తరతరాలుగా భారతీయ సమాజంలో అనేక ఆచారాలకు ఎలాంటి ప్రామాణిక ఆధారాలు లేకపోయినా అత్యధికులు ప్రగాఢంగా విశ్వసించి, తార్కిక దృష్టి లేకుండా అనుసరిస్తూండేవారు. సాటి వారిని ఆచారాల పేరిట అవమానిస్తూ అవతలవారి మానసిక క్షోభను గుర్తించకుండా నిర్దయగా ప్రవర్తించడాన్నే సాంఘిక దురాచారమంటారు. కొందరు ఉన్నత వర్గాలవారు కుటుంబ గౌరవ ప్రతిష్టలను కాపాడుతున్న సంప్రదాయవాదులం తామేనన్న మనోగర్వంతో ప్రవర్తించేవారు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి సమాజంలో నెలకొన్న అనేక సాంఘిక దురాచారాలలో ‘అస్పృశ్యత’ ఒకటి. పంచములను ఇంటి ప్రాంగణం లోనికి కూడా రానీయకుండడం, సహపంక్తి భోజనాలలో చేరనీయకపోవడం, దేవాలయాలు, పాఠశాలలోకి వారిని అనుమతించక పోవడం, పంచములు ముట్టిన నీరు కూడా మైలపడిందని భావించడం, వారి నివాసాలు ఊరి బయట ఏర్పడేలా చేయడం, వారిని తాకితేనే మైలపడతామనే భావించే దురాచారాలు సమాజంలో బలంగా నాటుకు పోయాయి.

సంఘ సంస్కరణ అంటే మార్పు కోరుతూ వేదికలపై అనర్గళంగా చేసే ఉపన్యాసం కాదు. తనకు ఉన్నంతలో ఆర్థిక సహాయం చేస్తే తీరిపోయే సమస్యా కాదు. ‘అయ్యో పాపం’ అని సానుభూతి చూపితే సమసి పోయే విషయం అసలే కాదు. సమాజమంతా సదాచారమని విశ్వసించి, ఆచరిస్తున్న ఒక సామాజిక దురాచారాన్ని ‘మీరు చేస్తున్నది తప్పు. ఇది అమానుషత్వం. మీరు ఆచరిస్తున్న దురాచారాలను ఏ మతగ్రంథం కూడా ఇలా చేయాలని చెప్పలేదంటూ అందుకు ప్రమాణాలు చూపి, నిర్భయంగా ప్రజల మధ్యకు చొచ్చుకు పోగలిగే వాడే అసలైన సంస్కరణవాది. అందుకు ఎంతో సాహసం కావాలి. ఛాందసవాదుల, మతపెద్దల, చివరకు బంధువుల నుంచి దూషణలు, ఛీత్కారాలు, దౌర్జన్యాలు, వెలివేతల వంటివి ఎదుర్కోవలసి ఉంటుది. తానుంటున్న సమాజాన్ని ఒప్పించి, మెప్పించి దురాచారాలను మాన్పించగలిగిన వాడే నిజమైన వీరుడు, సంస్కర్త.

ఆ కోవకు చెందినవారే కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనర సింహం (రాజమండ్రి), రఘుపతి వెంకటరత్నంనాయుడు (కాకినాడ), గూడూరి రామచంద్రరావు (గుడివాడ), వేమూరి రాంజీరావు (బందరు), వెల్లంకి కృష్ణమూర్తి (ఏలూరు), నల్లపాటి హనుమంతరావు (గుంటూరు), ఈరి వాడపల్లి (రామచంద్రపురం). వీరు ఆశ్రమాలు, పాఠశాలలు ఏర్పరిచి హరిజన బాలబాలికలకు ఉచిత విద్య, నివాస భోజన సదుపాయాల ఏర్పాటుకు కృషి చేశారు, ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దారు.

గూడూరి రామచంద్రరావు లక్షల రూపాయల సంపాదనను, జీవితాన్ని అస్పృశ్యత నివారణ హోమంలో ధారపోసి నిరుపేదగా మారారు. ఆంధ్ర దేశమంతటా పర్యటించి, ‘ఆది ఆంధ్రుల’ సమావేశాలను నిర్వహించి వారిలో నూతన వికాసాన్ని, ఆత్మస్థైర్యం పెంచటానికి కృషిచేశారు. 1914లో గుడివాడలో సేవాశ్రమం స్థాపించి ఆది ఆంధ్ర యువకులకు తర్ఫీదు ఇచ్చారు. వ్యయప్రయాసల కోర్చి 1917 నవంబరు 4 నుండి 6వ తేదీ వరకు బెజవాడలోని మైలవరం రాజయ్య నాటక మందిరంలో ప్రథ•మ ప్రాదేశిక పంచమ సదస్సును నిర్వహించారు. వీరిని పంచములు అని కాకుండా ‘ఆది ఆంధ్రులు’గా పరిగణించాలని సదస్సుకు అధ్యక్షత వహించిన మాదరి భాగ్యరెడ్డివర్మ పిలుపు నిచ్చారు. బావులు, సత్రాలు, పాఠశాలలు, స్థానిక సంస్థలోకి ఆది ఆంధ్రులకు ప్రవేశం కల్పించాలని ఆ సదస్సులో 18 తీర్మానాలు చేశారు.

