ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

చివరికొచ్చాం. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నాం?

మనం చెప్పుకున్నది దేశాన్ని చెరపట్టిన బ్రిటిషు సామ్రాజ్యం మీద రాజీపడకుండా వీరోచితంగా పోరాడి, స్వాతంత్య్రం సాధించిన నేషనల్‌ ‌హీరో నేతాజీ సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌కథ. స్వాతంత్య్రానికి అతడే కారకుడు లేక ప్రధాన కారకులలో ఒకడు అయినప్పుడు స్వతంత్ర భారతంలో కనీసం మిగతా సోకాల్డ్ ‌కారకులతో సమానంగా అయినా ఆయనకు సముచిత గౌరవ స్థానం లభించాలి కదా? మట్టి మనుషులను గట్టి యోధులుగా మలచి, 40 వేల సైన్యంతో తెల్ల దొరతనంతో భీకర సంగ్రామం చేసి, మాతృభూమి శృంఖలాలు తెంచగలిగిన మహా వీరుడిని, దేశం కోసం రక్తం ధారవోసిన అతడి స్వాతంత్య్ర సైన్యాన్ని జాతి తగినరీతిలో సన్మానించి, అవ్యాజాదరణ చూపి,కృతజ్ఞత ప్రకటించి ఉండాలి కదా? జరిగిందేమిటి?

జాతీయోద్యమకాలంలో జేబులు కొట్టి జైలుకెళ్ళినవారు కూడా లంచాలు ఇచ్చి, పైరవీలు చేసి స్వాతంత్య్ర యోధులన్న గుర్తింపు సంపా దించారు. భూముల మాన్యాలు, పెన్షన్లు బతికినంత కాలం తేరగా అనుభవించగలిగారు. నిజమైన యుద్ధం చేసిన నేతాజీ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ను మాత్రం తలచిన దిక్కు లేదు. స్వతంత్ర భారత మొదటి ప్రధాని గద్దె నెక్కగానే చేసిన మొదటి పని ఆ స్వాతంత్య్ర సైన్యాన్ని ఎత్తివెయ్యటం! జాతికి చేసిన సేవకు గుర్తింపుగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వకపోగా భారత సైన్యంలో వెనకటి కొలువు నుంచే స్వాతంత్య్ర యోధులను బర్తరఫ్‌ ‌చేశారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డి, తుపాకీ పట్టి యుద్ధం చేసిన ఆ దేశభక్తులకు కనీసం స్వాతంత్య్ర యోధులన్న గుర్తింపు లేదు. తామ్ర పత్రాలు, మాన్యాలు, పెన్షన్లు ఏవీ వారికి దక్కలేదు. ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ అనేది ఒకటి ఉండేదనీ, దేశ విముక్తి కోసం నేతాజీ నాయకత్వంలో అది సాయుధ యుద్ధం చేసిందనీ నవతరంలో చాలామందికి తెలియదు. నేతాజీ పేరుగాని, పటంగాని సైనిక, ప్రభుత్వ కార్యాలయా లలో ఎక్కడా కనపడకూడదని సర్కారువారి అజ్ఞ! 1978 జనవరి 23న జనతా ప్రభుత్వం పుణ్యం కట్టుకునేంతవరకూ పార్లమెంటులో నేతాజీ చిత్రపటమే ఉండేది కాదు.

స్వాతంత్య్రానికి పూర్వం ఊరూరా నేతాజీ చౌక్‌లు, నేతాజీ విగ్రహాలు, నేతాజీ యువజన సంఘాలు కనిపించేవి. స్వాతంత్య్రం అనబడేది వచ్చాక సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌పేర ఒక గౌరవ చిహ్నం గాని, ఏ ప్రభుత్వ సంస్థకూ ఆయన పేరుగాని, కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మగాని లేకుండా, ఆయన ఉజ్వల చరిత్రను ఎవరూ తలవకుండా కాంగ్రెసు ప్రభుత్వాలు గట్టి జాగ్రత్తలు తీసుకున్నాయి. స్వాతంత్య్ర సంగ్రామ ప్రధాన సేనాపతి సుభాస్‌ ‌చంద్ర బోస్‌ అన్న సంగతే భావి తరాలకు తెలియకుండా, ఆయన సమీకరించి నడిపించిన ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ పోరాటమే చరిత్రకు ఎక్కకుండా నెహ్రూ – ఇందిర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలకు అబద్ధాల మసి పూశాయి. నేతాజీ కుటుంబం తమ ఇంటిని ‘‘నేతాజీ భవన్‌’’‌గా మార్చి సొంత వనరులతో చేయిస్తున్న కార్యక్రమాలే తప్ప ఆ జాతీయ వీరుడి సంస్మరణకు ప్రభుత్వపరంగా చేసింది పెద్దగా లేదు.

స్వాతంత్య్ర సైన్యాన్ని ఆదరించి అక్కున చేర్చుకోవటానికయితే ప్రాణం ఒప్పదు. ఆ సైన్యం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజలు ఇచ్చిన సొత్తును కాజెయ్యటంలో మాత్రం మన వాళ్లు వాహినీవారి ‘‘పెద్దమనుషులు’’!

తూర్పు ఆసియాలోని ప్రవాస భారతీయులు భారత స్వాతంత్య్రం కోసం తమ దగ్గర ఉన్న నగలు, నగదు, ఆస్తులు సర్వస్వం నేతాజీకి విరాళంగా సమర్పించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని సోవియట్‌ ‌భూభాగం నుంచి కొనసాగించటానికి రష్యాకు బయలుదేరిన నేతాజీ మొత్తం బంగారం బార్లను, ఆభరణాలను, రత్నాలను బ్యాంకు నుంచి తెప్పించి తన వెంట తీసుకుపోవాలనుకున్నాడు. 1945 ఆగస్టు 17న సైగాన్‌ ‌విమానాశ్రయానికి నాలుగు పెట్టెల్లో ఆయన సుమారు 80 కిలోల బంగారాన్ని పట్టు కెళ్లాడు. అధికారులు అనుమతించక పోవటంతో 40 కిలోల బంగారం ఉన్న రెండు పెట్టెలను సైగాన్‌లోనే వదిలి, వెనుక నుంచి వేరే విమానంలో వాటిని పట్టుకురమ్మని ఎస్‌.ఏ. అయ్యర్‌ ‌తదితరులను ఆదేశించాడు. ఎన్నో కోట్లు విలువ చేసే ఆ స్వర్ణ సంపద ఏమైందో, ఎవరు కాజేశారో దేవునికెరుక!

నేతాజీ వెంట తీసుకు వెళ్లిన రెండు పెట్టెలు విమాన ప్రమాదంలో బాగా కాలిపోయాయి. శిథిలాలను గాలించి జపాన్‌ అధికారులు 14 కిలోల బంగారాన్ని మాత్రం రికవర్‌ ‌చెయ్యగలిగారు. దాన్ని పెట్టెలో పెట్టి సీలు వేసి హబీబుర్‌ ‌రహమాన్‌ ‌ద్వారా టోక్యో పంపించి అక్కడ ఎస్‌.ఏ. అయ్యర్‌, ఐఐఎల్‌ ‌పెద్ద ముంగా రామమూర్తిలకు అప్పగించారు. అ ఇద్దరు ప్రబుద్ధులూ మొత్తం నిధిని నొక్కేశారని ఐఎన్‌ఎ ‌సర్కిల్స్‌లో పెద్ద గోల అయింది. ఆ వైనాన్ని టోక్యోలోని ఇండియన్‌ ‌మిషన్‌ అధికారులు న్యూదిల్లీకి మూడు సార్లు వివరంగా ఫిర్యాదు చేశారు.

ఆదర్శ ప్రధాని నెహ్రూ ఆ ఫైలు చూసి కూడా మౌనంగా ఉన్నాడు. ప్రజా విరాళాల అమూల్య నిధిని ఏమి చేశావని తన పంచన చేరిన అయ్యర్‌ను గట్టిగా నిగ్గదియ్యవలసింది పోయి ‘‘గొడవ కాకుండా ఆ సంగతి ‘‘సర్దుబాటు ‘‘చేసి రమ్మని అదే అయ్యర్‌ను ఎంక్వయిరీ మిషమీద టోక్యోకు పంపించాడు. ఆ విషయంలో చేసిన ‘‘సేవ’’కు ప్రతిఫలంగా అయ్యర్‌ను తన పంచవర్ష ప్రణాళికల పబ్లిసిటీ అడ్వైజరుగా నియమించాడు.

నేతాజీ వెంట మొదట ఉన్న 80 కిలోల బంగారంలో అయ్యర్‌ అం‌డ్‌ ‌కో నిర్వాకం అల్లరి అయ్యాక దిల్లీలోని నేషనల్‌ ‌మ్యూజియానికి చేరింది 11కిలోలు మాత్రమే. మిగిలింది ఏమైందంటే ఎవరూ చెప్పరు. బంగారం గోల్‌ ‌మాల్‌లో నెహ్రూకూ పెద్ద భాగం ఉన్నదనీ, ఒక ఐసిఎస్‌ అధికారిని ప్రత్యేకంగా ఫారిన్‌ ‌పంపించి ఐఎన్‌ఎ ‌బంగారం పెట్టెలను నెహ్రూ నేరుగా తన ఇంటికి తెప్పించుకున్నాడనీ డాక్టర్‌ ‌సుబ్రహ్మణ్యస్వామి ఎప్పుడో 1978లోనే పబ్లిగ్గా అభియోగం మోపాడు. కాంగ్రెస్‌ ‌పెద్దలు కుయ్‌ అనలేదు. అపురూప స్వర్ణ నిధిని హరించిన పాపంలో ఎవరి వాటా ఎంత అన్నది నేటికీ శేష ప్రశ్నే.

మనకు స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహా నాయకుడు ఆత్మార్పణం చేసి ముప్పావు శతాబ్దం గడచిన తరవాత కూడా ఆయన మరణించిన సంగతే మనము గుర్తించము. అంగీకరించము. సుభాస్‌ ‌చంద్ర బోస్‌కు జననమే తప్ప రికార్డుల ప్రకారం మరణం లేదు. స్వాతంత్య్ర ప్రదాత అయిన మహనీయుడు మరణించి 75 ఏళ్లయినా ఆయన చితాభస్మాన్నీ, ఆస్థికలను దేశానికి తీసుకొని వచ్చి శ్రద్ధాంజలి ఘటించాలన్న ఆరాటం మనలో కన పడదు. నేతాజీ త్యాగానికీ, శౌర్యానికీ, జాతికి చేసిన మహోపకారానికీ తగిన స్మృతిచిహ్నాలను నలు మూలలా నెలకొల్పలేకపోయామన్న ఆవేదన మనలను పెద్దగా బాధించటం లేదు. ఆస్థికల పాత్ర నేటికీ జపాన్‌లోని రెంకోజీ మందిరంలోనే పట్టించు కునే దిక్కులేకుండా, మన నిర్లిప్తతకూ, నిష్క్రియా పరత్వానికీ ప్రత్యక్ష ప్రతీకగా పడి ఉన్నది.

ఓటమి ఎరుగని సాహస వీరుడిగా నేతాజీ పట్ల ఎనలేని ఆరాదనాభావం వల్ల తమ అభిమాన నాయకుడు మరణించాడంటే కొత్తలో ఎవరూ నమ్మలేకపోయారు. అంతకుముందు అనేక సందర్భా లలో లాగే మృత్యువును జయించి, అజ్ఞాతవాసం నుంచి బయటపడి మళ్ళీ తమ మధ్యకు వస్తాడన్న ఆశతో, నేతాజీ మరణాన్ని జనం అంగీకరించలేక పోయారు. పైగా సుభాస్‌ ‌మరణించ లేదు; అతడికి శ్రాద్ధకర్మలు చేయవద్దు అని మహాత్మా గాంధీ అంతటివాడే వారించాడు. బోస్‌ ‌కుటుంబ సభ్యులు కూడా సుభాస్‌ ‌బతికే ఉన్నాడని నమ్మారు. నేతాజీ రష్యాలో ఉన్నాడని, చైనాలోనో టిబెట్‌లోనో కనపడ్డాడని, త్వరలో స్వదేశానికి తిరిగొస్తాడని వదంతులు రావటంతో ఆయన మరణంపై అయోమయం నెలకొన్నది. కాబట్టి జపాన్‌లో భద్రపరచిన చితాభస్మం మీద మొదట్లో ఎవరికీ దృష్టి పోలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కాలం గడిచేకొద్దీ నాయకుడు మరి లేడు అన్న యథార్థం తేటతెల్లమయ్యాకకూడా దివంగత మహానేతకు జాతి సముచిత రీతిలో స్మృత్యజలి ఘటించకపోవటం దేశానికి అవమానం. జాతికి సిగ్గుచేటు.

సుభాస్‌ ‌చంద్రబోస్‌ అం‌టే జవహర్లాల్‌ ‌నెహ్రూకు పడదు. తనలాంటి వారినే కాదు- తమ రాజకీయ ఇలవేలుపు గాంధీని కూడా ఎదిరించి, జాతీయ కాంగ్రెస్‌ అఖిల భారత అధ్యక్ష పదవికి పోటీ చేసి, పెద్ద మెజారిటీతో గెలుపొందగలిగిన బోసునూ, అతడికున్న ప్రజాబలాన్నీ తలచుకుంటే నెహ్రూకు హడల్‌! ‌నెహ్రూ తన రైవల్‌ (‌ప్రత్యర్థి) అని బోస్‌ ఏనాడూ అనుకోకపోయినా నెహ్రూ మాత్రం ఎప్పుడూ బోసును తన రైవల్‌గానే చూశాడు. బోసుకు గుర్తింపు ఎంత పెరిగితే జనంలో తన గుర్తింపు అంత తగ్గుతుం దని… బోసుకు గౌరవం ఎంత దక్కితే దేశంలో తన గౌరవం ఆ మేరకు చిన్నబోతుందని నెహ్రూ భయపడ్డాడు. కాబట్టి నేతాజీ బలిదానం గురించి నిజం ఎరుక పడకుండా, నేతాజీకి సముచిత జాతీయ నివాళి అర్పించబడ కుండా తాను రాజ్యమేలినంత కాలం అడ్డంపడ్డాడు. కచ్చ మనస్తత్వంలో తండ్రిని మించిన కూతురు కాబట్టి… గాంధీ పేరు తగిలించు కుని, నెహ్రూ వారసత్వం పుణికి పుచ్చుకున్న ఇందిర కూడా అదే దుర్విధానాన్ని తాను గద్దె మీద ఉన్నంత కాలం కొనసాగించింది. అంతవరకూ అర్థం చేసుకోగలం.

మధ్యలో ఒక ఏణ్నర్థం లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, మూడేళ్ళ జనతా విఫల ప్రయోగం మినహాయిస్తే 1946 నుంచి 43 ఏళ్ల పాటు సాగిన నెహ్రూ వంశాధిపత్యం 1989తో ముగిసింది. సోనియా తోక కత్తిరించి స్వతంత్రంగా వ్యవహరించగలిగిన దార్శనికుడు పి.వి. నరసింహారావు 1991 తరవాత ఐదేళ్ళపాటు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నేతాజీ మిస్టరీని భేదించటానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా ఇందిరా గాంధితో హోరాహోరీగా కొట్లాడిన అటల్‌ ‌బిహారీ వాజపేయి ఆరేళ్లు దేశాన్ని ఏలాడు. ఆయన ఐదేళ్ల హయాం పుణ్యకాలమంతా ముఖర్జీ కమిషన్‌ ఎడతెగని విచారణ తోనే సరిపోయింది. మధ్యలో పదేళ్ళ సోనియా బినామీ పాలన తరవాత 2014 నుంచీ ప్రపంచఖ్యాతి పొందిన నరేంద్ర మోది పరిపాలన ఇప్పుడు సాగుతున్నది. మోది వచ్చాక పూర్వపు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు దాచిపుచ్చిన రహస్య దస్తాలను బహిర్గతం చేసి, నేతాజీ కుటుంబీకులను స్వయంగా కలిసి, నేతాజీకి నివాళిగా కొన్ని చర్యలు చేపట్టి మునుపటి ప్రభుత్వాల మీద నయం అనిపించు కున్నాడు. కానీ అసలైన చితాభస్మ వ్యవహారం మాత్రం నేటికీ అలాగే మిగిలింది.

దీనికి పూర్తిగా ప్రభుత్వాలనే తప్పుపట్టీ ప్రయోజనం లేదు. పివి నరసింహారావు హయాంలో ఏమైంది? ప్రధాని పివి చొరవ తీసుకుని విదేశాంగ మంత్రి ప్రణబ్‌ ‌ముఖర్జీని దేశాంతరం పంపించి బోస్‌ ‌భార్యను, కుమార్తెను చితాభస్మ స్వీకారానికి అంగీకరింప జేశాడు. ఎప్పుడో చేయవలసిన పని కనీసం అర్ధ శతాబ్దం లేటుగా అయినా కదిలిందని ఆయనను అందరూ మెచ్చుకున్నారా? లేదు. అదేదో భయంకరమైన నేరం అయినట్టు గోలగోల అయింది. బోస్‌ ‌భార్యకు లంచమిచ్చి, బలవంతపెట్టి తప్పుడు పనికి ఒప్పించ జూస్తున్నారని దుమారం లేచింది. ప్రజామోదం లేని కారణంగా ఆ ప్రయత్నం ముందుకు వెళ్లలేదు.

రేపు నరేంద్ర మోది ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకున్నా అంతే. ఎవడో జపాన్‌ ‌సైనికుడి అస్థికలను, బూడిదను నేతాజీకి చెందినవిగా ఎలా ఒప్పుకుంటాం? అసలు విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడని రుజువేమిటి- అని మీడియా, మేధావి గణం, ప్రతిపక్ష బాకాలు అలవాటైపోయిన అరుపులతో తోడేళ్ళలా మీద పడతాయి. నేతాజీ ఏమయ్యాడో తేల్చటానికి ఇంకో జుడీషియల్‌ ‌కమిషన్‌ ‌వేయాలని మళ్ళీ ఎవరో డిమాండు చేస్తారు. నేతాజీ మిస్టరీ అంతు తేల్చటానికి మోదీ సర్కారు ఎందుకు భయపడుతున్నది అంటూ సిక్యులర్‌, ‌లిబరల్‌ ‌మీడియా షరా మామూలుగా రణగొణ ధ్వని చేస్తాయి.

ఇలా ఎంత కాలం?

విమాన ప్రమాదంలో నేతాజీ మరణాన్ని చట్టబద్ధంగా ఏర్పాటైన రెండు విచారణ సంఘాలు ధ్రువీకరించాయి. ఆ విచారణల తీరు తెన్నుల గురించి ఎన్ని అక్షేపణలు ఉన్నా అవి చేసిన నిర్ణయాల వరకూ తప్పు పట్టవలసిన పని లేదు. ఖోస్లా కమిషన్‌ ‌సిఫారసులను ఆమోదించిన పూర్వపు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసి కొత్తగా ఇంకో కమిషన్‌ ‌వేయాలంటూ 1978లో జనతా హయాంలో లోక్‌ ‌సభలో ప్రొఫెసర్‌ ‌సమర్‌ ‌గుహ తీర్మానం పెడితే ఏమైంది? ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలన్నిటినీ కొట్టివేయటమే పనిగా పెట్టుకున్న జనతా ప్రభుత్వం దానికీ సై అన్నదా? లేదు. హోమ్‌ ‌మంత్రి చరణ్‌ ‌సింగ్‌ అం‌గీకారం తెలపబోతుండగా ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి కలగ జేసుకున్నాడు. ఖోస్లా కమిషన్‌ ‌సిఫారసులు సరిగా లేవని అంగీక రించినప్ప టికీ, కొత్తగా ఇంకో కమిషన్‌ ‌వేసినందువల్ల ప్రయోజనం ఉండదని 1978 ఆగస్టు 28న ఆయన లోక్‌ ‌సభలో విస్పష్టంగా ప్రకటించాడు. అంటే విమాన ప్రమాదంలో నేతాజీ మృతిని అంగీకరించిన పూర్వ ప్రభుత్వ నిర్ణయాన్ని జనతా ప్రభుత్వం కూడా ధృవీకరించింది.

అలాగే – 1999లో ఎన్‌.‌డి.ఎ. ప్రభుత్వం నియ మించిన ముఖర్జీ కమిషన్‌ ‌విమాన ప్రమాదం, అందులో నేతాజీ మరణం అబద్ధమంటూ ఇచ్చిన నివేదికను తరువాత వచ్చిన యు.పి.ఏ.ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తరవాత మళ్లీ ఎన్‌.‌డి.ఏ గద్దె నెక్కింది కదా? కొత్తగా వచ్చిన నరేంద్ర మోది ప్రభుత్వం ఆ తిరస్కరణ నిర్ణయాన్ని తిరస్కరించి ముఖర్జీ నివేదికను ఔదలదాల్చిందా? లేదు.

అంటే రాజ్యమేలేది ఏ కూటమి అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పటివరకూ అన్ని ప్రభుత్వాలూ 1945 ఆగస్టు 18న తైపేలో నేతాజీ మృతి చెందిన వాస్తవాన్ని అంగీకరించాయి. ఆ నాడు మరణం నిజమని ఒప్పుకున్నాక, మారుపేరుతో నేతాజీ పార్థివ కాయాన్ని దహనం చేయటమూ నిజమే, అక్కడ సేకరించిన అస్థికలూ, చితాభస్మమూ నేతాజీవే అని ఒప్పుకుని తీరాలి కదా? ఆ భస్మ పాత్ర ఇంకా జపాన్‌ ‌లోనే ఎందుకు ఉండాలి? దానిని ఇకనైనా స్వదేశానికి ఎందుకు తీసుకురారని మనం గట్టిగా అడగవద్దా? అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసి, వెంటపడి ఆ పని చేయించవద్దా? ప్రమాదంలో నేతాజీ మృతి నిజం కాక పొతే అసలు నిజం ఏది? అప్పుడు కాకపొతే నేతాజీ ఎప్పుడు ఎక్కడ మరణించాడు అన్నది ఇప్పటివరకూ ఏ ఒక్కరూ నిర్ద్వంద్వంగా నిరూపించ లేనప్పుడు బోస్‌ ‌మరణం మిస్టరీ అంటూ ముదనష్టపు వాగుళ్ళు ఇంకెంత కాలం వాగుతారని అందరం ఒక్క గొంతుతో ఉరమవద్దా?

ప్రజల నుంచి వత్తిడి లేనిదే, ప్రజాభిప్రాయం సంఘటితమై వెంటపడనిదే, జాతి జాగృతం కానిదే ఏ పనీ కాదు. ఏ ప్రభుత్వమూ కదలదు. నేతాజీకి సముచిత నివాళికి సంబంధించినంత వరకూ ప్రధాన వైఫల్యం ప్రజలది. వారిని కదిలించి, మంచి చెడ్డ ఎరుకపరచి, ముందుకు నడిపించలేని మేధావి వర్గానిది. జాతిపట్ల బాధ్యత మరచిన ఒపీనియన్‌ ‌మేకర్లది. నేతాజీ పోరాడింది మన కోసం. మన స్వాతంత్య్ర కోసం. మన జాతి ఉజ్వల భవిష్యత్తు కోసం. వేలమంది యోధులను సమీకరించి, దేశం కోసం రక్తం ధారవోయమని ఉద్బోదించి, కత్తుల వంతెన మీద వట్టికాళ్ళతో నడిపించి, మహా సంగ్రామం చేయించి, ఆఖరికి తన ప్రాణాలనే అర్పించి స్వాతంత్య్ర ఫలాన్ని సాధించి పెట్టిన జాతీయ వీరుడి దివ్యస్మృతిని సముచిత రీతిలో గౌరవించు కోవటం జాతిజనుల ప్రాథమిక బాధ్యత. అది గుర్తు చేయాలన్నదే ఈ రచన వెనుక తపన.

(అయిపోయింది)

About Author

By editor

Twitter
Instagram