సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌వైశాఖ అమావాస్య – 30 మే 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


తన వెనుక ఉండే నలుపు ఎంత చిక్కనో గురవింద గింజ ససేమిరా గుర్తించదట. అలాంటి గురవింద సైతం సిగ్గుతో చచ్చిపోయేటట్టు చేశారు మకుటం లేని కాంగ్రెస్‌ ‌మహారాజు రాహుల్‌ ‌గాంధీ. బ్రిడ్జ్ ఇం‌డియా అనే ఓ చిల్లర సంస్థ మే 20న లండన్‌ ‌కేంబ్రిడ్జ్ ‌విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఈ గాంధీ వారసుడిని పిలిచింది. చర్చనీయాంశం ఏమనగా, ఐడియాస్‌ ‌ఫర్‌ ఇం‌డియా. ఇంకా సీతారాం ఏచూరి, తేజస్వీ యాదవ్‌, ‌మహువా మొయిత్రా, మనోజ్‌ ‌ఝా వంటి యావన్మంది బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విరోధ కూటమి లేదా భారత వ్యతిరేకులందరినీ ‘బ్రిడ్జ్’ అక్కడ కూడగట్టింది. రాహుల్‌ ‌వెంట ‘షాహిన్‌బాగ్‌’ ‌సమర్ధకుడు సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ ‌కూడా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌/‌బీజేపీల పట్ల, మోదీ పట్ల భారతీయులకున్న నమ్మకాన్ని క్షణాలలో తుడిచెయ్యాలని కమ్యూనిస్టుల పోషణలోని ఆ బ్రిడ్జ్ ఆశ. కానీ, వాటిలో ఒక్క రాహుల్‌ ఉపన్యాసం మాత్రమే భారతీయులు గ్రోలే అవకాశం మీడియా కల్పించింది. ఆ మేరకు మీడియా అభినందనీయమే. మిగతా భారతీయ వక్తల ఉపన్యాసాలు ఇంకెంత నికృష్టంగా ఉన్నాయో!

సిద్ధం చేసి పెట్టుకున్న బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యతిరేక ప్రశ్నలను వ్యాఖ్యాత ఆశిష్‌ ‌రే సంధించడం, వాటికి తన వక్రభాష్యం, సొంత పైత్యం, అసత్య వచన నైపుణ్యం కలగలిపి రాహుల్‌ ‌జవాబులు ఇవ్వడం. ఇదే తంతు. భారత్‌ ‌కోసం ఆలోచనలంటే ఇవా? భారత్‌ అం‌టే ప్రజలు అన్న భావం కాంగ్రెస్‌ ‌నరనరాల్లో తిష్ఠ వేసుకుని కూర్చుందట. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ భారత్‌ అం‌టే అదొక భౌగోళిక భాగమని అనుకుంటాయట. ఇంకో అబద్ధపు మడుగును రాహుల్‌ ‌లండన్‌లో సృష్టించారు. అది – మీడియా వందశాతం బీజేపీ పిడికిట్లోనే చిక్కుకుని ఉందట. భారత్‌ను తిరిగి అసలైన భారత్‌గా ఆవిర్భవింప చేయడానికి కాంగ్రెస్‌ అలుపూ సొలుపూ లేకుండా పోరాడుతున్నదట. ఇప్పుడు దేశం మొత్తం కనిపిస్తున్న సైద్ధాంతిక జాతీయ సమరం అదేనట. ముక్కున వేలేసుకోము అంటే ఇంకొక అబద్ధం, వారిదే-పాకిస్తాన్‌లో ఎలా ఉన్నదో, ఇండియాలో కూడా అలాంటి పాలనే సాగుతున్నదట. ఇంకా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం, భారత సరిహద్దులలో చైనా తిష్ఠ, భారత్‌ అం‌టే రాష్ట్రాల సమాఖ్య వంటి చాలా విషయాలు మాట్లాడి ప్రపంచ ప్రజల జ్ఞానానికి పదును పెట్టి, వారి కళ్లు తెరిపించడానికి రాహుల్‌ ‌తనవంతు శ్రమించారు. భారతీయులక• సమస్య వచ్చినప్పుడు, కాంగ్రెస్‌ ‌క్లిష్ట పరిస్థితులో ఉన్నప్పుడు, ఎన్నికలలో సొంత పార్టీ ధరావతులు కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడిపోతున్నప్పుడు తాను దేశంలో ఉండకుండా, విదేశాలకి, అది కూడా గుర్తు తెలియని ప్రాంతాలకు పలాయనం చిత్తగిస్తానన్న సంగతి నుంచి వీక్షకుల దృష్టిని మళ్లించడానికి అమోఘమైన ఒక విశ్లేషణ కూడా ఆయన చేశారు. మీరు చెబుతున్నదానిని బట్టి బీజేపీని ప్రజలు ఎప్పుడో ఓడించాలి కదా, ఇంకా ఎక్కువ సీట్లతో ఎందుకు గెలిపించారు అన్న ప్రశ్న రాకుండా, నిరుద్యోగ సమస్య దాదాపు అలాగే ఉన్నా బీజేపీ అధికారంలో ఉన్నదంటే కారణం- మీడియాని కబ్జా చేయడం, సమాజాన్ని విభజించడమే సుమా అంటూ జ్ఞానబోధ చేశారు.

రాహుల్‌ ‌నోటి నుంచి నిఖార్సయిన అబద్ధాలే కాదు, కొన్ని నిష్ఠురసత్యాలూ జాలువారాయని ఒప్పుకోవాలి. పైగా అవన్నీ తమ కుటుంబ శతాధిక వత్సరాల, ఘనత వహించిన కాంగ్రెస్‌ ‌పార్టీకి సంబంధించినవే. మా పార్టీ ఆంతరంగిక కుమ్ములాటలతో చస్తూ బతుకుతోంది. తిరుగుబాట్ల రోగంతో బాధ పడుతోంది. ఫిరాయింపుల పితలాటకాలతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టే కాలం వెళ్లదీస్తున్నది. ఏ ఎన్నిక వచ్చినా ఓటమి తమ పార్టీనే వెన్నంటి ఉంటున్న సంగతినీ యువరాజు మరచిపోకుండానే ప్రస్తావించారు. అయితేనేం, బీజేపీ మీద తమ పార్టీ పోరాటం సాగుతూనే ఉంటుందని ఘంటాపథంగా చెప్పారు.

ఇది కదూ, ఇంటి పేరు కాంగ్రెస్‌ ‌వారు, ఇంట్లో గబ్బిలాల కంపు అంటే. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న గుజరాత్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నాయకుడు హార్దిక్‌ ‌పటేల్‌ ‌పార్టీ ముఖాన రాజీనామా లేఖ విసిరి ఏమన్నాడు? యావన్మంది గుజరాత్‌ ‌కాంగ్రెస్‌ ‌పెద్దలకి రాష్ట్ర సమస్యల కంటే, ఢిల్లీ నుంచి దిగిన నేతలకి సమయానికి చికెన్‌ ‌శాండ్‌విచ్‌లు అందాయో లేదో అన్న విషయమే ముఖ్యమని చెప్పలేదా? ఏమో అనుకున్నాం గానీ, ఈ పటేల్‌ ‌మర్యాదస్తుడే. లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన వారికి ఇంకా ఏమేం అమరుతూ ఉంటాయో, ఆ దేవరహస్యాలన్నీ విప్పేవాడే. నిన్నగాక మొన్న జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌మట్టికొట్టుకు పోయింది. ఆ రాష్ట్ర సీనియర్‌ ‌నేత సునీల్‌ ‌జాఖడ్‌ ‌తాజాగా బీజేపీ కండువా కప్పుకున్నారు. కర్ణాటకలో ప్రమోద్‌ ‌మధ్వరాజ్‌ అదే బాటలో ఉన్నాడు. ఇన్నీ చెప్పుకుని ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌ప్రహసనం మరిస్తే ఎలా? ఆయన, మీకు దణ్ణం, మీ పార్టీలో చేరికకు ఒక దణ్ణం, మీ పార్టీ సమస్యల పరిష్కారానికి రెండు దణ్ణాలు అని చెప్పలేదూ! పైగా వచ్చే గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని జోస్యం కూడా చెప్పేశాడు.

మరణశయ్య మీద ఉన్న సొంత పార్టీ సంగతి పట్టదు కానీ, విదేశీ వేదికలెక్కి భారతదేశాన్ని, భారతీయ జనతాపార్టీని ఆడిపోసుకోవడానికి రాహుల్‌ ‌వంటి కుక్కమూతి పిందెలకి కావలసినంత సమయం ఉంటుంది. భారత్‌ ఏమాత్రం మంచిచోటు కాదు. అక్కడంతా బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారు కిరోసిన్‌ ‌చల్లేశారు అంటూ అంతర్జాతీయ వేదికల మీద నోరు పారేసుకోవడాన్ని ఇంకేమనాలి? ఈ విపరీత బుద్ధి మారదా? బీజేపీ కిరోసిన్‌ ‌చల్లిందో లేదో కానీ, కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, తేజస్వి వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు దేశంలో ఏదో విధంగా మంటపెట్టాలని నిప్పు కణికలతో నిరంతరం ప్రయత్నిస్తున్న మాట ముమ్మాటికీ సత్యం.

About Author

By editor

Twitter
Instagram