సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌జ్యేష్ఠ శుద్ధ  సప్తమి – 06 జూన్‌ 2022, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌కేరళలోని అళప్పుజ నినాదాల కేసు విన్న తరువాత ఆ రాష్ట్ర హైకోర్టు వేసిన ప్రశ్న-‘అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది?’ ఈ ప్రశ్నలోని క్షోభను అర్ధం చేసుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తుల నుంచి అంత మాట వెలువడేటట్టు చేసిన నినాదాలు ఏవి? ఎవరు ఇచ్చినవి? మే 21న పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ) అనే దగుల్బాజీ సంస్థ నిర్వహించిన ఊరేగింపులో వినిపించాయవి. ‘హిందువులూ, క్రైస్తవులూ మన గడ్డమీద బుద్ధిగా ఉండాలి. లేదంటే వాళ్లు అంతిమ సంస్కారాలకి ఏర్పాట్లు చేసుకోవాలి’, ‘బాబ్రీ మసీదు, జ్ఞాన్‌వాపిలకి పూర్వ వైభవం తెస్తాం’- ఒకడి భుజాల మీద కూర్చుని ఇలాంటి దారుణమైన నినాదాలు ఇచ్చినవాడు ఆరో తరగతి చదివే 11 ఏళ్ల కుర్రాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అయినప్పుడే దేశం దిగ్భ్రాంతికి గురైంది. అది భయంతో మాత్రం కాదు. ఒక జుగుప్సతో, ఒక ఏహ్యభావంతో, ఒక ఛీత్కారంతో కలిగిన దిగ్భ్రాంతి. వెంటనే ఆ రాష్ట్ర హైకోర్టు ఆ నినాదాలకు ఆ ప్రదర్శన నిర్వాహకులను బాధ్యులని చేసి, అరెస్టు చేయమని పోలీసులను ఆదేశించింది. మేం ఏ మతానికీ వ్యతిరేకంగా నినాదాలు చేయనప్పుడు ఒక రిపబ్లిక్‌లో ఇలా అరెస్టులకు ఆదేశించడం అప్రజాస్వామికం అంటూ ప్రజాస్వామ్యం గురించి కోర్టులకు వెంటనే పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు ముస్లిం మతోన్మాదులు. నాలుక తీటతో ఆ నినాదాలు ఇచ్చిన కుర్రాడి తండ్రి సహా మొత్తం 26 మందిని అరెస్టు చేశారు. నినాదాలు రగడ సృష్టించడం తోనే ఆ కుర్రాడి కుటుంబం పరారయింది. చివరికి తండ్రిని ఎర్నాకులం జిల్లాలో అరెస్టు చేశారు. వీళ్లు పీఎఫ్‌ఐ ‌సభ్యులు కారట. కానీ ఎక్కడ ఊరేగింపు జరిగినా సకుటుంబంగా వెళ్లి జయప్రదం చేస్తారట. ఈ మాట ఎన్నో ప్రశ్నలకు తావిచ్చేదే.

ఈ దేశంలో ఏ ముస్లిం మతోన్మాది ఎక్కడ, ఎంతటి ఘాతుకానికి పాల్ప డినా, ఎంత విద్రోహం తలపెట్టినా అది కేవలం అమాయకత్వంతో చేసినదేనని అంతా నమ్మాల్సిందే. లేదా ఉపాధి లేక పేదరికం కారణంగా చేసినదేనంటూ ముద్ర వేయడానికి అనేక గొంతులు లేస్తాయి. ఇంతటి దుందుడుకు నినాదాలు ఇచ్చిన ఆ కుర్రాడిది కూడా ఒట్టి అమాకత్వమేనని అంటున్నాడు తండ్రి. సీఏఏ వ్యతిరేక ఆందోళనలో, ఎన్‌ఆర్‌సీ నిరసనల సమయంలో వాటిని ముచ్చటపడి నేర్చుకున్నాడట. ఆ తండ్రికి అసలు తల ఉందో లేదో, లేదా తెలివి ముదిరిందో కానీ, వాళ్లబ్బాయి ఇచ్చిన నినాదాలు ఏ మతానికీ వ్యతిరేకం కాదని తేల్చిపారే శాడు. కేవలం సంఘ పరివార్‌కే వర్తిస్తాయట. అంటే మిగిలిన కేరళ జనాభాని పీఎఫ్‌ఐ ఇస్లాంలో జమ చేసేసిందా ఏమిటి? అళప్పుజలోనే కాదు, ఇంకా చాలా చోట్ల మా అబ్బాయి అవే నినాదాలు ఇచ్చాడని కూడా ఆ తండ్రి కొత్త సత్యాన్ని ప్రజల ముందు ఉంచాడు. ఆ కాసిన్ని నినాదాలకే ఇంత రాద్ధాంతం ఎందుకో నాకయితే అర్ధం కావడం లేదనీ, ఈ మాత్రానికే ఆ పసివాడిని వేధించాలా అనీ అమాయకత్వం నటిస్తున్నాడు. కానీ ఆ నినాదాలు ఆ కుర్రాడికి నేర్పించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మేం కొన్ని నినాదాలే రాసిచ్చాం, మిగిలినదంతా ఆ కుర్రాడి సొంత కవిత్వమేనని నిర్వాహకులు చెప్పడం మరీ వికృతం.

న్యాయస్థానాల స్పందన గురించి మరొక పీఎఫ్‌ఐ ‌నేత వ్యాఖ్యానం మరీ బరి తెగింపు. ‘ఇలాంటి నినాదాలకి న్యాయస్థానాలు ఇట్టే కలవరపడతాయి. కేరళ హైకోర్టు న్యాయమూర్తులనూ దిగ్భ్రాంతికి గురి చేశాయంటే, అందుకు కారణం తెలుసా? వాళ్లకి లోపల ఉన్నవి కాషాయ చెడ్డీలు.’ ఇదీ ఆ నాయకుడి వాచాలత్వం. ఇంతకీ ఇదంతా భారత గణతంత్ర పరిరక్షణ కోసం పీఎఫ్‌ఐ ‌పడుతున్న ఆరాటమట.

ఒక కుర్రవాడితో మతోన్మాద నినాదాలు ఇప్పించడం, రాజకీయ కార్యకలాపాలకి ఉపయోగించడం పెద్ద తప్పిదం. హక్కుల కార్యకర్తలు, పిల్లల రక్షణ ఉద్యమకారులు ఏ మూల అఘోరిస్తున్నారో మరి, వారం తరువాత కూడా చడీచప్పుడూ లేదు. ఆ రాష్ట్రాన్ని అరాచకశక్తుల అడ్డాగా మార్చేస్తున్న సీపీఎం అనే సిగ్గులేని రాజకీయ పార్టీకీ ఇంకా మెలకువ రాలేదు.

‘ఈ దేశంలో ఏం జరుగుతోంది?’ అన్న ఆ ప్రశ్న చాలా చాలా ఆలస్యంగానే న్యాయవ్యవస్థ వేసింది. ఏం జరుగుతున్నదో కేరళ ఏలికలకు తెలియనిది కాదు. ఢిల్లీలో ఆప్‌ ‌ప్రభుత్వానికి తెలియనిది కాదు. పశ్చిమ బెంగాల్‌లో మమతకి తెలియనిది కూడా కాదు. ముస్లిం బుజ్జగింపు ధోరణి ఫలితమిది. సెక్యులరిజం వికృతరూపమిది. భావి ముస్లింలనూ భారతీయ సమాజానికి శత్రువులుగా మలుస్తున్నారు. హిందువుల శోభాయాత్రలను మా ప్రాంతాలలో అడుగుపెట్టనివ్వం అన్న వైఖరి నుంచి, ఈ గడ్డమీద బుద్ధిగా ఉండకపోతే నూకలు చెల్లిపోతాయని హెచ్చరించే వరకు వచ్చారు. మైనారిటీల హక్కుల మాటున జరుగుతున్నది ఇదే. కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని, బుజ్జగింపు ధోరణిని వీడి ఏం జరుగుతోందో చూడమని ఆ కొందరు ఏలికలను, కొన్ని పార్టీలను కోర్టులే ఆదేశించడం తక్షణావసరం. జరుగుతున్నది ఇదీ అంటూ ఎవరో ఫిర్యాదు చేసే వరకు కోర్టులు ఎందుకు ఆగాలి! ఎన్నో అంశాల మీద తమకు తామై కేసులను విచారణకు స్వీకరిస్తున్న కోర్టులు దేశ విచ్ఛిత్తికి, ఐక్యతకు జరుగుతున్న కుట్రల గురించి తమకు తామై ఎందుకు స్పందించరాదు?

 పీఎఫ్‌ఐ ‌వంటి దేశద్రోహ, మతోన్మాద, వేర్పాటువాద సంస్థ ఈ మధ్య తరచూ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద కత్తులు నూరుతోంది. ఇలాంటి విషప్రచారంతో ఆర్‌ఎస్‌ఎస్‌ను అప్రతిష్ట పాల్జేయడం దానికి సాధ్యం కాదు. అసలు పీఎఫ్‌ఐ ‌లాంటి సంస్థను వ్యతిరేకిస్తున్న సంస్థగా ముద్ర వేయడమంటేనే ఆర్‌ఎస్‌ఎస్‌ను తిరుగులేని దేశభక్తి సంస్థగా, నిర్మాణాత్మక వ్యవస్థగా ప్రపంచం ఎదుట మరొకసారి నిలపడమే.

About Author

By editor

Twitter
Instagram