సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌జ్యేష్ఠ  బహుళ చతుర్దశి – 27 జూన్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భారతదేశంలో ప్రతిపక్షాలు వాటి కర్తవ్యాన్ని ఏనాడో విస్మరించాయి. ఇప్పుడు వాటి కార్యక్రమాలు రెండే. వాటి కోసమే అవి చావో రేవో అన్నంత పట్టుదలతో పోరాడుతున్నాయి. ఒకటి -ఎన్నికలొస్తే బీజేపీని ఓడించడానికి వ్యూహాలు వెతకడం. రెండు – బీజేపీ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా దానిలో రంధ్రాన్వేషణ చేయడం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు; ప్రాంతీయంగా తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌తెరాస, ఆప్‌, ‌జేఎంఎం, ఎంఐఎం ఏ పార్టీ చూసినా ఇదే వైఖరి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ బహుశా తొలిసారి ప్రతిపక్షాలకు వాటి కర్తవ్యం ఏమిటో గుర్తు చేసే విధంగా ఢిల్లీ, బెంగళూరులలో రెండు వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి మంచి తలపెట్టినా, ఎంత సదుద్దేశంతో మొదలుపెట్టినా ప్రతిపక్షాలు అందులో రాజకీయాలు వెతకడం ఈ దేశ దౌర్భాగ్యం అంటూ ఢిల్లీలో మోదీ కాస్త కటువుగానే వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దీర్ఘకాలంలో అవి దేశానికి ఎంతో మేలు చేసేవే అని బెంగళూరులో వివరించవలసి వచ్చింది.

2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి, అతిశయోక్తి కాదు, మరుక్షణం నుంచే చాలా వరకు ప్రతిపక్షాలు ఇలాంటి విధ్వంసక వైఖరిలోనే ప్రయాణిస్తున్నాయి. అవార్డు వాపసీ, గోరక్షకుల హత్యలు, సీఏఏ వ్యతిరేక ఆందోళన పేరుతో షాహీన్‌బాగ్‌ -1 ‌తమాషా, రైతు సంస్కరణలకు వ్యతిరేకత పేరుతో షాహీన్‌బాగ్‌-2, ‌తాజాగా అగ్నిపథ్‌ ‌వ్యవహారం ఇవన్నీ ఎలాంటి ముందుచూపు లేకుండా ప్రతిపక్షాలు, కొన్ని విధ్వంసకర ఎన్‌జీవోలు చేపట్టినవే. త్రివర్ణ పతాకాలు, గాంధీజీ పటాలు పెట్టుకుని మరీ షాహీన్‌బాగ్‌ ‌గుడారంలో దేశాన్ని విభజించడం గురించి ఉపన్యాసాలు ఇప్పించిన తుంటరితనం ఈ పార్టీలది. గణతంత్ర దినోత్సవంలోనే ఎర్రకోట మీద దాడి చేసిన దుందుడుకుతనం కూడా వీటికే సొంతం.ఆ దాడులలోనే కాదు, అగ్నిపథ్‌ ‌దాడులలో దేశానికీ, రైల్వేలకీ, ఇతర ప్రభుత్వ సంస్థలకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్ల చేసిన రాక్షస గణాలను నిస్సిగ్గుగా సమర్థించే తెంపరితనానికి కూడా ఇవి వెనకాడడం లేదు. అంతేనా! దారుణ హత్యకో, అంతకంటే దారుణంగా సామాజిక వివక్షకో గురైన వ్యక్తి వర్గాన్ని బట్టి ప్రతిపక్షాల ఉద్యమాలు నడుస్తున్న సంగతి మరచిపోరాదు. ఏ మహిళ మీద లైంగిక అత్యాచారం జరిగినా అది ఘోరమే. కానీ మహిళ సామాజిక వర్గాన్ని బట్టి, మతాన్ని బట్టి ఆ ఘోరాన్ని ఖండించే నీచ పక్షపాత ధోరణి కూడా విపక్షాలలో సర్వసాధారణమైంది. బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికై వచ్చినదన్న కనీస జ్ఞానాన్ని కూడా అవి విస్మరిస్తున్నాయి. ఎన్నికలలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి, దానికి కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చిందన్న ఇంగిత జ్ఞానం కూడా విపక్షాలలో ఇంకిపోయింది. కోర్టులు చెప్పిన మాటను గౌరవించాలన్న సంస్కారానికి బీజేపీ వ్యతిరేకతా మంత్రంతో అవి ఎప్పుడో నీళ్లు వదిలిపెట్టాయి. పార్లమెంటు లేదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కే గూండాగిరిని అవి ఆశ్రయిస్తున్నాయి. అగ్నిపథ్‌ ‌పథకం వెనక్కి తీసుకోకుంటే రక్తపాతం తప్పదని గొంతు చించుకున్నాడొక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. సైన్యంలో చేరాలనుకున్న తమకు అన్యాయం జరిగిపోతున్నదంటూ యువకులు విధ్వంసం సృష్టించడం సబబే అంటాడో ముస్లిం మతోన్మాదం, బీజేపీ వ్యతిరేకత తలకెక్కిన ఓ మౌల్వీ. ఇతడి పేరు తౌకీర్‌. ఉం‌డేది ఉత్తరప్రదేశ్‌లోనే. ఇతడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోను దేశం మరోసారి విడిపోతుందంటూ తాటాకు చప్పుళ్లు చేశాడు.

దేశాన్ని రక్షించే సైన్యాన్నీ, వారి త్యాగాలనీ అతి నీచంగా కించపరిచే దుష్ట సంస్కృతికి దాదాపు ప్రతి ప్రతిపక్షం దిగజారింది. సర్జికల్‌ ‌స్ట్రైక్స్‌ను కూడా రాహుల్‌, ‌మమత, కేజ్రీవాల్‌ ఎద్దేవా చేసిన సంగతి దేశం మరచిపోలేదు. అగ్నిపథ్‌కు ఎన్నికైనవారు నాలుగేళ్ల తరువాత బయటకు వస్తారు, వాళ్లంతా ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ గూండాలుగా ఉపయోగపడతారని పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం దానికి కొనసాగింపు. వీళ్లే ఇప్పుడు సైన్యంలో చేరబోయే యువకులకు అన్యాయం జరిగిపోతున్నదంటూ వీరంగం వేస్తున్నారు. సుబోధ్‌కాంత్‌ ‌సాహే అనే కేంద్ర మాజీ మంత్రి మోదీకి పిల్లి శాపనార్థాలు పెట్టడం పరమ రోతగా, జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌ప్రాపకంలో కాలక్షేపం చేస్తున్న ఈ నాయకుడిని ప్రజలు మూడు దశాబ్దాల క్రితమే చెత్తబుట్ట చిరునామాకు విసిరేశారు. హిట్లర్‌ ‌నియంత పోకడలను వీడకుంటే, మోదీకి కూడా హిట్లర్‌ ‌చావు తప్పదని సాహే శాపనార్థాల సారాంశం. ప్రతిపక్షాల ఈ వైఖరితోనే భారత వ్యతిరేకతతో, హిందూద్వేషంతో కుళ్లిపోతున్న కొందరు ముస్లిం మతోన్మాదులకు బలం చేకూరుతోంది.

బీజేపీని ఓడించాలంటే, మోదీని గద్దె దించాలంటే రాజ్యాంగబద్ధమైన మార్గాలు ఉన్నాయి. అందుకు ప్రజలను సమీకరించాలి. ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శించాలి. అంతకంటే ముందు రాజ్యాంగం పట్ల నిబద్ధతనీ, ప్రజాస్వామ్యం మీద తమ భక్తిని చాటాలి. దురదృష్టవశాత్తు రాజ్యాంగబద్ధమైన ఏ ఒక్క మార్గాన్ని అనుసరించడానికి ఇవాళ్టి ఒక్క ప్రతిపక్షం కూడా సిద్ధంగా లేదు. అరాచకాన్ని సృష్టించడం, దేశాన్ని అల్లకల్లోలం చేయడం, సెక్యులరిజం పేరుతో మైనారిటీలను మెజారిటీల మీదకు ఉసిగొల్పడం, కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ ముద్ర గుద్ది చెలామణి చేసుకుంటూ ఢిల్లీ పైసా విదల్చడం లేదని శాపనార్థాలు పెట్టడం ఇదీ ఇవాళ ప్రతిపక్షాలు దేశంలో చేస్తున్న నిర్వాకం. ప్రజలు వీళ్లకి దేశాన్ని అప్పగిస్తారా? ఏం చూసి?

About Author

By editor

Twitter
Instagram