– డా।। చింతకింది శ్రీనివాసరావు

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘చెప్పేదేముంది. వడ్డాది పసుపు పేరిట మన పసుపుకొమ్ముల్నే మళ్లీ పైకి తీసుకువచ్చి పెద్ద ధరలకి అమ్ముకుపోతున్నారు పల్లంవారు. మనవాళ్లకి అవేం తెలియవు. అసలు వదిలేసి కొసరు కొనుక్కుపోతు న్నారు. నావంటి వాళ్లందరూ ఖాళీగా కూర్చుంటు న్నారు.’’ చకచకా చెప్పవలసింది చెప్పేసినప్పటికీ అలా చెబుతున్నప్పుడు ఆ అమ్మాయి గొంతును పట్టుకున్న వేదనల జీరలను పసిగట్టకపోలేదు దేవేంద్రాలు. డస్సిపోయినట్టుగా అయిపోయింది.

‘‘మన వేళ్లతోనే వడ్డాది వాళ్లు మన కళ్లు పొడుస్తున్నారన్నమాట.’’ ఆవేదన వెలిగక్కగా పైకే అనేసింది.

‘‘దీనికే ఇంతలా ఇదయిపోతున్నావు. సిసలు విషయం తెలిస్తే నివ్వెరపోతావేమో!’’ కొండపసుపు బొట్టె నిర్లిప్తంగా పలికింది. ‘‘ఏమిటా సిసలు?’’ వేగిరపడుతూ చెప్పమంది దేవమ్మ.

‘‘మరేంలేదు. ఆ వడ్డాది పసుపును కూడా వస్తుమార్పిడిగా అమ్మడంలేదు. నాణాలకే విక్ర యిస్తున్నారు.’’ పసుపుబొట్టె పలుకు దేవమ్మను కుళ్లబొడిచినట్టయింది. నెమలిజాణా ఆ సంగతి విని నిశ్చేష్టురాలయింది. ‘‘నాణాలెక్కడివి? మన దేశంలో ఆ పద్ధతి లేదు కదా!’’ అడగడం తనవంతన్నట్టుగా నెమలి ప్రశ్నించింది.

‘‘ఆ పద్ధతి మనది కాదని నాకూ తెలుసును. అది దిగువ వ్యాపారులు ఈ మధ్యనే ప్రవేశపెట్టిన పద్ధతి అని మీకు తెలిస్తే చాలును. ఆ పైసలనే మనవాళ్లూ ఇప్పుడు ఇష్టపడుతున్నారు. వస్తుమార్పిడి మోతభారాలు భుజానికి చేర్చుకోనక్కరలేదని, ఎంచక్కా జేబుల్లో కాసులు వేసుకుని సంతలకు రావచ్చునని మురిసిపోతున్నారు.’’ శెనగలు తిని చెయ్యి కడు క్కున్నట్టుగా చెప్పవలసింది చెప్పేసింది గిరికుమారి. భోజనం వేళయిందన్నట్టుగా పక్కనున్న అంబలి దిప్ప అందుకుంది. జుర్రుడు మొదలెట్టింది.

బుర్ర తిరిగినట్టయ్యారు నెమలి, దేవమ్మ. ఎడద మొత్తం దుఃఖభాజనం అయినట్టుగానూ అయ్యారు. కంటిచూపు లేదు. నోట మాటలేదు. తిండీ తిప్పలూ మరచిపోయారు. దేవమ్మ పరిస్థితి మరీ చింతల చితిగా మారింది. సంత దాటుకుంటూ పెద్ద పెద్ద అంగలతో బయటపడింది. సంతబయలుకు కాసింత దూరాన చెట్లకు కట్టిన గుర్రం వద్దకు దూకుడుగా పోయింది. దాని తాళ్లు వదిలించింది. దాని మీదికి చేరిపోయింది. చేత్తో అశ్వం మెడను తాకింది. అనుమతి వచ్చినట్టుగా తలపోసిన అశ్వం నడవటం మొదలెట్టింది. వెనుకగా మరో గుర్రాన్ని అధి రోహించిన నెమలీ అదే మోస్తరున కదిలింది. ఇరువురూ కొండదారుల్లో మారుమాట్లాడకుండా ప్రయాణం చేసి కోటకు చేరుకున్నారు.

* * * *

నందరాజ్యపు ఈశాన్యం దిక్కున పెద్దగద్దెగా పేరు గడించింది విక్రమార్కసింహాసనం. కోటకు సరిగ్గా కూతవేటు దూరాన ఉంటుంది ఈ కంఠీరవ పీఠం. అది ఎన్నో తరాల కిందటిది. నందపురాన్ని ఎప్పుడో ఏలిన గంగరాజుకు మున్నెప్పుడో దాని నిర్మాణం జరిగింది. వివరంగా చెప్పుకోవాలంటే ఉజ్జయిని మహాప్రభువు విక్రమాదిత్య మహా చక్రవర్తి కుమార్తె యువరాణీ ప్రభావతీదేవి నందపుర ప్రభువు వీరవిక్రమదేవుని ఇల్లాలిగా వచ్చినప్పటిదని స్థలజ్ఞులు చెబుతుంటారు. భార్య పుట్టింటి గౌరవం నిలపడానికి విక్రమదేవుడు చేసిన ప్రయత్నంగా దీన్ని అభివర్ణిస్తుం టారు. ఉజ్జయినిలో తన తండ్రి సింహాసనాన్ని నిరతం గుర్తుతెచ్చుకోదలిచానని, అలాంటి గద్దియను నందంలోనే నిలిపి చూపించమని ప్రభావతీదేవీ పట్టమహిషిగా భర్తను ఒకానొక పున్నమి రోజు కోరిందట. ఆ ప్రకారం ఉజ్జయిని గద్దె పీఠిని తలపించే ఎత్తయిన ఘన ఆసనాన్ని కళాత్మకంగా నెలకొల్పాడట విక్రమదేవుడు.

గద్దె అన్నందుకు అది అంతటి రాజసంతోనే తులతూగుతుంటుంది. దాన్ని చూడాలంటే శిరసు పైకెత్తి చూడవలసి ఉంటుంది. మోరఎత్తి పరికించ వలసి ఉంటుంది. దానికి ముప్ఫయి రెండు సోపానా లుంటాయి. వాటిని దాటి వెళ్లాక విశాలమైన నాలుగు సింహాలు మోసే ఆసనంగా అది వెల్లి విరుస్తుంటుంది.

నందంలో ఈ సింహాసనం రూపుకట్టింది మొదలు ఎక్కడ లేని పేరు ప్రతిష్టలూ వచ్చాయి. తొలినాళ్లలో ఉజ్జయిని నుంచి కూడా దీన్ని చూడటానికి లెక్కకు మిక్కిలిగా నందపురానికి జనం వస్తుండేవారట. వీరి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం వల్ల ప్రతి మాసంలోనూ పౌర్ణమి దినాను దీని దర్శనం కోసం ప్రత్యేకంగా కేటాయించేవారట. నందరాజ్యంలో పెద్ద పట్టణమని చెప్పదగ్గది జయపురం. రాజధానిగా ఉండవలసింది కూడా జయపురమే. కానీ ఈ సింహపీఠం కారణంగానే నందపురానికి విలువ చేకూరి పాలనాకేంద్రమైంది.

మహారాజు భైరవుడి కాలానికి ఈ గద్దెపీట చూసేందుకు వచ్చే జనం పలుచబడుతూ వచ్చారు. కాలమహిమ అంటే ఇదేనని పెద్దలు ఇందుకు భాష్యం చెబుతుంటారు. ఇప్పుడు వెంకటేశునికాలంలో ఆ ఆసనం రాచపరివారం చేసే అర్చనకే పరిమితమై పోయింది.

ఆ రోజు నిండుపున్నమి కావడం మూలాన తొలి ప్రభాతవేళలోనే కోట దాటి గద్దియ చేరింది మాకలి శక్తి. ఆమె వెంట పరివారం ఉంది. మందీ మార్బలమూ ఉంది. గిరిపూజారులూ ఉన్నారు. సుగంధద్రవ్యాలు, రకరకాల పండ్లు, పూలు అప్పటికే అక్కడికి చేరి ఉన్నాయి.

గత పౌర్ణమినాడు ఈ పూజల వేళ మాకలమ్మ మనసులో నాటుకున్న భక్తిభావనలే ఇప్పుడూ ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. నేటిపూజ కలిగిన వాళ్లు చేస్తున్న బీదపూజగా ఆమె తీరును చూసే ఎవరికయినా ఇట్టే బోధపడిపోతుంది. ఏదో తప్పదన్నట్టుగా సింహాసనపు తొలిమెట్టుకు పసుపుకుంకాలు అద్దింది. ఒకానొక తంతుగా పూజ కానిస్తోంది. గడిచిన నెలరోజులుగా ఆమె మానసం నదరుగా లేదు. కొండరాజ్యానికి వచ్చిపడుతున్న కొత్తచిక్కులు కలచివేస్తున్నాయి.

అత్తమ్మ మాకలి మాదిరిగానే ఉంది కోడలు పిల్ల దేవమ్మ. నిన్నటివేళ సంతలో ఎదురైన ఎన్నో ఘటనలు కూర్చున్నచోట కూర్చోనివ్వడం లేదు. నిలుచున్నచోట నిలవనివ్వడం లేదు. అందుకే సింహాసనానికి జరిపించవలసిన పూర్ణ జాబిల్లి పూజ పట్ల పెద్దగా సముఖంగా లేదు. నిజం చెప్పాలంటే ఆనాటి అర్చనలో పాల్గొనాలన్న కోరికే ఆమెకు లేదు. గతంలో తల్లితో పాటు ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే ప్రభువు వెంకటేశుడూ పెళ్లయ్యాక పూజకి బాగా వెనకదీస్తున్నాడు. భార్యకు ఈ విధిని అప్పగించేసి తప్పించేసుకున్నాడు. ఫలితంగానే ప్రతీ పున్నమికీ మాకలితో పాటు విక్రమార్కసింహాసనాన్ని దర్శించ వలసిన కర్తవ్యం దేవేంద్రాలి మీద పడింది. అంచేతనే మనసు కాదంటున్నా తప్పదన్నట్టుగా బయలుదేరింది. దాసికాజనం వెంటరాగా తక్కుతూ తారుతూ పయన మైంది. గద్దెవద్దకు వెళ్లేసరికి పూజ ముగింపునకు వచ్చేసింది. అర్చన నిర్వహిస్తూనే ఆలస్యంగా వచ్చిన కోడల్ని కళ్లతో పలకరించింది మాకలి. ప్రతి  పలకరింపుగా చేతులు జోడించి నమస్కరించింది దేవమ్మ. కోడలి ఆగమనంతో మరింత తొందరగా పూజాదికాలను పూర్తిచేసింది అత్తమ్మ. పురోహితులకు పాదాభివందనాలు చేసింది. తాంబూలాలిచ్చింది. వారినుంచి ప్రసాదాలు అందుకుంది.

అత్తాకోడళ్లిద్దరికీ నివేదనలు పంచిపెట్టాక లెంకలు వెనుదిరిగిపోయారు. ఇదే సమయంలో వెంట వచ్చిన మందీమార్బలాన్నీ చాలా వెనక్కి వెళ్లవలసిందిగా మాకలమ్మ ఆదేశాలిచ్చింది. ఆ ప్రకారమే పరిజన మంతా దూరంగా జరిగిపోయారు. అత్తగారు ఎప్పుడ యితే అలా చేశారో తను కూడా తన స్కంధావారానికి ఆజ్ఞలు జారీ చేసింది దేవమ్మ. వారూ దూరంగా తొలగిపోయారు. గద్దె దగ్గర మాకలమ్మ, దేవమ్మలే మిగిలారు. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకున్నారు. ఒకరి మొహాన్ని మరొకరు పట్టిపట్టి చూసుకున్నారు. ఈలోగా కొన్ని క్షణాలు కరిగిపోయాయి. ఇద్దరి వదనాల్లోనూ ప్రసన్నత మాత్రం లేదు. ఆ సంగతి ఇరువురికీ తెలుసు. మీదుమిక్కిలిగా మాకలి నేత్రాలను కమ్మిన నీటితెర దేవమ్మ చూడగలిగింది. దేవమ్మ సజలనేత్రయుగ్మాన్ని మాకలి దర్శించగలిగింది. ఇద్దరూ ఒకేలాంటి భావాలతో, బాధలతో ఉన్నారని ఇరువురికీ అర్థమైపోయింది.

‘‘నిన్న సంతకు వెళ్లివచ్చావట.’’ అంతమాత్రమే అన్నదిగానీ అంతకు మించి వివరాలేవీ అడగదలుచు కోలేదు మాకలి.

అత్తమ్మ తగుమాత్రంగానే మాటలు పలకడం వెనుక కారణం దేవమ్మకి తెలియంది కాదు. ఇద్దరికిద్దరూ ఎంతతక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిదన్నట్టుగా ఉన్నారు. భాషణ ప్రారంభిం చిన మాకలి మరోసారి కంఠాన్ని సవరించుకుని,

‘‘రెండు రాజ్యాలూ శత్రువుల దాడిలేని సుందర రాజ్యాలుగా విలసిల్లుతాయని తలపోశాను.’’ అర్థాంతరంగా ముగించింది. అంతా అర్థమైనట్టుగానే దేవమ్మ ఇందుకు బదులిస్తూ,

‘‘శత్రుదాడి భయం మన రాజ్యానికి లేకుండా పోయిందిలే అత్తమ్మా. కొత్తగా సంస్కృతి మీదనే దాడి మొదలైంది. ఇది వైరివర్గాలవారు చేస్తున్నది కాదు.’’ తాను కూడా మాట్లాడవలసినదానికంటే తక్కువే మాట్లాడింది. ‘‘వస్తుమార్పిడి మాసిపోతోందట.’’ మాకలి హఠాత్తుగా ప్రశ్నించింది.

‘‘నాణాలొస్తున్నాయి. తొందరలోనే మన ఆర్థికస్థితి ప్రమాదంలో పడక తప్పుదు. మన కట్టూబొట్టూ సైతం మారిపోతున్నాయి.’’ దేవమ్మ ఘూర్ణిల్లింది.

‘‘పంచపాండవుల పంట.. దుర్యోధనుని వంట.. అంటూ మనవాళ్లు పాడే పాటే నిజమవుతోందన్న మాట. కింది ఒరకల వారు మరీ అంతకి దిగు తున్నారా.’’ అత్తమ్మ నిస్త్రాణగా అంది.

‘‘దిగడంలేదు. ఎక్కుతున్నారు. మిట్టలు ఎక్కు తున్నారు. అలా ఎక్కుతున్నవారిలో స్వాములున్నారు. సన్యాసులున్నారు. మంత్రగాళ్లున్నారు. మహాభక్తులు న్నారు. షావుకార్లున్నారు. దళారులున్నారు. వ్యాపారులున్నారు. దోపిడీదారులున్నారు. అందరూ మనల్ని బాగుచేస్తామని చెబుతున్నవారే. మరో ముఖ్యమైన మాట వినండి. అచ్చమైన మన తెనుగుభాష సైతం దుంపనాశనం అవుతోంది.’’ మనస్తాపం చుట్టుముట్టగా దీనురాలిగా మాటలు వెడలించింది కోడలు.

‘‘అవునా? అదెలా!’’ ఆశ్చర్యం వ్యక్తంచేసింది మాకలి.

‘‘అదీ పల్లపు మహిమే.’’ బావురుమన్నట్టయింది దేవమ్మ.

‘‘కొంచెం వివరంగా చెప్పు..’’

‘‘నేలబారు భాషని మెరకల్లోకి తెస్తున్నారు ఒరకల వారు..’’

‘‘అవునా. ఘోరం కదూ..!’’

‘‘ఘోరమే. కుందేటి చుక్క అని మనం పలికే జాబిల్లిని చందమామ అనాలని సొదపెడుతున్నారు. కలిమిముద్దలు అనే మన మాటను విందుగా మారుస్తున్నారు. మన చేవడి బసను కల్లుపాక అంటున్నారు. మన గొట్టిబసను గోష్ఠి కేంద్రంగా పలుకుతున్నారు. మన జాకరమ్మను శాంకరిని చేశారు. మన సంకులమ్మను శంఖమణిగా చెబు తున్నారు. మన గంగాలమ్మను శివప్రియగా మార్చారు.’’ తీవ్రంగా విచారపడుతూ అనేసింది దేవేంద్రాలు. విలవిల్లాడింది మాకలమ్మ. అంతటి వ్యధలోనూ ఆమెకు ఒక ముఖ్యమైన విషయం గుర్తుకువచ్చింది. జ్ఞాపకానికి వచ్చిన ఆ అంశం ఆమెను ఒకింత భయపెట్టింది. బెంగపడేలా చేసింది. కర్తవ్యమేదో తోపించింది. వెనువెంటనే ఆమె మామూలు మనిషిగా మారిపోతూ,

‘‘సరే. సరే. నువ్వింతగా ఆలోచించవలసిన తరుణం కాదిది. నువ్వు గర్భిణివి. అటు గన్నియ గతీ ఇదే. ఇప్పుడు మనం పాలనాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా వడ్డాదికీ, నందానికీ కూడా మంచిది కాదు. పండంటి బిడ్డ పుట్టాక అప్పుడు ఏం చెయ్యాలో యోచన చేద్దాం. ఇంటికి పద.’’ కోడలిని త్వరపెట్టింది. తను గర్భందాల్చానన్న విషయం మదిలో మెదలగానే లోలోపలే నిర్వేదంగా నవ్వుకుంది దేవేంద్రాలు.

‘మరికొన్ని నెలల్లోనే నందరాచకుటుంబంలోకి కొత్తప్రాణి వచ్చి చేరుతుంది. అది వడ్డాది జీవి అవుతుందా? నందపురంబిడ్డ అవుతుందా? పల్లం బాగుంటే చాలనుకునే స్వార్థపూర్తిమైన వడ్డాది పోలికలతో పుడుతుందా? మన్యం బాగుంటేనే అన్యం పరిమళిస్తుందనుకునే వాస్తవికత ఎరిగే నందశిశువే అవుతుందా? చూడాలి! వేచి చూడాలి!’ ఈ మాదిరి తలపులు రాగానే ఆమె ఎడద మరింతగా బరు వెక్కింది. ‘అత్తమ్మ చెప్పింది నిజమే. ఇప్పటిస్థితిలో ఇంతకు మించి తపన కూడదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం.’ ఇలానూ తనుపు చేసింది. మాకలి పాదాలకు నమస్కరించింది.

‘కదులుదామా..’ అన్నట్టుగా ఆమె వైపు దృక్కులు ప్రసరింపజేసింది. ఆ సంకేతాన్ని అందుకుని మాకలి నడిచింది. ఆమె వెంట దేవేంద్రాలూ అడుగులు వేసింది. నడక పూర్తిగా మొదలే కాలేదు. మాకలమ్మ వెనక్కి తిరిగింది.

‘‘పురిటికి కన్నవారింటికి వెళతానంటే చెప్పు. నీ ఇష్టమే నా ఇష్టం. ఏర్పాట్లు చేయించమంటే చేయిస్తాను.’’ ప్రేమమీరా స్వరాన్ని వెలువరించింది. ఈ విషయమై ఎప్పుడో ఏదో ఆలోచించుకునే ఉన్నానన్నట్టుగా చప్పున ప్రతిస్పందించింది దేవమ్మ.

‘‘ఎక్కడికీ వెళ్లను. ఆ ఊరికి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికీ ఆ ఊరూ అంతే దూరం. రాచగన్నియను ఎగువకు పంపబోనని వడ్డాదిరాజు చెప్పినప్పుడు, నందరాణీ మటుకు పల్లానికి ఎలాపోతుంది. నా చావూ బతుకూ నందంలోనే.’’ కసకసలాడింది. అంతమాట అనకూడదన్నట్టుగా కోడలి నోటికి చెయ్యి అడ్డం పెట్టింది అత్తమ్మ. మరో పలుకు ఆ వేళ ఇద్దరిమధ్యా మరి చోటు చేసుకోలేదు.

* * * *

కాలం చిత్రమైంది. విచిత్రమైంది కూడాను. అది ఎప్పుడు మొదలైందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు ముగిసిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ, అది చూపించే మహత్యాలు మాత్రం అనంతం. దాని లక్షణాలు అసంఖ్యాకం. పాత గాయాలను మాన్పుతుంది. కొత్త గాయాలను రేపుతుంది. అది సనాతనంగానూ ఉంటుంది. పురాతనమనీ అనిపిస్తుంది. అది యుగాలను దొర్లిస్తుంది. జగాలను సృష్టిస్తుంది. కాలం తన కాళ్లకు ఏ చక్రాలు కట్టుకుందో తెలియదు. అవి ఎప్పుడూ మునుముందుకే పరుగులు తీస్తుంటాయి. అవి చురుకు ఎరిగినవి. విసుగు ఎరగనివి. అవి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. మన్వంతరాలనే దాటుకుంటూ వచ్చిన ఆ చక్రాలకు మనం సృష్టించుకున్న కొలమానాలనగా ఏపాటి! శతాబ్దాలు, దశాబ్దాలు ఇట్టే తిరిగిపోయే కాలానికి వత్సరాలు, మాసాలు, దినాలూ ఒక లెక్కేంటి! అందుకేనేమో ఆ పొరుగున రాచగన్నియ, ఈ ఇరుగున దేవేంద్రాలు ఎదురుచూసిన ఏడునెలలూ ఇట్టే అయిపోయాయి. పండంటి బిడ్డలను వాళ్ల ఒడికి చేర్చాయి. ముద్దుల పెద్దదేశిరాజును ప్రసవించిన రాణీదేవమ్మకు నందరాజ్యం గొడుగుపట్టింది. అందాల మోదమ్మను కన్న రాచగన్నియకు వడ్డాది జనం జేజేలు పలికారు.

పాలుగారే పసిబాలలిద్దరూ రాచకుటుంబాల్లో ప్రవేశించాకనూ ఇరురాజ్యా పరిస్థితీ మచ్చుకైనా మారలేదు. సరికదా తారతమ్యాలు మరింతగా తన్నుకొచ్చాయి. విభేదాలు ఇంతింతగా పొడుచు కొచ్చాయి. తేడాలు తామరతంపరగా దూసు కొచ్చాయి. వడ్డాదిపల్లం ఇంతకింతగా వ్యూహాలను పదునుతేర్చింది. చుట్టరికం మాటున దేవేంద్రుడు అలవిమాలిన చనువు తీసుకున్నాడు. కొండలను యథేచ్ఛగా దోచుకునే కూటనీతి కొనసాగించాడు. అక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట, వాగు, వంక, చేను, పోడు, పశువు, మనిషి అన్నీ తనవే అన్నట్టుగా తెగబలిసిపోయాడు. తత్ఫలితంగా కొండలు కరిగి పోతున్నాయి. లోతులు గట్టిపడుతున్నాయి. గుట్టలు కుదేలవుతున్నాయి. లోతట్టులు బాగుపడుతున్నాయి. మెరక ఏడుస్తోంది. పల్లం పల్లవిస్తోంది.

ఇంతజరుగుతున్నా నందప్రభువు వెంకటేశుడు కిమ్మనడం లేదు. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా తప్పించుకు తిరగడం నేర్చేశాడు. ప్రజలను గాలికివదిలేశాడు. మాకలిశక్తికి ఇదంతా నచ్చడం లేదు. దేవేంద్రాలి మనసైతే కాలిపోతున్నట్టే ఉంది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram