– సరస్వతి కరవది

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘‌నీకు మన శంకరం మాస్టారు గుర్తున్నారా?’’ చలమేశ్వర్‌ ‌లోపలకు దూసుకుంటూ వచ్చాడు నవయువకుడి ఉత్సాహంతో. నాకు ఆశ్చర్యమేసింది. వీడిలో ఇంత చురుకుదనం ఈ మధ్య చూడలేదు.

మేమిద్దరం చిన్నప్పటి నుంచి కాలేజీ వరకు కలిసే ఉన్నాం. తరవాత నేను సంపాదనే పరమార్థంగా దూరదేశాలకు వెళ్లి, కావలసినంత సంపాదించుకుని ఈ మధ్యే పుట్టి పెరిగిన ఊరు చేరుకున్నాను. చలమేశ్వర్‌ ఉన్న ఊళ్లోనే ఉద్యోగాన్ని పూర్తి చేసుకున్నాడు కడుపులో చల్ల కదలకుండా.

ఒక్కసారిగా శంకరం మాస్టారు నా కళ్ల ముందు మెదిలారు. పంచె, షర్ట్, ‌పైన కండువా… పిలక కూడా మామూలే! తెలుగు పండితుడు. మహా చాదస్తుడు. ఒక్క అక్షరం తప్పు రాసినా తాట తీసేవారు. ఈ రోజు మాతృభాష మీద మా అందరికీ ఈ గౌరవాభిమానాలు ఉండటానికి ఆయనే కారణం. భాషావ్యాప్తికి కృషి చేస్తున్న వాడిగా నాకు ప్రముఖ స్థానం లభించిందంటే మా గురువుగారి దయే !

‘‘వారు గుర్తుండకపోవటమేంటీ? జీవితాను భవాల పుటల మొదట్లో దాక్కున్నారు. ఎలా ఉన్నారు?’’

‘‘ నీకు గురువు గారి ఇల్లు తెలుసు కదా… రేపు అక్కడికి వచ్చెయ్యి. చూద్దూ గానివి ఎలా ఉన్నారో. వస్తా, ఇంకా మన స్నేహితులందరికీ చెప్పాలి, గురువు గారు చెప్పమన్నారు’ హడావిడిగా వెళ్లి పోయాడు చలమేశ్వర్‌. అం‌దరి చిరునామాలు, ఫోన్‌ ‌నంబర్లు వాడి దగ్గరే ఉన్నాయి, మరి వాడు స్థానికుడు కదా! మా ఊరిలో శివాలయం, చెరువు, రఘురామ కళానిలయం తెలియని వారు ఎలా ఉండరో చలమేశ్వర్‌ ‌తెలియని వారు కూడా అలాగే ఉండరు.

                                                                                           *         *          *

వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మా ఇంటికి గురువు గారిల్లు దగ్గరే! అలా నడుచుకుంటూ శివాలయం దాకా వచ్చాను. ఒక్కసారి బాల్యస్మృతులు చుట్టుముట్టాయి. పున్నాగ పూలను ఏరుకుని సన్నాయి ఊదటాలు, పోటాపోటీగా పరుగులు తీస్తూ ఆంజనేయ స్వామి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయటాలు! వినాయకుడి ముందు తీసిన గుంజిళ్లు, వీరభద్రుడి ముందు ఆడిన వీరంగం! పూజారిగారు ఆశీర్వదిస్తూ ఇచ్చిన తీర్థ ప్రసాదాలు!! మంచి గంధం పరిమళాల్లా చుట్టేసిన జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ స్వామి దర్శనం కోసం లోపలకు అడుగు పెట్టాను.

ఆశ్చర్యం! శివుడితో పాటు, జ్ఞానసంపన్నుడైన గురువు గారి దర్శనం కూడా అయ్యింది. తొంభయ్యో ఏటికి దగ్గర పడుతున్నా ఆయన ఒంట్లో దృఢత్వం తగ్గలేదు. కాళ్లకు వంగి నమస్కరించిన నన్ను లేపి గుండెలకు హత్తుకున్నారాయన వాత్సల్యంగా.

‘‘ఏరా, బాగున్నావా?’’

వెంటనే చనిపోయిన మానాన్న గుర్తొచ్చి కళ్లు నీళ్లతో నిండాయి నాకు. ‘ఏరా’ అని మా నాన్నే, నాన్నలాంటి మాష్టారి రూపంలో పలకరించినట్లు అనిపించింది. గొంతు మూసుకుపోయి మాటరాక, ఆయన చెయ్యి పట్టుకు నడిపిస్తూ తల ఊపాను బాగున్నానన్నట్లు. నా జీవితానికి చక్కని బాట చూపించిన ఆయనను చేయిపట్టుకు నడిపిస్తుంటే ‘ఇదీ’ అని చెప్పలేని భావంతో మనసు నిండి పోయింది.

గురువు గారి ఇల్లు ఐదు వందల గజాల్లో నాలుగు వైపులా ఖాళీ స్థలం వదిలి మధ్యలో ఉంది. ఆ ఇంట్లోకి ఆరేళ్ల పిల్లాడిగా పరిగెత్తుతూ వెళ్లిన స్మృతులు మదిలో ఇంకా తాజాగా ఉన్నాయి. ఇప్పుడు అరవై ఏళ్ల వాడిగా వెళ్తున్నాను.

గేటు తీసి లోపలకి వెళ్లి తాళం తీస్తున్న గురువు గారిని ఆశ్చర్యంగా చూసాను. నా మొహంలో ప్రశ్నను గమనించి,

‘‘ఆవిడ వెళ్లిపోయిందిరా! పదేళ్లయింది. పిల్లల కాపురాలు వాళ్లవి. ఇద్దరబ్బాయిలూ విదేశాలకి, సరే, ఆడపిల్ల అత్తారింటికి. ఈ ఇంట్లో ఇప్పుడు నేనే.’’ వాకిట్లో ఆయన కూర్చునే పడక కుర్చీ అలాగే ఉంది. లోపలకు వెళ్తే చెక్క కుర్చీలూ అవే!’’

‘‘ఏమీ మారలేదు మాస్టారూ’’అన్నా.

‘‘నేను మారాను కనకనా? కానీ ప్రపంచమంతా మారిపోయిందిరా. మన ఊరు కూడా! ఈ వాడ కూడానూ. మారనిది ఇదిగో నేనూ, మన ఇల్లే.’’ ఆయన మాటల్లో ధ్వనించిన భావం మనసుని కుదిపింది. పడకకుర్చీలో వాలారు మాస్టారు గారు. వారి పాదాల దగ్గర కూర్చున్నాను నేను. ‘‘ఎందుకో మీ మాటలలో ఏదో దుఃఖం వినబడుతోంది మాస్టారు.’’

 నా చేయి గట్టిగా పట్టుకుని కళ్లు మూసుకున్నారు ఆయన. ఆయన చేయి వృద్ధాప్యంతో ముడతలు పడి, వడలి ఉంది.

‘‘కృష్ణా! అపకారికి ఉపకారము కాదురా, ఉపకారికి, ఉపకారం చేసేవాళ్ళు కూడా కనపడట్లే దురా! నీ గురించి విన్నానురా. పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేసి, బాగా సంపాయించుకున్నావుట కదా! పిల్లలు కూడా స్థిరపడ్డారుట కదా!’’ అవునన్నట్లు తల ఊపాను నేను. వాత్సల్యంగా నా తల నిమిరారు మాస్టారు.

‘‘చాలా సంతోషంరా. మీ బ్యాచ్‌ ‌వాళ్లు అందరూ చక్కగా రాణించారు. ఇక ఇప్పుడు ఏం చేద్దామను కుంటున్నావు?’’

నవ్వేసాను నేను.

‘‘ఇంకా ఏముంది చెయ్యటానికి? నాది సంతృ ప్తికరమైన జీవితం. ఏలోటూ లేదు. ఈ స్థితికి రావటానికి ఎంతో కష్టపడ్డాను. తరతరాలకు సరిపడా సంపాదించాను. ఇక విశ్రాంతి తీసుకోవటమే.’’ గురువు గారి పెదాలమీద తాత్వికమైన నవ్వు కదలాడింది.

‘‘సాధించేశానంటావ్‌! ఇక సాధించాల్సింది ఏమీ లేదంటావ్‌’’

‌నా వెనకాల అయిన అలికిడికి తల తిప్పి చూసాను. ఒక పదిహేను మంది దాకా … నా బాల్య మిత్రులు. అందరి మొహాల్లో ఆనందోద్వేగాలు. వాళ్లందరినీ చూసిన గురువుగారి మొహం పున్నమినాటి సంద్రమే అయ్యింది. ‘‘వచ్చార్రా? ఒరే చలమాయ్‌! ‌నువ్వు, వీడు వెళ్లి చాపలు తేండిరా లోపల్నించి.’’ ఇద్దరం చిన్నప్పటిలానే లోపలకు పరిగెత్తి చాపలు తెచ్చాము. వయసును మరచిపోయి గోలగోల చేస్తూ ఒకరినొకరం పలకరించుకుంటూ, పెరిగిన పొట్టలు, వంగని మోకాళ్లతో నానా అవస్థలు పడుతూ ఆ చాపల మీద కూర్చుంటుంటే, పాఠం కోసం ఆనాడు మాష్టారి ముందు కూర్చుని పాట్లు పడ్డ రోజులు గుర్తొచ్చాయి. తప్పు చేసి ఆయన చేత దెబ్బలు తినని వారెవ్వరు మాలో? చదువుతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పిన గొప్ప గురువాయన.

అందరం కూర్చున్నాక నవ్వుతూ మా వైపుచూసి అన్నారు మాస్టారు.

‘‘ఎలా ఉన్నారర్రా? ఒకే ఊళ్లో ఉన్నా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఇవాళ మీకో కొత్తపాఠం చెప్పాలనిపించి అందరినీ రమ్మన్నానర్రా.ముందుగా మీ జీవితానుభవాలను తెలుసుకోవాలనుంది. మీ అనుభవాలు చెప్పండి. ఏం చేస్తున్నారు? జీవితం ఎలా ఉంది? అందరి ఉద్యోగాలూ పూర్తి అయ్యాయి కదా?’’

అందరూ ఇంచుమించు నాలాగానే జవాబులు ఇచ్చారు.ఇన్నాళ్లు కష్టపడ్డాం, ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు తీరాయి కనుక విశ్రాంతి తీసుకుంటున్నాం అని.

మా అందరినీ కలయచూసి చిరునవ్వుతో అన్నారు.

‘‘ఏరా, మీ అందరినీ నేను అడిగాను కదా ఏం చేస్తున్నారని. నన్ను మీరడగరా?’’

‘‘మీరు ఇంకా ఏమి చేస్తారు గురువుగారు? ఆ అవసరమేముంది? పిల్లలందరి బాధ్యతలు తీరిపోయాయి. మీ గుప్పెడు పొట్టకి ఆ వచ్చే పెన్షన్‌ ‌డబ్బులు చాలవా?’’

‘‘నిక్షేపంలా సరిపోతాయి. నా తిండికీ, పిండికీ ఎంత కావాలిరా?’’ఉల్లాసంగా అన్నారు గురువుగారు. ‘‘నాకు వచ్చిన పింఛన్‌లో పావువంతు నాకు సరిపోతుంది. అయినా ఏమన్నా చెయ్యటం అంటే డబ్బు సంపాదించటమా? అదే నా ప్రశ్న అయితే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నార్రా అని అడిగేవాణ్ణిగా!’’

విజయసారథి పైకే నవ్వాడు. ‘‘గురువుగారూ! మీ ఆశీర్వాదం వలన మాకే కాదు..మా తరవాత మూడు తరాలవరకు కూడా మేము సంపాదించింది సరిపోతుంది. ఇంకా సంపాదించాలా?’’ కొద్దిపాటి గర్వం వినిపించింది వాడి గొంతులో. వందల కోట్లకు పడగెత్తిన వాడికి ఆ మాత్రం గర్వం ఉండటంలో ఆశ్చర్యమేముంది?

‘‘మాష్టారూ, నాకు సొంత ఇల్లుంది. వందెకరాల సుక్షేత్రమైన మాగాణీ పొలం ఉంది గోదావరి జిల్లాలో. నా పిల్లల్లో ఒకడు అమెరికాలో ఉంటే ఇంకొకడు తన కొడుకు చదువుకోసం ఇక్కడే ఉన్నాడు. ఐదేళ్ల క్రితం నేనూ వ్యవసాయం కౌలుకిచ్చి, వీడు గొడవపెడుతున్నాడని ఇక్కడికి వచ్చేసాను మా ఆవిడతో కలిసి.’’ శేషాచలం అన్నాడు.

‘‘ఏమని గొడవ పెట్టాడేంటీ?’’

‘‘నువ్వు కష్టపడ్డది చాలు. ఇంక నా దగ్గరకొచ్చి హాయిగా విశ్రాంతి తీసుకో. ఇక్కడ నీ కోడలు కమ్మగా వండిపెడుతుంది. టీవిలో నచ్చిన సినిమాలు, పోగ్రాంలు చూసుకుంటూ కాలక్షేపం చెయ్యి అని.’’

‘‘మరి హాయిగా ఉన్నావా?’’

‘‘ఎక్కడ గురువుగారూ? వ్యవసాయం చేసేప్పుడు నిజంగానే నేనూ, ఆవిడ ఎంత కష్టపడ్డామో. వీడి దగ్గరకొచ్చాము… గట్టిగా ఏడాది కూడా సుఖపడ లేదు. మా ఆవిడకి కదిలితే, మెదిలితే ఒళ్లునొప్పులు. నాకు చక్కర వ్యాధి ఇక సుఖపడేదేముందీ?నెలకి నేను పెట్టె ఖర్చులో ఎక్కువ శాతం మందుల మీదే!’’

గలగలా నవ్వారు గురువుగారు. ‘‘సరిపోయింది. ఒరే గోవిందూ నీ మాటేంటీ ?’’

తరగతి గదిలో అడిగినప్పుడు లేచి నిలిచినట్లే నిలబడ్డాడు గోవిందు.

‘‘గురువుగారూ, మా ఆవిడ రెండేళ్ల క్రితం దాటిపోయిందండీ. అవిడున్నంత వరకు రాజ భోగంగా జరిగిన నా బ్రతుకు, ఇప్పుడు దిక్కులేని దయ్యింది. ఏం చెప్పమంటారు? ఇద్దరం కలిసి గుడికి వెళ్లేవాళ్లం. చుట్టాల ఇళ్లకు ప్రతి వేడుకకు వెళ్లేవాళ్లం. అందరూ గౌరీశంకరులనేవారు. ఇప్పుడు నేను ఒంటరినై పోయానండీ’’ గాద్గదికమైంది వాడి గొంతు.

‘‘అయ్యో, ఏంటిరా అలా బాధపడతావు? నీభార్య లేని లోటు తీరేది కాదనుకో. పోనీ నీ కొడుకుల దగ్గరకి వెళ్లాల్సింది’’

‘‘ఎక్కడ గురువుగారూ, కోడళ్లిద్దరికీ ఉద్యోగాలు. ఏదో అతిథిగా వెళ్తే నాలుగు రోజులు చూసుకుంటారే గానీ, నేను వాళ్ల దగ్గర శాశ్వతంగా ఉంటే ఇబ్బందని మాటల్లో, చేతల్లో తెలియజేస్తుంటారు. ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. వంట చేసుకోవటం రాక ఏ స్విగ్గీ లోనో ఆర్డర్‌ ‌పెట్టుకోవటం, నచ్చితే తినటం లేకపోతే పడెయ్యటం. ఇంట్లోంచి కదలట్లేదు. ఎక్కడికీ వెళ్లట్లేదు. వీటికి తోడు కొంచెం నడిచినా ఆయాసం. కూర్చుంటే లేవలేను. మందుల మీదే బ్రతుకుతున్నా నండీ.’’

అందరం వాడివంక జాలిగా చూసాం. ‘‘నా ఆలోచన చెప్పమంటారా? మీరందరు జీవితంలో ఎంతో సాధించేశామని తృప్తిపడి ఊరుకుంటున్నారు. ఏంటి మీరు సాధించింది? ఆలుబిడ్డలకి అన్నం పెట్టటం ఊరికి ఉపకారమా? ఊరికి ఏమి చేశారురా మీరు? చెట్లు మనకి నీడనిస్తాయి, పూలు పండ్లు ఇస్తాయి, కట్టెలనిస్తాయి, ఇంకా ఎన్నో చేస్తాయి. గాలి కేవలం ఆకాశంలోనే వీస్తుందా? వెన్నెల కేవలం చంద్రుని కోసమే కాస్తుందా? పువ్వులు తమ పరిమళాలను చెట్టుకే వెదజల్లుతాయా? సెలయేరు తన నీరు మనందరికీ ఇవ్వట్లేదా? భూమికీ ఆకాశానికి మధ్యనున్న ప్రకృతి ఇంత నిస్వార్థంగా అందరికీ మేలు చేస్తుంటే మనం వివేచనాశక్తి ఉన్న మనుషులుగా ఇంకెంత చెయ్యాలి? ప్రకృతి నుండి ఏం నేర్చుకుంటున్నాం?’’ మాస్టారి గొంతులో ఆవేదన, ఆవేశం కలిసి ధ్వనించాయి.

‘‘మీ అందరూ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేశారు. డబ్బులకు కొదవలేదు. ఇప్పటివరకు ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఒక్కసారిగా నిర్వ్యాపారంగా తయారవటంతో మీ ఆరోగ్యాలూ దెబ్బతింటున్నాయి. ఇంత వయసొచ్చింది. కళ్లు మూసుకుంటే ఏదోనాడు అవి శాశ్వతంగా మూతపడతాయని మీ అందరికీ తెలుసు. కానీ ఈ వయసులో కూడా మనకింత ఇచ్చిన దేశానికి, సమాజానికీ మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన మీలో రాకపోవటం సిగ్గుచేటు! నేను అలా కళ్లు మూసుకుని పడుకోలేనే…? సాటివారి సమస్యలను చూస్తే మనసు ఊరుకోదు. స్పంది స్తుంది. పరిష్కారాన్ని చూడమని వెంటపడుతుంది. తొంభయ్యో పడిలో పడిన నేనే ఇలా ఉంటే, నాకంటే ఇంచుమించు మూడు దశాబ్దాలు చిన్న అయిన మీరెలా ఉండాలి?’’

మా అందరి మనసులనూ గురువుగారి మాటలు తట్టి లేపుతున్నాయి.

‘‘మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యున్ని కలవటానికి వెళ్లాను నాకూడా మన చలమేశ్వర్‌ని రమ్మన్నాను. అక్కడ ఎంతమంది నిరక్షరాస్యులు ఎన్ని తిప్పలు పడుతున్నారో! వైద్య సలహా కోసం పడిగాపులు పడుతున్నారు. అక్కడి పద్ధతులు తెలీక ఎంతమందిని అడుగుతున్నారో! అంతకు ముందు రోజు మునిసిపల్‌ ఆఫీస్‌లో మన పక్కింటి హనుమాయమ్మగారికి ఏదో పని ఉంటే సాయం వెళ్లాను. అక్కడా అంతే! ఇలా చాలా చోట్ల … ఎంతో మంది! అందరికీ మరొకరి అవసరం ఉంది.

అటువంటి వాళ్లను చూసి నా మనసు ద్రవించి పోయిందిరా. వాళ్లకి సహాయం కావాలి. కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. సమూహం కావాలి. సంఘటిత శక్తీ కావాలి. చలమేశ్వర్‌ ఇం‌చుమించు ప్రతిరోజూ నా దగ్గరకు వస్తుంటాడు. వాడి ద్వారా మీ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే మీతో కలిసి ముందు కెళదామని కబురు చేసాను. మీ బ్యాచ్‌ ‌నాకెంతో ఇష్టమైనది. ఎందుకంటే మీరందరూ రత్నాలర్రా. విజయవంతమైన వ్యాపారస్తులు, రైతులు, పండితులు, వైద్యులు, వకీళ్లు, సంగీత కళాకారులు, ఉపాధ్యాయులు… మీలో లేనిదెవరు? మీరు ఏళ్ల తరబడి సాధించిన నైపుణ్యాలన్నీ రిటైరైపోయి ఇంట్లో కూర్చుంటే ఏమైపోతాయిరా? మీ పడకకుర్చీలు అలసిపోవూ?’’

అందరం మనస్ఫూర్తిగా నవ్వాము.

మాస్టారు నా వైపు తిరిగారు. ‘‘కృష్ణా, మన పాఠశాలలో విదార్థులకి నువ్వు నాయకుడివి గుర్తుందా? నీ నాయకత్వంలో మీ మిత్రులంతా కలిసి ఎన్నో మంచి పనులు చేశారు. ఆ వయసులోనే ఎన్నో అద్భుతాలను సాధించారు. అందుకే నీ సహాయాన్ని అర్థిస్తున్నానురా. మీరంతా రెండోసారి మైదానంలోకి దిగాలర్రా. రెండో ఆట ఆడాలి’’

నా మనసుకి అర్థమౌతోందిగురువుగారు చెప్పేది.

‘‘పదవీ విరమణ అవగానే ఏదో సాధించేసినట్లు పడకకుర్చీని ఆశ్రయించటం ఏమిటి? అందరూ కలిసి ప్రణాళికాబద్ధంగా నలుగురికీ ఉపయోగపడేలా ఏమన్నా చేయండి. సాటి మనిషి కోసం, సమాజం కోసం. మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందీ, ఊరి సమస్యలూ తీరతాయి. ఊరికే కూర్చుని కునికిపాట్లు పడేబదులు, ఆ సమయాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ల కోసం కేటాయిద్దాం. సమాజ సేవరా! ఇన్నాళ్లు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకోలేదా? ఇప్పుడు మన సమాజం కోసం, మన ఊరికోసం ఎవరి చేతనయ్యిందివారు చేద్దాం. మన బ్రతుకులకు విలువుంటుంది, మనకూ తృప్తి ఉంటుంది. ఏమంటారు? కృష్ణ నాయకత్వం మీకు సమ్మతమేనా? ‘‘

నా మిత్రులందరూ కరతాళధ్వనులతో తమ హర్షాన్ని వెలిబుచ్చారు.

‘‘చెట్లు నాటండి. మురికివాడల్లో పరిశుభ్రత పెంచండి. బడులు, గుడులు బాగు చెయ్యండి. పదిమందికీ ఉపయోగపడే పనులు చేయండి, చేయించండి. డబ్బున్న వాళ్లు అవసరంలో ఉన్న పేదవాళ్లకు సహాయం చేయండి. డబ్బివ్వలేనివాళ్లు నిస్సహాయులకు మీ సమయాన్ని వెచ్చించి సాయం చెయ్యటం ఎలాగో ఆలోచించండి. మీ నైపుణ్యాలను అవసరమైనవారికి అందుబాటులోకి తీసుకురండి.’’ గురువుగారు చెప్తున్నారు. అందరం ఇలాంటి ఆలోచన మాకెందుకు రాలేదా అని మనసుల్లో శోధించు కుంటున్నాం.

‘‘సొంత లాభం కొంత మానుకుపరుల మేల్‌ ‌తలపెట్టవోయ్‌! అన్నాడు కదా గురజాడ. ఆచరిద్దాం మనం. మనతో పాటు ఊరిలో వారినీ కదిలించా మంటే ఊరు మొత్తం బాగుపడుతుంది. జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు కదా! ఏమంటారు? మీకూడా నేనున్నాను. మరోసారి గోదాలోకి దిగి మీరేంటో నిరూపించుకోండి. జయోస్తు!’’

తొంభయ్యేళ్ల ఆ యువకుడి నిర్దేశకత్వంలో అరవయ్యేళ్లు పైబడిన బాల బాలికలందరం ముందుకి కదిలాం,

జీవిత మైదానంలో కొత్త ఆటలు ఆడి గెలవటానికి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE