వరిపంటకు ధాన్యాగారంగా పిలుచుకునే తూర్పు, పశ్చిమ గోదావరి (కోనసీమ, కాకినాడ, ఏలూరు, నరసాపురం) జిల్లాల్లో ఈ సారి సార్వా వరి పంటను నిలిపివేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు, అడ్డంకులు సృష్టించడమే దీనికి కారణంగా రైతులు పేర్కొంటున్నారు. వరికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ఇవ్వకపోవడం, తీసుకున్న ధాన్యానికి నెలల తరబడి బిల్లులు చెల్లించక పోవడం, విత్తనాలు సరిగా సమకూర్చకపోవడం, నాసిరకం విత్తనాల సరఫరాను అడ్డుకోలేకపోవడం, కేంద్ర పంటల బీమా పథకాన్ని అమలుచేయక పోవడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. అప్పు తీర్చకపోవడంతో వ్యాపారులు ఎరువులు, మందులు ఇవ్వడం లేదు. చేసిన అప్పులకు చక్రవడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు ఆక్రమణలు, పూడికలతో నిండిపోయిన డ్రెయిన్లను కూడా బాగు చేయకపోవడంతో వ్యవసాయం చేసే అవకాశం లేదని అన్నదాతలు భావిస్తున్నారు.

పదిరోజులుగా పలు గ్రామాల రైతులు వరుసగా పంట విరామం ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఆందోళన చెంది పాక్షికంగా కొంత చెల్లించింది. ధాన్యం బకాయిలు 20 శాతం వరకు, 2021- 22 పంటల బీమా సొమ్ము కొంత చెల్లించింది. కాని ఇవేమీ వారిని ఆదుకునేలా లేవు. మొత్తం చెల్లింపులు జరిగితే తాము అప్పుల ఊబి నుంచి బయటపడ గలమని, అప్పుడే ఉత్సాహంగా పంట వేస్తామని లేకుంటే పంట వేయలేమని చెబుతున్నారు.

చెల్లింపుల్లో జాప్యం

ప్రభుత్వం పంట బకాయిలు చెల్లించక పోవడంతో రైతులు తదుపరి పంట పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న వ్యవహారం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో సొమ్ము ఇస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో దీనికి విరుద్ధంగా ఉంటోంది. గతేడాది సార్వాలో నాలుగు నెలలకు, దాళ్వాలో మూడు నెలలకు రైతులకు సొమ్ములు వచ్చాయి. దీనికి తోడు మద్దతు ధర ఇచ్చే వరి రకం వేరని, తేమ శాతం అంటూ ఏదో వంకతో బస్తా ధాన్యానికి రూ.200 తక్కువగా గడిచిన దాళ్వాలో కొనుగోలు చేశారు. ఇలా ధాన్యం ధరలో కోత కోశారు. గడువు పూర్తయినా రైతు ఖాతాలో సొమ్ములు జమ చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల వద్ద ఎరువులు, పురుగు మందులు, సాగు పెట్టుబడిగా సొమ్ము అప్పు తీసుకుంటారు. ప్రభుత్వం సొమ్ములు చెల్లించినప్పుడు వారు వడ్డీతో సహా రైతు వద్ద వసూలు చేస్తుంటారు. రైతు సక్రమంగా చెల్లించకపోతే చక్రవడ్డీలు వేస్తున్నారు.

ఎరువుల భారం

రైతులు ఎరువుల కోసం తీసుకున్న అప్పుల్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. గోదావరి జిల్లాల్లో మొత్తం రూ.1500 కోట్లకు పైగానే ఎరువుల కోసం రైతులు వెచ్చించారు. ప్రభుత్వం రైతులకు డబ్బులు జమ చేస్తే వాటిని ఎరువుల వర్తకులకు చెల్లిస్తారు. గత రెండేళ్ల నుంచి ఎరువుల క్రయ విక్రయాలు గాడితప్పాయి. సక్రమంగా సొమ్ములు వసూలు కాకపోవడంతో కంపెనీలు అరువు ఇవ్వడాన్ని నిలిపివేశాయి. సొమ్ములు చెల్లిస్తేనే ఎరువులు ఇస్తామంటూ స్పష్టం చేస్తున్నాయి. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఏదో వంకతో బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తూ రైతులను నష్టపెడుతోంది. ఇప్పుడు పంట వేయాలంటే విత్తనాలు కొనాలి. నాట్లు వేయాలి. ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనాలి. కలుపుతీతకు కూలి డబ్బులు ఇవ్వాలి. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో అప్పు పుట్టక, ప్రభుత్వం నుంచి డబ్బు రాక రైతులు పంట విరామం ప్రకటించారు.

ఆందోళనగా కౌలు రైతుల పరిస్థితి

చిన్న, సస్నకారు రైతుల పరిస్థితి ఇలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత అందోళనకరంగా ఉంది. కౌలు రైతులకు రుణాలపై వడ్డీ రాయితీ, పంటలు నష్టపోతే బీమా పరిహారం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వరి సాగులో ఉపయోగించే యాంత్రిక పనిముట్లను 50 శాతం సబ్సిడీతో అందించేవారు. సబ్సిడీ రావడంతో రైతులు, కౌలు రైతులకు భారంగా ఉండేది కాదు. ఉమ్మడి జిల్లాల్లో ఏడాదికి రూ.25 కోట్ల సబ్సిడీ యాంత్రిక పనిముట్లకు అందేది. ప్రస్తుతం అది లేకుండా పోయింది. కౌలు భారీగా పడిపోయింది. మూడేళ్ల క్రితం రెండు పంటలకు కలిపి ఎకరానికి 32 బస్తాలు కౌలు ఇచ్చేవారు. ఇప్పుడు రెండు పంటలకు 18 బస్తాలు, అంతకన్నా తక్కువ అడుగుతున్నారు. దీంతో భూయజమానికి ఎకరానికి సంవత్సర ఆదాయం రూ.18 వేలు పడిపోయింది. రెండేళ్లుగా కౌలు రైతులు నష్టాల్లోకి వెళ్లారు. గడిచిన రెండు సార్వాలు ప్రకృతి కన్నెర్రతో భారీ నష్టం చవిచూడడంతో పాటు ఈ దాళ్వాలో డెల్టా ప్రాంతంలో ఎకరం 40 బస్తాలలోపు దిగుబడి రావడం, అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో నష్టం చూడాల్సి వచ్చింది. కౌలు రైతుకు ఆదాయం లేని సాగుగా వరి మారింది. దీంతో ఈ ఏడాది కౌలుకు తీసుకుని వరి సాగు చేసేందుకు కౌలు రైతులు వెనుకంజ వేస్తున్నారు. భూములున్న రైతులైతే పంట విరామాన్ని ఇప్పటికే ప్రకటించారు.

పూడుకుపోతున్న మురుగు డ్రెయిన్లు

ఇది గోదావరి పరివాహక ప్రాంతమైనందున మురుగు డ్రెయిన్లు తుప్పలు, తూటు, గుర్రపుడెక్క, వ్యర్ధాలతో పూర్తిగా పూడుకుపోవడంతో పంట పొలాల్లోని ముంపునీరు ముందుకుపారే పరిస్థితి లేదు. ఖరీఫ్‌ ‌నారుమళ్ల సమయం నుంచి వర్షాలు కురుస్తూ ఉంటాయి. అదే విధంగా నాట్లు వేసిన సమయం నుంచి ఖరీఫ్‌ ‌సీజను మొత్తం అల్పపీడనాలు, రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసి పంట పొలాలు ముంపుబారిన పడుతూ ఉంటాయి. ఆ సమయంలో పంట పొలాల్లోని నీరు ప్రధాన మురుగు డ్రెయిన్ల ద్వారా బయటకు వెళ్లాలి. కానీ ఈ సంవత్సరం మురుగు డ్రెయిన్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టకపోవడంతో మురుగు దిగే సమస్య మరింత జటిలమైంది. రైతులు ఆందోళన చేపట్టిన ప్రాంతాల్లో అధికారులు జోక్యం చేసుకుని కొంతమేర ఆధునికీకరించారు. గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రధాన మురుగు డ్రెయిన్లు పూడుకుపోయాయి. పలు మండలాల్లో కొన్ని డ్రైన్లు మరీ అధ్వాన్నంగా తయారై మురుగు పారలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లపక్కన, గ్రామాల్లోను ఉన్న చెత్తాచెదారాలను సైతం మురుగు డ్రెయిన్లలో వేసేయడంతో ఆ ప్రాంతంలో మురుగు నీరు దిగే అవకాశం లేకుండా పోతోంది. కొన్నిచోట్ల కల్వర్టులు, తూరలు పూడుకుపోయాయి. పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోతే పంట విరామానికి వెళతామని రైతులు రెవెన్యూ అధికారులకు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పంట విరామం ప్రకటించిన రైతులతో ఎలాగైనా పంటను వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తు ఖరీఫ్‌ అం‌టూ డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసింది. రైతు భరోసా కింద రూ.5500 ఖాతాల్లో వేసింది. వ్యవసాయానికి సాధనాలు సమకూర్చుకోకుండా నీరు వదలడం వల్ల ఉపయోగం ఏమిటి? వరి పంటకు ఎకరానికి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. రబీలో పండించిన ధాన్యానికి ఇంకా డబ్బు చేతికి రాకపోతే ఎలా పెట్టుబడి పెట్టగలడు? ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహక మొత్తం నారుమడికి కూడా సరిపోదు. పైగా ఒక రైతు ఎన్ని ఎకరాలు సాగుచేసినా ఏడాదికి రూ.13,500 మాత్రమే ఇస్తారు. రైతు చేతిలో పెట్టుబడి లేకుంటే ఏరువాకకు సిద్ధం కాలేడు. సిద్ధం కావాలంటే అప్పు చేయవలసిందే. అదీ ప్రస్తుతం పుట్టడం లేదు.

మరలా రోడ్డెక్కిన రైతులు

ఖరీఫ్‌ ‌సీజన్‌లో ధాన్యం బకాయిలు ఇవ్వడానికి చుక్కలు చూపించిన జగన్‌ ‌ప్రభుత్వం, ఇప్పుడు రబీలోనూ సొమ్ములు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతుండడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. దీంతో రోడ్డెక్కి నిరసన తెలియచేస్తున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఏ రోడ్డుపై చూసినా రైతులు దర్ణాలు చేస్తూ కనిపిస్తున్నారు. తమ కష్టాలు తీర్చాలంటూ అన్నదాతలు రోడ్డెక్కితే ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది.

ఆదరాబాదరా పరిహారం

రైతుల ఆందోళనను ఎలాగైనా విరమింప చేసేందుకు ప్రభుత్వం బీమా పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించింది. 2020-21 బీమా పరిహారం ఇవ్వ కుండా 2021-22 పరిహారం మాత్రం పాక్షికంగా విడుదల చేసింది. పెద్ద మొత్తంలో పరిహారం రావాల్సిన రైతులకు పరిహారం అందలేదు. రూ.50 వేలు పైన రావాల్సిన రైతులను మినహాయించి తక్కువ చెల్లించాల్సిన వారికి బీమా జమ చేసింది. రూ.50 వేలకు పైగా నష్టపరిహారం అందాల్సిన రైతులు గోదావరి జిల్లాల్లో సుమారు పది వేల మందికి పైగా ఉండడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన పరిస్థితి ఇలా ఉంటే 2020-21 సంవత్సరంలో రూ.లక్ష దాటి బీమా సొమ్ము రావాల్సిన రైతులకు పైసా వేయలేదు. ఆ సొమ్ము కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగిన రైతులకు కాళ్ల నొప్పులు తప్ప వేరే ప్రయోజనం లేదు.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram