకుంది. పాత గొడవలు తెలిస్తే కొత్త జీవితానికి మంచిది కాదన్న ఉద్దేశం ఆమెది. నర్సీపట్నంలో బాస్టియన్‌ ‌నిర్మించిన భారీ కట్టడం అతడి అవిధేయతకు ప్రతీకగా నిలుస్తుందని అప్పా రావు పంతులు వ్యాఖ్యానించారు. ఒక అమాయక తెగని మూడున్నర సంవత్సరాల పాటు యుద్ధఖైదీల్లా చూసిన ఘటన భారత చరిత్రలో ఎక్కడైనా కనిపి స్తుందా? కట్టుబానిసలను చేసిన కథ ఉంటుందా?

(అయిపోయింది)

About Author

By editor

Twitter
YOUTUBE