జూన్‌ 14 ఏరువాక పౌర్ణమి

నాగరికత ఎంత ముందుకు సాగుతున్నా నాగలి (రైతు) లేనిదే మనుగడే లేదు. పుడమిని పుత్తడిగా మార్చే అన్నదాతకు పండుగ రోజు. సమాజం కడుపు నింపేందుకు లాభనష్టాలు, కష్టసుఖాలకు అతీతంగా తన పనులకు పునరంకితమయ్యే రోజు. ప్రకృతి పగపట్టినా, ఏలికలు పట్టీపట్టనట్లు వ్యవహరించినా ఆరుగాలం శ్రమకు నడుంకట్టే రోజు. వ్యవసాయంలో తోడూ నీడగా నిలిచే పశుసంపదకు, ప్రధానంగా బసవన్నలకు కృతజ్ఞతలు చెబుతూ సమాదరించుకునే రోజు. అదే ‘ఏరువాక’ పున్నమి. జ్యేష్ఠ పౌర్ణమి. ‘హలపూర్ణిమ, పృషభపూర్ణిమ’గా పిలుచుకునే ఇది రైతులకే కాదు, ఆకలి తీర్చేది కనుక అందరికీ పండుగే.

ఇంచుమించు దేశమంతటిపైనా నైరుతి రుతు పవానాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు నాట సహా అనేక ప్రాంతాలలో జ్యేష్ఠ మాసంలో వానాకాలం ప్రారంభమవుతుంది. దేశంలో సుమారు 70 శాతానికి పైగా వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లనే ఏర్పడుతున్నందున దేశమంతా ఏరువాక పున్నమిని జరుపుకోవడం గమనార్హం. దానికి పేరు ఏదైనా సందర్భం ఒకటే. వేదకాలంలోనూ ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. అప్పట్లో ఇంద్ర ఆరాధన ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. హాలుడి ‘గాథా సప్తశతి’లోనూ ఏరువాక గురించి కథలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలూ ఏరువాక సందర్భంలో రైతులను సమాదరించినట్లు తెలుస్తోంది. ‘ఔత్తరాహులకు హోలీ, వసంత పంచమీలు ప్రత్యేకాభిమతములు. తమిళులకు పొంగల్‌ ‌ముఖ్య పండుగ. ఆంధ్రులకు ఉగాది, ఏరువాక పున్నమి ముఖ్యమైనవి’ అన్నారు సురవరం ప్రతాపరెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథంలో. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో దీనిని ‘దవన పున్నమి’గా పేర్కొన్నారు. కారుపున్నమి, కృషిక పున్నవి లాంటి పేర్లతో వ్యవహరించే ఈ పండుగను తెలంగాణలో ‘ఏరొక్క పండుగ’గా జరుపుకుంటారు. అయినవారిని, ఇతర ఊళ్లలోని బంధువులను పిలుచుకోవడమూ ఉంది. ఆర్థిక సంవత్సరం, విద్యాసంవత్సరం మాదిరిగానే వ్యవసాయ పనులు చేసేవారికి (జీతగాళ్ల) ఏరువాక పున్నమినాడే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడం, వ్యయసాయ పనుల ఆరంభానికి ముందు పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. అదే ఏరువాక. ‘ఏరు’ అంటే నాగలి, ‘వాక’ అంటే దున్నడం. (ఏరు అంటే ఎద్దులను కట్టి పొలం దున్నడానికి సిద్ధంచేసిన నాగలి అని అర్థం). పొలం పనుల ప్రారంభాన్నే ‘సస్యారంభం, కృష్యారంభం’ అని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంటోంది.

తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందో త్సాహాలతో అరక దున్నడంతో వ్యవసాయ పనులు మొదలవుతాయి. అన్నదాతలు కలసి చేసుకునే పండుగ ఏరువాక పున్నమి. వారు సామూహికంగా ఎద్దులను పొలాలకు తోలుకు వెళ్లి దుక్కి దున్నుతారు. ‘కాపులందరు వేగ కూడి రావాలి/గాదెల్లో విత్తనాలు దండిగా తేవాలి/గంపల్లో విత్తనాలు దండిగా తేవాలి/మృగశిర చిందించె ముసలెద్దు రంకేసె/దుక్కిటెద్దుల దెచ్చి అరక కట్టాలి/దున్నిన చేలన్నీ మిన్నగా పండాలి.’ అనే పాటలో ఏరువాకకు సన్నద్ధత, రైతుల ఆశలు కనిపిస్తాయి. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా/నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా’ అనే కొసరాజు రాఘవయ్య వారి ప్రసిద్ధ చిత్ర గీతం.. సకాలంలో పొలం పనులు చేపట్టవలసిన అవసరాన్నీ చాటి చెబు తోంది. ‘మానవ కృషికి మాధవ కృప’ తోడు కావాలం టారు. అప్పుడే సత్పలితాలు వస్తాయి. అందుకే ఏరువాక పండుగ• నాడు వరుణదేవుడిని పూజిస్తూ…

‘వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా

పన్నెండు ధాన్యాలు వానదేవుడా బండమీద పండాలి వానదేవుడా

బీదసాదసాకాలి వానదేవుడా పేదసాద సాకాలి వానదేవుడా….’ అని వేడుకుంటారు.

హలపూర్ణిమ

నాగలిని ధైర్యానికి, కష్టపడే మనస్తత్వానికి ప్రతీ కగా, ఎద్దులు, ఇతర పనిముట్లు, రైతు శక్తి సామర్థ్యాలను నైపుణ్యానికి చిహ్నాలుగా చెబుతారు. నాగలిని పట్టడమంటే భగవంతుడు వాన రూపంలో కల్పించిన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవ డమే. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించు కుంటూ శక్తివంచన లేకుండా పాటుపడుతూ మనిషి మనీషి కావాలని ‘ఏరువాక’ ప్రబోధిస్తోంది. నాగలిని భుజాన వేసుకోవడం అంటే సమాజానికి నాలుగు మెతుకులు పెట్టేందుకు నడుం కట్టడమే.

ఏ కాస్త సహాయం పొందినా కృతజ్ఞతలు చెప్ప డాన్ని సంస్కారంగా భావించినట్లే, జీవనాన్ని ఇస్తున్న నాగలికి సర్వదా రుణపడి ఉండాలనుకుంటుంది రైతు (కర్షక)లోకం. నాగలిని కేవలం వస్తువుగా కాకుండా ప్రాణ సమానంగా పరిగణిస్తూ నాగలి గొర్రుకు పూజాదికాలు నిర్వహించడం మన సంస్కృతి ఔన్నత్యం. శుద్ధోదన మహారాజు కపిలవస్తులో ఏరువాకను ప్రారంభిస్తూ కర్షకులకు బంగారు నాగళ్లను బహూకరించినట్లు చెబుతున్న ఐతిహ్యమే నాగలి ఉన్నతికి నిదర్శనం. ఈ పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాలలో ఊరి బయట గోగునారతో ‘తోరణం’ కడతారు. రైతులు ఆ తోరణాన్ని చెర్నా కోలతో కొట్టి దొరికిన నారను ఎద్దులకు, నాగళ్లకు కడతారు. దీనివల్ల వ్యవసాయం, దానివల్ల సంపద వృద్ధి చెందుతాయని విశ్వాసం.

‘వృషభ పూజ’

ఏరువాక పున్నమిని ‘వృషభపూజ’ అంటారు. ‘పాలిచ్చే గోవులకు పసుపు-కుంకుం, పనిచేసే బసవ న్నకు పత్రి పుష్పం’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక చిత్రగీతంలో పేర్కొన్నట్లు.. ఆనాడు ఎద్దులకు స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులద్దుతారు. కాళ్లకు గజ్జెలు కడతారు. పసుపు కుంకుమలతో అలంకరించి హారతులు పడతారు. పులగాన్ని నైవేద్యంగా పెడ తారు. వాటితో పొలంలో దుక్కి దున్నిస్తారు. తొలిదుక్కి సమయంలో కొందరు రైతులు కాడికి ఒక పక్కన ఉంటూ ఎద్దులతో సమానంగా నడుస్తారు. తమ జీవనంలో తమకు అండగా ఉండే మూగజీవాల పట్ల అభిమానాన్ని అలా చాటుకుంటారు. ఆ రోజున పశువుల కొట్టాలను శుభ్రపరచి, ముగ్గులెట్టి, ధూప దీపాలను పశువులకు చూపుతారు. పశువులతో ఊరే గింపులు నిర్వహించడం, వాటితో ఆలయాలలో ప్రద క్షిణలు చేయించడం లాంటివి కొన్నిచోట్ల కనిపిస్తాయి.

ఏరువాక పాటలు

జానపద సాహిత్యంలో ఏరువాక, నాగలి పాట లకు ప్రాధాన్యం ఉంది. ఏరువాక ఆరంభంలో కర్షక లోకం ఆనందోత్సాహలతో పాడుకునే గీతాలు ఆ సాహిత్యంలో కనిపిస్తాయి.

‘ఏరువాకొచ్చింది ఏరువా కమ్ము/యేరులు నదులు పొంగి వెంబడొచ్చాయి/నల్ల మేఘాలలో నాట్యమాడింది/కొండగుట్టల మీద కులు కులాడింది/ఇసుక నదిలో బుసలు కొట్టింది/ పాడుతూ కోయిల పరుగులెట్టింది/ఆడుతూ నెమలి అలసి పోయింది’, ‘అటక మీద గంప అందుకోవయ్య/విత్త నాలు దీసి విరగజిమ్మవయ్య/మృగశిరా కార్తిలో ముం చెత్తు వాన/కలపరా అబ్బాయి కొత్త దూడల్ని/కట్టరా అబ్బాయి కొత్త నాగళ్లు/దున్నరా ఓ అయ్య దుక్కుల్లు మీరు/ఒకగింజ కోటియై వర్థిల్లు మీకు/ఏరువాక సాగి ముసురుకోవాలి/కొత్త పంటలు మనకు కోరుకోవాలి.’ అంటూ దుక్కులు మొదలెట్టమంటూ సాగే పాట.

అష్టవిధ నాయికలలో ఒకరైన ప్రోషిత భర్తృక (దూరదేశాలలో ఉన్న భర్త గురించి ఆలోచించే నాయిక)కు సమాంతరంగా ఒక జానపద యువతి విరహానికి ఏరువాక పున్నమి సందర్భాన్ని అన్వయించే గీతం ఒకటి. ఏరువాక రైతన్నకు ఎంత ప్రాణప్రదమో దూరాన ఉన్న తన బావ కూడా అంతేనట.

‘తొలకరి ఒక మబ్బు తొంగి చూసింది

మబ్బులో ఒక మెరుపు మెరసి పోయింది

పెరటిలో ఒక జల్లు కురిసి వెలిసింది

జల్లులో నా మనసు జారిపోయింది

ఏరువాక నాటి కేడాది దాటింది

ఎదురు చూచిన గుండె చెదిరిపోయింది

పిట్టపిట్టా ముద్దు పెట్టుకున్నాయి

గోవులన్నీ ఇల్లు చేరుకున్నాయి

      ***************

ఏటి ఒడ్డున నేను పాటబాడే వేళ

నవ్వుతూ నా బావ పువ్వులేరేవేళ

కొంటె కోయిల పైన కూత కూసే వేళ

బావొచ్చి నాతోటి బాసలాడాలె

ముద్దొచ్చి నాతోటి మురిసిపోవాలె

ఏరువాకమ్మ మాకెదురు రావాలె

తలవంచి మము చూచి దీవించి పోవాలె’ అంటూ ఏరువాకతో పాటే తానూ వస్తాడని, రావాలని ఆశిస్తూ ఆ మరదలు పాడుకున్న గీతం ఈ పండుగ ప్రసిద్ధికి ఓ ఉదాహరణ.

సేద్యమంటే జూదమేనా…!

అయితే సేద్యం చెప్పుకున్నంత గొప్పగా లేదని మాధ్యమాలలో నిత్యం వచ్చే రైతు ఘోష వార్తలను బట్టి తెలుస్తోంది. వ్యవసాయాన్ని ‘జూదం’గా భావించి దాని నుంచి ఇతర రంగాలకు మళ్లుతున్న వారూ ఉన్నారు. చాలా వరకు వ్యవసాయ భూములు స్థిరాస్థి వ్యాపారంగా మారుతున్న తీరు తెలిసిందే. వ్యవసా యాన్ని వీడి భూములను ‘సొమ్ము’ చేసుకుంటూ గ్రామాంతరం వెళ్లేవారిపైనా, రైతుశక్తిని తక్కువగా అంచనా వేసే వారి పైనా….

‘పొలాలమ్ముకొని పోయేవారూ

టౌనులో మేడలు కట్టేవారూ

బాంకులో డబ్బు దాచేవారూ

నీశక్తిని గమనించరు వారూ…

పల్లెటూళ్లలో చెల్లనివాళ్లు

పాలిటిక్సుతో బ్రతికేవాళ్లు

ప్రజాసేవయని అరచే వాళ్లు

ఒళ్లు వంచి చాకిరికి మళ్లరు..’ అని దశాబ్దాల క్రితమే తన గీతంలో చురకలు వేశారు కవి కొస రాజు. అయినా రైతు దిగులు పడవలసిన అవసరం లేదని, రోజులు మారి ‘రైతే రాజు’ కాగలడంటూ….

‘పదవులు స్థిరమని భ్రమిసే వాళ్లే/ఓట్లు గుంజి నిను మరచేవాళ్లే/నీవే దిక్కని వత్తురు పదవోయ్‌..’ అనే ఆశా భావంతో భరోసా ఇచ్చారు. ఆ భరోసా నిజం కావాలని ఆశిద్దాం.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram