‘కేవలం జ్ఞానార్జనతోనే సరిపోదు. ధర్మానుష్టానంతోనే జ్ఞానం సార్థకమవు తుంది. సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయదృష్టితో కర్మాచరణ చేయడంతోనే జీవితం సార్థకమవుతుంది. సర్వమానవ సమానత్వంతోనే మానవత్వం పరిఢవిల్లు తుంది. తాను అందరివాడినని భగవానుడే చెప్పినప్పుడు మనుషుల మధ్య భేదాలు, తేడాలు ఎందుకు?’ అని నిగ్గదీసి మానవీయ విలువలపై అనంతర తరాలకు దిశానిర్దేశం చేసిన భగవద్రా మానుజాచార్యుల భారీ విగ్రహం (సమతామూర్తి) భాగ్యనగరం శివారు ముచ్చింతల్‌ శ్రీ‌రామనగరం దివ్యసాకేతంలో కొలువుదీరింది. దీక్షా వస్త్రాలు, తిరునామం ధరించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విగ్రహాన్ని ఆవిష్కరించి ‘శ్రీమతే రామానుజాయ నమః’ అంటూ సందేశం ఇచ్చారు. ద్వాదశ దిన మహాక్రతువు (ఫిబ్రవరి 2-14) కన్నుల పండువుగా సాగి, మధుర జ్ఞాపకంగా నిలిచింది.

హైదరాబాద్‌ ‌శివారు ముచ్చింతల్‌ శ్రీ‌రామ నగర్‌లోని దివ్యసాకేతం ‘సమతా స్ఫూర్తి’ కేంద్రంలో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త భగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం ఒక సామాజిక సందేశంతో, భారతీయత చెప్పే సమత్వ సిద్ధాంతాన్ని స్మరణకు తెచ్చి వైభవంగా ముగిసింది. ఈ నెల (ఫిబ్రవరి) 2వ తేదీ నుంచి పన్నెండు రోజులు సాగిన ‘సమతా మూర్తి’ మహా విగ్రహావిష్కరణ వేడుక, యజ్ఞయాగాలు, ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలతో అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది. తెలంగాణ, దక్షిణ భారతాలకే కాక భారతదేశమంతా మేల్కొనేటట్టు చేసింది. వేద మంత్రోచ్చారణతో శ్రీరామ నగరం మార్మోగింది. ఆ ప్రాంతం ఆధ్మాత్మిక సాగరంగా మారింది. రోజురోజుకు భక్తులు పోటెత్తారు.

దేశ ప్రథమ పౌరుడు రాంనాథ్‌ ‌కోవింద్‌, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ ‌షా, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌జి.కిషన్‌ ‌రెడ్డి, అశ్వినీ కుమార్‌, ‌ప్రహ్లాద్‌ ‌జోషి, గవర్నర్లు బండారు దత్త్తాత్రేయ (హరియాణా) తమిళి సై సౌందర రాజన్‌, (‌తెలంగాణ), బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ (ఆం‌ధప్రదేశ్‌), ‌ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు (తెలంగాణ) వై.ఎస్‌. ‌జగన్మోహన రెడ్డి (ఆంధప్రదేశ్‌), ‌శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ (‌మధ్యప్రదేశ్‌), ‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌, అయోధ్య ట్రస్ట్ ‌కోశాధికారి గోవింద్‌సింగ్‌ ‌మహారాజ్‌, ‌బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ ఉత్సవంలో పాలు పంచుకున్నారు. రామానుజుల మహావిగ్రహావిష్కరణ ఉత్సవం విజయవంతం కావాలని పేర్కొంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ‌సందేశం పంపారు. రామానుజుల సమానత్వ వాణిని దేశవ్యాప్తంగా వినిపించాలని ఆకాంక్షించారు.

రామానుజుల సహస్రాబ్ది వేడుకల సమయం లోనే అయోధ్య – కాశీ విశ్వనాథ్‌ ‌కారిడార్‌, ‌కేదార్‌ ‌నాథ్‌, ‌బద్రీనాథ్‌ ‌మందిరాల పునర్నిర్మాణం చోటుచేసు కోవడం ముదావహం. ఈ మహత్తర క్రతువు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ మరింత ముందుకు తీసుకు వెళుతుంది. సమతామూర్తి నిర్మాణ సమయంలోనే అయోధ్యలో భవ్య రామమందిర పునర్నిర్మాణం, 650 ఏళ్ల తరువాత కాశీ విశ్వనాథ్‌, ‌కేదార్‌ ‌థామ్‌, ‌బదరీథామ్‌ ‌పునర్నిర్మాణం లాంటివి విధి, విధాత ఇచ్చిన ఆశీర్వాదం.

సహస్రాబ్ది సమారోహ విశేషాలు

 సమతా స్ఫూర్తి కేంద్రానికి ‘9’ అంకెతో ముడిపడి ఉంది. భగవద్రామానుజల ‘సమతామూర్తి’ విగ్రహం ఎత్తు కాగా, దివ్యదేశాల నిర్మాణం, భద్రవేదిక కింద అమర్చిన ఏనుగులు అంకె లాంటివి ‘9’తోనే ముడిపడ్డాయి. మహాయజ్ఞానికి అగ్ని మథనానికి కూడా 9 నిమిషాలు పట్టిందని జీయర్‌ ‌స్వామి ప్రకటించారు.

 మొదటి రోజు (ఫిబ్రవరి 2) శోభాయాత్రలో భాగంగా వేల సంఖ్యలో మహిళలు ఏకరూప దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకుని పాల్గొన్నారు.

 తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. గోదావరి ఖని నుంచి రామాయణం కళాకారులు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చిందు యక్షగానం కళాకారులు, జనగామ నుంచి ఒగ్గు కళాకారులు మత కళలను ప్రదర్శించారు. రాష్ట్ర భాషాసంఘం ఆధ్వర్యంలో మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించారు.

 రామానుజుల 120 కిలోల బంగారు విగ్రహం కొలువైన స్ఫూర్తి కేంద్రంలోని అంతస్తును ‘ప్రసన్న శరణాగతి మండపం‘గా నామకరం చేశారు.

 బంగారు విగ్రహానికి ఏడాదిలో పరిమితం గానే పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఇతర సమయాలలో అభిషేకానికి కేవలం శుద్ధ జలాన్నే వినియోగిస్తారు.

 స్వర్ణమూర్తిని ప్రతిష్టించిన వేదికను ‘భద్రపాదం’ అంటారు. విగ్రహంపై కళాత్మకంగా కాంతిపడేలా అయిదు రంగుల దీపాలను అమర్చారు.

 ఈ క్షేత్రంలోని రామానుజ విగ్రహం ముందు గల శఠారిని ఆయన శిష్యులు ముదలియాండాన్‌ (‌దాశరథి) అనంతాళ్వార్‌ ‌ప్రతిమలతో రూపొందిం చారు. సాధారణంగా ఆయన సన్నిధిలో శఠారిని ‘ముదలియాండాన్‌’ అని వ్యవహరిస్తారు. తిరుమలలోని భాష్యకరా సన్నిధిలో ‘అనంతాళ్వాన్‌’ అం‌టారు.

 రామానుజ సమారోహం వేడుకల సందర్భంగా తపాలా శాఖ ముద్రించిన ప్రత్యేక కవర్‌ను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ ‌విడుదల చేశారు.

 సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ 108 దివ్య క్షేత్రాల నమూనా ఆలయాలు దర్శనమిస్తాయి. వాటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపం నిర్మితమైంది. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటైంది. విగ్రహం వద్ద భారీ గంట ఏర్పాటైంది.

 ఈ ప్రాంగణంలో అష్టదళ పద్మాకృతిలో 45 అడుగుల ఎత్తు ఫౌంటెయిన్‌ ‌మరో ప్రత్యేకత. పద్మపత్రాల మధ్య నుంచి నీరు రామానుజ విగ్రహాన్ని అభిషేకిస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తాయి.

 రామానుజ ప్రబోధిత సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్‌తో త్రీడీ షోగా ప్రదర్శిస్తారు.

…దివ్యక్షేత్రంలో అనేక రకాల పుష్ప జాతులతో ఉద్యానవనాలు ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు ‘స్వయం మార్గదర్శిక పరికరం’ (సెల్ఫ్ ‌గైడెడ్‌ ‌టూల్‌) ‌సాయంతో తమకు నచ్చిన భాషలో క్షేత్ర విశేషాలు, విశిష్టతలు తెలుసుకోవచ్చు.

నాలుగు భాగాల యాగశాల

మహనీయుడి సహస్రాబ్ది సంబరం మరో వెయ్యేళ్ల పాటు మానవులకు దిశానిర్దేశం చేసేలా కనులపండువగా సాగిందని ప్రముఖులంతా హర్షాతి రేఖాలతో వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక పరులకు చూడ కన్నులు చాలవన్నంత మహాద్భుత ఘట్టం. దేశవిదేశాల నుంచి వచ్చిన సుమారు ఐదు వేల మంది రుత్వికులు పాల్గొని సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. యాగశాలను నాలుగు భాగాలుగా విభజించారు. రామానుజులకు ప్రత్యేక అనుబంధం గల శ్రీరంగం దివ్య క్షేత్రానికి సూచికగా భోగమండపం, పుష్పమండపం (తిరుమల), త్యాగమండపం (కాంచీపురం), జ్ఞానమండపం (మేల్కొటే) అని పేర్లు పెట్టారు. యాగశాల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణించి పూజాదికాలు నిర్వహించారు.

రామానుజుల 216 అడుగుల మహా విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ (5న) జాతికి అంకితం చేయగా, రామానుజుల 120 కిలోల సువర్ణ విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్‌ ‌కోవింద్‌ (13‌న) ఆవిష్కరించారు.

ఈ వేడుకలకు హాజరైన ప్రముఖులు రామానుజాచార్యుల విశిష్టతను, ఆయన చేపట్టిన ఆధ్యాత్మిక, సామాజిక సంస్కరణలు తదితర అంశాలపై సందేశాలు ఇచ్చారు.

—————–

శ్రీమతే రామానుజాయ నమః

భారతీయ సంస్కృతి వైభవాన్నీ, ఆధ్యాత్మిక చింతన ఔన్నత్యాన్నీ, ఘన చరిత్రనీ, అదే సమయంలో ముచ్చింతల్‌లో వెలసిన తెలుగు నేల వైశిష్ట్యాన్నీ స్పృశిస్తూ ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరంలో ఇచ్చిన ఉపన్యాసం మరపురానిది. తెలుగువారి కళావైభవం, భాష, చలనచిత్రాల ఘనత వరకు ఆయన ప్రస్తావించారు. శ్రీమతే రామానుజాయ నమః అంటూ ఉపన్యాసం ప్రారంభించిన మోదీ, సమతామూర్తి సందేశమే భారత రాజ్యాంగానికి స్ఫూర్తి అంటూ ఆ మహనీయుడి సమున్నత వ్యక్తిత్వాన్ని, అనన్య సామాన్య విశిష్టాద్వైత తాత్త్వికతను సభ ముందు తన మాటలలో ఆవిష్కరించారు. సమతామూర్తి క్షేత్రంలో అడుగు పెట్టిన క్షణం మొదలు తిరిగి వెళ్లే వరకు మోదీ అడుగడుగునా ఆధ్యాత్మిక స్ఫూర్తితో కనిపించారు. తిరునామంతో, బంగారు వర్ణం దుస్తులతో, ప్రశాంత వదనంతో ఆయన నాలుగు గంటలు శ్రీరామనగరంలో గడిపారు. విశిష్టాద్వైతమే మనకు ప్రేరణ అని గుర్తు చేశారు. సరస్వతీదేవిని అర్చించే పవిత్రమైన వసంత పంచమి సందర్భంగా రామానుజుల గురించి స్మరించుకోవడం అదృష్టమని అన్నారు. సరస్వతీ మాత అంటే జ్ఞానం. గురువు వల్లే జ్ఞానం వికసిస్తుందని, రామానుజుల విగ్రహం దేశ మానవ శక్తికి సరైన రూపం ఇస్తుందని చెప్పారు. లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరేందుకు విష్వక్సేన యాగంలో పాల్గొన్నానని, ఆ యాగఫలం 130 కోట్ల భారతీయులకు అర్పిస్తున్నానని ప్రధాని చెప్పారు. దక్షిణాదిన జన్మించినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌వంటి ప్రాంతాలకు, భారతదేశంలోని ఎన్నో ప్రదేశాలకు రామానుజుల సందేశం వెళ్లిందని చెప్పారు. తెలుగు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య, కన్నడ కవి కనకదాసు, ఉత్తర భారతాన కబీర్‌ ‌రామానుజుల బోధలతో ఉత్తేజం పొందారని ప్రధాని చెప్పారు. జాతిని జాగృతం చేసిన జగద్గురువు భగద్రామానుజాచార్యుల బోధనలు నిత్యనూతనం, యుగయుగాలకు మార్గదర్శకాలు. దేశ ఐక్యత, సమగ్రతలకు ఆయనే ప్రేరణ. భక్తి మార్గానికి పితామహుడైన ఆయన ప్రబోధించిన మార్గంలోనే గాంధీజీ నేతృత్వంలో సాగిన స్వరాజ్యపోరులో దేశం సంప్రదాయక విజయం సాధించింది. అంధ విశ్వాసాలు ముసురుకున్న దాదాపు వెయ్యేళ్లనాడే దళిత గిరిజన బహుజనులను చేరదీయడం ద్వారా సమసమాజ స్థాపనకు పాటుపడ్డారు. భక్తికి కులం, జాతితో పనిలేదని చాటి, సద్గుణాలు, ప్రతిభా సంపత్తులతోనే విశ్వకల్యాణం సాధ్యమని ప్రబోధించారు. శ్రీరామచంద్రుడే జటాయువుకు అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పుడు మనకు కులమతాలతో పనేముందంటూ రామానుజులు దివ్య సందేశం ఇచ్చారు. భారత్‌ ఐక్యతా సూత్రాన్ని ఆయన బోధనల నుంచి నేర్చుకున్నాం. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు కృషి చేసిన డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌కూడా రామానుజుల మార్గంలో నడిచారు. ఈ మహావిగ్రహం ఆయన జ్ఞానం, ధ్యానం, వివేకం, వైరాగ్యం, ఆదర్శాలకు ప్రతీక అని తన ప్రసంగంలో ప్రధాని పేర్కొన్నారు.

సర్దార్‌ ‌పటేల్‌ ‌ధైర్యసాహసాలతో భాగ్యనగర్‌కు విముక్తి కలిగిందని మోదీ గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి ఎంత గొప్పదో కూడా ఆయన గుర్తు చేశారు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని గుబాళింప చేశారని చెప్పారు. 13 శతాబ్దానికి చెందిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం అభినందనీయమని అన్నారు. పోచంపల్లికి ప్రపంచ స్థాయిలో ఉత్తమ పర్యాటక స్థలంగా చోటు దక్కిందని చెప్పారు.

——————-

మహనీయులను నడిపించిన మంత్రం

వివక్ష నుంచి విముక్తం చేసిన మహనీయుడు రామానుజాచార్యులవారని, భగవంతుని ఎదుట అంతా సమానమేనని చెప్పిన దార్శనికుడు రామానుజులని, విశ్వకుటుంబ భావనకు వేయేళ్ల క్రితమే అంకురార్పణ చేసిన మహనీయుడని ఫిబ్రవరి 5 నాటి సమతామూర్తి ఆవిష్కరణోత్సవంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ ‌స్వామి అన్నారు. ఫిబ్రవరి 9న సాధుసంతుల సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో చిన్నజియర్‌ ‌స్వామీజీ, రామానుజార్య సహస్రాబ్ది ఉత్సవాలను సందర్భం చేసుకుని భాగ్యనగర్‌లో శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని నెలకొల్పడంలో గల ఉద్దేశాన్ని తెలియజేసారు. ఇప్పటికి 1000 సంవత్సరాల క్రితం దేశమంతా సమరసత సందేశాన్ని రామానుజులు వినిపించారని తెలిపారు. ‘ఇప్పుడు ఈ సందేశం వ్యాపింపచేయడం సులువు కావచ్చు. కాని 1000 సంవత్సరాల క్రితం ఈ సందేశాన్ని వినిపిస్తే చెవులలో సీసం కరిగించి పోసేవారు. నాలుక కత్తిరించేవారు. వారిని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. ఆ సమయంలో రామానుజాచార్యులు ఆనాటి రాజులు, పండితులు, సాధు మహాత్ములను ఒప్పించి, వారి ద్వారా సందేశాన్ని వ్యాపింపజేశారు. 1927లో డా।।బి.ఆర్‌.అం‌బేడ్కర్‌ ‌తన పత్రిక ‘భారత్‌’‌లో… సమత గురించి ఎవరైనా చెప్పారంటే, అర్థం చేయించారంటే, ఆచరణలోకి తీసుకొచ్చారంటే వారు రామానుజులే అని రాశారు. ఈరోజు కులమతాల పేరుతో ఒకరినొకరు అణగదొక్కడానికి, ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు.ఎంతో శ్రమకోర్చి ఈ రామానుజుల విగ్రహం ఏర్పాటు ద్వారా ప్రపంచానికి సమరసతా సందేశం అందించాలనేది ముఖ్య ఉద్దేశం’ అని చిన్న జీయర్‌ ‌స్వామి తెలియజేశారు. సమతామూర్తి ఆశయాలను అమలు చేద్దామని సామాజిక నేతల జాతీయ సమావేశంలో పూజ్య చిన్న జీయర్‌ అన్నారు. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. లోపాలను చూసి పరిహసించడం కాదు, అతనిలోని గుణాలను సమాజ హితం కోసం ఉపయోగపడేటట్లు చేయాలి. ప్రతి వ్యక్తిలోని గుణ, గణాల వికాసం కోసం సంపూర్ణ సమాన అవకాశాలను అందరికీ కల్పించాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. 5వ తేదీ సభలో ప్రధాని మోదీ గురించి చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.

నరేంద్ర మోదీ వ్రతబద్ధుడు. శ్రీరాముడిలా మోదీ సద్గుణ సంపన్నుడు. ఎల్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తారు. ధర్మాన్ని పాటిస్తారు. ధరిత్రి ఆశించిన పరిపూర్ణ పాలకుడు. దసరా సమయంలో అమెరికా వెళ్లినా, నియమాలను పాటించారు. పదిరోజులు కేవలం జలప్రసాదంతో గడిపారు. భారతదేశ ఘనతను చాటడానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాకే హిందువులమని హిందువులు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. భరతమాత తలెత్తుకుని నవ్వులు చిందిస్తున్నది. కశ్మీర్‌ ‌భారత చిత్రపటంపై కనిపిస్తున్నది. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కంకణబద్ధులై పనిచేస్తున్నారు.

————–

తిరునామం.. భక్తి పారవశ్యం

రామానుజ స్ఫూర్తి యువతకు దీప్తి: ఉపరాష్ట్రపతి

రామానుజాచార్యులు ఆధ్మాత్మికవేత్తే కాదు… సామాజిక సంస్కరణాభిలాషి. మానవాళి హితం కోసం అందించిన స్ఫూర్తిని అందరికి చేర్చడమే ఆయనకు సమర్పించే ఘనమైన నివాళి. తిరుమంత్రం ఉపదేశం పొందేందుకు ఆయన చూపిన చొరవ, స్ఫూర్తిని యువతరం ఆదర్శంగా తీసుకోవాలి. కులమతాల కన్నా గుణం మిన్న అని రామానుజాచార్యులు వెయ్యేళ్లకు ముందే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అనేక సంక్షేమ పథకాల వెనుక రామానుజుల ప్రేరణ ఉంది. ప్రభుత్వం ఆయన బాటలోనే వాటిని ప్రవేశపెట్టింది. రామానుజుల వారసులుగా ఆచార్యులు, పీఠాధిపతులు జ్ఞాన పరంపరను జనం దగ్గరకు తీసుకువెళ్లాలి. ఆయన బోధనలను విశ్వవ్యాపితం చేయడానికి నెలకొల్పిన ఈ ‘సమతాస్ఫూర్తి’ కేంద్రం ప్రపంచంలోనే ఎనిమిదవ అద్భుతం. ఈ కేంద్రం సందర్శనం భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రేరణ ఇస్తుంది.

రామానుజ జీవితమే సందేశం: అమిత్‌ ‌షా

సనాతన ధర్మం సంకటంలో పడినప్పుడు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వా చార్యులు లాంటి మహనీయులు ఎవరో ఒకరు ఉదయిస్తారు. సనాతన ధర్మాన్ని కాపాడడంతో పాటు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి, జాతుల మధ్య విద్వేషాలను తొలగించిన మహామనీషి రామానుజాచార్యులు. ఆయన జీవితమే ఒక సందేశం. వెయ్యేళ్ల క్రితమే సమతా ధర్మాన్ని ప్రబోధించి ఆచరించి చూపారు. ఆలయ ప్రవేశానికి అందరూ అర్హులేనని చెప్పడమే కాకుండా ఆచరించి చూపిన మహనీయుడు. ఆయన ప్రచారం చేసిన విశిష్టాద్వైత మార్గంతోనే దేశం నలుదిక్కులను ఏకతాటిపైకి తెచ్చారు. వేదసారాంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కంచిలో ఒక బ్రాహ్మణేతరుడిని శిష్యుడిగా స్వీకరించి సమానత్వాన్ని బోధించి ఆదర్శమూర్తిగా నిలవడాన్ని డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ఒక సందర్భంలో ప్రస్తావించారు. భాగ్యనగర్‌లో నెలకొల్పిన ‘సమతామూర్తి’ విగ్రహం తరతరాలకు స్ఫూర్తిని పంచుతుంది. ధర్మం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల విగ్రహాల దర్శనంతోనే ఉత్సాహం కలుగుతుంది. స్వదేశంతోపాటు ప్రపంచదేశాలకు సనాతన ధర్మ సందేశాన్ని అందించే కేంద్రంగా ఈ స్ఫూర్తి కేంద్రం విరాజిల్లుతుంది.

అసమానతల నిర్మూలనలో యతీంద్రులు: రాజ్‌నాథ్‌

‌ప్రతి విపత్కర సందర్భంలో మహనీ యులు అవతరించి సామాజిక అసమానతలను తొలగించేందుకు బాటలు వేస్తున్నారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి మహనీయులు ఆ కోవకు చెందిన వారే. సనాతన ధర్మ పరిరక్షణకు శంకరాచార్యులు తరువాత రామానుజాచార్యులు విశేష కృషి చేశారు. సామాజిక సంస్కరణల వాది రామానుజులు అసమానతల గోడలను కూల్చి, అణగారిన వర్గాలకు అండగా నిలిచారు. సమస్త మానవ సేవే మాధవసేవ అని చాటి చెప్పారు.

ఆధ్యాత్మికతతో మానసికానందం: బండారు

ఆధ్యాత్మికతతో మనిషి ఆత్మస్థయిర్యం పెరుగు తుంది. మానసిక ఆనందానికి ఆధ్యాత్మికత పరమౌషధం. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ ‌సమయంలో ఈ విషయం రుజువైంది. స్ఫూర్తికేంద్రం, సమతా మూర్తి విగ్రహ ఏర్పాటు ఆలోచనే అద్భుతం.

వివక్ష అనుచితం: బిశ్వభూషణ్‌

‌భగవంతుని ముందు అందరూ సమానమేనని రామానుజాచార్యులు చాటారు. పాలకులలో పక్షపాత ధోరణి, అహంకారం ఉండకూడదు. వారు అందరిని సమానంగా చూడాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎన్నటికీ సమానత్వాన్ని చూడలేం. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ అం‌కితభావం, కృషి, పట్టుదలతో సమతాస్ఫూర్తి కేంద్రం కల సాకారమైంది.

సహస్రాబ్ది వేడుక గర్వకారణం: కేసీఆర్‌

‘‌రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు దేశానికే గర్వకారణం. రామానుజులు ప్రబోధించిన సమతా సిద్ధాంతానికి జీయర్‌ ‌స్వామి వారధిగా నిలిచి ముందుకు తీసుకువెళుతున్నారు. సమతా స్ఫూర్తి కేంద్రం తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్‌కు వరం లాంటిది. ఇది ప్రపంచం లోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రాణిస్తుంది. రామానుజుల శాంతి సందేశం ఇక్కడి నుంచి యావత్‌ ‌ప్రపంచానికి చేరువవుతుంది.

సమానత వాద సదా ఆచరణీయం: శివరాజ్‌ ‌సింగ్‌

‌కులాల మధ్య ఆధిపత్య పోరుతో విద్వేషాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సమాజంలో నేటికీ అసమానతలు ఉండడం దురదృష్టకరం. మనుషులంతా ఒక్కటేనన్న రామానుజుల వాక్కును సదా గుర్తుంచు కోవాలి. హైదరాబాద్‌లోని ‘సమతామూర్తి’ (స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) కేంద్రం స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో ‘స్టాట్యూ ఆఫ్‌ ‌వన్‌ ‌నెస్‌’‌పేరుతో శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

———————–

ముచ్చింతల్‌ ఒక పుణ్యక్షేత్రం

సమతామూర్తి ప్రతిమ వెలసిన ముచ్చింతల్‌ ‌తనకు పుణ్యక్షేత్రమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌చెప్పారు. దైవ దర్శనానికీ, దైవ కృపకు ప్రతి మనిషి అర్హుడేనన్న మహోన్నత సిద్ధాంతం మానవాళికి అందించిన మహనీయుడు రామానుజా చార్యులవారని రాష్ట్రపతి చెప్పారు. మనసుని బట్టి భక్తి ఉంటుందే తప్ప కులాన్ని బట్టి కాదని ఏనాడో చాటిన మహనీయుడు రామానుజులవారని రాష్ట్రపతి చెప్పారు. పీడిత వర్గాల కోసం రామానుజులు వైష్ణవాలయాల ద్వారాలు తెరిపించారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 13న ప్రథమ పౌరుడు రామానుజుల 120 కిలోల స్వర్ణ ప్రతిమను లోకార్పణం చేశారు. తొలి పూజ కూడా ఆయనే చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తన భార్య సవిత, కుమార్తె స్వాతిలతో కలసి హాజరయ్యారు. రామానుజుల వారి స్ఫూర్తితోనే ఇంకా మిగిలి ఉన్న అసమానతలు తొలగించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. కార్యక్రమం 12వ రోజున ఆయన పాల్గొన్నారు. రామానుజస్వామి ప్రవచించిన సమానత్వ సిద్ధాంతమే మన రాజ్యాంగానికి ఆలంబన అని రాష్ట్రపతి చెప్పారు. ఇంకా, ‘రామానుజుల బాటలోనే మనం నిర్దేశించుకున్న ప్రాథమిక హక్కులు రాజ్యాంగాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ, డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సహా ఎందరో రామానుజుల వారి సమానత్వ సిద్ధాంతానికి ఉత్తేజితులయ్యారు. అంబేడ్కర్‌ ‌పుట్టిన గ్రామం, ఇప్పుడు ముచ్చింతల్‌ ‌సమానత్వ సిద్ధాంతానికి జన్మనిచ్చిన పుణ్యక్షేత్రాలు. వేయేళ్ల క్రితం రామానుజులు ప్రవచించిన విశిష్టాద్వైతం కేవలం ఒక సిద్ధాంతం కాదు. నిత్య జీవితానికి మార్గదర్శనం చేయగలిగే భావన’ అని రాష్ట్రపతి సందేశంలో పేర్కొన్నారు. తాను మహారాష్ట్రలోని అంబేడ్కర్‌ ‌స్వస్థలాన్ని సందర్శించానని, ఈరోజు ఇక్కడ (ముచ్చింతల్‌) ‌పుణ్య కార్యక్రమానికి హాజరయ్యానని చెబుతూ, అంబేడ్కర్‌ ‌కుటుంబం కబీర్‌ ‌మార్గాన్ని అవలబించిందని, ఆ విధంగా ముచ్చింతల్‌ అం‌బేడ్కర్‌ ‌స్వగ్రామంతో ముడిపడి ఉందని చెప్పారు. అంటే అంబేడ్కర్‌ ‌స్వగ్రామం అంబడవే వలెనే ముచ్చింతల్‌ ‌కూడా కబీర్‌ ‌పరంపరలోకి వచ్చిందని అన్నారు. కబీర్‌ ‌కూడా రామానుజుల నుంచి ప్రేరణ పొందారు. అందుకే అంబేడ్కర్‌ ‌జన్మస్థలం, ముచ్చింతల్‌ ‌తనకు పుణ్యక్షేత్రాలని ఆయన అన్నారు. రాష్ట్రపతి కూడా ప్రధాని మోదీ మాదిరిగానే శ్రీమతే రామానుజాయనమః అంటూ ఉపన్యాసం ప్రారంభించారు.

About Author

By editor

Twitter
Instagram