కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ తెలంగాణ పర్యటన పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏదో ముందస్తుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఓ బహిరంగ సభలో పాల్గొనడం, ఓ మఖాముఖి కార్యక్రమం నిర్వహించడం, తన రాకకు సంబంధించి నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థి నేతలను జైల్లో పరామర్శించడం మినహా.. మరే అంశంపైనా స్పందించలేదు, మాట్లాడలేదు. తన పర్యటనను మమ అనిపించారంతే. ఓ జాతీయ పార్టీ అగ్రనేత రాష్ట్రంలో తాజా పరిణామాలను, రాజకీయ వ్యవహారాలను, శాంతిభద్రతల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా అన్న ప్రశ్నలు రాజకీయ నిపుణులు లేవనెత్తుతున్నారు.

ఈ నెల 6, 7 తేదీల్లో రాహుల్‌గాంధీ తెలంగా ణలో పర్యటించారు. 6న వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ను విమర్శించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో సొంతపార్టీని గాడిలో పెట్టాలన్న ఆత్రుత రాహుల్‌ ‌గాంధీ ప్రసంగంలో ప్రస్ఫుటించింది. టీఆర్‌ఎస్‌తో ఎవరూ టచ్‌లో ఉండొద్దని, కేసీఆర్‌తో ఎవరు సంబంధాలు పెట్టుకున్నా తీవ్ర చర్యలు తీసుకుంటామని రాహుల్‌ ‌హెచ్చరికలు జారీచేశారు. అలాగే, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్లకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఇక, కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు డిక్లరేషన్‌ను వరంగల్‌ ‌సభా వేదిక మీది నుంచి రాహుల్‌ ‌గాంధీ ప్రకటించారు. ఇదంతా సొంతపార్టీని గాడిలో పెట్టుకునే ఉద్దేశమే అని పరిశీలకులు అంచనా వేశారు. అయితే, అంతకుముందు ఎయిర్‌ ‌పోర్టులో దిగిన తర్వాత ముఖ్యనేతలతో మాట్లాడిన రాహుల్‌ ‌గాంధీ.. అసలు ఈ సభ ఉద్దేశం ఏంటి? సభలో ఏం మాట్లాడితే బాగుంటుందంటూ పిచ్చా పాటీగా మాట్లాడిన వీడియో కూడా వైరల్‌ అయింది. దానిపైనా ఇతర పార్టీల నేతలు రాహుల్‌గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

వరంగల్‌ ‌సభ మరుసటి రోజు, అంటే 7న రాహుల్‌ ‌గాంధీ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌పార్టీ ముఖ్య నేతలతో భేటీ నిర్వహించిన అనంతరం చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యుఐ నేతలతో ములాఖత్‌ అయ్యారు. అదేరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి కోసం రాహుల్‌గాంధీ ప్రయత్నించారు.

రాహుల్‌ ‌తరఫున తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలు పలుమార్లు ఉస్మానియా యూనివర్సిటీ వీసీని అనుమతి కోరారు. కానీ, వీసీ ససేమిరా అన్నారు. ఓయూలో రాహుల్‌ ‌ముఖా ముఖికి అనుమతించా లంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం బంతిని ఓయూ వీసీ కోర్టులోకి విసిరింది. ఓయూ వీసీని సంప్రదించాలని సూచిం చింది. అయితే, ఆయన అనుమతి ఇవ్వలేదు. దీంతో, కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు మరోసారి హైకోర్టును ఆశ్ర యించారు. రెండోసారి కూడా హైకోర్టు నిర్ణయాన్ని ఓయూ వీసీకే వదిలేసింది. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నేతలు పలుమార్లు నిరసనలు తెలిపారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నిరసనల్లో పాల్గొన్న ఎన్‌ఎస్‌ ‌యూఐ నేతలను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. జైలుకు పంపించారు. తన సభ కోసం నిరసన తెలిపి జైలు కెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను రాహుల్‌గాంధీ పరామర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ప్రకంపనలు సృష్టించిన పరువు హత్య ఉదంతంపై రాహుల్‌ ‌గాంధీ తన పర్యటనలో ఎక్కడా కనీసం స్పందించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఒక రోజంతా హైదరాబాద్‌లోనే ఉండి.. ముఖ్యనేతలతో సమా వేశాలు, జైల్లో ఉన్న విద్యార్థులతో ములాఖత్‌కు సమయం వెచ్చించిన రాహుల్‌.. ‌పరువు హత్యపై నోరు మెదపకపోవడానికి పలు సమీకరణాలు ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

రాహుల్‌ ‌గాంధీ తెలంగాణ పర్యటనకు సరిగ్గా రెండు రోజుల ముందు, ఈ నెల 4న హైదరాబాద్‌లో పరువు హత్య ప్రకంపనలు రేపింది. సరూర్‌నగర్‌లో నడిరోడ్డుపై పదుల సంఖ్యలో జనం చూస్తుండగానే ఓ యువకుడిపై కొందరు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. రాడ్లతో కొట్టి హత్య చేశారు. ఆ తతంగ మంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసుల విచారణలో ఆ హత్య జరిగిన తీరు, కారణం, హత్యకు దారితీసిన పరిస్థితులు, హత్యకు గురైన యువకుడి వివరాలు అన్నీ బయటకు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన దళిత యువకుడు నాగరాజు, వాళ్ల గ్రామానికి సమీపంలోని ఘనాపూర్‌కు చెందిన ముస్లిం యువతి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ యేడాది జనవరి 31న పాతబస్తీలోని ఆర్యసమాజ్‌లో పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. దీంతో, కక్ష గట్టిన యువతి కుటుంబ సభ్యులు మూడు నెలల పాటు వెంటాడి.. ఎట్టకేలకు తమ కక్ష తీర్చుకున్నారు. నడిరోడ్డుపైనే ఘోరంగా కొట్టి చంపారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవడమే తప్పయితే, లవ్‌ ‌జిహాద్‌ ‌పేరుతో హిందూ అమ్మాయిలకు వలవేసి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పు కాదా? అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌ప్రశ్నించారు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు దళిత యువకుడిని చంపేయడం ఎంతవరకు న్యాయ మని తీవ్రస్థాయిలో నిలదీశారు. దీనిపై ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా మొసలి కన్నీరు కార్చారు. తాము కూడా ఇలాంటి దారుణాన్ని అంగీకరించబోమని ప్రకటిం చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు హత్య చేయడం క్షమించరాని నేరమని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ కలకలం సృష్టించింది. కానీ, జాతీయపార్టీ ముఖ్య నేత రాహుల్‌ ‌గాంధీ మాత్రం కనీసం ప్రకటన కూడా చేయలేదు. అదే.. ఇలాంటి సంఘటనలో ఇతర సామాజిక వర్గం వాళ్లు నిందితులు అయితే, ఇలాగే మిన్నకుండి పోయే వాళ్లా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

– సుజాత గోపగోని, 6302164068 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram