సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ఆషాడ శుద్ధ పంచమి

04 జూలై 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


1975 నాటి అత్యవసర పరిస్థితిని అధ్యయనం చేయడం అంటే, వేయి గాయాల భారతీయ ఆత్మను దర్శించడమే. అదొక దారుణమైన అనుభవం. ఈ జూన్‌ 26‌న ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ఆ చీకటిరోజులను గుర్తు చేశారు. ‘కాంగ్రెస్‌ ‌నియంతృత్వ పోకడలను ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టార’ని చెప్పడం సరైన అంచనాయే. ఆగస్ట్ 15, 1947 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇరవై ఏడేళ్ల తరువాత జూన్‌ 25, 1975 అర్ధరాత్రి వేళే నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వాతంత్య్రానికి మరోసారి సంకెళ్లు వేశారు. మార్చి 21, 1977న మళ్లీ దేశంలో స్వేచ్ఛావాయువులు వీచాయి. ఇది జరిగి 47 ఏళ్లు కావచ్చు. అయినా దేశం నిరంతరం గుర్తు చేసుకోవలసిన ఘట్టం అత్యవసర పరిస్థితి విధింపు. నియంతృత్వం, కుటుంబ పాలన వారసత్వంగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ అత్యవసర పరిస్థితి విధింపు అనే ఒక మహా చారిత్రక తప్పిదానికి పాల్పడింది. కానీ ఆ పార్టీ, దాని తైనాతీలు ఇవాళ అప్రకటిత అత్యవసర పరిస్థితి రాజ్యమేలుతోందని అదే పనిగా గగ్గోలు పెట్టడమే వింత.

రాజ్యాంగంలోని 352 అధికరణం, క్లాజ్‌ (1) ‌రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితిని విధించే విశేష అధికారాలను కట్టబెడుతున్నది. 1962లో చైనా దురాక్రమణ సమయంలో, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తున్నప్పుడు బాహ్య అత్యవసర పరిస్థితి విధించారు. అది రాజ్యాంగం ప్రకారం జరిగింది. అందులో దేశ ప్రయోజనాలు సుస్పష్టం. రక్షణ, సైనిక వ్యవహారాలకు సంబంధించిన కొన్ని వార్తల మీద ఆంక్షలు వచ్చాయి. కానీ 1975 నాటి ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధింపులో సమున్నత ఆశయాలు లేవు. దాని స్వరూపం స్వార్థం. స్వభావం రాక్షసం. ఆ సంవత్సరం జూన్‌ 12‌న అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పు అత్యవసర పరిస్థితి విధింపునకు తక్షణ కారణం. 1971 ఎన్నికలలో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఇందిర అక్రమాలకు పాల్పడినందుకు ఆ ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌జగ్‌మోహన్‌లాల్‌ ‌సిన్హా తీర్పు చెప్పారు. ఈ తీర్పు మీద స్టే ఇవ్వవలసిందంటూ ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ షరతులతో కూడిన స్టే మాత్రమే వచ్చింది. అలాంటి క్లిష్ట సమయంలో కేవలం తన పదవిని కాపాడుకోవడానికే ఇందిర అత్యవసర పరిస్థితికి సిఫారసు చేశారు. నాటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి కూడా ఈ విషయం మరునాడు పత్రికలు చూశాకే తెలిసింది. జూన్‌ 25 ‌రాత్రి వేళ హోంశాఖ సహాయ మంత్రి ఓం మెహతా అత్యవసర పరిస్థితి విధింపు పత్రం మీద రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ‌చేత సంతకం చేయించుకు వచ్చారు. ఈ చావు సలహా ఇచ్చినవారు నాటి బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి ఎస్‌ఎస్‌ ‌రే.

ఆ రాత్రే జయప్రకాశ్‌ ‌నారాయణ్‌, ‌మొరార్జీ దేశాయ్‌, ‌కేఆర్‌ ‌మల్కానీ వంటి వారిని ఢిల్లీలో ఉగ్రవాదులను అరెస్టు చేసిన తీరులో నిర్బంధించారు. ఫిరాయింపుల నిరోధక బిల్లు మీద శాసనసభ్యుల అభిప్రాయాల కోసం అధికారికంగా బెంగళూరు వెళ్లిన అటల్‌ ‌బిహారీ వాజపేయి, ఎల్‌కె అడ్వాణిలను అక్కడ ‘శాంతిభద్రతలకు విఘాతం’ ఆరోపణతో అరెస్టు చేశారు. ఇక అరెస్టుల పరంపర కొనసాగింది. ప్రజాస్వామ్యం కోసం ప్రాణం పెట్టే కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పుకునే ఇందిర మొదట వేటు వేసినది పత్రికా రంగం మీదే. ప్రతిష్టాత్మకమైన ‘శంకర్స్ ‌వీక్లీ’ సహా ఎన్నో పత్రికలు మూతపడ్డాయి. ప్రతిపక్ష నేతలు ఎక్కడి జైళ్లలో మగ్గుతున్నారో కూడా తెలియలేదు. న్యాయ వ్యవస్థ మీద బదలీల సమ్మెట పదే పదే పడింది. ప్రధాని మన్‌కీ బాత్‌లో అత్యవసర పరిస్థితి బాధితునిగా గాయకుడు కిశోర్‌కుమార్‌ ‌పేరును మచ్చుకి చెప్పి ఉండవచ్చు. కానీ ఆ కాలంలో జరిగిన అరాచకాలు ఎలాంటివో షా కమిషన్‌ ‌వెల్లడించింది. కాంగ్రెస్‌ ‌లీలలే ఇతివృత్తంగా వచ్చిన ‘కిస్సా కుర్సీకా’ చలనచిత్రం సెన్సార్‌ ‌కత్తెరకు కాకుండా, ‘చేతి’ కత్తెరతో ఛిద్రమైంది. ఇందిర జీవిత జాడలు కనిపించే ‘ఆంధీ’ చిత్రం థియేటర్లకు కాదు, దిక్కూ దివాణం లేకుండా పోయింది.స్నేహలతారెడ్డి, రాజన్‌ ‌మరణాలు, లారెన్స్ ‌ఫెర్నాండెజ్‌ ‌సహా వేలాది మంది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు ఆ కాలంలో చవిచూసిన థర్డ్ ‌డిగ్రీ హింస దేశం ఏనాటికీ మరచిపోదు. ఇవే కాదు, టర్క్ ‌మెన్‌ ‌గేట్‌ ఉదంతం, బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, రాజ్యాంగేతర శక్తిగా పేరు తెచ్చుకున్న సంజయ్‌గాంధీ విన్యాసాలు ఒక జాతి ఆత్మను ఎంతగా గాయపరచగలవో, అంతగానూ గాయపరిచాయి. వ్యక్తిపూజకు అదొక పరాకాష్ట. నాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే బారువా, ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా అని కొత్త నినాదం అందుకున్నాడు.

ఇప్పుడు చాలా తప్పిదాలను సమర్థించుకునే తెంపరితనం కాంగ్రెస్‌లో, ఇతర విపక్షాలలో బలిసిపోయింది. అత్యవసర పరిస్థితిని కూడా సమర్థించుకోవడానికి దారులు వెతుకుతున్నట్టే ఉంది. ఇందుకు చత్తీస్‌గడ్‌ ‌కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుశీల్‌ ‌శుక్లా ప్రకటన నిదర్శనం. అత్యవసర పరిస్థితి విధింపు అవకాశాన్ని రాజ్యాంగమే ఇచ్చింది కదా అంటూ వీర తర్కం లేవదీసే ప్రయత్నం జరుగుతోంది. అత్యవసర పరిస్థితి తరువాత కాంగ్రెస్‌ ఓడిపోయింది. జనతా తప్పిదాల వల్ల మళ్లీ గెలిచి ఉండవచ్చు. కానీ అత్యవసర పరిస్థితి పేరుతో ప్రజాస్వామిక వ్యవస్థకి ఆ పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వం చేసిన చేటుకు జాతికి క్షమాపణ చెప్పవలసి ఉంది. ‘ప్రగతిశీల’ కాంగ్రెస్‌ను ఆ సమయంలో అంటకాగిన సీపీఐ కూడా క్షమాపణ చెప్పాలి. అత్యవసర పరిస్థితి పేరుతో జరిగిన అత్యాచారాలు వ్యవస్థ స్ఫూర్తిని దారుణంగా దెబ్బతీశాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్‌, ‌సీపీఐ అంత హేయమైన చర్యకు పాల్పడినందుకు జాతి ముందు తలవంచి తీరాలి.

About Author

By editor

Twitter
Instagram