– జమలాపురపు విఠల్‌రావు

ఫిబ్రవరి 20వ తేదీన భారత ప్రజలు ఒక అపురూప దృశ్యం వీక్షించారు. బీజేపీ ముక్త భారత్‌ ‌సాధన కోసం ఓ కూటమి తొలి అడుగు వేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ముంబైలో మహదానందంగా ప్రకటించారు. ఇక్కడ గమనించవలసినదేమిటి అంటే కాంగ్రెస్‌తో సంబంధం లేని ఈ కూటమి గురించి అదే పార్టీ ఊతకర్రతో నెట్టుకొస్తున్న మహారాష్ట్ర వికాస్‌ అగాఢి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రేతో కలసి ఈ మాట అనడం.  చిత్రంగా మరునాడే కాంగ్రెస్‌ ‌లేని కూటమి లేదని సేన, ఎన్‌సీపీ తేల్చేశాయి. అలాంటి కూటమి, విస్తృతార్థంలో మూడో ఫ్రంట్‌ ‌ముచ్చట కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు మారింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను బట్టి అనతికాలంలోనే ఆ ముచ్చట  మరొక చోటకి  పాకినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం మూడో ఫ్రంట్‌ అనేది ప్రాంతీయ పార్టీల మధ్య ఫుట్‌బాల్‌లా అదేపనిగా పాద తాడనాలు చవిచూస్తోంది. 2018 నాటి హెచ్‌డి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో ఇలాంటి ఫ్రంట్‌ ‌కోసం బీజేపీ యేతర రాజకీయ శిబిరంలో పురిటినొప్పుల  సవ్వడేదో వినిపించింది. తీరా రెండేళ్లకల్లా ఆ నినాదం కోల్‌కతా చేరుకుంది. 2021 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అక్షరాలా ఫుట్‌బాల్‌ ‌చేపట్టి (కాలు దెబ్బతిని?) ఆట మొదలుపెడదామా అంటూ నినదించారు. కానీ ఆమె భయపడినట్టు ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది కాబట్టి, ఆమె మూడోఫ్రంట్‌ ‌ముచ్చటకి నిరవధిక విరామం ప్రకటించారు. అదే బీజేపీతో  తెలంగాణలో  తనకు బెడద మొదలయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్‌ ‌హఠాత్తుగా బీజేపీ ముక్త భారత్‌ ‌నినాదం అందుకున్నారు. బీజేపీ ముక్త భారత్‌, ‌మూడో ఫ్రంట్‌ ఇప్పుడు అవిభాజ్య శిశువులు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అశ్వత్థామ హతః కుంజరః అన్న శైలిలో ‘అవసరమైతే కొత్త జాతీయ పార్టీ’ అంటూ ముక్తాయించారు. దీనికి మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌, ‌దేవెగౌడ, ఉద్ధవ్‌ ‌ఠాక్రే ఆలస్యం లేకుండా అభినందించారు.


కేసీఆర్‌! ‌మీరే సమర్థులు అన్నారు బీజేపీయేతర ముఖ్యమంత్రులు. సరైన సమయంలో గళమెత్తారని కూడా అన్నారు. ఆ రెండూ అతిశయోక్తులా? వాస్తవాలా? బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా గళం విప్పినా, అందులోని వాస్తవాలను గమనించకుండా బీజేపీయేతరులు ఎక్కడ వెనకపడిపోతామో అన్నట్టు వెంటనే మీ అభిప్రాయమే మా అభిప్రాయం అంటున్నారు. ఈసారి దీని మీద జరగవలసినంత చర్చ జరగకపోవడం విచారకరం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మూడోఫ్రంట్‌ ‌ముచ్చట గురించి దేశం చర్చించి తీరాలి. ఇవాళ మూడో ఫ్రంట్‌ అం‌టే ఒక బెదిరింపు. కనీస సిద్ధాంత అవగాహన, కనీస కార్యాచరణ లేని శక్తుల కలయిక. అన్నిటికీ మించి దేశం అవాంఛనీయంగా భరించే ఒక గందరగోళం. శ్రీకారం చుట్టడం దగ్గరే శంకలు. ఒక్క ఉదాహరణ: సీపీఎం పత్రిక పీపుల్స్ ‌డెమాక్రసి తాజా సంచిక వ్యాఖ్య చూడండి! ‘ప్రాంతీయ పార్టీలతో ప్రత్యా మ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నం సమాఖ్య స్ఫూర్తి లక్ష్యాన్ని దెబ్బతీయనున్నదని హెచ్చరించింది.’ ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌గురించి మాట్లాడడం కూడా రాజకీయాలతో ముడిపడిన అంశమని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. కాబట్టి ఫ్రంట్‌ ‌నేత ఎవరో తేలలేదు. అది తేలేది కాదని పీపుల్స్ ‌డెమాక్రసి బాగా గుర్తు చేసిందనే చెప్పాలి. మరి దీనిని ప్రజలెందుకు నెత్తిన పెట్టుకోవాలి?

ఏమిటీ సంకీర్ణాలు?

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రకాల సంకీర్ణాలను చూడవచ్చు. ఒకటి సకారాత్మకం (Positive Coalition), రెండవది నకారాత్మకం (Negative Coalition) మూడవది అప్రకటితం (Tacit Coalition) నాల్గవది అభివ్యక్త సంకీర్ణం (An Express Coalition). సకారాత్మక సంకీర్ణాన్నే, సకారాత్మక కూటమి అని కూడా అంటారు. ఇది నిర్మాణాత్మకంగా ఉండటమే కాకుండా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని అధికారం నుంచి తొలగించి, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏర్పడుతుంది. నకారాత్మక సంకీర్ణం అధికారంలో ఉన్న పార్టీని పదవి నుంచి తప్పించడానికి మాత్రమే ఏర్పడుతుంది. ఇది ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదు. అటువంటి భారాన్ని వహించే సామర్థ్యం కూడా ఉండదు. దీన్ని విధ్వంసక (Destructive Coalition) సంకీర్ణం అని కూడా అంటారు. మూడవది అప్రకటిత సంకీర్ణంలో ఒక గ్రూపులో సభ్యులుగా ఉన్న పార్టీల్లో ఒక అవగాహన ఉంటుంది కానీ ఇవి ఒకదానితో మరొకటి కలవవు. అంటే బయటనుంచి మద్దతివ్వడం వంటిది. ఇందులో అధికారాన్ని పంచుకోవాలన్న నిబంధన ఏమీ ఉండదు. నాల్గవది అభివ్యక్త సంకీర్ణం. అంటే చట్టబద్ధమైన, శాస్త్రీయమైన సంకీర్ణం. ఈ విధానంలో పాలుపంచుకునే గ్రూపుల మధ్య స్పష్టమైన అవగాహన, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఇందులో అధికారాన్ని పంచుకోవడం వాస్తవిక దృఢ రీతిలో కొనసాగుతుంది. మన దేశానికి సంకీర్ణ ప్రభుత్వాలతో మిగిలినది చేదు నిజాల చరిత్ర. వాటి గురించి చర్చించే ముందు కేసీఆర్‌ ఎలాంటి సందర్భంలో ఈ పిలుపునిచ్చారో చూడాలి.

ఎలాంటి నేపథ్యంలో?

నిజానికి కేసీఆర్‌ ‌జనవరి మాసాంతం నుంచి బీజేపీ మీద తిట్ల దండకం అందుకున్నారు. ముచ్చింతల్‌లో ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరవుతానని మొదట చెప్పారు. తరువాత రాలేదు. రెండు బహిరంగ సభలను ఏర్పాటు చేసి బీజేపీని నిందించడానికే ఉపయోగించుకున్నారు. బీజేపీని తరిమి కొడతాం అంటూ జనగామ సభలో నేరుగా యుద్ధం ప్రకటించారు. తరువాత ప్రగతి భవన్‌లో విలేకరుల సమక్షంలో ఇంకో అడుగు ముందుకు వేసి, అసలు ఈ రాజ్యాంగమే మార్చాలన్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని ముచ్చింతల్‌ ‌వచ్చినందుకు కేటీఆర్‌ ‌సహా తెరాస శ్రేణులు తప్పుపట్టాయి. ఇంత గందరగోళం మధ్య జనించిన మాటలే -‘మూడో ఫ్రంట్‌’, ‘అవసరమైతే కొత్త జాతీయ పార్టీ’. ఈ ఫిబ్రవరి 9వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి ‘మోదీ డౌన్‌ ‌డౌన్‌’ అం‌టూ దిష్టిబొమ్మల దహనాలతో అట్టుడికిపోయింది. కారణం- మోదీ రాజ్యసభలో ఆంధప్రదేశ్‌ ‌విభజనపై మాట్లాడుతూ ‘2014లో ఒకవైపు తలుపులు మూసారు. మరోవైపు కాంగ్రెస్‌ ‌సభ్యులు మిరియాలపొడి చల్లారు. ఇంతటి గందరగోళం మధ్య బిల్లును ఆమోదించారు. రాష్ట్ర ఏర్పాటుపై సజావుగా చర్చజరగలేదు. అందువల్లనే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ’ని వ్యాఖ్యానించారు. ఇందులో పట్టించుకోవాల్సిందేమీ లేకపోయినా ఈ వ్యాఖ్య కె. చంద్రశేఖరరావు ఆగ్రహానికి ప్రధాన కారణం అనిపించేలా వాతావరణాన్ని తయారుచేశారు. రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తూ, కేసీఆర్‌ ఒక్కసారిగా కేంద్రం మీద ధ్వజమెత్తడానికి తగిన కారణం ఇప్పుడు ఉందా? ఇది లక్ష రూకల ప్రశ్న.

మోదీతో కలసి యాగం

2015లో కేసీఆర్‌ ఆయత చండీయాగం పేరుతో ఐదురోజులు యజ్ఞాన్ని నిర్వహించిన కాలంలో మోదీ-చంద్రశేఖర్‌రావుల మధ్య సయోధ్య కొనసాగింది. మోదీ ‘కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌’‌కు కేసీఆర్‌ అం‌డగా నిలిచారు. ‘త్రిపుల్‌ ‌తలాక్‌’ ‌బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌మోదీ ప్రభుత్వాన్ని సమర్థించింది. కానీ బండి సంజయ్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ, కేడర్‌ను విస్తరించుకుంటూ రెండో స్థానానికి చేరుకొని సవాలు విసిరే స్థాయికి ఎదుగుతుండటం కేసీఆర్‌కు కొరుకుడు పడటంలేదు. రాష్ట్రంలో 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 7% ఓట్ల వాటా కలిగిన బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి 20% ఓట్లను సాధించింది. దుబ్బాక (నవంబర్‌ 2020), ‌తర్వాతి ఏడాది హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. డిసెంబర్‌ 2020‌లో హైదరాబాద్‌ ‌గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు 99 స్థానాలున్న టీఆర్‌ఎస్‌ ‌బలం 56కు పడిపోయింది. బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందింది. ఎం.ఐ.ఎం.44 స్థానాల్లో గెలుపొం దాయి. అప్పట్లో కాంగ్రెస్‌ ‌ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. మరిప్పుడు బీజేపీ క్రమంగా ఎదుగుతూ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టేయడం కేసీఆర్‌ ‌కోపానికి మరో కారణం. ఇంకా ఆత్మహత్యలకు ప్పాడిన రైతుల కుటుంబాలను సంజయ్‌ ‌పరామర్శించడం దగ్గరి నుంచి ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు. కొవిడ్‌ ‌నిబంధనలు ఉల్లఘించారన్న నెపంతో బండి సంజయ్‌ను జైల్లో పెట్టించారు. సంజయ్‌ ‌వెనకడుగు వేయకుండా కేసీఆర్‌ ‌శైలిలో ఆ భాషనే ప్రయోగిం చడం ద్వారా తిప్పికొడుతూ, నిరుద్యోగ యువకులను కలుసుకొని వారి సమస్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం ఒక ఎత్తయితే, వచ్చే రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశాలకు ముందు ‘మిలియన్‌ ‌మార్చ్’‌కి ప్లాన్‌ ‌చేయడం మరో ఎత్తు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా విభాగాలకు ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు.

 వైఫల్యాలు

రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే కదా! బీజేపీ దూకుడు పెంచి, తనకంటూ ఒక రాజకీయ అవకాశాన్ని సృష్టించుకోవడానికి కేసీఆర్‌ ‌వైఖరి కారణమని నిస్సందేహంగా చెప్పాలి. అది స్వయంకృతం. కేసీఆర్‌ ‌వైఫల్యాలు తక్కువేమీ కాదు. అన్నిటికంటే పెద్ద ఆరోపణ- ఆయన ఫామ్‌ ‌హౌస్‌ ‌దాటి రారు. 2020 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సంభవించిన వరదలకు బలైన వారికి సహాయ సహకారాలు అందించడంలో విఫలమైందన్న విమర్శలను ప్రభుత్వం మూటకట్టుకోవాల్సి వచ్చింది. గత రెండేళ్లలో తెలంగాణలో వరి దిగుబడి విపరీతంగా పెరగడంతో, సేకరణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో రబీలో వరిధాన్యాన్ని పండించవద్దంటూ రైతులను కోరడం, బీజేపీ నేతలకు అయాచిత వరమైంది. దీనిపై వారు తమ విమర్శనా స్త్రాలకు పదును పెట్టడంతో కేసీఆర్‌ ‌కేంద్రమే వరిని కొనుగోలు చేయడంలేదంటూ ఎదురుదాడికి దిగి, ఏకంగా ‘మహా ధర్ణా’ నిర్వహించారు. కేంద్రం రైతు చట్టాలను ఉపసంహరించుకున్న రోజునే ఈ ధర్ణాకు ఉపక్రమించడం గమనార్హం. అన్నిటికంటే ముఖ్యంగా జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేసి, మేయర్‌ ‌స్థానం దక్కించుకోవడానికి ఎంఐఎంతో కలవడం టీఆర్‌ఎస్‌ ‌బలహీనతే. ముందు నుంచి ఎంఐఎంను, ఒవైసీలను కాపాడుకుంటున్న కేసీఆర్‌ ‌బీజేపీది ‘మత పిచ్చి రెచ్చగొట్టుడు’ వంటి వ్యాఖ్యలు చేయడమే పెద్ద వింత. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్‌ ‌రావు రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటూ ప్రెస్‌మీట్‌లో చెప్పడం బీజేపీకి ఒక ఆయుధాన్ని చేతికిచ్చి నట్లయింది. ‘డా।। బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగాన్ని మూలన పడేయాలని కేసీఆర్‌ ‌కోరుతున్నారు’ అంటూ బీజేపీ తిప్పికొట్టడం మొదలుపెట్టింది.

మూడో ఫ్రంట్‌ ‌కోసం

కేంద్రాన్ని లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని బెదిరించడానికి ఇటీవల కాలంలో ఆయుధంగా మారిన నినాదం మూడో ఫ్రంట్‌. ‌ప్రధాని మోదీని ఢీకొట్టడానికి టీఎంసీ, డీఎంకే, శివసేన, జేడీ(యు), సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జేడీ వంటి కాంగ్రెస్‌, ‌బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకొని రావాలన్నది కేసీఆర్‌ ‌యత్నం. ఆ విధంగా మిగిలిన ప్రాంతీయ పార్టీలకు తాను ఒక విశ్వసనీయ భాగస్వామినన్న సందేశాన్ని పంపాలను కున్నారని చెప్పాలి. ఇంతకీ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ నిజంగానే కాంగ్రెస్‌కూ, బీజేపీకీ వ్యతిరేకమా? వీటిలో ఎక్కువ పార్టీలు ఒకప్పుడు బీజేపీ కూటమిలో (ఎన్‌డీఏ) ఉన్నవి కాదా? లేకుంటే కాంగ్రెస్‌ను అంటకాగినవి కాదా?

ఒకపక్క కాంగ్రెస్‌ ‌లేని మూడో ఫ్రంట్‌ అం‌టూనే కాంగ్రెస్‌ ‌మీద కొత్త ప్రేమను ప్రదర్శిస్తున్నారని చెప్పే విధంగా ఆయన మాట్లాడారు. మరొకమాటలో చెప్పాలంటే ఇదివరకు లేని రాజకీయ అవకాశ వాదాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో, కాంగ్రెస్‌ ‌వారికి దీటుగా తప్పుపట్టడం. జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అవసరమైతే జాతీయ పార్టీ పెట్టాలన్నది ఆయన దృఢనిశ్చయం. దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని, రాజ్యాంగాన్ని తిరగ రాయాలని, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, రాష్ట్రాలకు మరిన్ని అధికారా లివ్వాలన్న డిమాండ్లతో ఆయన ముందుకెళితే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆశ.

ఒక్కసారిగా మారిన ఆయన గళానికి అనుకు న్నంత వేగంగా కాకపోయినా, ఒక్కొక్కరుగా ముఖ్యంగా జేడీ (ఎస్‌) ‌నుంచి దేవెగౌడ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే, స్టాలిన్‌, ‌మమతా బెనర్జీ పినరయి విజయన్‌, ‌తేజస్వీ యాదవ్‌, ‌వామపక్షాల నేతలు జత కలిపారు. అయితే ఇన్ని సంప్రదింపులు జరుపుతున్నా వీరి మధ్య ఉన్నది ఒక్కటే అజెండా- ‘మోదీ వ్యతిరేకత’. మరో సైద్ధాంతిక ఏకత లేదు. ఒకే దేశంలో వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ‘నేనీ దరిని… నువ్వా దరిని’ అన్నట్టు ఉన్న వీరు, ‘ఎవరి రాష్ట్రాల్లో వారు’ ఎవరి అవసరాల మేర వారు పాలనను సాగిస్తున్న నేపథ్యంలో ఒక్కటవ్వడం ఎంతమేర సాధ్యమవుతుందన్నది అలోచించడానికి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ తలలు కూడవన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ఏదో ఒకటి చేయక పోతే, బీజేపీ విస్తరణ తమ కొంపలు ముంచుతుందన్న భయం మాత్రమే వీరు ఒకే వేదికపైకి వచ్చేందుకు యత్నించడానికి కారణం. తెలంగాణ అసెంబ్లీకి 2023, డిసెంబర్‌ ‌నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. అంటే 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు కొద్దిగా ముందన్నమాట. ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతను తగ్గించు కోవడంతో పాటు బీజేపీ దూకుడుకు ముగ•తాడు వేయడమే లక్ష్యంగా ఇప్పటినుంచే కేసీఆర్‌ ‌పావులు కదుపుతున్నారు. ఢిల్లీలో బీజేపీయేతర ముఖ్య మంత్రుల సమావేశం జరపడానికి మమతా బెనర్జీ ప్రతిపాదించారు. కేసీఆర్‌, ‌స్టాలిన్‌, ‌మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రేలు ఇందులో పాల్గొంటా రంటున్నారు. జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరేన్‌, ‌కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లు కూడా పాల్గొనే అవకాశముంది. ఒరిస్సా ముఖ్య మంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌విషయం ఇంకా తెలియ రాలేదు. ఈ సమావేశం తేదీ వెల్లడి కాలేదు. బహుశా మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ సమావేశం తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది జులై నెలలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు జరుగనున్న ఎన్నిక నాటికి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌పై ఒక స్పష్టత రావచ్చు. కానీ ప్రశ్నలు మాత్రం ఉండిపోతాయి. కాంగ్రెస్‌ ‌మద్దతుతో రోజులు గడుపుకొస్తున్న ఉద్ధవ్‌ ‌ఠాక్రే కాంగ్రెస్‌ ‌లేని కూటమిలో చేరగలరా? మమత నాయకత్వంలో పినరయ్‌ ‌విజయన్‌ ‌నడుస్తారా? 2019 వరకు దేశ రాజకీయాలలో కొందరి దృష్టిలో ఇంద్రుడు చంద్రబాబు ఊసైనా ఇప్పుడు వినపడడం లేదేమి? అంటే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలే ఈ కూటమిలో చేరడానికి అర్హత కలిగి ఉన్నాయా? గోవా ఎన్నికలలో పోటీ పడుతున్న మమత, కేజ్రీవాల్‌, ‌పంజాబ్‌లో కేజ్రీవాల్‌తో తలపడుతున్న అకాలీదళ్‌ ఇక్కడ చేతులు కలుపుతాయా? నిజానికి ఈ ప్రాంతీయ పార్టీలన్నింటికీ అటు బీజేపీ నుంచి లేదా కాంగ్రెస్‌ ‌నుంచి లేదా మరొక ప్రాంతీయ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. ఇప్పుడు తామున్న స్థానం వదిలి పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల మీద ఈ పార్టీలు దృష్టి పెడతాయా? ఇప్పుడు ఇన్ని మాటలు చెబుతున్న స్టాలిన్‌ ‌తమిళనాడులో మళ్లీ అన్నా డీఎంకే బలపడడానికి అంగీకరిస్తారా? అది జరగకుండా ఉండాలంటే రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెట్టక తప్పదు. ఇలా రెండు పడవల ప్రయాణం చాలా ప్రాంతీయ పార్టీలకు అనివార్యమవుతుంది.

సంకీర్ణాలు

పార్టీల చేత, పార్టీల కోసం, పార్టీలే ఏర్పాటు చేసుకునేది సంకీర్ణమనేది అంతర్జాతీయంగా అంగీకరించిన గతానుగతిక వాక్యం. మేధస్సు అనే సామర్థ్యంతో విలువలు చోదకశక్తిగా నడిచేవే రాజకీయాలు. సంకీర్ణాల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన వాటికంటే, ఎన్నికల ముందు ఏర్పాటైనవి ఉత్తమం. ఎందుకంటే ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ప్రజల వద్దకు వెళతాయి కనుక ఇబ్బంది ఉండదు. అదే ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే సంకీర్ణాలు ఎక్కువగా అవకాశవాదంతోనే ఉంటాయి. మనకంటే ముందు ఇంగ్లండ్‌, ‌ఫ్రాన్స్, ‌స్విట్జర్లాండ్‌, ‌జర్మనీ వంటి దేశాల్లో సంకీర్ణాలు ఏర్పడ్డాయి. నిజం చెప్పాలంటే 1946-52 మధ్యకాలంలో పండిట్‌ ‌జవాహర్‌లాల్‌ ‌నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటైనది మనదేశంలో తొలి సంకీర్ణంగా చెప్పాలి. ఇందులో కాంగ్రెస్‌, ‌ముస్లింలీగ్‌ (‌దేశవిభజన వరకు), హిందూ మహాసభ, రిపబ్లికన్‌ ‌పార్టీ ఇతర చిన్నాచితకా పార్టీలు భాగస్వాములుగా ఉండేవి. 1952 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌మెజారిటీ సాధించడంతో పార్టీ ఏకఛత్రాధిపత్య పాలన మొదలైంది. తర్వాత 1977 మార్చి 24 నుంచి 1979 జులై 19 వరకు మొరార్జీ దేశాయ్‌ ‌నాయకత్వంలో తర్వాతి సంకీర్ణ ప్రభుత్వం పనిచేసింది. కాంగ్రెస్‌(ఒ), ‌భారతీయ జనసంఘ్‌, ‌భారతీయ లోక్‌దళ్‌, ‌భారత జాతీయ కాంగ్రెస్‌లోని అసమ్మతివాదులు కలసి ఉమ్మడిగా ‘జనతా పార్టీని’ ఏర్పాటు చేశారు. అది కొద్దికాలమే. మళ్లీ 1989 నుంచి సంకీర్ణయుగం ప్రారంభమై 2013 వరకు కొనసాగింది. జనతా పార్టీయే దేశంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం, 1989 నాటి వీపీ సింగ్‌ ‌నాయకత్వంలో ఏర్పడిన నేషనల్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వం ‘సకారాత్మక సంకీర్ణ ప్రభుత్వం’ అని అంటారు.

మనదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటానికి ప్రధాన కారణం బహుళపార్టీ వ్యవస్థ. ఉమ్మడివేదికపై ఆధారపడి కొన్ని పార్టీలు సంకీర్ణంగా ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇందులో వెసులుబాటు ఉంటుంది. దురదృష్టవశాత్తు మనదేశంలో ఇవి ఇంతవరకు సజావుగా పాలన సాగడానికి దోహదం చేయలేదనే చెప్పాలి. 1989 నాటి ఎన్నికల్లో అవినీతి ముఖ్యంగా బోఫోర్స్ ‌గన్స్ ‌కుంభకోణాన్ని ప్రధానాంశంగా తీసుకొని వీపీ సింగ్‌ ‌నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగిన జనతాదళ్‌ ‌గ్రూపు నేతృత్వంలోని నేషనల్‌ ‌ఫ్రంట్‌ ‌విజయం సాధించింది. ఆవిధంగా ఏర్పడిన నేషనల్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వం చట్టబద్ధత సాధించినప్పటికీ, జనతాదళ్‌ ‌లోని చంద్రశేఖర్‌ ‌నేతృత్వంలోని అసమ్మతివాదుల పుణ్యమాని వీపీ సింగ్‌ ‌ప్రభుత్వం కుప్పకూలింది. జనతా ప్రభుత్వం కొనసాగకుండా చరణ్‌సింగ్‌కు మద్దతు ఇచ్చినట్టే, చంద్రశేఖర్‌కు మద్దతివ్వడం ద్వారా వీపీ సింగ్‌ ‌జనతాదళ్‌ ‌ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్‌ ‌కూల్చింది. తర్వాతి కాలంలో కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పడటం మొదలైంది. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదు. వాటి ఆకాంక్షలు ప్రాంతీయతకు మాత్రమే పరిమితం. అందువల్ల కేంద్రంలో జాతీయ ప్రయోజనాల విషయంలో ఇవి ఒక్కటిగా నిలబడ లేదు. ఈ వైఖరి కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా పనిచేయడంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

మఖలో పుట్టి పుబ్బలో అస్తమయం

ఆ రెండు కూటములను ఉత్తమంగా భావించినా, అసమ్మతి రాజకీయాలతో కొద్దికాలంలోనే కుప్పకూలి పోయాయి. 2004 నుంచి యూపీఏ కూటమి 2014 వరకు అధికారంలో కొనసాగినా, ప్రాంతీయ పార్టీలు అనుక్షణం ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికే యత్నించాయి. సీబీఐ బూచిని చూపి ఎప్పటికప్పుడు ఆయా నాయకులను అదుపులో పెడుతూ వచ్చినా, పాలన సజావుగా సాగలేదు. తెలంగాణ రాష్ట్రం విడిపోవడం కూడా యూపీఏ హయాంలోనే జరిగినా, సరైన రీతిలో రాష్ట్ర విభజన జరగలేదన్నది అంగీకరించాల్సిన సత్యం. ఆ వాస్తవాన్ని రాజ్యసభ సాక్షిగా ప్రధాని ప్రస్తావిస్తే దానిని బీజేపీ వ్యతిరేకాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. ఓట్ల రాజకీయం కోసం కాంగ్రెస్‌ ‌చేసిన ఈ విభజన, దానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టగతులు లేకుండా చేసింది. అదే బీజేపీ విభజించిన రాష్ట్రాల్లో ఏవిధమైన సమస్యలు లేవు. కేసీఆర్‌కు ఈ సంగతి తెలియదా? ఆ రోజు పార్లమెంటులో చిన్నమ్మ (సుష్మా స్వరాజ్‌) ‌పాత్ర ఏమిటో కూడా ఆయనకు తెలియదా? మరి ఎందుకీ వదరుబోతుతనం? రాజ్యసభలో మోదీ అన్న ఇవే మాటకు ఆగ్రహించిన కేసీఆర్‌ ఒకేసారి జాతీయ పార్టీ పెడతానని, కూటమి కడతానని దూకుడుగా ముందుకెళుతున్నారు.

ఇక ఆయన ఎంచుకున్న ప్రాంతీయ పార్టీలు ఎలాంటివి? ‘ఎడ్డెం’ అంటే ‘తెడ్డెం’ అనే మమతా బెనర్జీ టీఎంసీ అందులో ఒకటి. ఆమె మొండి రాజకీయం ముందు కేసీఆర్‌ ఎం‌తమేర నిలబడతా రన్నది ప్రశ్న. ఆమె ఇప్పటికే ప్రధాని పదవిపై కన్నేశారు. స్టాలిన్‌ ‌ద్రవిడవాదం, ఉద్ధవ్‌ ‌ఠాక్రే మహారాష్ట్ర వాదం, కేసీఆర్‌ ‌తెలంగాణవాదం, మమతమ్మ ‘బెంగాలీవాదం’ ఎక్కడ కుదురుతాయి? ఉమ్మడి కార్యాచరణ ఎంతమేర సాధ్యం? మోదీ ప్రభుత్వాన్ని దించాలన్న ఒకే ఒక కారణంతో జట్టు కడదామనుకుంటే కేవలం ‘విధ్వంసక సంకీర్ణం’ మాత్రమే ఏర్పడుతుంది. వీరిలో ఎవరికీ జాతీయ వాదం లేదు. వీరిలో జాతీయస్థాయి నాయకుడు కూడా ఎవరూ లేరు. కేసీఆర్‌ ‌జాతీయ స్థాయికి ఎదగాలంటే 2019లో మొదలుపెట్టిన యత్నాలను కొనసాగించి ఉండాల్సింది. జాతీయస్థాయికి ఎదగడానికి జాతీయస్థాయి వేదిక ఉండటమే కాదు, జాతీయ రాజకీయాలను శాసించే నేతగా గుర్తింపు పొందాలి. మోదీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలు ఆయనకు ఇలాంటి అవకాశం అందించాయి. అంతేకాదు, ఆయన ఎదుగుదలకు బీజేపీ వంటి సిద్ధాంతబలం, కార్యకర్తల బలం ఉన్న జాతీయ పార్టీ వేదికను సమకూర్చింది. అడ్వాణి వంటి ఉద్దండులు ఉన్నా మోదీకి కొన్ని ఇతర కారణాలు కూడా కలసి వచ్చాయి. పైగా మోదీకి లేనిదీ, కేసీఆర్‌ ‌మీద బలంగా ఉన్నదీ అవినీతి ఆరోపణ. ఈ నేపథ్యంలో సామర్థ్యాన్ని నిరూపించు కొని చివరకు మోదీ ప్రధాని అయ్యారు. అంత ర్జాతీయ రాజకీయాలను శాసిస్తున్నారు. దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో సమున్నతంగా నిలబెట్టారు. మరి కేసీఆర్‌కు అటువంటి వేదిక లేదు. సంకీర్ణ వేదిక ఆయనకు అటువంటి దన్ను ఇవ్వదు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించ డంలో తప్పులేదు. కానీ అనుకూల, ప్రతికూలాంశా లను బేరీజు వేసుకోవడం చాలా అవసరం. ఇంతకీ కాంగ్రెస్‌ను దూరంగా పెట్టడం అనేది మూడో కూటమి నిర్మాణానికి ఉపకరించే నిర్ణయమేనా? ఇవన్నీ పదవులు కోల్పోతామన్న బెంగతో కొందరు చేస్తున్న కొత్త రాజకీయ ప్రయోగం. చేదు చరిత్రల చర్విత చర్వణం. దేశాన్ని మూడు నాలుగు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లే క్షుద్రవిద్య.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram