సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌వైశాఖ  బహుళ  అష్టమి – 23 మే 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భారతదేశంలో ముస్లింలని నల్లులను నలిపినట్టు నలిపేస్తున్నారని అంతర్జాతీయ ఉదారవాదులు ఊదరగొడుతూ ఉంటారు. ఇక్కడ ముస్లిం నేతలు మాత్రం నిరంతరం హిందువుల మనోభావాలను కించపరుస్తూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటారు. ఇందుకు తాజా ఉదాహరణ అపూర్వ ఒవైసి సోదరుల నిర్వాకమే. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసి మే 12న ఖుల్దాబాద్‌ (ఔరంగాబాద్‌ ‌జిల్లా, మహారాష్ట్ర)లో ఒక పాఠశాల భవన నిర్మాణానికి పునాది రాయి వేయడానికి వచ్చి, పనిలో పనిగా కొత్త వివాదానికి బీజం కూడా వేశారు.

ఖుల్దాబాద్‌లోనే ఉన్న ఔరంగజేబ్‌ ‌సమాధిని అక్బరుద్దీన్‌ ‌దర్శించుకోవడం, నమాజ్‌ ‌చేయడం రగడ రేపుతోంది. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ, ఇటీవలే ఈ పార్టీతో, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిలువెల్లా సెక్యులర్‌ ‌రంగు పూసుకున్న శివసేన కూడా ముక్కున వేలేసుకున్నాయి. గ్రేట్‌ ‌మొగలాయిలలో చివరివాడైన ఔరంగజేబ్‌ను ‘భారతదర్శనం’లో నెహ్రూ నోరారా పొగుడుతూనే, కాలచక్రాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నంలో భంగపడ్డాడనే చివరికి నిర్ధారించారు. భారతీయ ముస్లింలకు ఔరంగజేబ్‌ ఎప్పటికీ ఆరాధనీయుడు కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌విమర్శించడం అక్షరసత్యం. ఔరంగజేబ్‌ను ఆరాధించి అక్బరుద్దీన్‌ ‌జాతీయవాద ముస్లింలను అవమానపరిచారని కూడా ఫడ్నవీస్‌ అన్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ఔరంగజేబ్‌ ‌యుద్ధం చేశాడు. ఆయన మరణించాక కూడా పాతికేళ్లు మరాఠా ప్రజలతో యుద్ధం చేశాడని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ ‌రౌత్‌ ‌గుర్తు చేశారు. అలాంటి వాడి సమాధి దగ్గర నమాజ్‌ ‌చేసి అక్బరుద్దీన్‌ ‌మహారాష్ట్రకే సవాలు విసిరారని, తాము ఆ సవాలును స్వీకరిస్తున్నామనీ అన్నారు. మరాఠాలు ఔరంగజేబ్‌ను ఇక్కడే పాతిపెట్టారు. ఆయన అనుచరులు ఎవరైనా ఇక్కడ రాజకీయాలు చేస్తే అతడికి పట్టిన గతే పడుతుందనీ గట్టిగానే హెచ్చరించారు. అక్బరుద్దీన్‌ ‌చర్య నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత శరద్‌ ‌పవార్‌కి కూడా ఆగ్రహం తెప్పించడం విశేషమే. వీళ్లందరికి మహారాష్ట్ర చరిత్ర తెలుసు, ఆ చరిత్ర ఔరంగజేబ్‌ ‌గురించి ఏం చెప్పిందో కూడా తెలుసు, అందుకే మహారాష్ట్ర అవతల నుంచి వచ్చి ఇక్కడ వివాదాలు సృష్టించాలనుకోవడం మంచిది కాదని శరద్‌ ‌పవార్‌ ‌శషభిషలు లేకుండా చెప్పడం విశేషం కాదా!

 తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోవు. అక్కడ కూడా అక్బరుద్దీన్‌ ‌తన సహజ శైలిలో నోటివాటం ప్రదర్శించారు. హిందూ దేవతలను తూలనాడినా కూడా కేసు నుంచి బయటపడడంతో అక్బరుద్దీన్‌లో మళ్లీ ఉత్సాహం ఉరకలేయడానికి సిద్ధమవుతున్నట్టే ఉంది. పేరు ప్రస్తావించకుండా, మసీదుల నుంచి లౌడ్‌ ‌స్పీకర్లు తొలిగించిన కుక్క అని మొరిగారు. అది మహారాష్ట్ర నవనిర్మాణ్‌ ‌సేన అధినేత రాజ్‌ ‌ఠాక్రే గురించేనని వేరే చెప్పక్కర్లేదు. ఇక, ‘అక్బరుద్దీన్‌ ‌మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి, లేకుంటే మేమే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’ అని ఆ పార్టీ నాయకుడు గజానన్‌ ‌కాలే హెచ్చరించకుండా ఎలా ఉంటారు? ఆ సమాధి దగ్గరకి అక్బరుద్దీన్‌ ‌వెళ్లడం గురించి వేరే అర్థాలు తీయనక్కరలేదని మజ్లిస్‌ ఎం‌పి ఇంతియాజ్‌ ‌జలీల్‌ ‌సుద్దులు చెబుతున్నారు. కానీ, ఆ చర్యలో రెచ్చగొట్టే ధోరణి తప్ప ఇంకెముంది? కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సచిన్‌ ‌సావంత్‌ ‌మాత్రం తమ పార్టీకి మైనారిటీల పట్ల ఉండే అవ్యాజమైన అనురాగాన్ని దాచుకోకుండా బీజేపీనే విమర్శించారు.

అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు, తమ్ముడికి మించిన అన్న అసదుద్దీన్‌. ఆయన అహమ్మదాబాద్‌ ‌నుంచి భారతీయ న్యాయ వ్యవస్థకూ, హిందూ సమాజానికీ సవాలు విసిరారు. జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే జరుగుతుంటే కాంగ్రెస్‌, ‌సమాజ్‌వాదీ పార్టీ ఎందుకు మౌనంగా ఉన్నాయంటే, ముస్లింలు వారి ఓట్‌ ‌బ్యాంక్‌ ‌కాదు కాబట్టేనని కొంగ్రొత్త సత్యాన్ని జాతి మీదకి వదిలారు అసదుద్దీన్‌. అహమ్మదాబాద్‌లో మే 14వ తేదీన మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌, ఎస్‌పీ , బీఎస్‌పీ అన్నీ మత పార్టీలేనని, ముస్లింలు ముస్లిములుగానే ఉండిపోవాలనే అవి కోరుకుంటున్నాయని పెద్ద ఒవైసి అన్నారు. అయినా ముస్లింలు ముస్లింలుగా ఉండిపోవాలని గట్టిగా కోరుకుంటున్న వారే ఈ ఆరోపణ చేస్తున్నారు. అదే వింత. అక్కడితో ఆగితేనా! మేం బాబ్రీ మసీదును కోల్పోయాం. కపటత్వంతో, న్యాయాన్ని చంపేసి మరీ దానిని లాక్కున్నారు. గుర్తుంచుకోండి! ఇంకొక మసీదును కోల్పోలేం అని నొక్కి చెప్పారాయన. 1991 చట్టం ప్రకారం కట్టడాల విషయంలో ఆగస్ట్ 15, 1947 ‌నాటి యథాతథ స్థితి ఉండాలని చెప్పినా అతిక్ర మిస్తున్నారని భాష్యం వెలగబెట్టారు. చట్టాన్నీ, కోర్టు ఆదేశాలనూ గౌరవించాలన్న కనీస జ్ఞానం లేని వాళ్లు కూడా కోర్టులకి పాఠాలు చెబుతున్నారు.

యాభయ్‌ ఏళ్ల పాలనలో హిందువులను రాచి రంపాన పెట్టిన ఔరంగజేబ్‌ ‌సమాధికి మొక్కి రావడం వెనుక, బీజేపీ సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు (హిందూ) మతోన్మాద పార్టీలేనని ముద్ర వేయడం వెనుక వేరే ఉద్దేశాలు లేవంటే ఎవరు నమ్ముతారు? భారతీయ ముస్లింలకు తామే నాయకులమని చెప్పుకోవడం, వారిని ఒక శిబిరంలోకి తీసుకురావడం అసదుద్దీన్‌ ‌వాంఛ. కాని ఇదెంత ప్రమాదకర ఎత్తుగడో గుర్తించవలసినది యావద్భారతమే. ఏమైనా ఔరంగజేబ్‌ ‌సమాధి సాక్షిగా ఇంతకాలానికి ఒక గొప్ప చారిత్రక సత్యానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఔరంగజేబ్‌ ‌పచ్చి హిందూ వ్యతిరేకి. కరుడగట్టిన మతోన్మాది. భారతీయ ముస్లింలకు ఏనాటికీ ఆదర్శనీయుడు కాదు. ఇది కాదా ఆయా పార్టీల నేతలందరి మాటలలోని అంతరార్థం!

About Author

By editor

Twitter
Instagram