బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలకు ఓ సంకేతం పంపింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదన్న నమ్మకాన్ని కలిగించింది.

హైదరాబాద్‌ ‌తుక్కుగూడలో మే 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సాగించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభ జరిగింది. ఈ సభను పార్టీ అట్టహాసంగా నిర్వ హించింది. సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనపైనా, కేసీఆర్‌ ‌తీరుపైనా విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు, ఎంఐఎంపైనా తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిం చారు. మజ్లిస్‌కు భయపడే వాళ్లను అధికారం నుంచి దించేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడానికి బండి సంజయ్‌ ఒక్కడు చాలని అన్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో భగభగలాడే ఎండలోనూ బండి సంజయ్‌ 660 ‌కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారని అమిత్‌ ‌షా కొనియా డారు. ఇక, టీఆర్‌ఎస్‌ ‌లాంటి అవినీతి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. సంజయ్‌ ‌పాదయాత్ర రాష్ట్రంలోని రైతులు, ఎస్సీలు, వనవాసీలు, అణగారిన వర్గాల కోసమేనని అన్నారు. హైదరాబాద్‌ ‌నుంచి నిజాంను పారద్రోలి.. రజాకార్ల పీడనుంచి హైదరాబాద్‌ ‌గడ్డను విముక్తి చేసి భారత్‌లో విలీనం చేసిన వాళ్లకు శ్రద్ధాంజలి అర్పించాలని, టీఆర్‌ఎస్‌ను అధికారం నుంచి పెకిలించి వేయాలని పిలుపు నిచ్చారు. ఈ ఆశయానికి అందరూ చేతులు కలపాలన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాన్నారు. అంతేకాదు, రామానంద తీర్థ, సురవరం ప్రతాప రెడ్డి, దాశరథి, పీవీ నరసింహారావుకు కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అమిత్‌ ‌షా అన్నారు.

కేసీఆర్‌ ‌వాగ్దానం చేసిన నీళ్లు – నిధులు – నియామకాలు వచ్చాయా?, దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా?, వాగ్దానం చేసినట్లు బీసీలకు ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్‌ ‌కేటాయిస్తున్నారా? అంటూ అమిత్‌షా ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరా బాద్‌లో 4 సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని చెప్పి.. అవి చేయలేదు సరికదా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ఇద్దరూ దగ్గరి మిత్రులేనన్న అమిత్‌షా.. టీఆర్‌ఎస్‌ ‌స్టీరింగ్‌ ఒవైసీ చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల గురించి లెక్కలు చెప్పిన అమిత్‌ ‌షా కేంద్రం రూ. 18 కోట్లు ఇస్తే, హరితహారం పథకాన్ని తమ పథకంగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హస్తం పార్టీ ఉక్కిరిబిక్కిరి

ఓవైపు టీఆర్‌ఎస్‌ ‌నేతలపై అంతెత్తున విమర్శలు సాగించిన అమిత్‌షా, బండి సంజయ్‌.. ‌కాంగ్రెస్‌ ‌విషయంలో మాత్రం సరికొత్త ప్రణాళిక అనుసరిం చారు. ఆ పార్టీ విస్మరించిన ప్రజామోద నేతలను స్మరించుకున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీని ఆత్మపరిశీలనలోకి నెట్టేశారు. తుక్కుగూడ సభలో అమిత్‌షా పీవీకి శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు, ఆ మరుసటిరోజే జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బండి సంజయ్‌.. ‌పీజేఆర్‌ ‌గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. అమిత్‌ ‌షా, బండి సంజయ్‌ ఇద్దరూ పొగిడింది ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన వాళ్లనే. వాళ్ల పేర్లను ఉన్నట్టుండి తెరపైకి తీసుకు రావడం, ప్రశంసల వర్షం కురిపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హస్తం అంటేనే అంతెత్తున లేచే బీజేపీ.. ఆ పార్టీ నేతలను పొగడటం దేనికి సంకేతం? కాంగ్రెస్‌ ‌ఖేల్‌ ‌ఖతం చేసే కార్యక్రమం కమలం పెట్టుకుందా అన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ పరిణామం కాంగ్రెస్‌ ‌పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. అసలు బీజేపీ నేతలు ఎందుకిలా వ్యూహం మార్చారు? కాంగ్రెస్‌ ‌నేతలపై ప్రశంసల వెనుక కమలనాథుల ఉద్దేశం ఏంటన్న విషయం ఆసక్తికరంగా మారింది.

బీజేపీ నేతలు వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌ ‌నేతల పేర్లు ప్రస్తావించారని, శ్రద్ధాంజలి ఘటించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ‌నేతలను పొగడటం ద్వారా వారి వారసత్వాన్ని తమవైపు లాక్కోవడంతో పాటు.. మిగతా బలమైన నేతలను ఆకర్షించడం బీజేపీ స్ట్రాటజీగా భావిస్తు న్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే ముందు కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీనం చేయాలనే భావనలో బీజేపీ అధిష్టానం ఉందని అనుకుంటు న్నారు. కాంగ్రెస్‌ ‌బలహీనం అయితే.. ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కమలం గూటికి చేరే అవకాశం ఉంది. నిజానికి కొంత కాలంగా కాంగ్రెస్‌ ‌సీనియర్లు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగు తోంది. సభల్లో టీఆర్‌ఎస్‌ను తీవ్ర స్థాయిలో టార్గెట్‌ ‌చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రయత్నాలను బీజేపీ నేతలు చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో గతంలో బలమైన నేతలుగా ఉన్న కాంగ్రెస్‌ ‌నేతల జపం చేస్తున్నారని అంటున్నారు. దివంగత ప్రధాని పీవీకి బలమైన వర్గం ఉంది. ఇక హైదరాబాద్‌ ‌పరిధిలో పీజేఆర్‌కు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. అందుకే బీజేపీ నేతలు వీళ్లిద్దరి పేర్లను ప్రస్తావించారని అంటున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram