– జి. వల్లీశ్వర్‌

‘‌నాన్న గారు, నేను ప్లీడరు గారి దగ్గర మానే శాను.’ 23 ఏళ్ల కొడుకు కృష్ణమూర్తి దృఢచిత్తంతో తండ్రికి చెబుతున్నాడు.

పట్టణంలో కులపెద్ద (సభాపతి) హోదాతో మర్యాదలు అందుకునే తండ్రి గుండు వేంకట్రామ దీక్షితులు చివాల్న తలెత్తి చూశాడు కొడుకుకేసి. కాని కొడుకు వీధి గుమ్మం కేసి చూస్తున్నాడు.

‘ఏం ఏమైంది? ప్లీడర్‌ ‌శర్మగారు ఏమన్నా అన్నారా?’

‘ఏమీ అనలేదు.’

‘మరి? నీ గుమాస్తా ఉద్యోగానికి ఆయనిచ్చే ఆ నాలుగు రూపాయలు ఎందుకు వదులుకుంటున్నావ్‌? ‌మానేసి ఏం చేద్దామనుకుంటున్నావ్‌?’

‘‌మన కుటుంబం గడవటానికి ఏలూరు స్టేషన్‌ ‌దగ్గరున్న ఆ రెండెకరాలు చాలు కదా!’

తండ్రి ప్రశ్నకి సమాధానం అదికాదు. ఎందుకు మానేస్తున్నాడు?

‘ఆయనే పొమ్మన్నాడా? సత్యసంధుడివి కదా!’

 కొడుకు తండ్రి కళ్లల్లోకి చూశాడు. ‘ఆయన పొమ్మనలేదు. గాంధీగారు రమ్మన్నారు’ అంటూ వీధిలోకి వడివడిగా నడిచాడు. అక్కడ్నుంచి ఏలూరులో మోహన్‌దాస్‌ ‌కరమ్‌చంద్‌ ‌గాంధీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ఆఫీసుకి వేగంగా వెళ్లిపోయాడు.

ఇదంతా 1921 జనవరిలో తూర్పువీధిలోని గజవల్లివారి చెరువు దగ్గర ‘రామయ్య గారు’ అని ఊరంతా గౌరవంగా పిలుచుకునే వెంకట్రామ దీక్షితులు గారి ఇంటి దగ్గర జరిగిన సంఘటన.

కృష్ణమూర్తి తన తండ్రికి ఒక్కడే కొడుకు. అప్పటికే పత్రికల్లో గాంధీ గారి పిలుపుతో ఉత్తేజితు డైన ఆ కొడుక్కి – దేశానికి దాస్యపు సంకెళ్లు, తిలక్‌, ‌పటేల్‌, ‌గాంధీ వంటి నాయకుల పిలుపులు మనసుని లాగేస్తుంటే, ప్లీడర్‌ ‌గుమాస్తా ఉద్యోగానికి ఉద్వాసన చెప్పేశాడు.

కాంగ్రెస్‌ ఆఫీసుకి వెళ్లగానే, అక్కడ తెలిసున్న స్నేహితుడు జిల్లా నాయకులకు కృష్ణమూర్తిని పరిచయం చేశాడు.

‘రామయ్య గారి అబ్బాయా!’ అంటూ వాళ్లు స్వాగతం చెప్పారు. గాంధీ పర్యటనకు సంబంధించి కృష్ణమూర్తికి బాధ్యతలు కూడా అప్పగించారు.

1921 మార్చిలో గాంధీ చేసిన ఆ పర్యటన ప్రధాన లక్ష్యం ‘తిలక్‌ ‌స్వరాజ్య నిధి’కి విరాళాలు సేకరించటం. నేటికి వందేళ్ల క్రితం ఒక రూపాయి సేకరించడమంటే ఇవాళ లక్ష రూపాయలు సేకరించినట్లే. అలా ప్రారంభమై, గాంధీజీ పర్యటన పూర్తయ్యేసరికి-ఉద్యమంలో పూర్తిగా మమేక మయ్యారు. క్రమశిక్షణ గల  సమరయోధు డిగా కృష్ణమూర్తి  పనిచేశారు. సుప్రభాతాన స్నానం, జపం ముగించుకొని కాంగ్రెస్‌ ఆఫీసుకి వెళ్లటం, పికెటింగ్‌, ‌సత్యాగ్రహం, దీక్షా శిబిరాలు ఉండే చోటికి మిగతా దళసభ్యులతో కలిసి వెళ్లిపోవటం ఇదే నిత్యకృత్యం. అనేకసార్లు జరిగిన లాఠీచార్జిల్లో తగిలిన దెబ్బలతో ఒళ్లంతా రక్తసిక్తమయేది. అలా ఇంటికొచ్చేసరికి తల్లి ఆ రక్తం చూసి ఏడుస్తూండేది.

అనేకసార్లు పోలీసులు కృష్ణమూర్తిని నిర్బంధించి, రామయ్య గారి కొడుకని తెలిసి మందలించి వదిలేసేవారు. ఒకసారి మాత్రం పికెటింగ్‌ ‌తీవ్రంగా జరిగింది. ఆ దళం మొత్తాన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు స్టేషనులో ఉండగా తండ్రి వెళ్లారు. రామయ్య గారిని చూసి ఇన్స్పెక్టరు ‘రామయ్య గారు! మీ అబ్బాయి చదివిన హైస్కూలు చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది. అది చూసుకోక ఈ పికెటింగులు, కేసులు ఎందుకండీ? స్వాతంత్య్రం వచ్చేనా? చచ్చేనా? తీసుకెళ్లండి’ ఉచిత సలహా ఇచ్చాడు. అలా హితవు చెప్పి వదిలేస్తే కృష్ణమూర్తి ఒప్పుకోలేదు. ‘నాతోపాటు అరెస్టు అయినవాళ్లందర్నీ వదిలితేనే వెళ్తాను’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

కొడుకుని ‘దారిలో’ పెట్టాలంటే పెళ్లి చేయాలను కున్నారు తండ్రి. 27 ఏళ్ల వయస్సు గల కృష్ణమూర్తికి 14 ఏళ్ల లక్ష్మీ నరసమ్మనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయ్యాక మొదటి రోజునే కృష్ణమూర్తి భార్యకు ‘గాంధీ గారు మన దేశానికి స్వాతంత్య్రం తీసుకురావటం కోసం చేస్తున్న ఉద్యమంలో నేను మూడేళ్లుగా మునిగి పోయి ఉన్నాను. విదేశీ వస్త్రాలు తగలబెట్టి, ఖాదీ వస్త్రాలే ధరించాలని ఆయన చెప్పారు. నేను ధరిస్తున్నాను. రేపట్నుంచి నువ్వు కూడా నేత చీరెలే కట్టుకోవాలి’ అని స్పష్టంగా చెప్పారు.

ఆమెకి మరోమాట మాట్లాడే ఆలోచన లేదు. కారణం-3,4 నాలుగేళ్ల వయస్సులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది. గుంటూరు జిల్లా నూతక్కిలో అమ్మ పెంచింది. ఆమె తరువాత పెద్దక్క, బావ (మేనమామ) ఆదరించి, పెళ్లి చేశారు.

కృష్ణమూర్త్తి సంస్కృతం చదువుకున్నారు. కావ్య పఠనాలన్నా, వేదపరిషత్తులన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా ప్రీతి. కానీ, ఇవన్నీ భరతమాతకి స్వాతంత్య్రం సాధించాలన్న లక్ష్యం ముందు అల్పమైన విషయాలైపోయాయ్‌.

‌భార్య కాపురానికొచ్చినప్పట్నుంచీ కృష్ణమూర్తి ఉద్యమంలో ఉధృతంగా తిరగసాగారు. విదేశీ వస్త్ర బహిష్కరణ ప్రచారం, కల్లు దుకాణాల పికెటింగ్‌ ‌వంటి కార్యక్రమాల్లో తిండీ తిప్పలు లేకుండా తిరిగే వారు. నిరసన దీక్షల్లో తరచూ పాల్గొనేవారు.

1929లో కస్తూరిబాతో కలిసి గాంధీజీ జిల్లా పర్యటనకొచ్చినపుడు కృష్ణమూర్తి దంపతులు గాంధీజీకి పాదాభివందనం చేశారు. 1930లో ఏలూరు నుంచి మట్లపాలెం వెళ్లి ఉప్పు సత్యా గ్రహంలో పాల్గొన్నారు. లాఠీఛార్జి, నిర్బంధం, 1932లో శాసనోల్లంఘనలో పాల్గొన్నారు. విదేశీ వస్త్రాల దహనం, లోధియన్‌ ‌కమిటీ ఎదుట నల్లజెండాలతో ప్రదర్శన, బ్రిటిష్‌ ‌దమననీతిని ఎండగడుతూ నినాదాలు, ప్రదర్శనలు…

అంతకుముందు ఎన్నోసార్లు జరిగిన లాఠీచార్జిలో ఎముకలు విరిగాయి, తల పగిలింది, చెయ్యి విరిగింది. ఇంట్లో భార్య చికిత్స చేసింది. కానీ 1932 శాసనోల్లంఘనోద్యమం మాత్రం కృష్ణమూర్తిని ‘దేశద్రోహి’గా చిత్రించింది. ఆ ఏడాది మే 22న కోర్టు ఆయనకు ఏడాది పాటు ‘కఠిన కారాగారవాస శిక్ష’ విధించింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో పురుగులు, మేకులు కలిపి వండిన తిండి తినలేక ఉపవాసాలు చేస్తుంటే, ‘బ్రెడ్డు, పాలు ఇస్తాం, తీసుకో’ అన్నారు అధికారులు. ‘నా తోటి ఉద్యమ ఖైదీలందరికీ ఇస్తేనే నేనూ తీసుకుంటాను’ అని మొండికేశారు కృష్ణమూర్తి.

జైలుకి వెళ్లాక, వెళ్లకముందు కూడా ఉద్యమ కార్యక్రమం లేని రోజున రాట్నం వడికేవారు. నాలుగైదు కిలోల నూలు వచ్చాక, దాన్ని ఖాదీ భాండారులో ఇచ్చి, ఆ బరువుకి తగినట్లు తనకీ, భార్యకీ వస్త్రాలు తెచ్చుకునేవారు. జైలు జీవితం తరువాత మళ్లీ దీక్షలు, ప్రదర్శనల్లో పాల్గొంటుండేవారు. అప్పుడే పార్టీ ఆయనకు కొత్త బాధ్యత అప్పగించింది. గరికపాటి మల్లావధాని అనే మరో స్వాతంత్య్ర సమరయోధుడితో కలిసి, రహస్యంగా ‘ఢంకా’ అనే పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక రహస్య పంపిణీ బాధ్యతను కృష్ణమూర్తికి అప్పగించారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, నాయకుల పిలుపులతో పత్రిక ప్రచారంలోకి వచ్చాక, కృష్ణమూర్తి ఇంటిమీద పోలీసు నిఘా ఎక్కువైంది. రెండుమూడు సార్లు పోలీసులు సోదా చేయటానికొస్తే, భార్య నరసమ్మ ఆ పత్రికలను ఇంటి సరిహద్దు దడి (తాటాకుల గోడ)లో దాచింది.

1932లో నూతక్కిలో మేనమామ లక్ష్మీ నారాయణ ఇంట్లో పురుడు పోసుకున్న నరసమ్మ, భర్త జైలు కెళ్తున్నాడని తెలిసి ఆయన్ని చూడాలన్న ఆదుర్దా, భయం, బెంగ మూటగట్టుకొని, పసిబిడ్డని భుజాన వేసుకొని, మేనమామ పంపిన పాలేరు సాయంతో ఏలూరు వచ్చింది. రైల్వే స్టేషనులో భర్తని సంకెళ్లతో చూసి 22 ఏళ్ల నరసమ్మ ఏడ్చేసింది. కృష్ణమూర్తి భార్యని గదమాయించారు. ‘ఏడవకు, దేశానికి బానిసత్వ సంకెళ్లు తెగటం కోసం ఈ సంకెళ్లు వేసుకున్నాం. గర్వపడు’ అని ఆమె భుజం మీద పసిబిడ్డని ఆప్యాయంగా నిమిరి పంపించేశారు.

1943లో ఏలూరులో ప్రముఖ న్యాయవాది సోమంచి లింగయ్య అధ్యక్షులుగా, తాను కార్యదర్శిగా మిత్రులతో కలిసి చెరుకువాడ వారి సత్రంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించారు (కొన్ని వందలమంది సంస్కృత పండితుల్ని తయారు చేసింది ఆ పాఠశాల). 1940 తరువాత రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఉద్యమ ఉధృతం తగ్గింది. అప్పటికి నలుగురు పిల్లలు పుట్టి, కొన్ని మాసాలు బ్రతికి చనిపోవటం ఆ దంపతుల్ని కుంగదీసింది. అప్పట్నుంచి అక్షర లక్షలుగా శరవణభవోపాసన చేశారు(ఆ తరువాత పుట్టిన నలుగురూ బాగున్నారు).

గాంధీజీ ప్రభావంతో ఖాదీ వాడకం, సత్యాన్ని పలకటం, అహింసని పాటిం చటం జీవితంగా చేసుకున్నారు కృష్ణమూర్తి. 1948లో గాంధీజీ మరణం ఆయన్ని దుఃఖంలో ముంచింది. చాలా రోజులపాటు మౌనవ్రతంలో ఉండిపోయారు.

యవ్వనమంతా స్వరాజ్య ఉద్యమంలో గడిచిపోగా, కొద్దిపాటి పొలం కరిగిపోయి ఇల్లు గడవటం కష్టమైంది. 1972లో ప్రభుత్వ పింఛన్‌ ‌వచ్చేదాకా దుర్బర దారిద్య్రాన్ని అనుభవిస్తూ కూడా, ‘అతిథి దేవో భవ’ అన్నట్టు అన్నదానం చేసిన ఔదార్యం ఆయనది. మిత్రులు అంబికానాథ వరప్రసాద్‌తో కలిసి ‘గ్రేట్‌ ఇం‌డియన్‌ ‌థియేటర్‌’ ‌ద్వారా నాటక రంగానికి సేవ చేసిన సంస్కృతీ అభిమాని. తండ్రి తరువాత గ్రామ ‘సభాపతి’గా ఆ హోదా గౌరవాన్ని కాపాడుతూ వచ్చిన  వ్యక్తిత్వం ఆయనలో కనిపిస్తాయి. 1972లో భారత ప్రభుత్వం ఆయన్ని ‘తామ్రపత్రం’తో గౌరవించింది. ఈ గాంధేయవాది తన 84వ ఏట 1981లో కీర్తిశేషులయ్యారు. 23 ఏళ్ల వయసులో 1921లోనే ఉద్యమంలోకి ఉరికినా, పత్రికలకు, పుస్తకాలకు ఎక్కని అనేక మంది నిఖార్సయిన స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరు ఈ గుండు వేంకట కృష్ణమూర్తి. 1975 జూన్‌లో దేశంలో అత్యవసర పరిస్థితి విధింపుతో చలించి పోయి, ‘ఈ కాంగ్రెస్‌, ‌దేశం కోసం త్యాగాలు చేసిన మా కాంగ్రెస్‌ ‌కాదు’ అని కన్నీరు పెట్టుకున్న దేశభక్తుల్లో కూడా ఒకరు కృష్ణమూర్తి. ఉద్యమంలో భర్తకు ఇతోధికంగా సహకరించిన ఇల్లాలు లక్ష్మీ నరసమ్మ 103 ఏళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించి 2013లో కన్నుమూశారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram