‘భారత స్వాతంత్య్ర సంగ్రామం 1857’ ఇదొక చరిత్ర గ్రంథం. ఈ గ్రంథానికీ ఒక చరిత్ర ఉండడమే విశేషం. మహా విప్లవకారుడు, దేశభక్తి ప్రపూర్ణుడు స్వాతంత్య్ర వీర సావార్కర్‌ 1908‌లో మరాఠీ భాషలో ఈ అద్భుత గ్రంథాన్ని రచించారు. అస్వతంత్ర భారతావని, మాతృభూమి బానిస శృంఖలాలను ఛేదించే లక్ష్యంతో సావార్కర్‌ ‌రచించిన ఈ గ్రంథం స్వరాజ్య కాంక్షను రగిలించి, సుమారు నాలుగు దశాబ్దాలు భారత స్వాతంత్య్ర సమరోత్తేజాన్ని సృష్టించింది. భారతజాతిని మరొకసారి స్వాతంత్య్ర సమరం వైపు ఉవ్వెత్తున విజృంభింప చేయటమే ఈ గ్రంథ లక్ష్యమని వీర సావార్కర్‌ ‌పారిస్‌ ‌నుండి వెలువరించిన ‘తల్వార్‌’ ‌పత్రికలో, వివరించారు. ‘అభినవ భారత విప్లవ సమాజ’ అధికార పత్రిక తల్వార్‌. ‌భారత జాతీయ కాంగ్రెస్‌ ‌పంథాకు భిన్నంగా తీవ్ర జాతీయ వాదాన్ని ప్రేరేపించే విప్లవ పోరాటానికి ఈ పుస్తకం దోహదం చేసింది. నిజానికి నాంది పలికింది. ఆ రోజులలో సావార్కర్‌ ఈ ‌గ్రంథంలోని విషయాలను ఆంగ్లంలో లండన్‌లోని ఫ్రీ ఇండియా సొసైటీ సప్తాహిక సమావేశాలలో ప్రస్తావించినప్పుడే బ్రిటిష్‌ ‌గూఢచారులు పసికట్టారు. అంతే, రాతప్రతిలోని ఒకటి, రెండు అధ్యాయాలు అదృశ్యమై లండన్‌లోని స్క్లాండ్‌ ‌యార్డు కేంద్రానికి రహస్యంగా చేరాయి. మిగిలిన మరాఠీ రాతప్రతిని విప్లవకారులు బ్రిటిష్‌ ‌నిఘా డేగ కన్ను కప్పి, ఎలాగో భారతదేశం చేర్చారు.

 కానీ ప్రింటింగ్‌ ‌ప్రెస్‌ ‌ముద్రించే సాహసం చేయకపోవటంతో అభినవ భారత్‌ ఆ ‌బాధ్యత చేపట్టింది. ఆ ప్రింటింగ్‌ ‌ప్రెస్‌పై దాడులు ప్రారంభమయ్యాయి. చివరకు ఆ గ్రంథ రాతప్రతి తిరిగి పారిస్‌లో రచయిత వద్దకు అముద్రితంగా చేరింది. అచ్చు కాక ముందే బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నిషేధించింది. ఇక మరాఠీ ముద్రణ అసాధ్యం కావటంతో, జర్మనీలో అచ్చు వేయించే ప్రయత్నం కూడా మరాఠీ భాష తెలియని జర్మన్‌ ‌ప్రెస్‌లలో అసాధ్యమైంది. ప్రముఖ విప్లవకారుడు వీవీఎస్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఐసీఎస్‌ ‌చదువుతున్న మహారాష్ట్ర ప్రాంత యువకుల ద్వారా ఆంగ్లానువాదం తయారైంది. ఈ విషయం కూడా బ్రిటిష్‌ ‌గూఢచారులు పసిగట్టడంతో, ముద్రణ కోసం పుస్తక ప్రతి మళ్లీ పారిస్‌ ‌చేరింది. ఫ్రాన్స్‌లో కూడా సాధ్యం కాకపోవడంతో విప్లవకారులు హాలెండు చేరి, అక్కడ ముద్రించారు. అక్కడి నుంచి ఫ్రాన్స్, ఆపై ఆ నిషేధిత గ్రంథం భారతదేశం చేరింది. అత్యంత రహస్యంగా పెట్టెలలో పైకి కనపడని అరలలో దాచి, డాన్‌ ‌క్విక్జోట్‌, ‌స్కాట్‌వర్కస్ ‌వంటి శీర్షికల అట్టలతో ప్రత్యేకంగా బైండు చేయించిన వేలాది ప్రతులు భారత ప్రముఖులకు, గ్రంథాల యాలకు, కళాశాలలకు, విప్లవకారుల రహస్య స్థావరాలకు ప్రథమ ముద్రణ ప్రతులన్నీ ఉచితంగా అందాయి. తపాలా ఖర్చులు అభినవ భారత్‌ ‌భరించింది. తర్వాత ఫ్రాన్స్‌లో బహిరంగంగా ముద్రించగలిగారు.

 ఆనాటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఐర్లండ్‌, ‌ఫ్రాన్స్, ‌రష్యా, అమెరికా, ఈజిప్టు, జర్మనీ, ఇంగ్లండ్‌ ‌దేశాల చరిత్రకారులు, రాజకీయవేత్తలు, విప్లవ కారులు ఈ రచనను పరిశీలించారు. 1857 భారత స్వరాజ్య సంగ్రామంలో బ్రిటిష్‌ ‌నిరంకుశత్వం, జాత్యహంకార కుటిల రణతంత్ర వైఖరులు, సాహసిక విప్లవ సమరంతో రాజ్యాధిపతులను ప్రతిఘటించి, మరుగున పడిన చరిత్ర పప్రథమంగా వెలుగు చూడటం సహజంగానే బ్రిటన్‌కు కన్నెర్ర అయింది.

1910 నుండి, బ్రిటిష్‌ ‌ప్రభుత్వం అభినవ భారత్‌ను అణచివేయటానికి ఎందరినో నిర్బంధిం యింది. కొందరిని కాల్చి చంపారు. ఉరిశిక్షలు, ద్వీపాంతరవాస కఠినశిక్షలు అమలు చేసి హింసకు ఆస్కారం కల్పించారు. సావార్కర్‌ను నిర్బంధించారు. ఆయన అజ్ఞాతంగా పోరాటం కొనసాగించడానికి, నౌక నుంచి సముద్రంలోకి సాహసికంగా దూకి తప్పించుకొన్నా, మళ్లీ బంధించి తెచ్చి అండమాన్‌ ‌ద్వీపాంతరవాస క్రూర శిక్ష విధించారు. అభినవ భారత్‌ ‌తరపున పార్శీ సమర యోధురాలు మేడం కామా, గదర్‌ ‌విప్లవనేత లాలా హరదయాల్‌, ‌చటోపాధ్యాయ ద్వితీయ ముద్రణ అందించారు. అమెరికాలో గదర్‌ ‌పత్రిక ద్వారా ఉర్దూ, హిందీ, పంజాబీ భాషలలో ప్రపంచ వ్యాప్తం అయింది.

భారత సాయుధ సమర చరిత్రలో, వీరసావార్కర్‌ ‌రచన 1857 స్వరాజ్య సంగ్రామం ఎంత ప్రభావితం చేసినదీ వివరించే ఒక సంఘటనను ‘భగత్‌సింగ్‌ ఏన్‌ ఇగ్నైటెడ్‌ ‌హిస్టరీ’ పుస్తకంలో భగత్‌సింగ్‌ ‌సమకాలికుడు, రచయిత హన్సరాజ్‌ ‌రహ్‌బర్‌ ‌వివరించారు. 1926లో భగత్‌సింగ్‌కు 19 సంవత్సరాల వయసులో బ్రిటిష్‌ ‌ప్రభుత్వ నిషేధ గ్రంథం ‘ఇండియన్‌ ‌వార్‌ ఆఫ్‌ ఇం‌డిపెండెన్స్ 1857’ ఒక ప్రతి తిరిగి వెంటనే చదివి ఇచ్చే షరతుపై ఒక మిత్రుడు ఇచ్చాడు. లాహోరులోని ద్వారాకాదాస్‌ ‌గ్రంథాలయ అధికారి రాజారామ్‌శాస్త్రి గ్రంథం కోసం, భగత్‌ను బతిమాలుకోగా 36 గంటలలో తిరిగి తనకు ఇచ్చే వాగ్దానంపై భగత్‌ ఆయనకు ఇచ్చారు. తర్వాత రాత్రింబవళ్లు రహస్యంగా శ్రమించి వారిద్దరు ఆ గ్రంథాన్ని రెండు సంపుటాలుగా ఎనిమిది అణాల ధరతో ప్రచురించారు. మొదటి ప్రతి రాజర్షి, భారతరత్న పురుషోత్తమ్‌ ‌దాస్‌ •ం‌డన్‌ ‌స్వీకరించారు. షహీద్‌ ‌భగత్‌సింగ్‌, ‌సుఖదేవ్‌లు సావార్కర్‌ ‌రచనను ఎంతగా ఆరాధించారో, విప్లవ ప్రచారానికి వినియో గించారో ఈ కథనం స్పష్టం చేస్తోంది.

ఈ మహాగ్రంథ ఆంగ్లానువాదం విశ్వవిఖ్యాతి చెందినా, మూల మరాఠీ ప్రతి కాలగర్భంలో కలిసి పోయింది. సావార్కర్‌ ‌బ్రిటిష్‌ ‌నిర్బంధంలో ఉండగా, పారిస్‌లో ఉన్న మేడం కామా, దానిని బ్యాంక్‌ ఆఫ్‌ ‌ఫ్రాన్స్‌లో పోలీసుల కంట పడకుండా భద్రపరిచింది. ఆమె మరణానంతరం మూల ప్రతి ఏమైందీ తెలియ లేదు. ఆంగ్లానువాదం రహస్యంగా ముద్రణకు నోచుకుంటూనే ఉంది. వెలుగులోకి వచ్చిన మూడవ ప్రచురణ భగత్‌సింగ్‌, అయిదవ ప్రచురణ జపాన్‌ ‌సమరయోధుడు రాస్‌బిహారీ బోస్‌ ‌చేయించారు. నేతాజీ అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌వీర సైనికులకు ఆరాధ్య గ్రంథం అదే. 1946లో నిషేధాన్ని ధిక్కరించి రహస్యంగా ప్రచురితమైంది. బొంబాయి కాంగ్రెస్‌ ‌మంత్రివర్గం, ప్రజాందోళనకు తల ఒగ్గి, సావార్కర్‌ ‌సాహిత్యంపై నిషేధం తొలగించింది. తెలుగులో 1964లో (‘విజయ’ అనువాదం) జాగృతి ప్రచురణ సంస్థ, వినాయక దామోదర సావార్కర్‌ అనుమతితో ఈ మహాగ్రంథాన్ని ప్రచురించింది. ‘ఇండియన్‌ ‌వార్‌ ఆఫ్‌ ఇం‌డిపెండెన్స్ 1857’ ‌వీర సావార్కర్‌ అఖండ భారతావనికి ప్రసాదించిన సమరోజ్వల విప్లవ కేతనం.

– జయసూర్య, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram