పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి అనంతరం వేర్పాటువాదశక్తులకు ఊతమొచ్చిందా? ఖలిస్తాన్‌వాదులకు కొత్త బలం వచ్చిందా? తమ అనుకూల పార్టీ అధికారంలోకి వచ్చిందన్న భావనతో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారా? తమ ఆగడాలపై కొత్త సర్కారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందన్న ధీమా వారిలో కలిగిందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తుంది.

ఇటీవల పంజాబ్‌లో, పొరుగునున్న హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనలు చూసిన తరవాత ఈ అభిప్రాయం కలగక మానదు. వేర్పాటువాదశక్తులకు పరోక్షంగా సర్కారు ప్రోత్సాహం లభిస్తుందన్న వాదనకు బలం చేకూరుతుంది. తాజా ఉదంతాలను చూసిన తరవాత ఖలిస్తాన్‌ ‌శక్తులు తమ కుట్రలను, కుతంత్రాలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. దేశ విచ్ఛిత్తికి కంకణం కట్టుకున్న అసాంఘిక శక్తులను ఆదిలోనే అంతం చేయకపోతే దేశ సమగ్రతకు, సమైక్యతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇటువంటి శక్తుల వ్యూహాలు, ఆలోచనలపై అటు సర్కారు, ఇటు జాతీయవాదులు ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల జరిగిన మూడు అవాంఛనీయ ఘటనలను పరిశీలిస్తే ఈ అవసరం మరింత ఉందనిపిస్తోంది. మొహాలిలో గ్రనేడ్‌ ‌దాడి, ధర్మశాలలోని హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ భవనంపై ఖలిస్తాన్‌ ‌పతకాల ప్రదర్శన, పాటియాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు వేర్పాటువాదశక్తుల ఆగడాలకు అద్దం పడుతున్నాయి.

మొహాలి.. పంజాబ్‌-‌హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లోని కీలక ప్రాంతం. మొహాలీ క్రికెట్‌ ‌స్టేడియం క్రికెట్‌ అభిమానులకు అత్యంత సుపరి చితం. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని పని చేస్తున్నాయి. కీలకమైన ఇంటెలిజెన్స్ ‌వింగ్‌ ‌ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఈ కార్యాలయం పనిచేస్తోంది. ఇంతటి కీలక కార్యాలయంపై ఈ నెల రెండోవారంలో అనూహ్యంగా దాడి జరిగింది. భవనంలోని మూడో అంతస్తులోకి చొచ్చుకు వచ్చిన గ్రనేడ్‌ ‌గోడను తాకింది. కిటికీ రెక్కలు విరిచింది. భవనం పైకప్పు దెబ్బతిన్నది. కార్యాలయం చిందరవందరైంది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కార్యాలయంపై రాకెట్‌ ‌చోదక గ్రనేడ్‌ ‌దాడికి పాల్పడిన ఘటనలో లాంచర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు చిచ్చు పెట్టేవారిని విడిచిపెట్ట బోమని ముఖ్యమంత్రి భగవత్‌ ‌మాన్‌సింగ్‌ ‌ప్రకటిం చారు. నిందితుల పట్ల ఎంతమాత్రం ఉదాసీనంగా వ్యవహరించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. ఘటనకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని, త్వరలోనే కేసును ఛేదిస్తామని రాష్ట్ర డీజీపీ (డైరెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌) ‌వి.కె.భవ్రా తెలిపారు. నిందితులపై ఉపా, పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు.

ఏప్రిల్‌ 29‌న రాష్ట్రంలో జరిగిన మరో అవాంఛ నీయ ఘటన శాంతిభద్రతల పరిస్థితికి దర్పణం పట్టింది. పటియాలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘటన పోలీసులు కాల్పులు జరిపేవరకూ, కర్ఫ్యూ విధించేంత వరకు వెళ్లింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పరస్పరం రాళ్లు రువ్వుకు న్నారు. శివసేన (బాల్‌ ‌ఠాక్రే) వర్గంగా ప్రకటించు కున్న ఓ బృందం ఖలిస్తాన్‌ ‌వ్యతిరేక మార్చ్ ‌నిర్వహిం చింది. దీనికి అభ్యంతరం చెబుతూ కొందరు సిక్కులు పోటీగా ర్యాలీ జరిపారు. ఈ క్రమంలో కాళీమాత ఆలయం వద్ద ఎదురుపడిన రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఏప్రిల్‌ 29‌వ తేదీని ఖలిస్తాన్‌ ‌వ్యవస్థాపక దినోత్సవంగా గుర్తించాలని కొందరు సిక్కులు పిలుపునివ్వడంతో తామూ పోటీగా ర్యాలీ నిర్వహించినట్లు శివసేన నాయకుడు ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు శివసేన (బాల్‌ ‌ఠాక్రే) పంజాబ్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌హరీశ్‌ ‌సింగ్లాను అరెస్టు చేశారు. సిక్కుల వైపు నుంచి ఒక్క నాయకుడిని కూడా అదుపులోకి తీసుకోకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ప్రభుత్వ పక్షపాత వైఖరికి ఇంతకు మించి మరో నిదర్శనం అక్కరలేదు. ఇక ప్రభుత్వపరంగా చూసినట్లయితే ఈ ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌మాన్‌ ‌సింగ్‌ ‌స్పందన అత్యంత పేలవంగా ఉంది. ఆయన ఎక్కడా దీనిని ఖండించలేదు. ఘటన దురదృష్ట కరమని. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ట్వీట్‌ ‌చేయడం తప్ప ఖండించడానికి ఆయన నోట మాట రాలేదు. ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌స్పందన పొడిపొడిగా ఉంది. ఘర్షణకు సంబంధించి ఇతర విషయాలను పక్కన పెడితే ఖలిస్తాన్‌ ‌శక్తుల ఆగడాలను, బీభత్సాన్ని పదునైన మాటలతో ఖండించ లేకపోయారు.

హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో జరిగిన మరో ఘటన వేర్పాటువాదశక్తులు ఎంతగా పెట్రేగిపోతున్నాయన డానికి నిలువెత్తు నిదర్శనం. ఏకంగా ధర్మశాలలోని అసెంబ్లీ భవనాన్నే దుండగులు లక్ష్యంగా ఎంచు కున్నారు. ఈ నెల రెండోవారంలో అసెంబ్లీ ప్రధాన గేటు, ప్రహరీపై వేర్పాటువాదశక్తులు ఖలిస్తాన్‌ ‌జెండాలు ఎగురవేశాయి. ఖలిస్తాన్‌ అనుకూల నినాదాలు రాశాయి. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాజధాని సిమ్లా నగరంతో పాటు ధర్మశాలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. సిమ్లాలో విపరీతమైన చలి కారణంగా శీతాకాల సమావేశాలు ఇక్కడ నిర్వహించేందుకు అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. ఆ మేరకు 2005 నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌శాంతికాముక రాష్ట్రం. ప్రశాంతతకు నిలయం. వివిధ వర్గాల ప్రజలు పరస్సర సామరస్యంతో మెలగుతుంటారు. రాష్ట్రంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు భంగం వాటిల్లలేదు. ధర్మశాలలో ప్రవాస టిబెట్‌ ‌ప్రభుత్వం నడుస్తోంది. టిబెట్‌ ‌బౌద్ధ నాయకుడు దలైలమా ఇక్కడే నివాసం ఉంటారు. ఇంతటి ప్రశాంత నగరంలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది. ముఖ్య మంత్రి జైరాం ఠాకూర్‌ ఈ ‌ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణిం చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అర్ధరాత్రి గానీ లేదా తెల్లవారుజామున గానీ దుండగులు జెండాలు పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తమకు సమాచారం అందిన వెంటనే వెళ్లి జెండాలను తొలగించామని, నినాదాలను చెరిపేశామని పోలీసులు తెలిపారు. పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ఈ ‌ఘటనను తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ గేటు, ప్రహరీపై జెండాలను ఉంచిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌జాతీయ కార్యదర్శి సుధీర్‌ ‌శర్మ మాట్లాడుతూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని ఖండించాల్సిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అందుకు బదులుగా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించడం విచిత్రంగా ఉంది. ఖలిస్తాన్‌వాదం పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. ఢిల్లీ, పంజాబ్‌ల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత వేర్పాటువాద శక్తులకు అదనపు బలం వచ్చినట్లయింది. వారి కార్యకలాపాల పట్ల ఆ ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబించడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధర్మశాల ఘటనపై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఓపెన్‌ ‌ప్లేసెస్‌ ‌ప్రివెంటింగ్‌ ఆఫ్‌ ‌డిస్ట్రబెన్సెస్‌ ‌యాక్టు-1985 కింద కేసులు నమోదు చేసినట్లు కాంగ్రా జిల్లా పోలీస్‌ అధికారి ఖుషాల్‌ ‌శర్మ, ధర్మశాల సబ్‌ ‌డివిజినల్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌శిల్పి బీక్తా వెల్లడించారు. దీనిని పంజాబ్‌కు చెందిన కొందరు పర్యాటకుల చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీలు పనిచేయక పోవడం వల్ల దుండగులను పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే ఘటనకు సంబంధించి అమెరికాలోని వివాదాస్పద సంస్థ సిఖ్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే)కు చెందిన గురు పత్వంత్‌ ‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌లోని 153-ఏ, 153-బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌ప్రస్తుతం పాలన సాగిస్తున్న ఆప్‌ ‌పార్టీల నిర్వాకం వల్ల ఖలిస్తాన్‌ ‌శక్తులు మళ్లీ బుసలు కొడుతున్నాయన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన, ముఖ్యమంత్రి పదవి ఆశించి, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నవజ్యోత్‌ ‌సింగ్‌ ‌సిద్దూ ఖలిస్తాన్‌ ‌శక్తులతో ఉదారంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రమాణ స్వీకారానికి ఇస్లామాబాద్‌ ‌వెళ్లి సైన్యాధిపతి జనరల్‌ ‌బజ్వాతో రాసుకుపూసుకు తిరిగి, కౌగిలించు కున్న చరిత్ర సిద్ధూది. ఆప్‌ ‌నేతలూ ఇందుకు భిన్న మైన వారేమీ కారు. వారూ వేర్పాటువాదుల పట్ల అంత కఠినమైన వైఖరి ఏమీ అవలంబించడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. విధానాలపరంగా, రాజకీయంగా ఎన్ని తేడాలైనా ఉండవచ్చు. పరస్పరం విమర్శలు చేసుకోవచ్చు. విధానాలతో విభేదించ వచ్చు. కానీ జాతి సమగ్రత, సమైక్యతల విషయంలో అన్ని పార్టీలు ఒకే మాట మాట్లాడాలి. ఒకే పంథాను అనుసరించాలి. ఒకే గళం వినిపించాలి. లేనట్లయితే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ సత్యాన్ని ఆయా పార్టీలు ఎప్పటికి తెలుసుకుంటాయన్నదే అసలు ప్రశ్న.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram