తృతీయ వర్ష-2022

నాగపూర్‌లోని రేషిమ్‌బాగ్‌ ‌మైదానంలో మే 9 నుంచి జూన్‌ 2 ‌వరకు తృతీయ వర్ష సంఘ శిక్షావర్గ జరిగింది. ముగింపు కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పరమపూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ శ్రీ ‌మోహన్‌జీ భాగవత్‌ ‌పాల్గొని స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగించారు.  మోహన్‌జీ ఉపన్యాసం పాఠకుల కోసం యథాతథంగా..

ప్రతి సంవత్సరం శిక్షావర్గ జరుగుతూ ఉంటుంది. కరోనా వలన ఈ రెండేళ్లు ఆగింది. కానీ సంఘ కార్యం ఆగలేదు. మైదానంలో శాఖలు ఆగాయి. కానీ స్వయంసేవకుల ఇళ్లలో జరిగాయి. అయితే సంఘ కార్య స్వరూపం మారింది. కరోనా పీడితులకు సేవ చేయడమే సంఘ కార్యం అయింది. సంపూర్ణ హిందూ సమాజంతో కలసి లక్షలాది మంది స్వయంసేవకులు కొవిడ్‌ ‌సమయంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు. ఆ విధంగా కూడా వారికి తగిన శిక్షణ లభించింది. ఇక్కడ ఈ రోజు తృతీయవర్ష శిక్షార్థులు దండ, నియుద్ధ, సమత వంటి శారీరక ప్రదర్శనలు చేశారు. ఇవన్నీ మనకు వివిధ రకాలుగా కనపడినా ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి చేర్చడానికి కావలసిన యోగ్యతను సంపాదించి పెట్టే ప్రశిక్షణగా భావించాలి. ఈ కరోనా కాలంలో సంఘ కార్యం ఆగకపోగా ఇంకా పెరిగింది. రామజన్మ భూమి నిధి సంగ్రహణ పనిలో నాలుగు కోట్లకుపైగా గ్రామాల నుండి మనం నిధి సేకరించాం. దీని ఫలితంగా ఇక్కడ జరుగుతున్న ఈ తృతీయ వర్ష సంఘ శిక్షావర్గకు ఇప్పుడున్న సంఖ్యకు రెట్టింపు సంఖ్య రావడానికి తయారయ్యారు. కానీ ఇక్కడ అంతమందికి ఒక్కసారిగా ప్రశిక్షణ ఇవ్వడం సాధ్యం కాదు. అందుకని ఈ వర్గలో సంఖ్యను పరిమితం చేశాం. మిగిలినవారి కోసం మరొక వర్గ నిర్వహించ వలసి ఉంది.

ప్రపంచమంతా భారతమాతకు జైకొట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మనం విశ్వవిజేతలం కావాలనే ఆకాంక్ష మనకు లేదు. కాని అందరినీ కలుపుకుపోవాలనేదే సంఘ కార్య స్వభావం. అనాది కాలం నుండి భారత్‌ ఇదే అనుసరిస్తున్నది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రాచీన కాలం నుండి మన అస్తిత్వమంతా రంగురంగులుగా భిన్నత్వంతో నిండి ఉన్నదని, అదే శాశ్వత సంపూర్ణం (ఏకమేవ అద్వితీయం) అని, అదే సత్యావిష్కారమని భావించాలి. దీని ఆధారంగానే మనం ఆనందాన్ని పొందాం. ప్రపంచాన్ని మనదిగా అనుకొన్నపుడు ప్రపంచం కూడా ఆ సంతోషాన్ని పొందేట్లు చేయాలి. దానినే అందరూ అనుసరించాలి.

సత్యం, కరుణ, పవిత్రత, ఆధ్యాత్మిక సాధన (తపస్సు) అనేవి మన ధర్మానికి నాలుగు పాదాలు. ఈ నాలుగు విలువలు మన ప్రజలు ఆచరించి చూపారు. అదే మన రాష్ట్ర జీవనం అయింది. మనమంతా భాష, పూజ కారణంగా ఒకే రాష్ట్రీ యులం (జాతీయులం) కాలేదు. ఒకచోట ఉన్నాం కనుక కాలేదు. (ఏతద్దేశ ప్రసూతస్య… పృథీవ్యాం సర్వమానవాః) అన్నట్లు మనుష్య జీవనం ఎలా ఉండాలి? ప్రపంచం నుండి ఎవరు వచ్చినా మనలో ఉన్నత ప్రమాణాలు కలిగిన వారుగా కనపడాలి. అలాంటి జీవనం మనం కలిగి ఉండాలి. ప్రపంచంలో ప్రాచీన దేశవాసులుగా ఇది మన బాధ్యత. ఇలాంటి సమాన ఉద్దేశం భారతదేశం లోని అన్ని సంప్రదాయాలవారు, అన్ని భాషలవారు, అన్ని ప్రాంతాలవారు, ఆహారం, వస్త్రధారణలో భిన్నత్వం కలిగినవారితో పాటు వివిధ కారణాలతో విదేశాలకు వలస వచ్చి పూజాపద్ధతిని స్వీకరించిన వారిలోనూ మనఃపూర్వకంగా ఇదే లక్ష్యం ఉంటుంది. ఎందు కంటే వారు భారతీయులు కనుక. ఇది ప్రపంచానికి చాలా అవసరం. ఇలా అందరినీ కలుపు కొని వెళ్లే మనలాంటి విధానంతో సమానమైనది ప్రపంచంలో మరెక్కడా లేదు. ప్రపంచంలో సిద్ధాంతం ఉంది కాని అభ్యాసం, అనుభవం లేదు. ఈ అభ్యాసం, అనుభవం అనే పరంపర ఈనాటికీ మన దేశంలో నిరంతరంగా వస్తున్నదే తప్ప ఎటువంటి పరిస్థితి లోనూ ఆగలేదు. ఇదే మన ఆధ్యాత్మికత. ఇటువంటి ఆధ్యాత్మికతపై నిలబడే ఈ ధర్మాన్ని హిందూధర్మం అని అంటున్నా వాస్తవంగా ఇది మానవ ధర్మం, విశ్వధర్మం అవుతుంది. యుగయుగాలుగా ఈ భూమిలో ధర్మ సంరక్షణ జరిగింది. హిందూ భూమిలో ఈ పరంపరలో పనిచేస్తున్నవారిని ప్రపంచ దేశాలవారు హిందువులని అంటున్నారు. కనుక ఇది హిందూధర్మం. ఈ భూమిలో మనం నివసిస్తున్నాం. ఈ భూమి మనల్ని సంరక్షిస్తుంది. మన దేశం చుట్టూ పర్వతాలు, సముద్రం ఉన్నాయి. కనుక ఆ రోజుల్లో బయటి దేశాలవారు రావాలంటే చాలా కష్టం. అందువల్ల ఇక్కడ పుట్టి పెరిగిన మనం, మన సంరక్షణకై ఇతరులతో పోరాడే అవసరం రాలేదు. ఎంత గొప్ప సమృద్ధిని, విశేషమైన రక్షణను మన మాతృభూమి కల్పించింది. దీని ఆధారంగా సత్యాన్ని ఆవిష్కరించి ప్రపంచానికి అందించడానికి అవసరమైన సద్గుణ సంపద కలిగిన సంఘటిత సమాజం రూపొందింది. దాని ఆధారంగా రాష్ట్ర (దేశ) నిర్మాణం చాలా ప్రాచీనకాలంలోనే జరిగింది.

‘ఓం భద్రమిశ్చంతరుషయః…. తదైస్మై దేవా ఉపసన్నమంతు’

మన దేశాన్ని బలసంపన్నంగా చేయడం ద్వారా విశ్వ కల్యాణాన్ని కాంక్షించిన మన రుషులు, మునులు అనంత శ్రమలకోర్చి తపస్సు చేశారు. అంతేగానీ తమ స్వార్థం కోసం కాదు. అలాంటి రుషులు, మునులు మన సమాజానికి ఆధారం. కాని కాలచక్రం మారుతూ వస్తున్నది. ఒక్కసారి అనుకూలత (మంచి), మరొక్కసారి ప్రతికూలత (చెడు) సంభవించాయి. ఒక్కోసారి ప్రపంచానికి సంస్కృతిని అందించి పాలించాం. ఒక్కోసారి విదేశీయులతో పీడనకు గురయ్యాం. తిరిగి మనం ప్రపంచంలో ముందు వరుసలో నిలబడాలి. ఈ సనాతన దేశానికి మనం వారసులం. ఇదే ధర్మం సమన్వయాన్ని నేర్పుతుంది. సంతులనాన్ని ఇస్తుంది. అందరినీ కలుపుకుంటూ, అందరి ఉన్నతి కాంక్షిస్తూ, అందరి అభివృద్ధిలో తన అభివృద్ధిని దర్శించుకుంటేనే అది ఉన్నత స్థితి అవుతుంది. ఈ మొత్తాన్ని మనం తిరిగి స్థాపించాలి. దేశ ప్రయోజనం ఇందులోనే ఉన్నది. స్వాతంత్య్రంలోని ‘స్వ’ ఆధారంగా మనదైన తంత్రాన్ని అనుసరిస్తూ ప్రపంచాన్ని ఆ దిశలో అనుసరింపచేయాలి. ఈ కార్యాన్ని పాలించడానికి సత్యాన్ని అనుభూతి పొంది, తెలుసుకొని జీవించేవారు కావాలి.

ధర్మ సంరక్షణ రెండు రకాలుగా జరుగుతుంది. ధర్మం పట్ల ఆక్రమణ జరిగితే రక్షించడం, దానికోసం పోరాడవలసి వస్తే పోరాడడం, బలిదానం కావడం జరుగుతుంది. కనుక ధర్మాచరణ కావాలి (ఆచార ప్రభవో ధర్మః). మన మధ్య ప్రేమ, ఆనందం, ఒకరి పట్ల ఒకరికి సంవేదన కావాలి. భిన్నత్వాన్ని సహజమైనదిగా భావించాలి. భిన్నత్వాన్ని విడివిడిగా చూడవద్దు. మన మధ్య ఘర్షణ ఉండవద్దు. ప్రపంచానికి ఇవ్వడానికి ఇలాంటి సత్యం మన దగ్గర ఉంది. దానిని ప్రపంచానికి అందించే సమయం ఆసన్నమయింది కూడా. దాని కోసం మనం తయారు కావాలి. సత్యం స్వయంగా నిలబడలేదు. సత్యానికి శక్తి ఆధారం కావాలి. శక్తి లేకుండా మనలను ప్రపంచం గౌరవించదు. మనం ఎవరినీ గెలవాలని అనుకోం. కాని ప్రపంచంలో దుష్టశక్తులు ఉన్నాయి. అవి మనని ఓడించాలని చూస్తున్నాయి. వారి ఆలోచనల్లో ఎటువంటి మార్పు రాలేదు.

అందుకని శక్తిని మనం ఆరాధించాలి. ఎవరైనా ఆధ్యాత్మికతను వదిలి, కేవలం భౌతికవిద్యను అభ్యసిస్తే అంధకారంలోకి వెళతారు. కనుక భౌతిక జ్ఞానం ఆధారంగా జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటే యశస్వి అవుతాడు. ఆ విధంగా పొందిన యశస్సును ఆధ్యాత్మిక విద్యనభ్యసించడం ద్వారా సార్థకత సాధిస్తాడు. సార్థకత లేకుండా యశస్సు (విజయం) సాధ్యం కాదు. విజయం పొందడం పశువులకు కూడా సాధ్యమే. కీర్తి లేకుండా సార్థకత లేదు. సార్థకత లేకుండా యశస్సుకు అర్థం లేదు. భారతీయులకు ప్రేమను పంచడం తెలుసు. సంఘంలో స్వయంసేవకులు ప్రేమను తమ హృదయంలో నింపుకుని ఇంటింటికి వెళుతుంటారు. హిందుత్వం మనది అనే భావనను నరనరాలలో జీర్ణించుకొనేటట్లు చేయాలి. అహంకారాన్ని మరచిపోయి అందరినీ తమవారిగా చేసుకోవాలి. స్వయంసేవక్‌ ‌దీని కోసం తయారవుతాడు. కాని అన్ని విషయాలకు శక్తి అనేది మన అధిష్ఠానం కావాలి. సత్య ఆధారమైన నీతి కావాలి.

‘విద్యా వివాదాయ ధనం మదాయ- జ్ఞానాయ దానాయ చ రక్షణాయ’

విద్య, ధనం, శక్తి దుష్టులలో ఉంటే వారు ఇతరులను బాధలకు గురిచేస్తారు. అదే మంచి వారిలో ఉంటే ఇతరుల బాగుకు ఉపయోగిస్తారు. ఈ నీతిని ఉపయోగించకపోతే శక్తి ప్రమాద కరంగా తయారవుతుంది. రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించింది. రష్యా దగ్గర శక్తి ఉంది కనుక ఉక్రెయిన్‌లోకి వెళ్లింది. రష్యాను ఆపడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. మీరు యుద్ధంలో ప్రవేశిస్తే అణుబాంబును ప్రయోగిస్తామని రష్యా బెదిరిస్తున్నది. కొన్ని దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తు న్నాయి. ఉక్రెయిన్‌కు తమ ఆయుధాలనిచ్చి సహాయం చేస్తున్నవారి హేతువు వెనుక పవిత్ర భావం ఉందా? లేదు. గతంలో భారత్‌-‌పాకిస్తాన్‌ ‌యుద్ధం జరిగి నపుడు వాళ్ల ఆయుధాలు పరీక్షించుకొనేందుకు సరఫరా చేశారు. నేడు ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న వారి పరిస్థితి కూడా ఇంతే.

కాని శక్తిశాలి దేశాలు కూడా ఉన్నాయి. వాటి భాష మనలాగే ఉంది. శాంతి ద్వారా ఐకమత్యంగా ఉందామంటున్నాయి. మనం అనే భావనతో, మనమంతా ఒకటే అనే భావనతో మెలుగుదాం అనే ధర్మం, నీతి వారి దగ్గర లేవు. వాటి దగ్గర సైన్యం ఉంది, సంపద ఉంది కాని తమ స్వార్థం కోసమే వీటన్నిటినీ ఉపయోగించుకొంటున్నాయి. అందుకనే ఈ యుద్ధాన్ని ఆపడం ఆ దేశాల వల్ల కావడం లేదు. అందుకే నీతి కావాలి. సత్వగుణంతో శక్తి వస్తుంది. ఐకమత్యంతో కూడా శక్తి వస్తుంది. భారతదేశాన్ని పరమ వైభవం వైపు సాగించ డానికి, విశ్వగురువు స్థానంపై నిలబెట్టడానికి సమయం పడుతుంది. అందుకు భారతీయులందరూ ఒక్కటి కావాలి-ఏ పూజా పద్ధతి దీనికి బంధనం కారాదు. ఏ పూజా విధానాన్ని వ్యతిరేకించవద్దు. అన్ని భాషలు మనవి. దేనినీ వ్యతిరేకించవద్దు. అన్ని ప్రాంతాల వారిని మనవారిగా భావించాలి. అందరినీ భరతమాత సంతానంగా అంగీకరించాలి. ఇక్కడి పూర్వీకులు భారతీయులందరికీ సమానం. ‘స్వ’ ఆధారిత సంస్కృతి అంటే ఇదే. ఇది మనకు వారసత్వంగా లభించింది. పూజతో, కర్మకాండలతో, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాల నుండి ధర్మాన్ని వేరు చేయాలి. అపుడే ధర్మరక్షణ జరుగుతుంది. బంధుభావన, మానవత అనేది భారతదేశ ‘స్వ’గా చెబుతాం. అదే భారత ప్రాచీన ధర్మం. అదే మానవత. దానినే నేడు హిందూధర్మం అంటున్నాం. వివిధత కూడా అదే. అది వేరు కాదు.

ఇప్పుడు జ్ఞాన్‌వాపి మసీదు వివాదం మొదల యింది. ఇది చరిత్రకు సంబంధించింది. నేడు హిందువులుగా చెప్పుకుంటున్న వారుగాని, ముస్లింలని చెప్పుకుంటున్నవారుగాని దీన్ని సృష్టించలేదు. గతంలో జరిగింది. ఇస్లాం బయట నుండి ఆక్రమణ ధోరణితో భారత్‌లోకి చొరబడింది. ఆ సంఘర్షణ సమయంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారి మనో ధైర్యాన్ని సడలింప చేయడానికి వేలాది మందిరాలను కూలగొట్టారు. హిందువులకు అత్యంత పవిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటి గురించి చర్చ వస్తున్నది. ఏ విధంగా చేయాలి, దీనిని ముస్లింలకు విరుద్ధంగా ఆలోచించ కూడదు. ఈనాటి ముస్లింల పూర్వీకులు కూడా హిందువులే! హిందుత్వ మూలాలున్న ఇలాంటి ముస్లింలందరినీ స్వాతంత్య్రం వచ్చాక మోసానికి గురిచేస్తు, మనోధైర్యాన్ని సడలింపచేస్తూ వస్తున్నారు. కనుక ముఖ్యమైన మందిరాలు పునరుత్థానం గావించాలని హిందువులు కోరుకుంటున్నారు. మేము ఇప్పుడు ఏమీ చెప్పడం లేదు. రామజన్మభూమి ఉద్యమంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల ఆధారంగా పాల్గొనాల్సి వచ్చింది. ఆ విషయం పూర్తయ్యింది. మరో ఉద్యమమేదీ చేపట్టేది లేదని 2019 నవంబర్‌ 9‌వ తేదీన చెప్పాం.

ఎవరు ఎవరికీ విరుద్ధం కాదు. ముస్లింలు కూడా విరుద్ధంగా భావించరాదు. హిందువులు కూడా ఆ విధంగా భావించవద్దు. ఇరువర్గాలు కలిసి కూర్చుని మాట్లాడుకొని అందరూ ఒకే అంగీకారంతో సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. కాని ప్రతిసారి ఇది సాధ్యం కాకపోవచ్చు. కోర్టుకు పోవాల్సి వస్తుంది. అపుడు కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తే దానిని శిరసా వహించాలి. మన రాజ్యాంగం అంగీకరించిన న్యాయవ్యవస్థను పవిత్రంగాను, సర్వశ్రేష్ఠమైనదిగాను భావించాలి. కోర్టు నిర్ణయాన్ని స్వీకరించాలి కాని ఆ నిర్ణయంపై ప్రశ్నించరాదు. సరే ఒకానొక ముఖ్యమైన స్థలాన్ని (కాశీ) కోరుకుంటున్నాం. దీనిపై తరతరాలుగా శ్రద్ధ ఉంది. అలాగని ప్రతి మసీదులో శివలింగం కోసం ఎందుకు వెతకాలి? ఇస్లాం పూజాపద్ధతి బయటి నుండి వచ్చినా అది కూడా ఒక పూజా పద్ధతి అని మనం గౌరవించాలి. అదే సమయంలో ముస్లింలు కూడా బయట నుండి వచ్చినవారు కారని, వారూ ఇక్కడి వారేనని గుర్తుంచు కోవాలి. ప్రతి పూజా పద్ధతి పట్ల మనకు గౌరవం ఉంది. అన్నిటినీ అంగీకరిస్తాం. కాని పూజా పద్ధతి ఏదైనప్పటికీ ఆ పద్ధతిని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరు ఈ దేశంలోని రుషులు, మునులు, రాజుల వారసులే. మనందరికీ ఒకే పరంపర ఉంది. మనందరికీ సమాన శత్రు, మిత్ర భావన వుంది.

ఈ దేశ స్వాతంత్య్రం కోసం హిందువులతోపాటు ముస్లింలు కూడా పోరాడారు. ఉదా।। అష్పాకుల్లా ఖాన్‌, ఇ‌బ్రహీంఖాన్‌గార్గిల్‌ ‌వంటి వారి మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఇది ముస్లింలకు ఆదర్శం కావాలి. కనుక చరిత్రను అర్థం చేసుకోవాలి. భారత్‌ ‌మనందరికి మాతృభూమి. వారి వారి విషయాలను ఏమీ మార్చుకోకుండా అందరినీ కలుపుకొనేదే భారతీయ సంస్కృతి. వారి పూజ, వారి పద్ధతి సర్వ శ్రేష్ఠమైనదే కాని అందరి పూజ, అందరి కొరకు సర్వ శ్రేష్ఠం. ఎవరి పద్ధతిని తప్పు పట్టవద్దు. ‘నా పూజా పద్ధతే సరైనది’ అనే పిడివాదం అవసరం లేదు. జనజీవనంలో అరమరికలు లేకుండా అందరితో కలవగలగాలి. పాకిస్తాన్‌ ఏర్పడినపుడు కొందరు వెళ్లిపోయారు. మిగిలినవారు వెళ్లలేదు. కారణం ఏమై ఉంటుంది? ‘మన పూజా పద్ధతి వేరైనంత మాత్రాన మన మాతృభూమి వేరు కాదు’ అనే భావనతోనే మిగిలిన వారంతా పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఉండిపోయారు. కాబట్టి భారతదేశంలో కలసి జీవించారు. వేర్పాటువాదాన్ని ఆలపించరాదు. పూజా పద్ధతి వేరు కాబట్టి మేము వేరు అని భావించరాదు. సంపూర్ణ హిందూ సమాజం కూడా అర్థం చేసుకొని మన పూర్వీకులంతా ఒకటే, మన సంబంధాలు ఇక్కడి సమాజంతోనే, మన రక్తం ఒకటే అని ముస్లింలు భావించి తిరిగి వస్తామంటే హిందువులు రెండు చేతులు చాపి స్వాగతించాలి. అలా తిరిగి రాకపోయినా పరవాలేదు. మనకు 33 కోట్ల దేవతలున్నారు. వారిలో మరొకరు చేరినా ఇబ్బంది లేదు. ఎవరి పూజా పద్ధతిని వారు ఆచరించినా, దేశభక్తి కలిగి వుండి, హిందూ సంస్కృతి ఉదారత, అందరినీ కలుపుకుపోయే తత్వం, అందరినీ సమానంగా చూసే గుణం, అందరినీ తమవారిగా అనుభూతి చెందడం, అందరి వికాసంలో తమ వికాసం చూసుకోవడం, అనుభూతి చెందడం, తామే గొప్పగా అభివృద్ధి చెందాలని కాకుండా అందరి వికాసంలో తమ వికాసాన్ని చూసుకోగలగాలి. మనకు వారసత్వంగా లభించిన పూర్వీకుల పట్ల గౌరవం వుంచి కలిసి జీవించాలి. మన రాజ్యాంగ ప్రస్తావనలో కూడా ఇదే ఉంది. సమాజంలోని ఇతరుల సంవేదన పట్ల కూడా దృష్టి సారించాలి. మనసు, మాట, కర్మలలో అతివాదం అవసరం లేదు. ఇరువైపుల నుండి రెచ్చగొట్టే మాటలు వినబడు తుంటాయి. ఇలాంటిది హిందువుల వైపు నుండి తక్కువే. ఐక్యత కోసం హిందువులు ఎంతో ఓర్పు వహించారు, ఎంతో కోల్పోయారు. చివరకు దేశ విభజనను కూడా అంగీకరించారు. రెచ్చగొట్టవద్దు. రెచ్చగొట్టేవారిని నియత్రించాలి. హిందువులెవరైనా ఆ విధంగా మాట్లాడితే వారిని నియంత్రి స్తున్నారు. మేము మాట్లాడినా నియంత్రణ చేస్తున్న వారూ ఉన్నారు. హిందూ సమాజం అతివాదాన్ని అంగీకరించదు. అందుకనే హిందూ సమాజంలో అందరూ వచ్చిచేరారు. గ్రీకులు (యూదులు), పార్శీలు… ఇలా ఒకటేమిటి ప్రపంచంలోని ప్రతి దేశం దిగ్భ్రమకు గురై సత్యాన్ని కనుక్కోవడం కోసం ఈ భూమి వద్దకు చేరారు. వెనకబడ్డ ప్రతి ఒక్కరిని, ప్రతి పతితుడిని ఉద్ధరించింది ఈ భూమి. హిందూ జీవన పరంపర అయిన దీనిని అర్థం చేసుకొని హిందువు కూడా తమ ఆచరణను సరిచేసుకొంటూ శక్తిసంపన్న మవ్వాలి. అంటే ఎవరినీ జయించవద్దు, ఎవరూ నిన్ను జయించలేనంత శక్తిమంతుడివి కావాలి. ఎవరినీ భయపెట్ట వద్దు-ఎవరికీ భయపడవద్దు. ఆ విధంగా హిందువు జీవించాలి. అందరినీ కలుపుకుంటూ సమృద్ధమైన ఒకే రాష్ట్ర జీవన ప్రవాహంలో అందరినీ కలపాలి. దీని కోసం అందరిలో అవసరమైన శక్తి, శీలం హిందువులు నింపాలని సంఘం ప్రయత్నిస్తున్నది. ఇది దేశానికి అత్యంత అవసరం.

 భాష, ప్రాంతం ఇత్యాది విషయాలను ఆధారం చేసుకొని మనల్ని ఒకరి నుండి ఒకరిని దూరం చేసే ప్రయత్నంలో అగ్గి రాజేసి తమ స్వార్థమనే రొట్టెలను ఆ జ్వాలల్లో కాల్చుకొనే దేశ విరోధశక్తులు నేటికీ క్రియాశీలంగా ఉన్నాయి. ఇలాంటి వారు ప్రపంచం లోను, మన దేశంలోను ఉన్నారు. విజ్ఞులైనవారు ఇలాంటి కుతంత్రాలు చేసే వారి మాయలో పడరాదు. సంఘం చేస్తున్న పనికి సమయం పట్టవచ్చు. రేపటికి మార్పు వచ్చేస్తుందని అనుకో వచ్చు. అంత సులభం కాదు. మనం ఎంచుకొన్న దారి రాళ్లు, రప్పలతో కూడిన కఠినమైనది. అయినప్పటికీ ఈ దారిలోనే ప్రయాణించాలి. మనం భరతమాతకు జయకారం పలకాలని కోరుకొంటాం. మనం ఈ వ్రతాన్ని ధరించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సామర్థ్య, సంపన్న హిందూ సమాజం హిందువుల సచ్ఛీల ప్రవృత్తిపై ఆధారపడి దేశంలోనే కాదు యావత్‌ ‌ప్రపంచ దేశాలను, కలహాలను సమాప్తం చేసి ఒక నూతన సుఖవంతమైన, సుందర మైన ప్రపంచాన్ని నిర్మించే క్షమతను పొందాలి. ఇలాంటి క్షమత, సద్గుణ సంపదను దేశంలోని యావత్‌ ‌హిందూ సమాజంలో జాగృతం చేసే పనిని 1925 నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్నది. అప్పుడప్పుడు సంఘ కార్యక్రమం ఆగి ఉండవచ్చు. కానీ కార్యం ఆగలేదు. ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది. ఈరోజు కాకపోతే రేపు మనం విజయం ప్రాప్తించేట్లు చేయగలం. ఈనాడు కనబడుతున్న పరిణామాలను బట్టి ఈరోజు కాకుంటే రేపు అని నేను అన్నాను అంటే మొత్తం హిందూ సమాజం తమలోని భేద భావాలను మరచిపోయి, తమ స్వార్ధాలను త్యజించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచాన్ని సుఖ సమృద్ధి చేసే దిశగా అనుకూల పరిస్థితులు కనబడు తున్నాయి.

తృతీయ వర్ష సంఘ శిక్షావర్గలో దేశ వ్యాప్తంగా  733 (ఆంధప్రదేశ్‌:24, ‌తెలంగాణ:23) మంది శిక్షార్థులు పాల్గొన్నారు.

By editor

Twitter
Instagram