సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ఆషాడ శుద్ధ ద్వాదశి – 11 జూలై 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


మహారాష్ట్ర పరిణామాలు ఆధునిక భారత రాజకీయాలకీ, రాజకీయ పక్షాలకీ కూడా గుణపాఠమే. మితవాద పార్టీలకే కాదు, నేతి బీరలో నేయి చందంగానే ఉన్న ‘అతివాద’ పార్టీలకు కూడా అవి చక్కని గుణపాఠాలే. ఏ పార్టీ అయినా తనదైన పంథానూ, ముద్రనూ గాలికొదిలేసి, ఆ పార్టీల వ్యవస్థాపకుల ఆశయాలకు నీళ్లొదిలేసి అధికారం కోసం వెంపర్లాడితే వాటి మరణశాసనం అవి స్వయంగా రాసుకున్నట్టే. కొత్త అవతారం కోసం వాతలు పెట్టుకుంటే, తోకలు కత్తిరించుకుంటే, కొమ్ములు మొలిపించుకుంటే అధోగతి తప్పదు. పగలు యాంటీ నాచ్‌, ‌రాత్రి ప్రోనాచ్‌ అన్నట్టు, హిందూధర్మం దగ్గర సెక్యులరిజం, మైనారిటీల దగ్గర బుజ్జగింపు పాట పాడితే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే. మహారాష్ట్రలో శివసేన ఇటీవలి పతనంలో ఇదే కనిపిస్తుంది. శివసేన గుర్తు పులి. దానికి చారలు చెరిపేసి, కోరలు పీకేసి మచ్చల పిల్లిని చేస్తే తాత్కాలికంగా సింహాసనం దక్కిందేమో కానీ, పరువు మాత్రం శాశ్వతంగా పోయింది. ఇంతటి హిందూత్వ అభిమానం కూడా ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురైనా నోరు విప్పలేకపోయింది.

1966లో కేవలం బొంబాయి కేంద్రంగా ఏర్పడిన పార్టీ శివసేన. బయటివారు వర్సెస్‌ ‌మరాఠా అన్న నినాదం ఆ పార్టీకి బలం, బలహీనత కూడా. క్రమేణా అలాంటి ముద్ర నుంచి బయటపడడానికి అది చాలా కష్టపడవలసి వచ్చింది. కానీ శివసేన మౌలిక సిద్ధాంతం హిందుత్వం, హిందూ జాతీయవాదమే. 1980 దశకంలో పార్టీ అనూహ్యంగా ఎదిగింది. ఆ క్రమంలోనే బీజేపీకి దగ్గరయింది. అయోధ్య ఉద్యమంలో దూకుడుగా వ్యవహరించింది కూడా. డిసెంబర్‌ 5,1992‌న ఆ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ చేసిన వ్యాఖ్యలు ఇందుకు చిన్న ఉదాహరణ. ‘అయోధ్య వెళుతున్న ఒక్కొక్క శివసైనికుడు ఎలా కనిపించారు? ఏనుగు కుంభస్థలం మీదకి లంఘించే కొదమసింహంలా భాసించలేదా? కొండను పిండి చేయడానికి ఉరుకుతున్న ఖడ్గమృగంలా కనిపించలేదా? ఈ హిందూవీరులకు మన ఆశీస్సులు అందించాలి…’ ఇలా సాగింది. సోనియా గాంధీ మీద బాల్‌ ‌ఠాక్రే ఆగ్రహం ఎలాంటిదో తెలిసిందే. జూన్‌ 2010‌లో జనగణన సందర్భంగా ఆయన ఇలా రాశారు, ‘కులం సంగతి పక్కన పెట్టండి. సోనియా గాంధీ తన మతం ఏదని చెబుతుంది? ఇది జాతికి తెలియాలి’ అని. దసరా సందర్భంగా బాల్‌ ‌ఠాక్రే ఇచ్చే ఉపన్యాసాల వాడి వేడి కూడా దేశానికి తెలిసినదే. ‘మనని మొగలాయిలు 600 ఏళ్లు ఏలారు. బ్రిటిష్‌ ‌వాళ్లు 150 ఏళ్లు పాలించారు. మనలో ఒకరు ఎదిగి వచ్చి పాలన చేపడితే అది మనకు నచ్చదు. మనం దిగుమతి చేసుకున్న నాయకులనే ఇష్టపడతాం’ అన్నారు, 2007లో. ఈ వ్యాఖ్య సోనియా భారతదేశ నాయకత్వం కోసం అర్రులు చాస్తున్న సమయంలో చేసినదే. బాల్‌ ‌ఠాక్రే చనిపోవడానికి కాస్త ముందు, నవంబర్‌ 17, 2012‌న సోనియా, రాహుల్‌, ‌ప్రియాంక, రాబర్ట్ ‌వాద్రా, అహ్మద్‌ ‌పటేల్‌ని ఉద్దేశించి, ‘ఈ ఐదుగురిని నాశనం చేయాలి. దేశం నుంచి బయటకి విసిరివేయాలి’ అన్నారు. ఆఖరికి బాల్‌ ‌ఠాక్రే కన్నుమూసిన రెండేళ్ల తరువాత కూడా జనవరి, 2015లో రాజ్యాంగ పీఠిక నుంచి ‘సెక్యులర్‌’,‘‌సోషలిస్ట్’ ‌పదాలను తొలగించాలని శివసేన వ్యాఖ్యానించింది. ఆనాటి వరకూ కూడా అదే ఆ పార్టీ వైఖరి. శివసేన దృష్టిలో భారత్‌ అం‌టే హిందూదేశమే. కాబట్టి ఆ పదాలు ఈ దేశానికి అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఆ రెండు మాటలను 1976లోనే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన సంగతి తెలిసిందే.

1985 నాటికి ఆ పార్టీ బొంబాయి, థానేలను దాటి కొంత విస్తరించింది. గణేశ్‌ ఉత్సవాలకు సర్వం తానే అయింది. వీధులలో మహా హారతులు పట్టే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. ఆఖరికి తిలక్‌ ‌మహరాజ్‌ ‌ప్రారంభించిన సామూహిక గణేశ్‌ ఉత్సవాలు శివసేన సొంత ఉత్సవాలన్నట్టే కనిపించాయి. ఇది ఆ పార్టీ హిందూత్వ ముద్రకు తిరుగులేని రుజువు. 1985లో బీజేపీ, సేనలకు కలిపి 16 స్థానాలే ఉన్నాయి. 1989లో ఆ రెండు పార్టీలు కలిశాయి. కానీ శివసేన కొన్ని పోకడల ప్రభావం మహారాష్ట్ర శాఖ మీద పడకుండా బీజేపీ జాగ్రత్త పడిందనే చెప్పాలి. కొన్ని విషయాలలో ఎవరి అభిప్రాయాలు వారివి అన్న రీతిలో వ్యవహరించి, ఎవరి ఉనికిని వారు సుస్థిరంగా ఉంచుకున్నారు. 1991లో ఆ రెండు పార్టీల కూటమికి 94 స్థానాలు వచ్చాయి. 1995లో 138 సీట్లు సాధించి కాంగ్రెస్‌ ‌పార్టీకి అధికారం దక్కకుండా చేశాయి. 2019 ఎన్నికల తరువాత పరిణామాలు, వాటి పర్యవసానమని అనుకోదగిన నిన్న మొన్నటి మార్పులు తెలిసినవే. ఇప్పుడు శివసేన దాదాపు ఠాక్రేల నుంచి బయటపడుతుందనే అనిపిస్తుంది. ఉద్ధవ్‌ ‌మంత్రిమండలిలోకి తీసుకున్న ఇద్దరు మంత్రులు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు.

ఉద్ధవ్‌ ‌ఠాక్రే నిస్సందేహంగా తండ్రి ఆత్మను క్షోభ పెట్టారు. శివసేనను మట్టుపెట్టడమే బీజేపీ ధ్యేయమని తొందరపాటుగా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం పరిణామంలో శల్య సారథ్యం వహించిన శరద్‌ ‌పవార్‌ ‌పార్టీ ఎన్‌సీపీకి ఏమీ కాలేదు. కానీ శివసేనకి ఈ రెండేళ్లలోనే చేయగలిగినంత చేటు చేసేశారు. అసెంబ్లీలో నాలుగో స్థానంలో కాంగ్రెస్‌కూ ఏమీ జరగలేదు. ఇక బీజేపీ తన ఉనికిని తాను కాపాడుకుంది. అంటే శివసేన మాత్రమే గదాఘాతానికి గురైంది. బాల్‌ ‌ఠాక్రే, ఆయన నాయకత్వంలోని శివసేన ఉద్దేశాలు, వజ్రసదృశమైన విశ్వాసాలు తెలిసి కూడా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ ఏ ‌ముఖం పెట్టుకుని ఆ పార్టీతో కలసి అధికారం పంచుకున్నాయి? ఈ ప్రశ్న అధికార యావ తప్ప, సిద్ధాంతాలు, నీతి, నిజాయితీ ఏమీ లేని ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లను అడగాలి. అదే సమయంలో శివసేనను కూడా అడగడం మరచిపోకూడదు.

About Author

By editor

Twitter
Instagram