సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌జ్యేష్ఠ  బహుళ సప్తమి – 20 జూన్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


సరిగ్గా వందేళ్ల క్రితం గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకత్వంలో మొదటిసారి దేశవ్యాప్తంగా సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ప్రయోగించారు. స్వరాజ్య సమరంలోకి ఆ విధంగా ఆయన ప్రవేశించారు. కానీ ఇవాళ్టి అంగుష్ట మాత్రుల కాంగ్రెస్‌ ‌గాంధీలు జూన్‌ 13‌న సత్యాగ్రహం అనే ఆ ఆయుధానికి నూరేళ్లు నింపి, శాశ్వతంగా శవపేటికలో పరుండబెట్టారు. ‘నేషనల్‌ ‌హెరాల్డ్’ ‌పత్రిక అక్రమ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జూన్‌ 13‌న కాంగ్రెస్‌లో మకుటం అక్కరలేని మహారాజు రాహుల్‌ ‌గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌ముందు హాజరు కావడానికి వెళుతూ చేసిన హంగామాకు సత్యాగ్రహం అని పేరు పెట్టడం గాంధీజీపట్ల చేసిన తీవ్ర అపచారమే. స్వాతంత్య్రంవచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమృతోత్సవాలు నిర్వహిస్తూ ఉంటే, కాంగ్రెస్‌ ఈ ‌రీతిలో స్వాతంత్య్ర అవమానోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఒక కుటుంబం రక్షణ కోసం, ఆ కుటుంబం ఆర్థిక అవకతవకలను కప్పిపుచ్చడం కోసం కాంగ్రెస్‌ ‌శ్రేణులు కష్టపడ్డాయి.

స్వాతంత్య్రోద్యమ కాలంలో పత్రికలకు స్వేచ్ఛ లేదు. అయినా తెగించి  భారతీయ వాణిని వినిపించేందుకు ఎన్నో పత్రికలు తమ వంతు త్యాగాలు చేశాయి. అలా నెలకొల్పిన పత్రికలలో ఒకటి ‘నేషనల్‌ ‌హెరాల్డ్’. ‌దీని స్థాపనకు నెహ్రూ చొరవ చూపించి ఉండవచ్చు. కానీ 5000 మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇందులో వాటాదారులు. ఈ వాటాదారుల సంఘమే అసోసియేటెడ్‌ ‌జర్నల్స్ ‌లిమిటెడ్‌. 1937‌లో ఆరంభమైన ఈ పత్రిక ఆదాయం వేలాది కోట్ల రూపాయలకు చేరింది. కాలం మారింది. కాంగ్రెస్‌ ఇం‌కా మారింది. ఫలితం నేషనల్‌ ‌హెరాల్డ్‌కు దాదాపు రూ. 90 కోట్లు నష్టాలు వచ్చాయి. సరిగ్గా ఇక్కడే యువనేత రాహుల్‌, ఆయన తైనాతీలు చావు తెలివితేటలు ప్రదర్శించారు. మొదట అసోసియేటెడ్‌ ‌జర్నల్స్ ‌లిమిటెడ్‌ ‌సంస్థకు నష్టాలు పూడ్చుకునేందుకు కాంగ్రెస్‌ ‌రూ. 90 కోట్లు రుణం ఇచ్చింది. దీనికి వడ్డీ లేదు. ఈ అన్ని బకాయిలు వసూలు చేసే పని కోసమంటూ యంగ్‌ ఇం‌డియన్‌ ‌లిమిటెడ్‌ ‌పేరుతో ఒక సంస్థను సృష్టించారు. 2010లోనే పుట్టిన యంగ్‌ ఇం‌డియన్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థకు జర్నల్స్ ‌లిమిటెడ్‌ ఆస్తులన్నీ ఎలాంటి సంకోచం లేకుండా బదలీ చేసేశారు. ఇంతకీ యంగ్‌ ఇం‌డియన్‌ ‌లిమిటెడ్‌ ‌సంస్థలో 76 శాతం వాటాలు తల్లి గాంధీవీ, కొడుకు గాంధీవే. మిగిలినవి కూడా ఎవరో బయటివారికి ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ‌భజనపరుల పేరుతోనే ఉన్నాయి. ఇంత పెద్ద ఆర్థిక విన్యాసం చేసిన వారు మోతీలాల్‌ ఓరా. ఇదీ ఇందులో ఉన్న మతలబు. నెహ్రూ స్థాపించిన పత్రిక ఆస్తులు రాహుల్‌ ‌గాంధీ చేతికి అలా వచ్చే ఏర్పాటు జరిగింది. నేషనల్‌ ‌హెరాల్డ్ ఎలాగూ నెహ్రూయే స్థాపించారు కాబట్టి ఆ పత్రిక ఆస్తులు ఆ కుటుంబపరం కావడం ఎంతమాత్రం తప్పు కాదన్న గట్టి నమ్మకంతోనే సోనియా, రాహుల్‌ ఇం‌తకు తెగించారనిపిస్తుంది.

 భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది తామే కాబట్టి, ఈ దేశానికి ఎప్పటికీ తమ కుటుంబీకులే ప్రధానులుగా ఉండాలన్న వజ్ర శిలా సదృశమైన సంకల్పంతో బతికేస్తున్న గాంధీ-నెహ్రూ కుటుంబీకులకు ఇదొక లెక్క కాదు. భారతదేశానికి అవినీతి తెగులును అంటించిన ఘనత శ్వేతజాతీయులకు దక్కుతుంది. కానీ స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ నీతిమాలిన రివాజును నిర్విఘ్నంగా కొనసాగిం చిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీకే దక్కుతుంది. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ఆ పార్టీకి, ఆ కుటుంబానికి కూడా ఇలాంటి అవినీతి చిట్టా ఉంది. నెహ్రూ హయాంలో జీపుల కొనుగోలులో అవినీతి జరిగింది. కట్టలు చేతులు మారాయి. ఇక ఇందిరాగాంధీ హయాం ఒక అవినీతి రాజ్యమే. ఏఐసీసీ సమావేశాలలో పీసీ సేథి వంటి నాయకులు మనవాళ్లు తరతరాలకు సరిపోయేంత సంపాదిస్తున్నారు, ఈ తెగులు వదిలితేనే పార్టీకి పుట్టగతులు ఉంటాయి అని 1975 ప్రాంతంలోనే హెచ్చరించారు. నగార్‌వాలా ఉదంతం, బ్యాంకుల నుంచి రుణమేళాలు… ఒకటేమిటి వందల అక్రమాలు ఆమె హయాంలో జరిగాయి. ఇక బొఫోర్స్ ‌మచ్చ నుంచి ఇప్పటికీ రాజీవ్‌ ‌గాంధీ బయటపడలేదు. తరువాత పీవీ నాయకత్వంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక నేరాలు తక్కువేమీ కాదు. మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వ హయాంలో జరిగిన బాహుబలి అక్రమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇంతకీ నేషనల్‌ ‌హెరాల్డ్ ఆర్థిక అవకతవకల గురించి బయటపెట్టినదీ, ప్రచారం చేసినదీ బీజేపీ మాత్రం కాదు. 1971 ఎన్నికల అవకతవకల కేసులో ఇందిరకు వ్యతిరేకంగా, రాజ్‌నారాయణ్‌ ‌తరఫున వాదించిన శాంతిభూషణ్‌, ‌సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఈ చీకటి కోణాన్ని వెలికి తీశారు. బీజేపీ నాయకుడు డా. సుబ్రహ్మణ్యస్వామి దానిని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లి, బీజేపీకి పెద్ద అస్త్రాన్ని అందించారు.

కాంగ్రెస్‌ను చూస్తే బీజేపీకి భయమనీ, అందుకే నిఘా వ్యవస్థలను దుర్విని యోగం చేస్తూ నెహ్రూ కుటుంబం పరువును రచ్చకీడుస్తున్నారనీ కాంగ్రెస్‌ అధికార చెక్కభజనపరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో రాహుల్‌ ‌గాంధీ ఏ తప్పు చేయలేదని నమ్మితే ఇంత రాద్ధాంతం ఎందుకు? ఆ మధ్య ఇదే కేసులో ఈడీ సమన్స్ ఇస్తే, సోనియాకు వెంటనే కరోనా సోకింది. మరోసారి హాజరు కావలసిందేనని ఈడీ తాజాగా సమన్స్ ఇచ్చింది. అప్పుడు కరోనాలో ఏ రకం వైరస్‌ ‌వస్తుందో చూడాలి. ఈడీ ముందుకు వస్తూ రాహుల్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పెంపుడు జీవులు చేసిన హడావిడి చూస్తే భవిష్యత్తులో ఇంకొన్ని విపరీ తాలూ చూడక తప్పదని అనిపిస్తున్నది. అత్యవసర పరిస్థితి (1975-77) విధించడం చారిత్రక అవసరం అంటూ ప్రదర్శనలు జరిగినా ఆశ్చర్యపోనక్కర లేదు. తుర్కుమన్‌ ‌గేట్‌ ఉదంతం మా ఘనతేనని చాటుకున్నా అంతే. సిక్కుల ఊచకోత సరైనదేనంటూ కాంగ్రెస్‌ ‌గణాలు వీధులెక్కే దృశ్యాలూ చూడవలసి రావచ్చు.

About Author

By editor

Twitter
Instagram