వందలాది అనాథ బాలల

మాతృదేవత సింధుతాయి

ఎవరైనా కోరేదేమిటి? సాదర స్పర్శ, మనఃపూర్వక పరామర్శ. ఈ రెండూ ఒక్కరిలోనే నిండి ఉంటే – ఆ పేరు సింధుతాయి! పేరుకు తగినట్లు ఆమెది సముద్రం (సింధువు) అంత ప్రేమ. పిల్లలు ఎక్కడ కనిపించినా కొండంత వాత్సల్యాన్ని పంచే తల్లి (తాయి) మనసు. పాలబుగ్గల చిక్కదనాల బాబు అయినా, వాలుకనుల చక్కదనాల పాపను చూసినా మైమరిచే మాతృహృదయం. అనాథ పిల్లలనైనా కన్నబిడ్డల కన్నా మిన్నగా ప్రేమించే మానవతా సుమ పరిమళం. ఏడు పదులను మించిన జీవితకాలం. పదిహేను వందల మంది పసివాళ్లను లాలించిన జీవితానుభవం!! ఎటువంటి ప్రతిఫలాపేక్షాలేని ఆ చల్లనితల్లికి దేశవ్యాప్తంగా అందిన పురస్కారాల సంఖ్య మూడువందల పై చిలుకు. మహారాష్ట్రలోని వార్ధాలో ఉదయించి, ఈ మధ్యనే జనవరి తొలివారంలో పుణెవద్ద అస్తమించిన కాంతి శిఖరం. బాలలందరినీ కంటికి రెప్పలా చూసుకుంటూ, ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వారికి వచ్చినా తోడూ నీడై నిలిచిన దైవరూపం. ఎటుచూసినా, ఇంటాబయటా ఎంతగా వెతికినా కనిపించని అమృతత్వం ఆమెలో పుష్కలం.

ఆ పద్మశ్రీమంతురాలి బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలన్నీ చిన్నారులతోనే ముడిపడి ఉన్నాయి. జనని, లోకపావని, అవని ప్రేమ ధమని అన్నీ తానే. తన పేరులోని ప్రతి మధురాక్షరం – మమకార సాగరం. ఆదర్శానికి అర్థతాత్పర్యాలు తెలిపే సమగ్రకావ్యం. మరాఠీ మహిళైనా… భాషకీ అందని, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాని విశ్వమాతృశ్రీ.


దేశానికి స్వాతంత్య్రం లభించిన ఏడాది తర్వాత సింధుతాయి జననం. ఆ తేదీన బాలల దినోత్సవం కావడం కాకతాళీయమైనా, ఎంతైనా విశేషం. చిన్నప్పటి నుంచీ బాగా చదివించడంపైనే శ్రద్ధాసక్తి చూపారు తండ్రి. దుర్భర పేదరికం తాండవిస్తున్నా, చదివేందుకు ఒక్క పరిస్థితీ అను కూలించకున్నా, పూర్తిస్థాయి పట్టుదలే ఆ చిన్నారిని ముందుకు నడిపించింది. పలకా బలపం సైతం కరవైన దుస్థితిలో, ఎలా చదివిందో ఏమో కానీ… గట్టి పట్టు సాధించిందామె. కొన్నేళ్లకే పెళ్లయి మెట్టినింటికి వెళ్లింది. భర్త శ్రీహరి సప్కాల్‌ అనే హార్జాజీ. స్వభావరీత్యా సింధు చుట్టూ ఏం జరిగినా పట్టనట్లు ఉండే తీరు కాదు. అవసరమైతే ఎదురు నిలిచి ప్రశ్నించి, సమాధానం లభించేవరకు వెను తిరగని మనస్తత్వం. ఉదాహరణ కావాలా? తన ఊరు పింప్రిమెఘే పరిసరాల్లో గోమాతల పట్ల కొందరి వ్యవహార ధోరణి ఆమెకి అస్సలు నచ్చలేదు. భర్త ఊరైన నవర్గాన్‌లోనూ అదే రీతి కొనసాగడాన్ని భరించలేకపోయింది. సాధారణ గ్రామీణులందరికీ మేలు కలిగించాలని కంకణం కట్టుకుంది. ఎంతగా పోరాడిందంటే సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఆ పల్లెకి తరలివచ్చారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడికక్కడే తక్షణ ఆదేశాలిచ్చారు. ఆమె చొరవను ప్రత్యేకించి మెచ్చుకున్నారు. బొత్తిగా నచ్చని భర్త తెగబడి ప్రవర్తించాడు. తొమ్మిది నెలల నిండు గర్భిణి అని కూడా చూడకుండా, పశువుల పాకలోనికి నెట్టేశాడు. అక్కడే ఆ ఇల్లాలికి ఆడశిశువు పట్టింది. మెట్టినింటి వాళ్లు మరీ రెచ్చిపోయి వెంటాడటంతో, ఆ వనిత చిరునామా తిరిగి పుట్టింటికి మారింది. అక్కడా ముఖ్యంగా తల్లినుంచి నిరాదరణ, మరింత ధాటిగా చెప్పాలంటే.. కర్కశ తిరస్కరణ. పాపం ఆ పసికందు మాతృదేవత ఎంతగా తల్లడిల్లిందో? ఆ తల్లీబిడ్డ లిద్దరూ ఆకలిదప్పులతో అలమటించారు. ఎవరు దిక్కు ఆ ఇద్దరికీ!

‘నీకోసం నేనున్నా చిన్నా’

విధి విసిరిన కరవాలం సింధు ఆశలన్నిటినీ ఛిద్రం చేసేసింది. పసిగుడ్డతో సహా మకాం సమీప శ్మశానానికి మారింది! అప్పుడే అక్కడ శవం కాలుతూ కనిపించింది. దహనక్రియ అంతా ముగిసిపోయాక, ఆ బంధుమిత్రులంతా అక్కడినుంచి తిరికి వెళ్లి పోయాక, అప్పుడామె చేసిందేమిటో తెలుసా? కొంతసేపు గడిచాక, ఆ శ్మశానంలోని కొన్ని కట్టె ముక్కలను రాజేసి, చిన్నపాటి కుండలో నాలుగు గింజలు వండి, అదే రసంతో చంటిబిడ్డ ఆకలి తీర్చడం!! బతుకు బాటలో ఎన్నెన్ని అడ్డంకులు ఎదురైనా, ఏదో తెలియని కాస్తంత ఆశ ఆ తల్లిని ముందుకే నడిపించింది. దగ్గరున్న ఇళ్లు, గుళ్లు, ఇతరచోట్ల తనకొచ్చిన పాట పాడుతూ.. విన్న వాళ్లు ఇచ్చిన పదో పరకో తీసుకుంటూ, శిశువు ఆకలిదప్పుల్ని తీరుస్తుండేది. ప్రతిరోజూ ఒక యుగంగా గడుస్తున్నా, అనుక్షణం గండంగా మారు తున్నా, తనతో పాటు ఉండే యాచకులకు తన దగ్గర ఉన్నవాటినీ ఇచ్చి ఆదుకోవడం అలవాటు చేసుకుంది. అక్కడా ఇక్కడా వెళ్తూ జీవనయానం సాగించిన ఆ అమ్మనీ, కూతురునీ ఏ దైవం దీవించిందో తెలియదు. ఆ పాపకు మమత అని పేరు పెట్టుకుంది. ‘ఎవరికెవరు ఈ లోకంలో’ అని నిరాశలో కూరి పోకుండా; ‘నేను ఉన్నా చిన్నా నీ కోసం’ అంటూ పెంచి పోషించుకుంది ఆ మాతృమూర్తి. రోజులు ఎవరికోసమూ ఆగవు, కలతలూ కన్నీళ్లూ శాశ్వతంగా ఉండవు. కాయకష్టంతో బతుకీడ్చిన తనకు కాలం కలిసొచ్చింది. ఆమె ఆదరణ తోటి వారిపైన ప్రసరిం చింది. శ్రమ ఫలించి, వసతి సమకూరి, సాటివారి బిడ్డలకీ తల్లిలా మానవతను పంచిందామె. పరిమళిం చిన మమతానుబంధాల ముందు పరమ దారిద్య్రం ఓడిపోయింది. పేదరికం స్థానంలో ఆర్థిక స్థిమితత్వం చోటు చేసుకుంది. ఇక అనాథలెవరు, నిర్భాగ్యులెక్కడ ఉంటారు? ప్రేమాభిమానాలతో అందరికీ తలలో నాలుకలా మారిన సింధు అటు తర్వాత ‘తాయి’గా పిలిపించుకుంది. ఉన్నదాంట్లో, తనకు వచ్చిన వాటిలో ఎంతో కొంత పొరుగువాళ్లకి పంచినందుకు… లభించిన గౌరవమర్యాదలవి. కాల పరిణామ క్రమంలో అనాథల ఆశ్రమంగా రూపొందింది. కానీ అనాథ అని ఎవరిని పిలిచినా తాను సహించలేదు, భరించలేదు. సమాజంలో సనాథలే తప్ప అనాథ లుండరన్నది ఆమె భావం, అనుభవం కూడా.

ఇంటి దివ్వె, కంటి వెలుగు

కాలమాన పరిస్థితులన్నీ పూర్తిగా మారి పోయాయి. సింధుతాయి నిలిచి గెలిచారు. తల్లి పక్షిలా తన రెక్కలకింద పిల్లలెందరినో పెంచి పోషించారు. వారంతా జీవితాల్లో స్థిరపడేదాకా అండదండగా ఉన్నారు. ఆమె ఆశ్రమంలో రోజుల బిడ్డలనుంచి ఎదిగిన అబ్బాయిలు, అమ్మాయిలు దాకా ఎందరెందరో! వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటే, జీవితాలు నిలబడ్డాయంటే, ఆ చలవంతా పూర్తిగా ఆమెదే. తన మాట, పాట, చూపించే బాట అన్నీ వారికి ఇష్టమే. జీవితాన్ని వారికే అంకితం చేశారు సింధుతాయి. ఫలితంగా ఆ కుటుంబం అతి పెద్దదైంది. వందల సంఖ్యకు చేరుకుంది. ఆ కరుణామయి ఆలనా పాలనా చూరగొన్నవారంతా తనను దేవతలా చూస్తారు, ఎంతగానో ఆరాధిస్తారు. మొత్తం సమాజమే తన ముందుకొచ్చి పురస్కారాల వర్షం కురిపించింది. పిల్లలకు తినడానికి తిండి, ఉండేందుకు గూడు, కట్టుకునేందుకు దుస్తులు ఇవ్వడంతోనే సరిపెట్టుకోలేదు ఆ సేవామయి. వాళ్లందరికీ చదువు చెప్పించి, ఉపాధి కల్పించి అందరిలోనూ ఆశాజ్యోతులు వెలిగించి, ధన్యచరిత అయిందా అనురాగమూర్తి. పోరాట యాత్రలో ఆమెదే గెలుపు బావుటా. భర్తగా కుటుంబ బాధ్యత వహించక పోగా; బాధించి, వేధించి, హింసించి, రాచి రంపాన పెట్టిన వ్యక్తే వృద్ధాప్యదశలో ఆవిడ దరికే చేరి తానూ ఆశ్రయం పొందాడు. ఇప్పుడు మీరే చెప్పండి… ఆమెను మించిన జీవిత విజేత ఇంకెవరుంటారు? తాను మినహా సకల సౌభాగ్య శ్రీమంతురాలు మరెవరు? ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖులు ‘ఎవరీయన’ అని ప్రశ్నిస్తే; ‘నా పెద్ద బిడ్డ’ అంటూ బదులిచ్చేవారామె. కళ్లు చెమర్చకుండా, సింధుతాయి కాళ్లకు మోకరిల్లకుండా ఇంకా ఎవరుంటారీ లోకంలో! ‘విరిసిన వెన్నెలవా వేల వెలుగులు దివ్వెవో’ అంటూనే కీర్తి కిరీటం అలంకరిస్తారు కదా ఈ ప్రపంచంలో ఎవరైనా!!

సాటిలేని మేటి వనిత

అల్లదిగో తేజోమయి, అనుపమాన శోభామయి

సేవల దేవతగా నిలిచిన ఆ తల్లిపేరు సింధుతాయి

శ్రీకారం చుట్టుకున్న స్త్రీ జాతి కథానిక

ఆకారం దాల్చిన లోకైక పావన గీతిక

బతుకంతా బాష్పం, పారిజాత పుష్పం

శాశ్వత కీర్తి మయం దిగంతాల వెలుగుఘనం

దరిదాపు నాలుగున్నర దశాబ్ధాల సమాజసేవ, ఆ భాగ్య దీపికకు చేతులు జోడిస్తూ భారత ప్రభుత్వం నిరుడు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారం జాతి చరిత్రలో మైలురాళ్లు. అంతకుముందే ‘నారీ శక్తి పురస్కృతిని’ నాడు రాష్ట్రపతి రామనాథ్‌ ‌కోవింద్‌ ‌చేతులమీదగా అందుకున్నారు. శాంతి బహూకృతి, సామాజిక న్యాయసాధనకు పొందిన మదర్‌ ‌థెరిసా అవార్డు, మహిళా-బాలల సంక్షేమరంగంలో మహారాష్ట్ర ప్రభుత్వమిచ్చిన ప్రత్యేక గుర్తింపు. మరాఠీ పత్రిక బహూకరించిన ‘మేటి వనిత’ విశిష్టత.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పుణెలో మదర్‌ ‌గ్లోబల్‌ ‌ఫౌండేషన్‌, ‌మంజ్రీలో బాలనికేతన్‌, ‌సాస్వాదలో బాలల సదన్‌, అమరావతి ప్రాంతంలోని వసతి గృహం, వార్ధా వద్ద బాలభవన్‌, ‌షిరిడీ పరిసరాల్లోని సేవాలయం, సిర్పూర్‌ ‌తదితరాలన్నీ సింధుతాయి స్థాపించిన కేంద్రాలే. ఆ సేవానిరతికి ముగ్ధులైన చలనచిత్ర ప్రముఖులు అనంత్‌ ‌మహదేవన్‌ ‌పుష్కరం క్రితమే బయోపిక్‌ ‌నిర్మించారు. దాన్ని లండన్‌ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌కు ఎంపిక చేయడం ద్వారా జగద్విఖ్యాతి కలిగించారు నిర్వాహకులు.

ఆమె మృతికి సంతాప సందేశంలో ప్రధాని నరేంద్రమోదీ శ్లాఘించినట్లు మాతృత్వానికి శాశ్వత చిరునామా. ఆమె ఒక వ్యక్తి కాదు, సేవాశక్తి. బాలల మనోమందిరాల్లో కొలువై ఉన్న ఇలవేలుపు.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram