జనవరి 22 – త్యాగరాజ ఆరాధనోత్సవాలు

కళలు.. ముఖ్యంగా సంగీతం కేవలం ధనార్జనకో, ప్రతిభా ప్రదర్శనకో కాదని, మానసిక ఆనందానికి, కైవల్య ప్రాప్తికి సోపానమని భావించి ఆచరించి చూపిన మహా వాగ్గేయకారుడు. కళలు భగవత్‌ ‌ప్రసాదితాలని, వాటిని జీవనానికి కొంతవరకు ఉపకరించు కున్నా మానవులకు సంక్రమించిన విద్య, విజ్ఞానాలను తిరిగి భగవదర్పణ చేసి తరించవచ్చునని రుజువు చేసిన కైవల్య పథగామి. తమిళదేశంలోని తిరువారూరులో జన్మించి తిరవయ్యూ రులో జీవితాన్ని గడిపిన తెలుగు వ్యక్తి నాదబ్రహ్మ, సంగీత కళానిధి కాకర్ల త్యాగరాజు. ఆయన మహాసమాధి పొందిన పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

విజయనగర సామ్రాజ్య పతానంతరం ఆంధ్ర దేశంలో శాంతిభద్రతలతోపాటు తమ సాహితీ సంస్కృతులకు ఆదరణ కరవవ్వడంతో దక్షిణ దేశానికి వలస వెళ్లిన కుటుంబాలలో త్యాగరాజు పూర్వీకులదీ ఒకటి. సంస్క్బతాంధ్ర భాషలలో పండితుడైన తండ్రి రామబ్రహ్మం ద్వారా పురాణేతిహాసాలు, రామ నామోపదేశాన్ని, తల్లి సీతమ్మ ద్వారా జయదేవుని అష్టపదులు, పురందరదాసు, రామదాసు వంటి మహనీయుల కీర్తనలను నేర్చుకున్నారు త్యాగరాజు. ఏకసంథాగ్రహియైన ఆయన తంజావూరు మహారాజా వారి ఆస్థాన విద్వాంసులు శొంఠి వేంకటరమణయ్య శిష్యత్వంలో గొప్ప సంగీత జ్ఞానాన్ని ఆర్జించారు.

‘కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేత రక్షతయే/సద్య: పర నిర్వృతయే కాంతా సమ్మితయోప దేసయుజే’ (యశస్సు, ధన సంపాదనకు, వ్యవహార జ్ఞానానికి, అమంగళ పరిహరణకు, రసానందం, లాలించి- బుజ్జగింపుతో చేసే హితోపదేశం కోసం కావ్యరచన) అని ఆలంకరికుడు ముమ్మటుడు కావ్య ప్రయోజనాలను నిర్వచించారు. త్యాగయ్య జీవితం వాటిలో ఒకదానితో (అర్థం) తప్ప అన్ని అంశాలకు అన్వయిస్తుంది. ప్రాచీన కవులు అనేకులు తమ రచనల ద్వారా సన్మానాలు, అగ్రహారాలు పొందారని, రాజపోషణలో అపార ధనాన్ని సముపార్జించారన్నది చారిత్రక సత్యం. పోతనామాత్యుడు, త్యాగరాజస్వామి లాంటి వారు ఏ కొందరో అందుకు మినహాయింపు. ఈ విషయంలో త్యాగయ్యకు పోతన కవి స్ఫూర్తి ప్రదాతగా చెబుతారు. తండ్రి రామబ్రహ్మం చిన్నతనంలోనే పోతన గురించి, ఆయన విరచిత• శ్రీమద్భాగవతం గురించి వివరించడం కూడా త్యాగయ్యపై ఆ కవి ప్రభావం పడింది.

సామాజిక ప్రయోజనాలను

తమ కీర్తనలలో ఆధ్యాత్మికతోపాటు సామాజిక ప్రయోజనాలను ఆవిష్కరించారు త్యాగరాజు.

ఆ కీర్తనలు మనిషిని కర్తవ్య నిష్ఠవైపు మళ్లించే చైతన్యదీపాలు. సంగీత సాహిత్యాలను సమాజ హితానికి ఉపయోగించారు. శ్రీరామ చంద్రమూర్తి పురుషోత్తముడని పురాణ ప్రవచనం కాగా, సమాజ హితైషి త్యాగయ్య మరోసారి ఆయనను తమ రచనలలో ఉపమానంగా చేసుకున్నారు. శ్రీరాముడిని ‘పరనారీ సోదరా!’ అని ఒక కీర్తనలో స్తుతించారు. భార్యకు తప్ప మహిళాలోకానికి రాముడు సోదరతుల్యుడనడం గొప్ప కవి సమయం. త్యాగయ్య ప్రవచించిన రాముడిలోని ఈ ఒక్క లక్షణమైనా వర్తమాన సమాజంలోని విపరీత పోకడలకు అడ్డుకట్ట వేయగలిగితే అదే శ్రీరామరక్ష.

ఉత్తమ జీవితంతోనే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని విశ్వసించిన ఆయన ధనవ్యామోహం వదలాలంటారు. జీవికకు డబ్బు అవసరమే కానీ ‘డబ్బే’ ప్రధానం కాదంటూ ‘నిధి చాలా సుఖమా! రాముని సన్నిధి చాలా సుఖమా? నిజముగ తెలుపు మనసా’ అని ప్రశ్నించుకొని, రాజాస్థానాన్ని, రాజాశ్రయాన్ని తిరస్కరించారు. రామ భక్తి సామ్రాజ్యమే మానవుల కబ్బెనో,

ఆ మానవుల సందర్శన మత్యంత బ్రహ్మానందమే’ అని పరవశించారు. ‘ఊరకయే గల్గునా రాముని భక్తి సారెకును సంసారమున జొచ్చి / సారమని యెంచువారి మనసున’ అంటూ సంసార తాపత్రయం కలవారికి రామభక్తి సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిర్మలం, స్వచ్ఛమైన భక్తి, వినయం లాంటి గుణాలతో భగవంతుడిని కీర్తించి తరించవచ్చునని హితవు పలికారు.

తన ఆస్థానంలో విద్వాంస పదవిని, తాను సమర్పించిన అమూల్యమైన వస్త్రాభరణాలను తిరస్కరించిన త్యాగయ్యపై తంజావూరు ప్రభువు శరభోజీ ఆగ్రహించారు. అయినా బెదరక, అలాంటి కష్టనష్టాల భారాన్ని రాముడిపై వేసి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డారు త్యాగయ్య. సంగీతం నరులను స్తుతించేందుకా? దైవాన్ని అర్చించేందుకా? అని ప్రశ్నించారు. భగవద్భక్తి ముందు రాజ్య వైభవాలు తృణప్రాయమని నిరసించారు. ‘దేవుని నమ్మిన వాడు ఎన్నటికి చెడిపోడు’ అని సూక్తిని, హితోక్తిని త్రికరణశుద్ధిగా ఆచరించారు. దండించబోయిన మహరాజు భగవత్‌ ‌దండనపాలై పశ్చాత్తాపంతో త్యాగరాజ సన్నిధికి చేరి ఆయన నాదామృతాన్ని ఆస్వాదించి, ‘నిధి చాలా సుఖమా…?’ అని నాదబ్రహ్మతో గొంతుకలిపారు.

తెలుగు వెలుగు

సంగీత సాహిత్య రచనా సర్వస్వాన్ని తల్లి భాష తెలుగులోనే రచించి ఆ భాష సారస్వత రంగం వెలుగులీనడానికి కృషి చేసిన త్యాగరాజును తెలుగు తొలి భాషోద్యమకర్తగా సాహితీవేత్తలు అభివర్ణిస్తారు. తిరువారూరు దేవుడు త్యాగరాజస్వామి(శివుడు) వరపుత్రుడిగా జన్మించిన త్యాగయ్య రచనలన్నీ మాతృభాషలోనే చేయడాన్ని బట్టి తెలుగుభాషా పరిరక్షణకు తన వంతుగా చేసిన కృషి తేటతెల్లమవుతుంది. స్థానిక భాష తమిళం, పండిత భాష సంస్కృతం, ఉనికిలో ఉన్న ఉర్దూ, పార్శీ భాషల ప్రభావం లేకుండా వేలాది కీర్తనలను తెలుగులోనే రాయడం ఆయన మాతృభాషాభిమానానికి నిదర్శనంగా చెబుతారు. అయిన్పటికీ దేశీయ భాషీయులకు ఆయన కీర్తనలు ఆరాధ్యమయ్యాయి. భక్తి ముందు భాషా పట్టింపు చోటు చేసుకోలేదు. ఆయన వద్ద శిష్యరికం చేసిన శతాధికులలో తెలుగువారు వేళ్లమీద లెక్కించదగినవారుండగా ఇతరులంతా తమిళులేనట. సంగీత సాహిత్యాలకు అవినాభావ సంబంధం ఉందని, సాహిత్యం అర్థం కాకపోతే సంగీతం రాణించదని, కనుక కీర్తనలు, కృతుల(రచనల) గల భాషపట్ల అవగాహన కలిగి ఉంటేనే కళ రాణిస్తుందన్నది త్యాగయ్య దృఢ విశ్వాసం. అందుకే, సంగీత శిక్షణకు శిష్యరికం కోరి వచ్చిన వారందరికీ మొదట భాష నేర్పించేవారట. అలా వాగ్గేయకారుడిగానే కాకుండా అంతమందికి తెలుగు నేర్పించిన భాషోపాధ్యాయుడిగానూ వినుతికెక్కారు.

త్యాగయ్య ఆలపించిన కీర్తనలు అక్షరరూపం దాల్చడానికి ఆయన శిష్య సమూహ సహకారమూ అమూల్యం. ఆయన ఆశువుగా, ఆర్ద్రంగా గానం చేస్తుండగా, శిష్యులు వాటికి అక్షర రూపమిచ్చేవారట. కొందరు పల్లవిని, మరికొందరు అనుపల్లవిని, మరికొందరు చరణాలను నమోదు చేసేవారట. ‘దేహమే దేవాలయం’గా భావించిన త్యాగయ్యకు తీర్థయాత్రల పట్ల ఆసక్త లేకపోయినా శిష్యుల, అభిమానుల అభ్యర్థన, ఆహ్వానాలను మన్నించి యాత్రలు చేశారు. అలా కలియుగవైకుంఠంగా ప్రసిద్ధమైన శ్రీరంగం, తిరుపతి, కంచి, నాగ పట్టణం, ఘటికాచలం తదితర క్షేత్ర సందర్శనం చేసి, ఆయా దేవుళ్లపై కీర్తనలు రాశారు.

శిష్యాధిచ్చేత్‌

‘‌శిష్యాధిచ్ఛేత్‌ ‌పరాజయం…’ ఆర్యోక్తిని నిజం చేసిన మహనీయులలో త్యాగరాజస్వామి ఒకరు. వసిష్ఠునికి శ్రీరాముడు, సాందీపుడికి• శ్రీకృష్ణుడిలా శొంఠి వేంకటరమణయ్యకు త్యాగరాజు అభిమాన, అసమాన ప్రతిభ గల శిష్యుడు. పురాణపురుషులు, కారణజన్ములకు గురువులు కాగలడం అదృష్టమే అయినప్పటికీ అంతటి జ్ఞాన, విద్వణ్ముర్తులకు నమస్కరించలేని దురదృష్టవంతులమని భావించేవారట నాటి మహనీయులు. గురువును మించిన శిష్యుడికి తన చేతి కంకణాన్ని తొడిగి ఆశీర్వదించారు శొంఠి వారు. త్యాగయ్య పాండిత్య గరిమకు ముగ్ధులైన కాంచీపురం వాసి రామకృష్ణ యతీంద్రులు ‘తొంభయ్‌ ఆరు కోట్ల సార్లు రామనామ జపం చేయాలని, తద్వారా విశ్వవిఖ్యాత వాగ్గేయుడవు కాగలవు’ అనీ ఉపదేశం, ఆశీస్సులు అందచేసి సంగీత యాత్రకు దిశానిర్దేశం చేశారు. గురుతుల్యుల హితవు మేరకు త్యాగయ్య ఇరవై నాలుగేళ్లలో లక్ష్యసాధనతో ఆనంద సాగరంలో మునిగిపోయి… ‘ఆనందసాగర మీదని శేషము భూమి భారము…’ అని ప్రబోధించారు.

నేటికీ పెద్ద సంఖ్యలో ఉన్న నాదబ్రహ్మ అనుయాయులు, ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అనే పలుకులు ఆయన భక్తి, జ్ఞాన, ముక్తి, వైరాగ్య, ప్రతిభలకు తార్కాణం.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram