ఆశలూ,ఆశయాల కలయిక సివిల్‌ ‌సర్వీస్‌. ‌కేంద్రంలో లేదా రాష్ట్రంలో కీలక ప్రభుత్వ / అధికారాలు, ఐ.ఏ.ఎస్‌, ఐ.ఎఫ్‌.ఎస్‌, ఇలా పౌరసేవలన్నింటా అగ్రగణ్యం. యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఏటా నిర్వహించే పరీక్షల (లిఖిత, మౌఖిక) ఉత్తీర్ణతే యువత కలల్ని పండిస్తుంది. దేశంలోని ఆబాల గోపాలన్నీ ఎంతగానో ఆకట్టుకునే ఆ ఎంపికలు ఈసారి కూడా పలు రీతుల రికార్డులు సృష్టించాయి. తొలి మూడు ర్యాంకుల విజేతలుగానూ ఘనపతాక ఎగురవేసి వనితా శక్తికి తిరుగేలేదని చాటి చెప్పారు శ్రుతిశర్మ (ఉత్తరప్రదేశ్‌), అం‌కిత (కోలకతా), గామిని (చండీగఢ్‌). అతివలు  టాప్‌ ‌ర్యాంకర్లుగా నిలవడం ఇదేమీ కొత్త కాకున్నా, ఒకటీ రెండూ మూడు స్థానాలూ వారినే వరసగా వరించడం దరిదాపు దశాబ్దాకాల వ్యవధిలో  ఇదే ప్రథమం, ప్రధానం.

సివిల్స్‌లో నిరుటి ఫలితాలకు సంబంధించి, 177 మంది మహిళలు ర్యాంకుల్ని కైవసం చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట యూపీఎస్‌సీ పరీక్షల విజేతలు మొదటి పాతిక మందిలో ఎనిమిది మంది మహిళామణులే. ఇప్పుడైతే వరస స్థానాలు మూడింటినీ ఆడపిల్లలే సంపాదిం చడం, అందులో తమదైన విశిష్టత చూపడమే జయజయహో అనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శతాధిక విజేతలను ఇప్పటిదాకా తీర్చిదిద్దిన మల్లవరపు బాలలతది మరింత ప్రత్యేకత. తాజా ఫలితాల్లోనూ ఏకంగా 14 మందిని ర్యాంక్‌ ‌సాధకులుగా నిలబెట్టిన తనది ఎంతైనా విలక్షణత. మరీ ముఖ్యంగా దేశంలో అమ్మాయిల పరంగా గత పరీక్షలోనూ సగానికి పైగా సందర్భాల్లో వారే మొదటి ర్యాంకర్లు. 2015-2017 మధ్య ముదితలే తొలి ర్యాంకులందుకోవడం ఇంకెంతో విశేషం. జాతీయంగా; తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల రీత్యా ర్యాంకర్ల నేపథ్యాలు చరిత్రాత్మకాలు, స్ఫూర్తిదాయకాలు, ఆదర్శప్రాయాలు. వాటిల్లో కొన్నింటిని సమీక్షించుకుంటే, భారతీయుల్లోని ప్రతి ఒక్కరి హృదయమూ స్పందనతో నిండితీరుతుంది. ఘనవిజయమంటే ఆ ర్యాంకర్లదే. విజేతలంటే నూటికి నూరు శాతమూ వారే!

అఖిల భారత స్థాయిలో అత్యంత ఉత్తమ ర్యాంకర్‌ ‌సాధించిన శ్రుతి శర్మది సివిల్స్‌లో ద్వితీయ యత్నం. యూపీలోని బిజ్‌నార్‌ ‌స్వస్థలమైనా చదు వంతా దేశ రాజధాని ఢిల్లీలోనే. ఆధునిక చరిత్రలో పోస్ట్‌గ్రాడ్యు యేట్‌. ‌రోజూ వార్తాపత్రికలు చదువుతూ, సొంతంగా నోట్సు రాసుకుంటూ, ఇష్టపడి సివిల్స్ ‌పరీక్షలు రాసిన ఆమె గెలుపు రహస్యం-స్వయం ప్రేరణ. తొలి ప్రయత్నం సఫలం కాకున్నా, అందులో నుంచే పాఠం నేర్చుకుని అగ్రగామిగా నిలిచి గెలిచిన శ్రుతి ఒకే ఒక్క మాట అన్నారు… ‘నిత్యసాధన’. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనే ఆర్థికశాస్త్రం (ఆనర్స్) ‌డిగ్రీ చేసిన అంకితా అగర్వాల్‌ ఇచ్ఛాపూర్వకంగా ఎంచుకుంది మాత్రం రాజనీతిశాస్త్రం, విదేశీ సంబం ధాలు. అందుకే తన ఆలోచనా పరిధి నానాటికీ విస్తరించి రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంక్‌ ‌వచ్చేలా చేసిందన్నారు. రోజులో సగభాగం చదువులోనే గడిపిన తనకు వనితాశక్తి నిరూపణే జీవితాశయం. తదుపరి ర్యాంకర్‌ ‌గామినీ సింగ్లా చదువుకుంది బీటెక్‌ అయినా, ఐచ్ఛిక పాఠ్యాంశం సామాజికశాస్త్రం. ఈ ఎంపికకు కారణం ఏమిటని అడిగితే ‘సమాజ సాంకేతికత’ అని ఒక్క ముక్కలో బదులిచ్చారు. ‘అమ్మా నాన్నా వైద్యాధికారులు. చూశారా, వైవిధ్యమంతా మా కుటుంబంలోనే ఉంది’ అంటూ నవ్వులు చిందించారు. పంజాబ్‌ ఇం‌జనీ రింగ్‌ ‌కళాశాలలో చదువుతున్నప్పుడే తన దృష్టికోణం విస్తారంగా మారిందన్నారు. అంకితభావం అమ్మా యిల సహజ లక్షణం, ప్రోత్సాహం తోడైతే ఎంతైనా ఎదుగుతారనేందుకు తానే నిదర్శనమన్నారామె.

దీక్షాదక్షతల నెలవు

తెలుగు అభ్యర్థుల సివిల్స్ ‌సత్తా అసాధారణం. పదిమంది పైగా వందలోపు ర్యాంక్‌ల్లో నిలిచారు. ఉభయ రాష్ట్రాల నుంచీ పదుల సంఖ్యలో ఎంపిక య్యారు. భాగ్యనగరం సైనిక్‌పురివాసి ప్రియంవదది పదమూడో ర్యాంకు. తెంగాణ నుంచి ఆమె టాపర్‌. ‌మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగి అయిన నాన్న అశోక్‌ ‌మదాల్కర్‌ ‌తనకు స్ఫూర్తి.ఫలితంగా ముంబయి నుంచి పట్టా పొంది, బెంగళూరులో ఎంబీఏ చేశారు. దశలవారీగా సన్నద్ధత కొనసాగించి లక్ష్యం చేరుకున్న ఆ వనిత సమయపాలనకే సమాధిక ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్‌ ‌పోలీస్‌ ఉన్నతాధికారి మహేశ్‌ ‌భగవత్‌ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ ‌గ్రూపు సభ్యురాలిగా చేరారు. మరో ర్యాంక్‌ ‌విజేత సంజనది కూడా హైదరాబాద్‌ ‌నగరమే. బీటెక్‌ ‌స్వర్ణపతక సాధకురాలు. ర్యాంక్‌ ‌సాధనలో భర్త హర్ష ఉత్సాహ ప్రోత్సాహాలు ఎన్నో ఉన్నాయి. సివిల్స్ ‌శిక్షణ సమయంలో ఆయనే ఆమెకు మెంటార్‌! ‌వేరొక ర్యాంకర్‌ శ్రీ‌పూజ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. ఆమె బీటెక్‌ ‌చదువు కర్ణాటకలో. సివిల్స్ ‌పరీక్షల ముందు రోజంతా చదువుతూ, పాఠ్యాంశ విశ్లేషణలు కొనసాగిస్తూ, తనదైన పటిమను నిరూపించారు. ఒకప్పడు సివిల్స్‌కు ప్రయత్నించిన తండ్రి కలను తనయగా నెరవేర్చాన్నప్పుడు శ్రీపూజ కళ్ల నుంచి ఆనందబాష్పాలు! ఇంకా సాహిత్య, కిరణ్మయి, స్నేహ, మనీషా, శ్రీలేఖ, అనన్యప్రియ, అంబిక, చైతన్య, మౌనిక, పవిత్ర మరెందరో నారీరత్నాలు. పూసపాటి సాహిత్యది విశాఖ ప్రాంతం. ఫార్మసీ చదివిన ఆమెకి సివిల్స్‌లో ఇది ఆరో యత్నం. ‘ప్రతిసారీ నాలో పంతం పెరుగుతూ వచ్చింది. అపజయానికి జవాబు చెప్పాలన్న గట్టిపట్టుదలతోనే పగలూ రాత్రీ మనసు పెట్టి చదివి, చివరికి నెగ్గాను’ అన్నారు. ఇనుమ డించిన ఆత్మవిశ్వాసంతో.సాహిత్యం మీద ఎంతో అభిమానంతో తాత, రచయిత పూసపాటి కృష్ణంరాజు తనకీ పేరు పెట్టారన్నారు. పేరు ప్రఖ్యాతులు నిలబెట్టానన్న సంతృప్తి, సంతోషాలు ఈ విజేత మాటల్లో ప్రస్ఫుటమయ్యాయి. ఇతర వాటి కంటే ఇండియన్‌ ‌ఫారిన్‌ ‌సర్వీసులంటేనే తనకు మక్కువ ఎక్కువన్నారు.

శ్రమించి సాధించిన తీరు

అనన్య ప్రియదీ ఆరో ప్రయత్నం. ఏ దశలోనూ నిరాశకు తావివ్వకుండా కష్టపడి చదివి సాధించారు. వరంగల్‌ ‌ప్రాంతీయురాలైన ఆమె చదివింది ఆర్కిటెక్చర్‌. ఈ ‌చదువుకోసమే తల్లిదండ్రులతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి అందించిన ప్రోత్సాహబలంతో, ఆరోసారి యత్నంలో గెలుపు సంపాదించుకున్న అమ్మాయి మౌనిక. చదువంతా హైదరాబాద్‌ ‌నగరంలోనే. తల్లి భద్రాచలంలో పెట్రోలు బంకు నిర్వాహకురాలు. బీఫార్మసీ చేసి, కొంతకాలం జర్మనీలో రీసెర్చి సాగించి, అటు తర్వాత సివిల్స్‌పై బెంగళూరులో శిక్షణ పొందారు. ప్రస్తుత గెలుపుతో ఐఏఎస్‌ అర్హత సాధించిన తాను ఆ అధి కారిణిగా తనవంతు సేవలు అందిస్తానంటున్నారు.

భాగ్యనగరానికీ సంబంధించిన కొప్పిశెట్టి కిరణ మయిది తెలంగాణ రాష్ట్రంలో రెండో ర్యాంకు. తొలి యత్నంలో 573, తర్వాతి ప్రయత్నంలో 633వ ర్యాంకు లొచ్చిన ఆమె అనంతర కృషి పర్యవసానంగా ఇప్పుడు 56వ ర్యాంకు సాధించారు మరి. ఉస్మానియాలో ఎమ్‌.‌బీ.బీ.ఎస్‌, ఎమ్‌.ఎస్‌. ‌సర్జన్‌ ‌తన వృత్తి నేపథ్యం. సూర్యాపేట ప్రాంతీయురాలు చైతన్యరెడ్డికి 161వ ర్యాంకు. నీటిపారుదల శాఖ అధికారిణిగా పనిచేస్తూనే సివిల్స్ ‌పరీక్షలు రాసి విజయ కిరీటం అందుకున్నారు. తన ఈ గెలుపును ప్రముఖంగా సోదరుడు రవికిరణ్‌కి అంకితం చేశారీమె. జూబ్లిహిల్స్ ‌నివాసిని పవిత్ర హైదరాబాద్‌, ‌బెంగళూరుల్లో చదివారు. సివిల్స్ ఇం‌టర్వ్యూ మునుపు ఆరు మార్కుల తేడాతో దక్కకుండా పోయిందని బాధపడకుండా అవిశ్రాంతంగా పరి శ్రమించారు. ఆఖరికి జీవితాశయం నెరవేర్చుకున్న దీక్షాదక్షురాలు. అరుగుల స్నేహ సొంత ఊరు నిజామాబాద్‌. ‌తల్లి ఒక్కరే కుటుంబానికి ఆధారమైన స్థితిలో, అనేక కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచారు వనిత. కంప్యూటర్‌ ‌బేసిక్స్ ‌నేర్చుకున్న అమ్మకు కాంట్రాక్టు ఉద్యోగం రావడం, ఆ అధికారిక పత్రంపై ఐఏఎస్‌ ‌సంతకం చూడటం ఈమెలో స్ఫూర్తిని నింపాయి. ఆ మాతృమూర్తి నిరంతర తోడ్పాటుతోనే స్నేహ సైతం తన కలను ఫలింపచేసుకున్నారు.

సవాళ్లకు సమాధానాలు

సివిల్స్ ‌పరీక్షలంటే అడుగడుగునా పోటాపోటీ. ఈసారి ఐదు లక్షల మంది రాస్తే, తుదిదాకా నిలిచి వడపోతల్లో గెలిచి, ఎంపికైనవారి సంఖ్య 685. వీరిలో నాలుగోవంతు అతివలే ఉండడం ఎంతైనా గణనీయం. ప్రాథమిక, ప్రధాన, మౌఖికాల్లోనే కాదు; జీవిత పరీక్షల్లోనూ స్త్రీలే కృతార్థులు. ర్యాంకర్లలో ఒకటైన శివాంగి మెట్టినింట హింసను ఎదుర్కొన్నారు. పుట్టింటికి తిరిగొచ్చి తనవారి పరిపూర్ణ అండ దండలతో నెగ్గి ఈ అధికారిక హోదాను సొంతం చేసుకొన్నారు. ఈమెది హాపూర్‌ (ఉత్తరప్రదేశ్‌). ‌పెళ్లయ్యాక కట్నం వేధింపులు ఎక్కువయ్యాయి. కలలన్నీ కల్లలవడంతో తల్లిదండ్రుల దగ్గరికి చేరాల్సి వచ్చింది. సామాన్య కుటుంబం. తనకు చిన్నారి పాప. ఇన్నీ ఆందోళనలూ, సందేహాలూ సమస్యల మధ్యనే సివిల్స్ ‌రాసి ర్యాకు అందుకున్నారీమే. ‘పరీక్షలు ఎదురవడం, వాటిని తట్టుకుని నిలబడటం నాకు అలవాటైంది’ అనడం తన ధీరతకు ప్రతీక. ఎక్కడా ఎటువంటి శిక్షణ లేకుండానే సివిల్స్ ‌టాప్‌ ‌టెన్‌లో నిలిచిన ఆణిముత్యం ఇషిత. ఈమెది దిల్లీ. తల్లిదండ్రులది పోలీసుశాఖ. వనితా సాధికారతకు పరితపించే ఈ పాతికేళ్ల యువతి మద్రాసులో పీజీ చేశారు. స్వయం శిక్షణ, సంపూర్ణ ఆత్మవిశ్వాసం, ధృఢమైన వ్యూహ రచనతో ర్యాంకును వశం చేసుకు న్నారు. బ్రెయిలీ లిపి సాయంతో చదువుకుని ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన ఆయుషిదే తరగని చెదరని ఘనత. చరిత్రను బోధించే ఈమె దేశవ్యాప్తమైన సివిల్స్ ‌పరీక్షలో 48వ ర్యాంకును కైవసం చేసు కోవడం చరిత్రను సృష్టించడమే! దిల్లీ పరిసరాల్లోని పల్లె రాణిఖేడా నివాసిని. పుట్టుకతోనే రెండు కళ్లూ కనిపించని విధి వైచిత్రి. అయినా శ్యాంప్రసాద్‌ ‌ముఖర్జీ కళాశాలలో బి.ఎ. చేసి, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రధానాంశంగా ఎం.ఎ. చదివి, అటు తర్వాత దశాబ్దంగా టీచర్‌ ఉద్యోగం చేస్తున్నారు ఆయుషి. అనంతర కాలంలో సివిల్స్ ‌ర్యాంకర్‌గా వెలుగుతున్న తనకి ఇప్పుడు 29 ఏళ్లు!! దివ్యాంగుల పరంగా నేటి సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఎంతో ఉందన్నది ఆమె నిశ్చిత అభిప్రాయం.

ధన్యచరిత బాలలత

ఆత్మశక్తి, విశ్వాసాలే రెండు కాళ్లుగా సదా ముందడుగు వేస్తున్న; అందరితోనూ వేయిస్తున్న మల్లవరపు బాలలత జీవితం చరితార్థం. సివిల్‌ ‌సర్వీసు పరీక్షలకు హాజరయ్యే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఈ హైదరాబాద్‌ ‌మణిదీపిక చిర పరిచిత ఆత్మీయురాలు. తమ శిక్షణనిచ్చిన వారిలో ఇప్పటికే వందమంది విజేత స్థానాల్ని అలంకరిం చారు. ఇటీవల ఫలితాల్లోనూ 14 మంది ర్యాకర్లు ఈమె శిష్యులే! ఈ గుంటూరు ప్రాంతీయురాలు న్యాయశాస్త్రం విద్య వరకూ ఎప్పుడూ ప్రథమురాలే. తొలి యత్నంలోనే ఆనాడు ర్యాంకు సాధించి అధి కారిణిగా ఉంటూనే సివిల్స్ అభ్యర్ధులకు మార్గదర్శ కురాలిగా వ్యవహరిస్తూ, హైదరాబాద్‌లో శిక్షణ సంస్థ స్థాపన ద్వారా మెంటార్‌ ‌స్థానాన్ని సుస్థిరం చేసుకున్న బాలలత ధన్యచరితురాలు.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram