– సమకాలీన వ్యాఖ్య : డా. దీర్ఘాసి విజయభాస్కర్‌

‘‘నారీ స్తన భర నాభీదేశం

దృష్ట్వా మాగా మోహావేశం

ఏతన్మాంస వసాది వికారాం

మనసివి చింతయ వారం వారం’’

స్త్రీ అందాల పట్ల పురుషులకు ఉండదగని మోహావేశం గురించి శంకరులు ఈ శ్లోకంలో బోధిస్తున్నారు. మితిమీరిన ధనవ్యామోహం ఎంత ప్రమాదకరమో, స్త్రీ వ్యామోహం కూడా అంతే ప్రమాదకరమని తెలియజేస్తున్నారు.

యవ్వనవతుల వక్షోజాలు, నాభి ప్రదేశాలు చూసి మోహపరవశుడవు కావద్దు. ఈ ప్రపంచంలో అంత్యంత సుఖాన్నిచ్చే ప్రదేశాలుగా భ్రమింపజేస్తున్న  స్తనాలు, నాభి మాంసకండరాలతో, చీము, నెత్తురుతో రూపొందాయి. పరమ సౌందర్యవంతమని భావిస్తున్న వాటి లోపలి స్వరూపం వికార కారకం. జుగుప్సా కరం. ఈ సత్యాన్ని మనసులో మరలా, మరలా జ్ఞప్తికి తెచ్చుకో. ఏమరుపాటుకి గురై మర్చిపోవద్దు అని శంకరులు హెచ్చరిస్తారు.

మోహమనేది రజోగుణ ప్రధానమైనది. అది ధనంవల్ల కావచ్చు. స్త్రీ పట్ల కావచ్చు. పదవి పట్ల కావచ్చు. సంతానం పట్ల కావచ్చు. మోహమే మోక్షానికి అడ్డంకి. రజోగుణంతో రాజ్యాన్ని సంపా దించగలమేమో గాని కైవల్య సామ్రాజ్యాన్ని మాత్రం చేరుకోలేం. అందుకే శంకరులు ‘వివేకాచూడామణి’లో

‘‘కామః క్రోధో లోభ దంభాద్యసూయా

హంకారే ర్యామత్సరాద్యాస్తు ఘెరాః

ధర్మాఏతే రాజసాః పుంప్రవృత్తిః

యస్మాదేషా తద్రజోబంధహేతుః’’

కామం, క్రోధం, లోభం, దంభం, అసూయ, అహంకారం, ఈర్ష్య, మత్సరం వంటి ఘోర లక్షణాలన్నీ రజోగుణ ధర్మాలు. ఈ లక్షణాలే జీవునికి బంధాలు ఏర్పరిచి బంధనానికి కారణభూత మవుతున్నాయంటారు.

అయితే శంకరులు తన ‘సౌందర్యలహరి’లో అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ అనేక శ్లోకాలు చేప్పారు. పూర్వ కవుల సంప్రదాయం ప్రకారం స్త్రీ పురుష వర్ణనా క్రమంలో సర్వాంగాల్ని వర్ణించేవారు. అది విధానం. తప్పుకాదు. అమ్మవారి పట్ల ఉన్న విశేష భక్తి భావనతో అలాంటి వర్ణన చేసారు శంకరులు. అలాంటి గౌరవ ప్రపత్తులే ప్రతీ స్త్రీ పట్ల వ్యక్తపర్చాలనేది శంకరుల అభిప్రాయం. అంతే గానీ, కాముకత్వంతో కూడిన విపరీతమైన మోహం పనికిరాదంటారు.

స్త్రీ సౌందర్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకో కుండా గౌరవం ప్రకటించడానికి బదులు మోహాన్ని పెంచుకుంటే అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. చరిత్రలో జరిగిన అనేక యుద్ధాలకు కారణం స్త్రీ సౌందర్యమే. జడధారుల తపస్సుని భగ్నం చేసింది స్త్రీ సౌందర్యమే.

రావణుడు, సుందోపసుందులు, సైంధవుడు స్త్రీ పట్ల వ్యామోహంతో అనుచితంగా ప్రవర్తించారు. హెలెన్‌ కారణంగా ట్రోజన్‌ వార్‌ జరిగింది. మధ్య, ఆధునిక యుగాల్లో కూడా అనేక యుద్ధాలు జరిగాయి.

సౌందర్యం చిక్కదనం చర్మం మందంతో సమాన మని గుర్తెరగాలి. తమ సౌందర్యంతో మత్తెక్కించిన అనేక మంది మదవతులు వయసు మళ్లిన తర్వాత నడుములు ఒంగిపోయి, వడలు కుంగిపోయి నడవడానికి కూడా శక్తిలేక నశించిపోయిన సంగతి మర్చిపోకూడదు. శంకరులు తన ‘వివేక చూడా మణి’లో లౌకిక వాంఛలపై విరక్తి కలిగి వైరాగ్యం ఎలా సంభవిస్తుందో చెబుతారు.

‘‘తద్వైరాగ్యం జుగుప్సా యాదర్శన శ్రవణాదిభిః

దేహాది బ్రహ్మపర్యంతే హ్యానిత్యే భోగవస్తుని’’

ఈ దేహం మొదలు కొని బ్రహ్మ పర్యంతంగా ఉన్న అశాశ్వతమైన భోగ పదార్థాల పట్ల ఏవగింపు, జుగుప్స, యేహ్య భావం కలగడమే వైరాగ్యం అంటారు. ఈ వైరాగ్యం నిత్య సత్య దర్శన తపన, సత్యవాక్‌ శ్రవణాసక్తి వలన ఏర్పడుతుందని చెబుతున్నారు.

నిత్యం మనం ఏది వింటామో, కంటామో దానివలెనే మార్పు చెందుతాం. స్త్రీపట్ల, ఆమె సౌందర్యం పట్ల మాతృ భావముంటే ఆమెను మాతృమూర్తిగానే దర్శిస్తాం. లేదా కాముకతతో చూస్తే ఆ భావనలు మనలో స్థిరపడతాయి.

ప్రతీరోజు ఎక్కడో ఒకచోట యువతలు మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కారణాలు వెతకాలి. చాలావరకు వారి పట్ల మాతృభావన లేకపోవడమే. కాముకత్వం నిండిన కళ్లతో చూడడమే కారణం.

‘‘పురుషుడ్ని సృష్టించిన దేవుడు సామాన్యుడు

స్త్రీని సృష్టించాకే అతడు పరిపూర్ణుడు’’.

దేవునికే పరిపూర్ణతను కలిగించిన స్త్రీ మూర్తికి మనమిస్తున్న స్థానమేమిటి? అమ్మాయిలపట్ల అబ్బాయిలకు సరైన అవగాహన కల్పించడం లేదు. చిన్నతనం నుండి మగపిల్లలకు స్త్రీల పట్ల ఏర్పరుచు కోవాల్సిన దృక్పధాన్ని మనం నేర్పించడంలేదు. ఈనాడు జరుగుతున్న అఘాయిత్యాలకు అమ్మాయిల్నే బాధ్యులుగా చేస్తున్నాం తప్ప, అబ్బాయిలకు ఇవ్వాల్సిన కౌన్సిలింగ్‌ గురించి ఆలోచించడం లేదు.శంకరులు ఈ శ్లోకంలో చేసిన ఉద్బోధకు ఎంత సమకాలీనత ఉందో ఆలోచించండి.

‘‘నీలాంటి అందమైన కొడుకుని మీతో కనాలు నుందని ఒక మహిళ అడిగినప్పుడు, నా కన్నా అందమైన కొడుకు మీ కెలా వస్తాడమ్మా’’ అని అడిగారట వివేకానంద స్వామి. అలాంటి ఆత్మ సంయమనం, నిగ్రహదీక్ష ఎంత మందిలో చూడగలం? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సహితం స్త్రీ పొందు కోసం వెంపర్లాడుతూ చేస్తున్న అసహ్యకరమైన సంభాషణలు వింటూనే ఉన్నాం.

ఈ శ్లోకంపైన వ్యాఖ్యానిస్తూ రాజాజీ రాసిన వాక్యాలను గుర్తు చేస్తాను.

“If the impulsion of the senses is controlled, tranquility will come into being without and further effort. Then will ensure a joy that will endure. To attain it, first the eyes must be held under check. Such restraint of the senses is prescribed not for known as a Mahatma or a Sage. It is essential for one’s ordinary welfare and mental peace”.

ఈ శ్లోకంలోని అర్ధ భావాల్ని సరిగ్గా అవగాహన చేసుకుంటే స్త్రీలపట్ల గౌరవభావం పెరిగి సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అక్రమాలు, అఘాయి త్యాలు తప్పకుండా ఆగిపోతాయి.

By editor

Twitter
Instagram