మార్చి 18, 1921న రామచంద్రరావు తమ అధ్యక్షతన ఏలూరులో ‘అంటుదోష నివారణ’ మహాసభను నిర్వహించారు. అస్పృశ్యతా నివారణ మన తక్షణ కర్తవ్యమని, హిందూ సంఘం బలహీనతకు, హిందూ మతం నిర్వీర్యమవడానికి ‘అంటుదోషం’ ప్రధాన కారణమని హెచ్చరించారు. ఈ సభలో ఉమర్‌ అలీషా మహాకవి ‘అంటుదోష’ నివారణ ఆవశ్యకతపై గంభీర ఉపన్యాసం చేశారు. కుసుమధర్మన్న, కుసుమ వెంకటరామయ్య, రాయుడు గంగయ్య, పాకేటి గురువులు, గొట్టుముక్కల వెంకన్న వంటి సంస్కరణవాదులు రామచంద్రరావు ఆశ్రమంలో శిక్షణ పొంది, నాయకులై తమవారి అభ్యున్నతికి విశేష కృషి చేశారు.

వేమూరి రాంజీరావు 1916లో బందరులో హరిజనుల కోసం పాఠశాలను నెలకొల్పి తర్వాత ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చేశారు. హరిజన వాడలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి, పిల్లలకు బట్టలు కొనిపెట్టి అనేక మంది పిల్లలను పాఠశాలలో చేర్చుకున్నారు. వారికి ఉచిత విద్యా బోధనతో పాటు వసతి గృహాన్ని కూడా నిర్మించారు. అక్కడ చదివిన వేముల కూర్మయ్య వంటి హరిజన యువకులు ఎందరో అత్యున్నత స్థితికి రాగలిగారంటే అది రాంజీరావు సంకల్పసిద్ధికి తార్కాణం.

గుంటూరు నల్లపాటి హనుమంతరావు ‘శ్రీకృష్ణాశ్రమం’ స్థాపించి ఆది ఆంధ్ర బాలబాలికలకు ఉచిత విద్యాబోధన చేశారు. బలపాలు, పలకలు, పుస్తకాలు ఉచితంగా అందజేశారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాజమండ్రిలో 1910లో ‘శ్రీరామ మోహన ప్రాథమిక ఉన్నత పాఠశాల’ను ప్రారంభించి అనేక మంది హరిజన బాలురకు విద్యను బోధించారు. హరిజనులు చిలకమర్తి ఇంటికి యథేచ్ఛగా వెళ్లటం, వారి ఎదురుగా కూర్చోవడం, సలహాలు పొందడాన్ని ప్రజలు నిబిడాశ్చర్యంతో తిలకించేవారు.

హరిజనోద్ధర•ణ అనగానే ఆంధ్రదేశంలో పిఠాపురం మహారాజారావు వెంకట కుమార సూర్యారావు బహద్దర్‌, ‌బ్రహర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు, బ్రహ్మ సమాజం జ్ఞాపకం రాకమానవు. ‘మనమా ఉద్ధరించేవాళ్లం! వారే మన అల్పసేవను స్వీకరించి మనలను ఉద్ధరించాలి. మాలమాదిగలు అనే వారు ఎంత క్షమాశీలంతో బాధలు సహించారో! కూృరమైన అగ్రజాతుల అమానుషత్వాన్ని, నైచ్యాన్ని వారే మన్నించాలి’ అనేవారు పిఠాపురం మహారాజా, వెంకటరత్నం నాయుడు. వీరిరువురూ ఆది ఆంధ్రులకు చేసిన సేవ అనిర్వచనీయం. రఘుపతి వెంకటరత్నం హరిజన విద్యార్థులను ఓదార్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, వెలుగువైపు నడిపించిన సంఘటనలు కోకొల్లలు. ఆయన హరిజన బాలికలను పెంచి పెద్దచేసి విద్యావంతులుగా, విదుషీమణులుగా తీర్చిదిద్ది సవర్ణ యువకులకిచ్చి పెళ్లి చేయటం ఆంధ్రదేశమంతా తెలిసిందే. మహారాజావారు కాకినాడలో అనాథ శరణాలయం, పిఠాపురంలో వసతి గృహాలు స్థాపించి హరిజన విద్యాభివృద్ధి కోసం భారీ మెత్తంలో ఖర్చు చేశారు.

ఏలూరులో వెల్లంకి కృష్ణమూర్తి నిమ్న జాత్యు ద్ధరణకై విస్త•ృత కృషి చేశారు. ఆయనకు మోచర్ల రామచంద్రరావుపంతుల సహాయం లభించింది. వీరి నాయకత్వాన ఐదుగురు సభ్యులతో నిమ్నజాత్యుద్దరణ సంఘాలు ఏర్పడ్డాయి. కృష్ణమూర్తి ఏలూరులో చింతా శేషయ్య, నరాల శెట్టి దేవేంద్రుడు, రాయుడు గంగయ్య, సుండ్రు వెంకన్న తదితర హరిజన యువకులను చేర దీసి, వారిలో సంస్కర•ణా భిలాషను పెంచి నాయకులుగా తీర్చిదిద్దారు. కృష్ణమూర్తి ఏలూరు సమీపంలోని ఫిరంగులదిబ్బ, సోదిమెళ్ల, వంగాయగూడెంలలో పంచమ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఆయన అభ్యర్థన మేరకు వెంకటామ్రా అండ్‌ ‌కో అధినేత ఈదర వెంకటరావు విద్యార్థులకు పాఠ్య సామగ్రిని ఉచితంగా పంపిణీ చేసేవారు.

 అస్పృశ్యత పాపమని, హిందూ మతానికి తీరని కళంకమని, భారతజాతి సమైక్యతకు వేరుపురుగని గాంధీజీ విశేషంగా ప్రచారం చేశారు. ఆది ఆంధ్రులను హిందూ సంఘం నుండి వేరుచేసి వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరచాలనే ‘కమ్యూనల్‌ అవార్డు ’ ప్రకటనను నిరసిస్తూ గాంధీ నిరశన వ్రతం ప్రారంభించి దేశంలో స్దబ్దతను పటాపంచలు చేశారు. హిందూమత గ్రంథాలు ‘అస్పృశ్యతా శాస్త్ర సమ్మతమని చెప్పలేద’ని ఎలుగెత్తి చాటారు. ‘అస్పృశ్యత ఉండాలంటే నేను చావక తప్పదని’ పేర్కొన్నారు. డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌, ‌బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ‌కృషితో ‘పూనే ఒప్పందం’ కుదిరి ‘కమ్యూనల్‌ అవార్డు’ ఉపసంహరణకు దారితీసింది. ఈ విజయంతో గాంధీజీ పంచమ జాత్యుద్ధరణకు పూనుకొని, పంచములకు ఎర్రవాడ జైలులోనే ‘హరిజనులు’ అని నామకరణం చేశారు.

హరిజనాభ్యుదయానికై గాంధీజీ అఖిల భారత హరిజన యాత్ర సంకల్పించి 1933 డిశంబరు 16 నుండి 1934 జనవరి 4 వరకూ ఆంధ్రదేశంలో పర్యటించారు. హరిజనోద్యమం బలపడి, సంబంధిత నిధికి విరాళాలు గణనీయంగా సమకూరాయి.

పత్రికా మాధ్యమం కూడా ఆంధ్రదేశంలో హరిజనాభ్యుదయానికి ఎక్కువ తోడ్పడింది. దిన, మాస, వారపత్రికలు వారి ఉన్నతికి వీలైనంత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’, కాటూరి వేంకటేశ్వరావు ‘గుడిగంటలు’, విశ్వనాధ సత్యనారాయణ ‘బద్దన్నసేనాని’, జాషువా ఖండ కావ్యాలు, బోయి భీమన్న ‘కూలిరాజు’…ఇంకా ఎందరో భావకవుల గీతాలు, కథలు, గేయాలు హరిజనాభ్యుదయానికి, నూతన వికాసానికి దారి చూపాయి.

అస్పృశ్యతా నివారణలో, హరిజనాభ్యుదయంలో ఆంధ్రదేశం ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహామహులు, మానవతావాదులు, సంస్కారప్రియులు చేసిన సేవలు, వారి ఆశీస్సులతో పురోభివృద్ధి కార్యక్ర మంలో అగ్రగాములు కావాలని ఆకాంక్షిద్దాం.

– డా. గాదం గోపాలస్వామి, 9390742602, రిటైర్డ్ ‌ప్రిన్సిపాల్‌

ఉపయుక్త పత్రికలు-గ్రంథాలు

  1. ఆంధ్రపత్రిక, రాష్ట్రావతరణ సంచిక 1 అక్టోబరు1953 పే.50
  2. ఆంధ్రపత్రిక 30 మార్చి 1921 పే.19
  3. శ్రీ తారకం : తెలుగునాడులో సంస్కర ణోద్యమాలు 1976, ఆంధప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ పే.24, 25
  4. ఆంధ్రపత్రిక 27 మార్చి 1919 పే.4
  5. ఆంధ్ర సర్వస్వం – యాగంటి బాపినీడు 1961 పే.493

About Author

By editor

Twitter
Instagram