– చాగంటి ప్రసాద్‌

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన రచన


గండు వీధిలోని శేషపాన్పు గుడి దాటి మహీపాల వీధిలోకి రాగానే.. కత్తి ఝుళిపిస్తే గాలిని చీల్చుకుని ‘సర్‌ ‌సర్‌’ ‌మంటూ వచ్చే శబ్దాలు, గిరగిర తిప్పే అగ్గి బరాటాల జ్వాలా ధ్వనులు, టక్‌ ‌టక్‌ ‌మంటూ వినిపించే బాణాకర్రసాముల విన్యాసాల కోలాహలం.. ఊళ్లో అడుగుపెట్టిన మల్లేష్‌కి చెవులని తాకినట్టుగా అనిపించింది.

ప్రతి ఏడాది ఇక్కడ జరిగే దసరా సంబరాలు, వాహనాల ఊరేగింపు, పోటీపడి బరిలో దిగి వీరులు చేసే ‘చెడీ, తాలింఖానా’ గుర్తుకొచ్చాయి. ఆనందం, ఉద్వేగం కలిసి మొహం మీద అప్రయత్నంగా నవ్వు మొలిచింది.

‘‘ఏంట్రా బాబు! నీలో నువ్వే నవ్వేసుకుంటు న్నావు? నాకు కూడా నీ ఆనందం పంచు’’ అన్నాడు శ్రీకర్‌. ‘‘‌దసరా సంబరాలు జ్ఞాపకం వచ్చాయి. త్వరలో చూద్దువుగాని!’’ అన్నాడు మల్లేష్‌ ‌నవ్వుతూ. ఇంతలో ఇల్లు రావడంతో ఇంటిముందు కారు ఆగింది. డోర్‌ ‌తీసుకుని కారు దిగి శ్రీకర్‌తో ఇంట్లోకి దారితీసాడు. మల్లేష్‌ని చూడగానే కొడుకు అమెరికా నించి ఎప్పుడు వస్తాడా అని చూస్తున్న సరస్వతి ఎదురుచూపులకి విశ్రాంతినిచ్చి ఆనందంగా కొడుకుని దగ్గరకు తీసుకుంది.

‘‘అమ్మా, వీడు నా స్నేహితుడు శ్రీకర్‌! ‌మన దసరా సంబరాలు చూస్తాడని తీసుకువచ్చాను’’ అన్నాడు. శ్రీకర్‌ ‌వినయంగా నమస్కరించాడు ఆమెకి. ‘‘మంచిది బాబు!’’ అని ఆహ్వానించింది. భోజనా లయ్యాక తమకి కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకున్నారు ఇద్దరు.

తండ్రి చినరామదాసు కనపడకపోవడంతో తల్లి దగ్గరకు వచ్చి ‘‘నాన్న ఎక్కడికి వెళ్లారమ్మా?’’ అని అడిగాడు మల్లేష్‌.

‘‘ఇం‌కెక్కడికి? మన కుర్రాళ్లు ‘చెడీ’ ఎలా చేస్తున్నారో చూద్దామని మన ‘బరి’ దగ్గరకు వెళ్లారు’’ అంది సరస్వతి.

‘‘ఈ వయసులో ఇంకా ఎందుకు తాపత్రయం? అసలే ఆరోగ్యం సరిగా లేదు’’ బాధపడుతూ అన్నాడు.

‘‘మనోళ్లు ఇంతకు ముందులా శ్రద్ధగా చేయడం లేదని, మీ నాన్న ఎదురుగా ఉండకపోతే తోక జాడించేస్తున్నారని నెల రోజులనుంచి రోజూ ఎండలో అక్కడే పడిగాపులు పడుతున్నారు’’ విచారంగా మాట్లాడింది సరస్వతి.

కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మల్లేష్‌ ‌శ్రీకర్‌ని ఒక పెద్ద ఖాళీ ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు.

‘‘ఏరా ఎప్పుడు వచ్చావు? ఈ అబ్బాయి ఎవరు?’’ అంటూ పలకరించాడు మోహన్‌. ‘‘‌పొద్దున్నే వచ్చాం. ఎలా ఉన్నావు, మావయ్య! అత్త బావుందా? ఇతను శ్రీకర్‌. అమెరికాలో ఇద్దరం పక్క పక్కనే ఉంటాం. వీడికి మన ఊరి దసరా సంబరాలు, మన ‘చెడీ’ చూపిద్దామని తీసుకు వచ్చా. ఏంటి ఈసారి పెద్ద హడావుడి కనబడ్డంలేదు? పల్చగా ఉన్నారు మనయోధులు?’’ అంటూ సాలోచనగా అక్కడ పెట్టిన తమ పూర్వికుల విగ్రహాల కేసి చూస్తూ అడిగాడు.

‘‘ఏడాది ఏడాదికి ఉత్సాహం తగ్గుతోందిరా! వీరులు కూడా శ్రద్ధగా సాధన చెయ్యడం లేదు. ఏదో విధంగా మన సంప్రదాయ యుద్ధకళని ముందుకు తీసుకు వెడుతున్నాం. చూద్దాం! పూర్వ వైభవం తప్పక కొనసాగుతుందని నాకు నమ్మకం ఉందిరా మరి!’’ అని నిట్టూరుస్తూ బళ్లెం పట్టుకున్న తనికి పట్టు నేర్పడానికి పక్కకి వెళ్లాడు.

కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అక్కడున్న యువకులకి సూచనలిస్తున్నాడు చిన రామదాసు. ఆరడుగుల ఎత్తు, బాణాకర్రలా సన్నగా నిలువెత్తుగా ఉన్న రూపం, తల మీద బాగా పెరిగిన జుత్తు కొప్పుగా కట్టుకున్నాడు. నుదుటి మీద ఎర్ర సింధూరం ధరించి మండుతున్న సూర్యుడిలా ఉన్నాడు. ఈ విద్య నేర్పుతున్న రోజులన్నీ ఒంటిమీద కాషాయ వస్త్రాలు దీక్షా వస్త్రాలుగా ధరిస్తాడు. కొడుకు రాకని గమనించి గంభీరంగా అతని కేసి చూసి కళ్లల్లోంచే ఆనందం వ్యక్తపరిచాడు. వయసు మీద పడుతున్నా తండ్రి పడుతున్న తపన చూసి, కళ్లల్లో నీళ్లు చిప్పిల్లేయి మల్లేష్‌కి.

విశాలమైన ‘బరి’లో ఈశాన్యం మూల గంధ సింధూరం పూత పూసిన ఆంజనేయుడి విగ్రహం, ఉగ్రరూపంలో ఉన్న దుర్గమ్మ విగ్రహం, ఒక పక్క భారతీయ జెండా స్తంభం ఉన్నాయి. వాటిముందు అఖండ దీపం ప్రజ్వరిల్లుతోంది. నేలమీద మెత్తని ఇసుకలో చిడత కర్రలు, బళ్లాలు, కత్తులు గుచ్చి ఉన్నాయి. చెక్కతో చేసిన బంతులు తాళ్లకి కట్టి ఉన్నాయి. బాణా కర్రలు, మేను బాణాలు గోడలకి ఆనించి ఉన్నాయి. కొందరి పిడికిళ్లలో లేడి కొమ్ములు బిగుసుకుని ఉన్నాయి. వాటితో లయబద్ధంగా విన్యాసం చేస్తుంటే గాలిలో ఒక వింత శబ్దం వినబడుతోంది. కర్రసాము తిప్పుతున్న వాళ్లని సాధన చేయిస్తూ మోహన్‌ ‌హడావుడిగా ఉన్నాడు. కొంతమంది తర్ఫీదు పొంది పట్టు సాధించిన యువకులు పట్టాకత్తులు, కర్రలు వేగంగా గిరగిరా తిప్పుతున్నారు. కత్తి పట్టుకున్న వాళ్ల చేతుల మీద కండరాలు ఉబికి ఉక్కుతీగల్లా ఉన్నాయి. భుజ కండరాలు తాచుపాము మింగిన కప్పల్లా పైకి, కిందకు కదులుతున్నాయి. వాళ్ల విన్యాసాలు నిశితంగా చూస్తున్న రామదాసు ఒక్కసారిగా దిగ్గున లేచాడు.

‘‘ఒరేయ్‌ ‌హరిబాబు! కత్తి ఒడుపుగా పట్టుకోవాలి. అలా కాదురా! పిడికిలిలో బిగిస్తే, నీ చెయ్యి అవత లోడు నరికేసినా కత్తి వదిలే ప్రసక్తి రాకూడదెహే!’’ అంటూ భూమాతకు దణ్ణం పెట్టుకుని, కత్తి చేతిలోకి ఇముడ్చుకొని కత్తి మీద పడ్డ కాంతి పుంజపు మెరుపు తప్ప ఏదీ కనబడని రీతిలో గిర గిర తిప్పాడు అరవై ఏళ్ల రామదాసు.

 శిష్యులు ఆశ్చర్య చకితులై కనురెప్ప వేయకుండా గురువు గారి ‘కరవాల విహారం’ చూస్తూ నిలబడి పోయారు. మరో అరగంటలో ఆ ప్రాంతమంతా ‘చెడీ’ చేస్తున్న యువకులతో నిండిపోయింది. ఒక్కసారిగా అందరూ భూమాతకి ప్రమాణం చేసి, చెమటలు చిందిస్తూ కర్రసాము, కత్తిసాము చేస్తున్నారు. వాళ్ల ఒంటినుండి ధారాపాతంగా కారుతున్న చెమట ఇసుకలో ఇంకుతోంది.

‘‘ఎలా ఉందిరా? మా చెడీ, తాళింఖానా?’’ అని గర్వంగా అడిగాడు మల్లేష్‌ ‌శ్రీకర్‌ని.

‘‘ఏముంది ఇందులో గొప్ప? దీని గురించేనా ‘మా ఊళ్లో సాహసాలు గొప్పగా చేస్తారు’ అంటూ ఊదర గొట్టేవాడివి!’’ అని పెదవి విరిచేశాడు. మల్లేష్‌ ‌మొహం చిన్నబోయింది. ఆ మాటలు విన్న రామదాసు గారి కళ్లు చింతనిప్పుల్లా ఎరుపెక్కాయి. కళ్లల్లో ఎర్రజీరలు త్రాచుపాము నాలికల్లా కనపడ్డాయి మోహనరావుకి. ఒక్క అంగలో శ్రీకర్‌ ‌దగ్గరకి వచ్చాడు చిన రామదాసు.

‘‘ఎవరు నువ్వు? ఇక్కడకి ఎందుకు వచ్చావు. ఈ గొప్ప సాంప్రదాయ వీరవిద్య గురించి నీకు ఏం తెలుసని, అలా విమర్శించావు?’’ సింహగర్జన లాంటి ఆయన స్వరానికి కంగారు పడి, భయంగా నోట మాట రాక బిగుసుకు పోయాడు.

బావగారికి అంత కోపం రావడం ఏనాడు చూడలేదు మోహనరావు. గబగబ ఆయన దగ్గరకు వచ్చి.. మన మల్లేష్‌ ‌స్నేహితుడు. ‘‘కొత్త కదా గురూజీ! ఆ అబ్బాయికి నేను చెప్తాను’’ అని సర్ది చెప్పబోయాడు.

మోహనరావు మాటలని పట్టించుకోకుండా శ్రీకర్‌కేసే చూస్తూ..

‘‘దీని చరిత్ర నీకు తెలియాలని నియమం లేదుగాని.. పోనీ మన దేశంలో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడొచ్చిందో చెప్పగలవా?’’

‘‘పందొమ్మిది వందల….’’ తప్పో రైటో తెలియక నసిగాడు.

‘‘దేశ చరిత్ర తెలియదు. సరే, ఈ విద్య నేర్చుకోవడానికి పడే కష్టం, తపన చూసైనా నువ్వు అలా సులువుగా అనేయడం నాకు నచ్చలేదు. దీని చరిత్ర తెలిస్తే అలా మాట్లాడవు! సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది. దాని కన్నా ఒక ఏడాది ముందే.. అంటే పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈ యుద్ధకళ సాధన చెయ్యడం మొదలైంది. అంటే ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర ఉంది ఈ విద్యకు. తెల్లదొరల అరాచకాలు ఎదుర్కోవడానికి, తమని తాము కాపాడుకోవడం కోసం పిల్లలు, యువకులు; స్త్రీలైతే మాన సంరక్షణ కోసం ఈ ఆయుధాలు తయారు చేసి సాధన చేసేవారు.’’

‘‘అసలు చెడీ, తాళింఖానా అంటే అర్థం ఏమిటండి?’’ వినయంగా అడిగాడు శ్రీకర్‌.

‘‘‌చెడీ – అంటే ఉర్దూలో సాధన అని పేరు. ఆయుధాలని భద్రపరచి సాధన చేసే ప్రదేశాన్ని తాలింఖానా అంటారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ప్రజలందరిని ఒక తాటి మీదికి తీసుకు రావడానికి బాలగంగాధర్‌ ‌తిలక్‌ ఎలా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారో అలాగే బ్రిటిష్‌ ‌సామ్రాజ్యాన్ని మన దేశంలో కూలదొయ్యడానికి, వాళ్లకి తెలియకుండా చాప కింద నీరులా ఈ ‘వీర విద్యా విన్యాస పక్రియ’ దసరా ఉత్సవాల్లో ప్రారంభించారు. దీనికి ఆద్యుడు, ఆదిగురువు మా తాత అబ్బిరెడ్డి రామదాసు గారు. ఆయన పేరే నాకు పెట్టారు. అదిగో ఆయన శిలావిగ్రహం!’’ ముఖంలో గర్వం తొణికిసలాడుతుండగా చూపించాడు.

‘‘మా వంశ పారంపర్యంగా ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ విద్య నేర్చుకోవడానికి కుల, మత, లింగ, వర్గ బేధం లేదు. అందరూ అర్హులే. ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో తప్పకుండా ఈ కర్రసాము, కత్తి సాము తదితర సాహస విన్యాసాల ప్రదర్శన కొనసాగిస్తున్నాం. మహీపాల, కొంకాపల్లి, గండు, రవణం, రవణం మల్లయ్య, నల్లా, శ్రీరాంపురం వీధుల్లో ఉన్న గురువుల ఆధ్వర్యంలో యువత నెలరోజుల పాటు సాధనచేసి ప్రతి విజయదశమికీ దీన్ని ప్రదర్శిస్తారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా, ఆనాటి భారత ప్రభుత్వం దీన్ని ఒక ‘యోధకళ’గా గుర్తించింది. అందుకనే ఈ ఉత్సవాల ప్రారంభ ఊరేగింపులో భారతీయ జెండా పుచ్చుకుని గౌరవ వందనం చేస్తూ ఊరేగుతాం. విజయదశమి నాడు నువ్వే చూస్తావుగా..’’

‘‘క్షమించండి సర్‌! ఏదో తెలియక నోరు జారాను’’ అని చేతులు జోడించాడు శ్రీకర్‌.

‘‘‌ఫర్వాలేదు! నేటి యువతకి కాస్త తొందరపాటు ఎక్కువ. అందుకనే అలా గట్టిగా చెప్పవలసి వచ్చింది. అదీగాక, మా వీరులు కూడా మరొక్కసారి ఈ విద్య మూలాలు తెలుసుకున్నట్టు అయింది.’’ నుదుట మీంచి కారుతున్న చెమటని అంగీతో తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు రామదాసు.

చాలా కాలం తర్వాత తండ్రి నోటి నుండి ఈ చరిత్ర వినడంతో ఒళ్లు పులకరించింది మల్లేష్‌కి.

ఆయన అంటే భయంపోయిన శ్రీకర్‌ ‌కాస్త తేరుకుని ‘‘సర్‌! ఇన్ని మారణాయుధాలతో ఇలా విచ్చలవిడిగా ప్రదర్శిస్తే, ప్రమాదం కదా? నేరం కూడా కదా! ఈ విద్య నేర్చుకున్న మనిషి అన్యాయంగా ఎవరికైనా అపకారం తలపెట్టి దాడి చేస్తే?’’ సందేహంగా అడిగాడు.

‘‘ఇవి మారణాయాధాలు కాదు, మానవ రక్షణాయుధాలు. మాన, ప్రాణ సంరక్షణాయుధాలు. చాలా ఏళ్ల క్రితం మా తాతగారు ఈ విద్య నేర్పే రోజుల్లో ఒక సంఘటన జరిగిందిట. అది నీకు చెప్తాను. విను’’ అన్నాడు చిన రామదాసు.

మల్లేష్‌, ‌శ్రీకర్‌ ఆయన పక్కనే నిలబడి వింటున్నారు.

 *  *  *

‘‘గాలి కరవాల విన్యాసం చేస్తోంది. చెట్లు ఆ కత్తివాటు నుంచి తప్పుకోవడానికి తమ తలల్ని అటూ ఇటూ తిప్పుతున్నాయి. రుద్రయ్య గాలి వేగానికి తన బలమైన ఛాతిని అడ్డుపెట్టి తోసుకుంటూ వెడుతున్నాడు. ‘ఈ రోజుతో వాడో నేనో తేలిపోవాలి’ కసిగా అనుకున్నాడు. ఉద్రేకంతో అతని గుండె ఎగిసిపడుతోంది. చేతి కండరాలు పైకి ఉబికాయి. ‘ఎంతో కష్టపడి నేర్చుకున్న విద్యకు పోటీగా ఆడు రావడేమేంటి? తనకు దసరాలో ప్రతి ఏడు జరిగే గౌరవం ఆ ఎదవ తన్నుకుపోవడానికి తయారవు తున్నాడు’ రుద్రయ్యకి కడుపు మండిపోతోంది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. గురువుగారి మీద గౌరవం కొద్ది అతన్ని ఏమి సెయ్యలేకపోతున్నాను అనుకున్నాడు. ‘దొంగ ఇనయం నటించి గురువుగారిని బుట్టలో పడేసాడు!’ కోపంతో ఊగిపోతూ ఇంటివైపు సాగాడు.

దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పెద రామదాసు ఆధ్వర్యంలో ‘జై భేతాళా’ అంటూ దిక్కులు పిక్కటిళ్లెలా గొంతెత్తి అరుస్తూ చెడీ, తాళింఖాన ప్రదర్శన మొదలుపెట్టారు. ఏడు వీధులనుండి ఉత్సవం మొదలైంది.

సమయం కోసం ఎదురుచూస్తు అసూయతో రగిలిపోతున్న రుద్రయ్య లయబద్ధంగా అడుగులు వేస్తూ, అందరూ ఊపిరిబిగపెట్టి చూస్తుండగా ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తూ వీర విహారం చేస్తూ బాణాకర్ర తిప్పుతున్నాడు. ఆరుగురు యోధులు చిడత కర్రలతో విరుచుకుపడ్డారు. అతనొక్కడు అభిమాన్యుడిలా! చేత కత్తెర్లు వేస్తూ వాటి మధ్య దెబ్బలు కొడుతున్న వారిని తప్పించుకుంటూ నిలువరించడానికి వీరోచితంగా పోరాడుతున్నాడు. ఆ ఆరుగురిలో పార్థుడు కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే రుద్రయ్య కోపం తారస్థాయి అందుకుంది. అతని మొహంలో ఉద్రేకం కనిపిస్తోంది. దానికి తోడు నుదుటమీద గంధసింధూరపు బొట్టు చెమటకి అటూ ఇటూ చెరిగి శివుడి మూడోకన్నులా ఉంది. ముఖ కండరాలు ఉబికి భయంకరంగా కనిపిస్తున్నాడు. జనం అందరూ ఊపిరి బిగపెట్టి చూస్తున్నారు. భయ పడుతున్నారు ఏ దొమ్మియో జరగబోతుందే మోనని. రౌద్రంగా ముందుకొచ్చిన రుద్రయ్యకు నిన్న గురువు గారు తనతో అన్న మాటలు ఠక్కున గుర్తుకొచ్చాయి.

‘ఒరేయ్‌ ‌రుద్ర! నీ నడవడిక చాలా రోజులబట్టి చూస్తున్నా. కోపం తారస్థాయిగా లేస్తోంది. విద్యమీద శ్రద్ధ తగ్గుతోంది. పాదాల లయ తప్పుతోంది. చేతలు కూడా సరిగ్గాలేవు. ఏమిటి విషయం?’ గట్టిగా హూంకరించాడు.

‘ఏం లేదు గురువు గారు! ఏదో పరధ్యానం’ నసిగాడు.

‘శిష్యుడి మనోభావాన్ని తెలుసుకోలేడా నీ గురువు?’ అంటూ పాయల్లా విడిపోయిన జుత్తుని ముడి వేసుకుంటూ నవ్వాడు. ఆ నవ్వులో ‘నాకు అన్నీ తెలుసు’ అనే అంతరార్థం ఉంది.

‘పార్థుడు మంచాడు రా! శ్రద్ధగా విద్య నేర్చుకుంటున్నాడు. రుద్రన్నకి వచ్చిన విద్యలో నాకు ఇసుమంతయినా రాదు గురువుగారు! ఇంకా సాధన చెయ్యాలండి! అంటూ ఉంటాడు. నిన్ను అస్తమాను నా దగ్గర కొనియాడుతూ ఉంటాడు. నువ్వు వాడంటే అసూయ పెంచుకుంటున్నావు. మనం అవిరామంగా సాధన చేస్తున్న ఈ విద్య కూడా ఒక తపస్సు లాంటిదిరా. తప్పు చేస్తే అథఃపాతాళానికి పడి పోతాం. విద్యలో నేర్పు, నైపుణ్యం, ఓర్పు, మెలకువ అన్నీ అబ్బుతున్నాయంటే మనం ఒక తపస్సులో కూర్చునట్టే. అప్పుడు జ్ఞానమనే మూడోకన్ను తెరుచుకున్నట్టే. అది తెరుచుకుంటే, నువ్వు కళ్లు మూసుకున్నా లక్ష్యాన్ని ఛేదించగలవు. విద్యలో పైకి రావాలనే పట్టుదలుండాలి. అంతమొందించాలనే అసూయ ఉండకూడదురా రుద్రా!’ గురూజీ మాటలు అతని చెవుల్లో ఓంకారంలా ధ్వనించాయి.

 రుద్రయ్య కళ్లు మూసుకున్నాడు. మూడో కన్ను తెరుచుకుంది. గురువు పెదరామదాసు అతనికేసి సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాడు. రుద్రయ్య కళ్లు మూసుకుని ఆ ఆరుగురి దెబ్బలకి అందకుండా తప్పుకుంటున్నాడు. ఎదురు దాడిచేసి వాళ్లు డస్సి పోయి ఇంక పోరాడలేక చతికిల పడిపోయారు. రామదాసు రుద్రయ్య మహాయోధుడు అంటూ జనం హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. దండ వేశారు, దుశ్శాలువ కప్పి సన్మానం చేశారు. రుద్రయ్య ఆయన కాళ్లకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు పెద రామదాసు. జనం హర్షధ్వనాలు చేశారు. ఈ సంఘటన ద్వారా ఎవరికి హాని చెయ్యని తపస్సు లాంటి విద్య చెడీ అని అందరికీ తేటతెల్లం చేశారు.’’ అన్నాడు చిన రామదాసు.

‘అబ్బా! ఎన్నిసార్లు విన్నా ఒళ్లు మళ్లీ గగొర్పొడిచింది నాన్నగారు!’ అన్నాడు మల్లేష్‌.

‘‘‌వింటే కాదు. ఇది నేర్చుకుని, ప్రదర్శిస్తే కలిగే అనుభూతే వేరురా’’ అన్నాడు మోహన్‌. ‌శ్రీకర్‌ అపరాధ భావంతో తల వంచుకున్నాడు. గమనించిన మల్లేష్‌ ‌శ్రీకర్‌ ‌భుజం మీద చెయ్యి వేసి అనునయంగా నొక్కాడు.

 *  *  *

విజయదశమి.. తాలింఖానా దగ్గర చిన రామదాసుతో పాటు, మల్లేష్‌, ‌మోహన్‌, ‌యువకులందరూ ఆయుధాలన్నిటికి గంధ సింధూరం పెట్టి తాము ధరించారు. దుర్గమ్మ విగ్రహం ముందు పెట్టి ఆయుధ పూజ చేశారు. చుట్టూ కొబ్బరికాయలు తిప్పి కొట్టారు. కోడిని కోసి ఆయుధాలకి నైవేద్యం పెట్టారు. హారతులిచ్చారు. అందరూ తెల్లదుస్తులు ధరించి నుదుట గంధసింధూరం ధరించారు. పక్కనే ఉన్న భేతాళ రాయికి కూడా పూజ చేసి హారతి ఇచ్చారు. అందరూ గట్టిగా ‘జై భేతాళా’ అంటూ గొంతెత్తి పలుమార్లు ప్రార్ధించారు. ఈ ప్రాచీన యుద్ధ కళకి ఆద్యుడైన పెద రామదాసు విగ్రహానికి పూలమాల వేసి వినయంగా నమస్కరించారు.

‘‘ముందుకు సాగండి’’ అని ఆజ్ఞాపించాడు చినరామదాసు. మిగిలిన వీధుల నుండి గురువుల ఆధ్వర్యంలోని వీరులు ఎప్పుడెప్పుడు తమ వీరోచిత విన్యాసాలు ప్రదర్శిద్దామా! అని ఉత్సాహంగా బయలుదేరారు.

అందరూ ఒకే వరుసలో నిలబడ్డారు. భారతీయ జెండా పట్టుకుని ముందుకు నడిచారు. దసరా ఉత్సవాల ప్రారంభంలో కొంకాపల్లి వీరులు వచ్చి చినరామదాసుకీ గురుపూజ చేశారు.

అన్ని వీధుల్లో ప్రదర్శన అయ్యకా, రాత్రి ఒంటి గంటకి గడియార స్తంభం సెంటర్‌కి చేరిన ఉత్సవంలో ఒళ్లు గగుర్పొడిచేలా అగ్గి బరాటాల తిప్పుడు, ఎన్నో చేతులతో బాణాకర్రలతో వీరుల విన్యాసాలు, కత్తి పట్టిన వీరులు వీర విహారంతో ఒకరిని మించి ఒకరు ఒడుపుగా తప్పుకుంటూ, శత్రు దుర్భేద్యంగా చూపరులని ఆకుట్టుకొనే విధంగా ప్రదర్శించారు. అబ్బిరెడ్డి వంశాచార ప్రకారం కళ్లకి గంతలు కట్టుకుని చినరామదాసు లయబద్ధంగా కత్తి తిప్పుతూ ఒక వీరుని పొట్టమీద పెట్టిన కొబ్బరికాయని ఒక్క దెబ్బతో పగలగొట్టాడు. అదే కరవాలంతో వీరుని తలమీద ఉన్న ఆనపకాయని కూడా ఒక్క దెబ్బతో ముక్కలుచేశాడు. తలమీద ఆనపకాయ పెట్టుకున్న అతనికి వెంట్రుక కదిలిన స్పర్శ కూడా తెలియలేదు. నేతాజీ, దొరబాబు, రమేష్‌ ‌మోహన్‌రావు లాంటి యోధుల వీరోచిత ప్రదర్శన చూసిన శ్రీకర్‌కి ఒళ్లు గగుర్పొడిచింది.

‘‘ఎంత గొప్పగా ఉందిరా ఈ ఉత్సవం!’’ అంటూ మల్లేష్‌ని అభినందించాడు.

 *  *  *

‘‘ఈ బాధ్యతని భుజస్కంధాల మీద మోసే యోధులు ఎవ్వరూ లేరు మా వంశంలో. నాకా వయస్సు మీద పడింది. ఎప్పుడు ఆ సర్వేశ్వరుడు పిలుస్తాడో తెలియదు. మల్లేష్‌ అమెరికా వెళ్లి కూర్చున్నాడు. వచ్చే దసరాకి నేను ఉంటానో ఉండనో?’’ అన్నాడు విచారంగా చినరామదాసు. మోహన్‌ ‘‘అయ్యో! అంత మాట అనకండి బావగారు! విశ్రాంతి తీసుకోండి.’’ అంటూ దుప్పటి కప్పి గదిలోంచి బయటకి వచ్చేశాడు.

 *  *  *

పెద రామదాసు గారి ప్రాంగణంలో భేతాళ పూజ జరిపించి వీర తిలకం దిద్ది కత్తి చేతికిచ్చాడు చిన రామదాసు, కొడుకు మల్లేష్‌కి. గురువుకి, పెద రామదాసు గారికి, భూమాతకి నమస్కరించి కత్తి ఒడుపుగా పట్టుకున్నాడు. జై భేతాళా! అంటూ గట్టిగా అరిచాడు. బరిలో సాధన మొదలైంది. అతను వేగంగా తిప్పుతున్న కత్తి గాలిలో ‘కస్స్ ‌కస్స్’’ ‌మంటూ కరవాల రాగం పాడుతోంది. ఒక వీరుని పొట్టమీద ఉంచిన కొబ్బరికాయని కత్తితో ఛేదించాడు. చెడీ, తాలింఖానా అనే వీరరథాన్ని ముందుకి నడి పించడానికి సంసిద్ధమయ్యాడు అబ్బిరెడ్డి తరం యువ యోధుడు.

By editor

Twitter
Instagram