– కడియాల ప్రభాకరరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

రాత్రి 9 గం.లు అవుతోంది. గదిలో ఒంటరిగా ఎంతో విచారంగా కూర్చొంది శ్రీదేవి. భరించరాని నిశ్శబ్దం. మనసులో ఏదో భయం. ఏవో పనికిరాని ఆలోచనలు ఒకవైపు, దానికితోడు రెండు రోజుల నుండి సరిగా తిండి తినక నీరసం. భగవంతుడా నాకెందుకీ పరీక్ష? నేనేం తప్పు చేశాను? అనుకుంటూ ఉండగా ‘పెదవే పలికిన మాటలలోనే తియ్యని మాటే అమ్మ’ అనే రింగ్‌ ‌టోన్లో సెల్‌ ‌ఫోన్‌ ‌మ్రోగింది. ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకొని ఎంతో ఆత్రుతగా ‘అమెరికా నుండి అబ్బాయే’ అని ఫోన్‌ ‌తీయగానే ‘మేము శ్రీవాణి హాస్పిటల్‌ ‌నుండి మాట్లాడుతున్నాము. మీరు 203 నం. గది పేషంట్‌ ‌విశ్వనాథం గారి భార్యేనా! ఆయన పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఆయన ఏ వైద్యానికి స్పందించటం లేదు. ఇంకా కొన్ని గంటలే బ్రతుకుతారు. మీరు బిల్లు కట్టేసి ఆయన్ని ఇంటికి వెంటనే తీసుకొని వెళ్లండి’ అని చెప్పారు. ఇంతలో మా పెద్దమ్మ కొడుకు ఫణీంద్ర లోపలికి వస్తూ… ‘అవునమ్మా యిప్పుడే డాక్టర్లతో మాట్లాడాను. వారి ప్రయత్నం వారు చేశారు గాని బావగారి మీద ఆశలేదు. అంతా పైవాడిదే భారం. అబ్బాయి గాని, కోడలు గాని నిన్నటి నుండి ప్రయత్నిస్తున్నా ఫోన్‌ ‌తీయడం లేదు. చాలాసార్లు ప్రయత్నం చేసిన తర్వాత నాన్నగారికి సీరియస్‌గా ఉంది, హాస్పిటల్‌ ‌లో పెట్టాము’ అని మెసేజ్‌ ‌చేశాను. ‘బహుశ ఏ సమయంలోనైనా మనకి ఫోన్‌ ‌చేయవచ్చు. అయినా నువ్వేమి భయపడకు మేమందరం ఉన్నాము. అన్నీ మేము చూసుకొంటాం’ అని చెప్పాడు.

అంతే ఆమెనోట మాటరావడం లేదు. కన్నీళ్లు ఆగటంలేదు. చుట్టూ ఉన్న వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆమెను ఓదార్చ లేకపోతున్నారు. ‘అయ్యో! ఈమెకు ఎంత కష్టం వచ్చింది? పాపం ఎలా తట్టుకుంటుందో?’ చుట్టూ ఉండే వారి పరామర్శలు. కొంతసేపటికి ఆమె కాస్త తేరుకొని ‘నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్‌’ అం‌టూ అలా ఆలోచిస్తూ ‘ఏంటి ఈ దుస్థితి? ఒక్కసారిగా పరిస్థితి ఎందుకిలా తలక్రిందులైంది? ఆయనకు సుగరు, బీ.పీ లాంటి జబ్బులేవి లేవు. ఎలాంటి దుర్వ్యసనాలు లేనేలేవు. ఈ మధ్య ఎప్పుడూ చిన్న జ్వరం కూడా రాలేదు. మరి అకస్మాత్తుగా ఈ గుండెజబ్బు ఎలా వచ్చింది? సమయానికి అబ్బాయి కూడా ఇక్కడలేడు. వాడి ఫోన్‌ ‌కూడా దొరకడం లేదు. నాకేం దారి?’ అనుకుంటూ కళ్లు మూసుకుంది. ‘ఎందుకేడుస్తావే పిచ్చిదానా?’ అంటూ వాళ్లాయనే కనిపించి మాట్లాడుతున్నట్లు అనిపించింది. ‘నీ సుపుత్రుడు కోసం ఎదురుచూస్తున్నావు కదూ! అమెరికా నుండి రావాలిగా! రెండ్రోజులైనా ఫోన్‌ ‌లోనే దొరకడం లేదు కదూ! వాడింకా చిన్నప్పటి నీ ముద్దుల కొడుకు ‘రాజు’ అనుకోకు. ఇప్పుడు వాళ్లావిడ స్థాపించిన రెండు, మూడు కంపెనీలకు అధిపతి రాజశేఖరం. రెండు మూడు వందల పనివాళ్లకు యజమాని. ప్రతి నిమిషం వాడికి చాలా విలువైనది. పాపం అక్కడ వాడి సమస్యలేమిటో? మనం ఈ జీవిత గమనంలో 70వ పడిలో – ఇంచుమించు చివరిదశలో వున్నాం. గరికపాటి వారు చెప్పినట్లు వయసు 70 దాటితే స్విచ్‌ ఆపిన సీలింగ్‌ ‌ఫ్యాన్‌లాగ మనిషి బ్రతుకు ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేం. అయినా భార్యాభర్తలన్నాక ఎవరో ఒకరు ముందూ వెనకా పోవలసిందే కదా! నాకు బెర్త్ ‌ముందుగా దొరికింది. అనాయాస మరణం. సంతోషించు. అనవసరంగా ఎందుకు ఏడుస్తావు?’

ఆయన మాటలు వింటుంటే మునుపటి మా పెళ్లిరోజు, మా ఇద్దరి దాంపత్య జీవిత తీపి జ్ఞాపకాలు, అలల్లా కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నాకు డిగ్రీ అయిన వెంటనే మా నాన్నా అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తూ ‘ఒక స్కూలు టీచరు పెళ్లి చూపులకు రేపు వస్తారు’ అని చెప్పారు. ‘అబ్బా! టీచరు అయితే నాకు వద్దు. నేను చేసుకోను’ అని మారాం చేశాను. ఎందుకంటే ముఖ్యంగా చిన్న చిన్న ఊర్లలోనే ఉండాల్సి వస్తుంది. పల్లెటూళ్లు పట్టుకుని పాకులాడాలి. ‘నాకు వద్దుగాక వద్దు’ అని గొడవ చేస్తే మా అమ్మ నాకు నచ్చ చెప్పింది. ‘మీ నాన్నగారు పెళ్లి చూపులకు వాళ్లని రమ్మన్నారు. ఇప్పుడు ఆఖరి నిమిషంలో వద్దంటే బాగుండదే. ముందు అబ్బాయిని చూడు, నచ్చకపోతే ఏదో ఒకటి సర్ది చెప్పేద్దాం. మాకు ఒక్కగానొక్క కూతురివి. నీకు బలవంతంగా ఇష్టంలేని పెళ్లి ఎందుకు చేస్తాం?’ మా అమ్మ మాట కాదనలేక సరేనని ఒప్పుకున్నాను. మరునాడు వాళ్లు పెళ్లిచూపులకు రానే వచ్చారు. అబ్బాయి నాకన్నా అందగాడు. మృదుమధురంగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్నాడు. నాకు కూడా ఎందుకో పిచ్చపిచ్చగా నచ్చేశాడు. వాళ్లకి పెద్ద పెద్ద కోరికలు కూడా ఏమీలేవు. కనుక మా పెళ్లి వెంటనే ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోయింది. ఆయన శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం హైస్కూల్‌లో సైన్సు మాష్టారుగా పనిచేస్తుండటం వల్ల అక్కడే మా కొత్త కాపురం మొదలైంది. నాకు కాస్త కోపం, చిరాకు ఎక్కువే కాని ఆయనకు చాలా శాంతం, ఓర్మి. ఆయన చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా ఎప్పుడూ విద్యార్థులు గుంపులు గుంపులుగా ఉండే వారు. విసుగు లేకుండా పిల్లలకి ఎన్ని సందేహాలనైనా, ఎన్నిసార్లయినా తీరుస్తూ వాళ్లతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు. ‘వీళ్లంతా మన పిల్లలే అనుకో, మనకు ఇంకా పిల్లలు కలగలేదని ఎందుకలా బాధపడుతూ వుంటావు’ అనేవారు. ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి. వృత్తే దైవము. విద్యార్థుల భవిష్యత్తే ఆయన లక్ష్యం. వారి ఎదుగుదలే ఆయన కోరుకున్న కర్మఫలం. ఇలా ఎంతో హాయిగా సాగిపోతున్న మా సంసారానికి ఒక్క పిల్లలు లేని లోటు తప్ప ఇంకేమి లేదు.

ఇంతలో నేను నోచిన నోములో, చేసిన వ్రతాలో, ఏ జన్మ ఫలమో నా కడుపు పండి ఒక బాబుకు తల్లినైనాను. నా సంతోషానికి అవధులు లేవు. నేనెంత అదృష్టవంతురాలను? లేక లేక అపురూపంగా పుట్టిన నా బాబే నాకు ప్రపంచం. నా పంచప్రాణాలు. తెల్లగా బొద్దుగా ఎంతో ముద్దుగా ఉండేవాడు నా బంగారు కొండ. నన్ను- బాబును చూసినప్పుడల్లా ‘ఏమోయ్‌ ‌వాడికి మరీ అంత ముద్దుచేసేయకు’ అని ఆయన అంటున్నా, వాడు ఇంటర్‌ ‌చదివే వరకు నేనే దగ్గరుండి అన్నం తినిపించేదాన్ని. వాడికి కావలసినవన్నీ నేనే సొంతంగా చూసుకొనే దాన్ని. ఏది అడిగితే అది ఇచ్చేసేదాన్ని. బజారులో ఏ వస్తువు కొత్తగా వస్తే అది వెంటనే కొని తెచ్చేదాన్ని. వాడిచేత చిన్న పని కూడా చేయించే దాన్ని కాదు. ఇంజనీరింగ్‌ ‘‌గీతం’ లాంటి పెద్దకాలేజీలో సీటు వచ్చినా పై ఊళ్లో హాస్టల్‌లో ఉండలేడని మా ఊరి దగ్గరే ఉన్న కాలేజీలో చేర్పించాను. వాడుకూడా చదువు, స్కూలు, కాలేజీ, ఇల్లు తప్ప స్నేహితులు, సినిమాలు, ఆటలు అని ఎక్కడికీ వెళ్లేవాడు కాదు. నా వెనకనే అమ్మ అమ్మ అని కబుర్లు చెబుతూ తిరుగుతూ ఉండేవాడు. ‘వీడు ఇలాగే అమ్మకూచిలా పెరిగితే లోకజ్ఞానం తెలీకుండా అయిపోతాడే. అంతేకాదు అందరూ పప్పుగాడని ఎక్కిరిస్తారు చూసుకో’ అంటూ ఉండేవారు ఆయన. ‘ఏం పరవాలేదు లెండి. వీడే చాలా గొప్పవాడు అవుతాడు చూడండి’ ఆయనతో వాదనలో ఎప్పుడూ నాదే పైచేయి.

ఇలా అనుకుంటూనే ఉన్నాం, వాడి చదువు పూర్తి అవుతుండగానే హైదరాబాదులో మంచి సాఫ్ట్ ‌వేర్‌ ‌కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం కూడా చాలా ఎక్కువే. కాని నాకు తెలుసు అక్కడ పని కూడా దానికి రెట్టింపు ఉండి, మనిషిని పిండేస్తారని. నా కొడుకు ఎక్కడ కష్టపడి కందిపోతాడోనని నా భయం. అందుకే ‘వద్దురా బాబు! ఈ చుట్టుపక్కలే ఏదైనా కాలేజీలో లెక్చరర్‌గా పని చూసుకోరా. అందరం కలిసి మెలసి సుఖంగా ఇక్కడే వుండవచ్చు. అలా చూస్తా రేంటండీ మీరు కూడా చెప్పండి. నోరు మెదపకుండా నిల్చుంటారే కాని ఏం మాట్లాడరు’. ‘బాబోయ్‌ ‌నాకేం తెలీదు. మీ తల్లీకొడుకులే తేల్చుకోండి. మధ్యలో నన్నెందుకు లాగుతావు?’ ఆయన చిన్న చిరునవ్వుతో తెలివిగా తప్పుకొనే వారు. కాని వాడికి ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే చాలా ఇష్టం. అందులోనే చేరుతానని పట్టుబట్టి మొహం ముడుచుకొని కూర్చున్నాడు. అందుకే నాకు ఇష్టం లేకున్నా ఆ ఉద్యోగానికే హైదరాబాద్‌ ‌పంపాను. ఉద్యోగంలో చేరాడు. బాగా పనిచేయడం వల్ల కంపెనీలో గుర్తింపు, త్వరత్వరగా ప్రమోషన్లు వచ్చాయి. మొదట్లో రోజూ రెండు మూడు సార్లు ఫోన్‌ ‌చేస్తూ, తరుచూ వచ్చి వెళ్తూ ఉండేవాడు. రోజులు ఎంత వేగంగా గడుస్తున్నాయో తెలియడం లేదు. మా వాడికి పక్క ఆఫీసులో పనిచేస్తున్న మాధవి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ‘నాన్నగారిని ఒప్పించు’ అన్నాడు. అమ్మాయి వాళ్లు బాగా ఉన్నవాళ్లని, మనం వాళ్లకి సరిపోమని మా వారికి ఇష్టం లేదు. కాని వాడికి ఆ అమ్మాయి బాగా నచ్చిందని వాళ్లిద్దరూ పెళ్లికి నిశ్చయించుకొన్నారని ఇంక చేసేది లేక ఒప్పుకున్నాము..

పెళ్లైంది. వెంటనే కొద్ది రోజులకే వాళ్లిద్దరికీ అమెరికాలో మంచి అవకాశం వచ్చింది. వెళ్లక తప్పదన్నాడు మావాడు. ఉన్న ఒక్కడూ అంతదూరం వెళ్లిపోతే… అని నా మనసు విలవిల లాడింది. ఆయన ఏమి పట్టని వారిలా ‘ఇక మన చేతిలో ఏముంది? వాడంతటి వాడయ్యాడు. దీవించి పంపడమే మనం చేయగలిగేది’ అన్నారు. వాళ్లు అమెరికా వెళ్లిపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. మావారు ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. వాడిని ఎన్నిసార్లు రమ్మన్నా పని ఎక్కువగా వుంది తర్వాత వస్తానని అంటున్నాడే తప్ప రావడం లేదు. నాలుగేండ్లు గడిచాయి. వాడిని చూడాలని నాకు ఎంతో దిగులు దానికి తోడు బీపీ, సుగర్లు కూడా చేరాయి. ఆయన మాత్రం నిండుకుండలా నిశ్చలంగా వుంటారు. ఏదీ బైట పడరు. మరి మా వాడికి ఏం బుద్ధి పుట్టిందో ఏమోగాని మమ్మల్ని అమెరికా రమ్మని టిక్కెట్లు పంపాడు. మేము అమెరికా బయలుదేరి న్యూయార్క్‌లో దిగాం. కొడుకు, కోడలు విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. పెద్ద గదులు, ముందు వెనుక చిన్న పూలతోటలు అబ్బా ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. కానీ వాళ్లిద్దరూ ఉదయాన్నే వెళ్లిపోయి రాత్రి ఆలస్యంగా వస్తారు. సెలవు రోజుల్లో కూడా మీటింగులని, వర్క్‌షాపులని ఇంట్లో ఉన్నంతసేపు ‘లేప్‌టాప్‌’‌తోనో ‘సెల్‌ఫోన్‌తోనో’ బిజీగా ఉండేవారు. మేమిద్దరం ఎక్కడికీ వెళ్లలేము. ఎవరూ కనబడరు. మాట్లాడేవారు ఉండరు. మాకైతే ఇది ‘అమెరికానా’ లేక ‘అండమాన్‌ ‌జైలా’ అని అని పించేది. కొడుకు, కోడల్ని చూస్తే వాళ్లు భార్యాభర్తలా! లేక వ్యాపార భాగస్వాములా? అని అనుకునేవాళ్లం. ఎక్కడ తింటారో, ఎప్పుడు తింటారో కూడా తెలియదు. దేనికోసం మనం కష్టపడి సంపాదిస్తామో దాన్నే మర్చి పోతున్నారు. మన భారతీయ సనాతన ధర్మంలో ‘గృహస్థు ఆశ్రమ ధర్మం’ ఎంతో విలువైనది. దాన్నే మర్చిపోయి సంపాదనే ధ్యేయంగా నిత్యం పనిలోనే మునిగిపోతే సుఖపడేదెప్పుడు, అచ్చటా ముచ్చటా లేని సంపాదన ఎవరి కోసం? వాళ్లకి ఈ విషయం ఎలా అర్థం అవుతుందో? అక్కడ కూడా మా ఇద్దరికీ నేనే వండుకునే దాన్ని. మా వారికి ప్రొద్దున్నే కాఫీ త్రాగితే గాని బండి నడవదు. ఒకరోజు కాఫీ పౌడరు అయిపోయింది. అబ్బాయికి చెప్పాను. ‘అలాగే తెస్తాను’ అని నాలుగు రోజులు అయింది. తర్వాత ఉప్పుకూడా అయిపోయింది. అబ్బాయికి చెపితే ‘తెస్తాలేవే అమ్మా’ అంటాడు. కానీ వారం గడిచిన దిక్కులేదు. ఇంక లాభం లేదని మూటాముల్లె సర్దుకొని ‘వెంటనే వెళ్లిపోతామంటూ’ ఊరు వచ్చేశాము. సుఖంగా ‘కృష్ణా! రామ’ అని కాలక్షేపం చేస్తున్నాము. అబ్బాయి మునుపటిలాగ కాకుండా నెలకో రెండు నెలలకో ఒక ఫోను చేస్తున్నాడు. నేను ఏదో చెప్పేలోగా ‘నాకు మీటింగుకు టైము అయి పోయింది. మళ్లీ చేస్తానులే అమ్మా’ అని ఫోను పెట్టేసేవాడు. ఇలా మా మధ్యలో రాను రాను దూరం పెరిగి ఆప్యాయత తగ్గిపోయింది.

నేను ఉలిక్కిపడి లేచాను. తెల్లారింది. బైట జనం. ఆంబులెన్స్ ఆగింది. ‘విశ్వనాథం మాష్టారు జోహారు’ అంటూ ఆయనను మోసుకుంటూ తీసుకువచ్చి ముందు గదిలో పడుకోబెట్టారు. మా వాడు తప్ప ఎంతోమంది ఎక్కడెక్కడి నుండో చుట్టాలు, స్నేహి తులు వస్తూనే ఉన్నారు. చాలామంది అభిమానులు ఆయన వద్ద చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలలో వున్న శిష్యులు ఆయనని కడసారి చూడాలని ఎంతో ఆర్తితో వస్తున్నారు. ఇంకొక వైపు ఆగకుండా ఫోన్లు మ్రోగుతూనే వున్నాయి. ఆయన గొప్పతనం, మంచి తనం ఏమిటో పూర్తిగా ఈరోజే ఇంతమంది ద్వారా నాకు తెలిసింది. ఆయన్ని ప్రభుత్వం పలుమార్లు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎందుకు సత్కరించిందో బోధపడింది. ఎప్పుడు, ఎన్నడూ ఎవరినీ నిందించడం ఎరుగరు. ఇంతమంచి తండ్రిని కడసారి చూడడానికి కూడా నోచుకోని పుత్రుడు ఉన్నా లేకున్నా ఒక్కటే. చాలాసేపటికి అమెరికా నుండి మెసేజ్‌ ‌వచ్చింది. ‘అమ్మా నేను ఇంత అర్జంటుగా ఇప్పుడు రాలేను. నాకు అనేక వ్యాపార బంధకాలు ఉన్నాయి. నీకు 3000 డాలర్లు పంపిస్తున్నాను. నాన్నగారి కార్య క్రమం ఘనంగా చేయించు. నీవు ధైర్యంగా ఉండు’. ఆ సమయంలో ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు…’ అని ఆయన చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి. కానీ ‘మన అబ్బాయి విషయంలో నేను ఎప్పుడు అలా అనుకోలేదు. వాడికి మనమంటే ఎంతో ఇష్టం అండీ. నేనంటే ఇంకా ఇష్టం. నేను లేకుండా, నాకు చెప్పకుండా ఏ పనీ చేయడండీ. నా మాటంటే వాడికి చాలా గౌరవం’ అని నేను గర్వంగా చెప్పినప్పుడల్లా ‘ఔనౌను! వాడికి పనీ పాట చెప్పక, అడిగినవన్నీ ఇస్తూ, కష్టం సుఖం తెలీకుండా అతి గారాబంగా పెంచుతున్నావు. ఇప్పుడు సరే రేపు పెళ్లైతే నీ పైన ఆధాపడినట్లే వాడి పెళ్లంమీద కూడా ఆధారపడి సొంత నిర్ణయాలు తీసుకోలేక దద్దమ్మలా తయారవుతాడు’. అవును ఎంత కరెక్టుగా చెప్పారు. నిజమే ఇది అంతా నా వల్లే జరిగింది. పిల్లలకి ఎక్కువ గారాబం చేసి చదువుతో పాటు బాధ్యతలు కూడా సక్రమంగా నేర్పించకపోతే ఏమౌతుందో నాకు బాగా అర్థం అయింది. మాలాంటి తల్లితండ్రులకు ఇది చక్కని గుణపాఠం. మాష్టారి అంత్యక్రియలు అతని శిష్యులు, అభిమానులే ఎంతో వైభవంగా కన్న కొడుకుకన్నా ఎక్కువగా జరిపించారు. మా వారి దృష్టిలో అతని విద్యార్థులందరూ తమ పిల్లలే.

ఆ భావనే వారి అందరి చేతులమీదుగా అతని అంతిమ సంస్కారం జరిపించింది. ఇది ఒక అపురూపమైన గురుదక్షిణ. కొడుకు పంపిన మొత్తం డబ్బు మాష్టారు పేరున విద్యార్థులకే చెందాలని అతను పనిచేసే స్కూలు భవన నిర్మాణానికి విరాళంగా సమర్పించి ఘనంగా మాష్టారికి నివాళులర్పించింది శ్రీదేవి.

About Author

By editor

Twitter
YOUTUBE