– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌

‌భారతదేశం బహుళ పక్ష వ్యవస్థ. అంటే అమెరికా, ఇంగ్లండ్‌ల మాదిరిగా రెండు లేదా మూడు పార్టీలతోనే సరిపెట్టుకోవడం లేదు. ఇక్కడ వేలాది రాజకీయ పార్టీలు ప్రజలను ఇక చాలు అన్న రీతిలో సేవిస్తున్నాయి. చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా పదేసి పార్టీలు పరిఢవిల్లుతున్నాయి. భారత ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి,2022 నాటికి దేశంలో మొత్తం రాజకీయ పార్టీలు 2858. ఇందులో 8 జాతీయ పార్టీలు. అవే బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, టీఎంసీ, ఎన్‌సీపీ, ఎన్‌పీపీ (ఈశాన్య భారతంలో ఆవిర్భవించిన తొలి జాతీయ రాజకీయ పక్షం). ఇక 50 రాష్ట్ర స్థాయి పార్టీలు. 2796 పార్టీలకు గుర్తింపులేదు. కాబట్టి దేశం రాజకీయ పార్టీల వరకు సుసంపన్నమే. కానీ రాజకీయ పార్టీలకు నియమాలు, నిబంధనలు, కొలమానాల బట్టి స్థాయిని ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. అయినా ఆ స్థాయి మీద సాధారణ ఓటరుకు కనీసం వేయి సందేహాలు తప్పవు. కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ పార్టీయా? ఔను. కమ్యూనిస్టు పార్టీలు కూడానా? ఔను. బీఎస్పీ, టీఎంసీ కూడానా? ఔను. మరి కాంగ్రెస్‌ ‌పార్టీ ఏమిటి? ప్రాంతీయ పార్టీల తోక పట్టుకు నడుస్తుంది. తోకలు పట్టుకు నడిచే పార్టీల తోకల కోసం నడిచే కమ్యూనిస్టు పార్టీలకి జాతీయ హోదా ఏమిటి? అవన్నీ లెక్కలు. వాస్తవాలు వేరు. ఏదో ఒకానొక బలహీన క్షణంలో భ్రమలు భారీగా పెరిగిన నిమిషంలో కొందరు ఆయా పార్టీలకి ఓట్లు వేసిన ఫలితమిది. ఏ విధంగా చూసినా ఇప్పుడు బీజేపీ ఒక్కటే వాస్తవమైన జాతీయ పార్టీగా కనిపిస్తుందని రాజకీయ పండితుల ఉద్దేశం.


సాధారణంగా ప్రాంతీయ పార్టీలుగా వ్యవహ రించే వాటినే రాష్ట్ర పార్టీలని ఎన్నికల సంఘం పేర్కొంటున్నది. అవి-ఆప్‌ (‌ఢిల్లీ, పంజాబ్‌), ఏఐఏడీఎంకే, డీఎంకే (పుదుచ్చేరి, తమిళనాడు), ఆలిండియా ఎన్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌(‌పుదుచ్చేరి), దేశీయ మురుపొక్కు ద్రవిడార్‌ ‌కళగం (తమిళనాడు), తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ (ఆం‌ధ్ర ప్రదేశ్‌), అఖిల భారత ఫార్వార్డ్ ‌బ్లాక్‌ (‌పశ్చిమ బెంగాల్‌), ఏఐఎంఐఎం (‌తెలంగాణ), అసోం గణపరిషత్‌, ఆలిండియా యునైటెడ్‌ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌, ‌బోడోలాండ్‌ ‌పీపుల్స్ ‌ఫ్రంట్‌, ‌యునైటెడ్‌ ‌పీపుల్స్ ‌పార్టీ లిబరల్‌ (అసోం), మిజో నేషనల్‌ ‌ఫ్రంట్‌, ‌మిజోరం పీపుల్స్ ‌కాన్ఫరెన్స్ (‌మిజోరం), ఆల్‌ ‌జార్ఖండ్‌ ‌స్టూడెంట్స్ ‌యూనియన్‌ (‌జార్ఖండ్‌), ‌బిజూ జనతాదళ్‌ (ఒడిశా), ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లిం లీగ్‌, ‌కేరళ కాంగ్రెస్‌ (‌కేరళ), హిల్‌ ‌స్టేట్‌ ‌పీపుల్స్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ, పీపుల్స్ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌ (‌మేఘాలయ), ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌దళ్‌ (‌హరియాణా), జేకే నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌జేకే నేషనల్‌ ‌పాంథర్స్ ‌పార్టీ, జేకే పీపుల్స్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ (జమ్ముకశ్మీర్‌), ‌జనతాదళ్‌ (‌సెక్యులర్‌), (‌కర్ణాటక, కేరళ), లోక్‌ ‌జనశక్తి పార్టీ, జనతాదళ్‌ (‌యునైటెడ్‌), ‌రాష్ట్రీయ జనతాదళ్‌ (‌బిహార్‌), ‌సమాజ్‌వాదీ పార్టీ (ఉత్తర ప్రదేశ్‌), ‌శిరోమణి అకాలీదళ్‌ (‌పంజాబ్‌) ‌మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ ‌సమితి (మహారాష్ట్ర), మహారాష్ట్రవాది గోమంతక్‌ ‌పార్టీ (గోవా); ఇంకా, దేశంలోను, ఈశాన్య భారతంలో పలు పార్టీలు ఉన్నాయి. ప్రతి ఎన్నికల ముందు ఇవి చేసే హడావుడి ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. మళ్లీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ హడావుడి మొదలయిపోయింది. సాంస్కృతిక వైవిధ్యానికి అవశ్యమైన ఫెడరల్‌ ‌వ్యవస్థను కదపడానికి బయలు దేరాయి. అందుకే వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ప్రాంతీయ పార్టీలు నిజంగా ఆ ప్రాంతానికీ, లేదా రాష్ట్రానికి సేవలు చేశాయా? వాటిలో నిజాయితీ ఉందా? కేంద్రం మీదనో, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ మీదనో కక్షతో రంగం మీదకొచ్చిన ప్రాంతీయ పార్టీల నిజరూపం ఏమిటి? కేంద్రం నిర్లక్ష్యం కారణంగా తమ ప్రాంతం వెనుకబడి పోయిందన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలు నిజంగా చేసిన అభివృద్ధి ఉందా? అభివృద్ధి ఉంటే అది రాష్ట్రం కోసమా? కుటుంబం కోసమా? ప్రాంతీయ పార్టీల నినాదాలలో నిజాయితీ ఎంతో తెలుసుకోవాలంటే కంచుకాగడా వేయాలి. కేంద్రం, అక్కడి పార్టీల నియంతృత్వం గురించి ఆరోపించే ప్రాంతీయ పార్టీలలో నిజంగా ప్రజా స్వామ్యం ఉందా? వీటి కుటుంబ పాలన మీద, అవినీతి మీద, బంధుప్రీతి మీద, వికృతాల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక అధికారం కోసం ఏ పార్టీతో అయినా, వేర్పాటువాదులతో అయినా జతకట్టడానికి వీటిలో చాలా పార్టీలు వెనుకాడడం లేదు. వ్యవస్థాపకుడు మొదలు, మనమల వరకు నాయకత్వం ఒక కుటుంబం చేతిలోనే కొనసాగడం మరొక వైచిత్రి. ఈ ఆరోపణలకు అతీతంగా ఉన్నవి అతి స్వల్పం.

సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తూ….

భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పట్టం కట్టింది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో కలసికట్టుగా ముందుకు సాగడం. ప్రజల సంక్షేమం, దేశ ప్రగతి కోసం ఒకేమాట, ఒకేబాటలో ప్రయాణించి దేశాభివృద్ధికి దోహద పడాలన్నది రాజ్యాంగ నిర్మాతల ఆలోచన. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ అవి సంయుక్తంగా ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాలని వారు ఆకాంక్షిం చారు. హక్కుల కోసం ఎంత గట్టిగా పోరాడాలో అదే సమయంలో బాధ్యతలను నెరవేర్చడంలో అంతే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎన్నికల సమయం లోనే రాజకీయాలు మాట్లాడాలి తప్ప మిగిలిన సమయాల్లో ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయాలన్నది రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం. ఆచరణలో ఇది ఎంతవరకు అమలవుతున్నది అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం దొరకడం కష్టమే. విపక్ష పాలిత రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు అయినదానికి కానిదానికి కేంద్రంపై దుమ్మెత్తిపోసే విధానాన్ని అవలంబించడం ఆందోళన కలిగి స్తోంది. మాట్లాడితే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, అప్పులు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని, పథకాలు, ప్రాజెక్టుల మంజూరులో వివక్ష చూపుతున్నారని ఆరోపణలు చేయడం పరిపాటైంది. నిజానికి వీటిల్లో సహేతుకత ఎంత? నిధుల మంజూరు అన్నది నిబంధనల మేరకు ఉంటుంది. ఆర్థిక సంఘం సూచనల మేరకు కేంద్రం వ్యవహ రిస్తుంది. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు 40 శాతానికి పైగా కేటాయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వమూ ఇంత ఉదారంగా వ్యవహరించ లేదు. అప్పులు తెచ్చుకునేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్‌ ‌రెస్పాన్సబిలిటీ అండ్‌ ‌బడ్జెట్‌ ‌మేనేజ్‌మెంట్‌) ‌నిబంధ నలు పరిమితులు విధిస్తాయి. పథకాలు, ప్రాజెక్టుల మంజూరన్నది వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వీటిని ఉద్దేశపూర్వకంగా విస్మరించి విపక్ష పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఆరోపణలు చేయడం పరిపాటైంది. ఇటీవల ఈ ధోరణి మరింత విస్తరించింది. ఈ వైఖరి ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా సమాఖ్య విధానానికి చేటు చేస్తోంది. రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికగా పనిచేసే ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు ఈ విషయం బోధపడటం లేదు.

అకాలీదళ్‌… ‌మతమే ఎజెండా…

సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్‌, ‌కశ్మీర్‌ ‌ప్రాంతీయ పార్టీలకు ఆలవాలం కావడం ఎన్నో సమస్యలు తెచ్చి పెట్టింది. కాంగ్రెస్‌ ‌తరవాత దేశంలో రెండో అతి పురాతన పార్టీ శిరోమణి అకాలీదళ్‌. ఇది పంజాబ్‌ ‌ప్రాంతీయ పార్టీ. అలాగే దాదాపు సిక్కు మతానికి పరిమితం. డిసెంబరు 14, 1920న అకాలీదళ్‌ ఆవిర్భవించింది. ఈ పార్టీ ప్రధాన ఎజెండా ప్రపంచ సిక్కుల సంక్షేమం. వాస్తవానికి పంజాబ్‌ అం‌తటా సిక్కులు లేరు. ఇక్కడా విభిన్న వర్గాల ప్రజలు (34 శాతం) ఉన్నారు. హిందువులు, దళితులు, ముస్లింలు ఉన్నారు. దళితులు కూడా ఎక్కువే. అలా అని సిక్కులంతా అకాలీదళ్‌ ‌తోనే లేరు. పంజాబ్‌ ‌కాంగ్రెస్‌లో సింహభాగం సిక్కులే. అదే మాదిరిగా ఇతర పార్టీల్లోనూ సిక్కులున్నారు. ఒక రాజకీయ పార్టీగా విశాల, ఉదారవాదంతో వ్యవహ రించాలి తప్ప ఏకపక్ష అజెండాతో కాదు. అందువల్లే పంజాబ్‌లో అకాలీదళ్‌ ‌పెద్దగా పట్టు సాధించలేదు. ఒకసారి గెలవడం మరోసారి ఓడిపోవడం జరుగు తోంది. గత ఐదేళ్లుగా ఆ పార్టీని ప్రజలు అధికారానికి దూరంగా ఉంచారు. రేపటి ఎన్నికల్లోనూ అకాలీ దళ్‌కు ఆశావాహ పరిస్థితులు లేవని తేలిపోయింది. అకాలీదళ్‌పై ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ ‌కుటుంబం రెండున్నర దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తోంది. బాదల్‌ ‌నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఆయన కుమారుడు సుఖ్‌బీర్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు. ఆయన భార్య హర్‌ ‌సిమ్రత్‌ ‌కౌర్‌ ‌నిన్న మొన్నటి దాకా కేంద్రంలో మంత్రి. మొత్తం 13కు గాను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లు రెండే రెండు. వాటిల్లో భటిండా నుంచి హర్‌ ‌సిమ్రత్‌ ‌కౌర్‌, ‌ఫిరోజ్‌పూర్‌ ‌నుంచి ఆమె భర్త సుఖ్‌బీర్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌గెలిచారు. పార్టీపై బాదల్‌ ‌కుటుంబం పట్టు అలాంటిది. ఒక కుటుంబం, ఒక మతం ప్రాతిపదికగా పనిచేసే పార్టీ దేశ విశాల హితాన్ని ఎంతవరకు కోరుకుంటుందో చెప్పడం ప్రశ్నార్థకమే. ఈ పార్టీ మీద అవినీతి ఆరోపణలకు కొదవే లేదు.

కశ్మీర్‌లోనూ ఇదే పరిస్థితి…

జమ్ము కశ్మీర్‌లోనూ ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర. జాతీయ పార్టీలది ద్వితీయస్థానం. తొలి రోజుల్లో కాంగ్రెస్‌ ‌చక్రం తిప్పినప్పటికీ క్రమంగా నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ (పీడీపీ) వేళ్లూనుకున్నాయి. ఈ రెండూ కుటుంబ, మత పార్టీలే. నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అసలు పేరు జమ్ముకశ్మీర్‌ ‌ముస్లిం కాన్ఫరెన్స్. ‌చౌధురి గులాం అబ్బాస్‌తో కలసి దివంగత షేక్‌ అబ్దుల్లా 1932 అక్టోబరులో ప్రారంభించారు. అలీగఢ్‌ ‌ముస్లిం విశ్వవిద్యాలయం సంస్కృతిని నరనరాన నింపుకున్న అబ్దుల్లా అందుకు తగ్గట్టే పార్టీని తీర్చారు. కశ్మీరీల ప్రయోజనాలే దీని ప్రధాన ధ్యేయం. కశ్మీర్‌లో అంతర్భాగమైన జమ్ము సంక్షేమం, ప్రగతి ఈ పార్టీకి ద్వితీయ ప్రాధాన్యమే. ఆ పార్టీకి వచ్చే ఓట్లు, సీట్లు కూడా కశ్మీర్‌లోనే ఎక్కువ. పేరు ఏదైనా ఆ పార్టీ సంకుచిత స్వభావం దీనితో తేటతెల్లమవుతోంది. 1946,47 ప్రాంతంలో మహారాజా హరిసింగ్‌ ‌కుటుంబం మీద వ్యతిరేకతతో ‘క్విట్‌ ‌కశ్మీర్‌’ ఉద్యమం ఈ పార్టీ ఆరంభించింది. క్రమంగా ఇది అబ్దుల్లాల కుటుంబ పెత్తనం కిందకు వచ్చింది. షేక్‌ అబ్దుల్లా, తరవాత ఆయన కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, అనంతరం ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రులయ్యారు. పార్టీలో వేరే నాయకుడు ఎదగడానికి, అత్యున్నత పీఠాలు అందుకోవడానికి అవకాశాలు శూన్యమన్నది స్పష్టం. కనీసం పార్టీ పగ్గాలన్నా ఇతరులకు ఇస్తారా అంటే అదీ లేదు. ఇలాంటి పార్టీలు, నాయకులు ప్రజాస్వామ్యం, దేశ ప్రగతి గురించి మాట్లాడటం విడ్డూరంగానే ఉంటుంది.

 కశ్మీర్‌లోని మరో కుటుంబ పార్టీ పీపుల్స్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ (పీడీపీ). ఇదీ కుటుంబ, మత పార్టీనే. దీని బలమంతా కశ్మీర్‌ ‌లోయలోనే. జమ్ములో దీని బలం అంతంత మాత్రమే. ఒకప్పటి కాంగ్రెస్‌ ‌నాయకుడు, తరవాత జనతాదళ్‌ ‌పార్టీలోకి ఫిరాయించిన ముఫ్తీ మహమ్మద్‌ ‌సయిద్‌ ఈ ‌పార్టీ వ్యవస్థాపకుడు. 90వ దశకంలో నాటి వీపీసింగ్‌ ‌మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా ముఫ్తీ పనిచేశారు. కిడ్నాపైన తన కుమార్తె కోసం ఉగ్రవాదు లను ఆయన విడిచిపెట్టారు. తరవాత రోజుల్లో అంటే 1999లో సొంతంగా పీడీపీని స్థాపించారు. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు.

జార్ఖండ్‌లో ప్రస్తుతం అధికారంలో కొనసాగు తున్న జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా (జేఎంఎం) ఫక్తు ప్రాంతీయ పార్టీ, కుటుంబ పార్టీ. ఉమ్మడి బిహార్‌లో అంతర్‌ ‌భాగమైన జార్ఖండ్‌ ‌గిరిజనుల పరిరక్షణ కోసం శిబూ సొరెన్‌ 1972‌లో జేఎంఎంను స్థాపించారు. ప్రత్యేక రా్ట్ర•ం కోసం పోరాడారు. 2000 నవంబరులో నాటి ప్రధాని వాజపేయి జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 90వ దశకంలో నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కాపాడే క్రమంలో జేఎంఎం ఎంపీలు అనుచిత లబ్ధి పొందారన్న ఆరోపణలు సంచలనం కలిగించాయి. ఇదే జేఎంఎం ముడుపుల కేసు. తొలుత శిబూ సొరెన్‌ ‌ముఖ్యమంత్రి కాగా ప్రస్తుతం ఆయన కుమారుడు హేమంత్‌ ‌సొరెన్‌ ‌జార్ఖండ్‌ ‌పీఠాన్ని అధిష్టించారు. జేఎంఎంలోనూ సొరెన్‌ ‌కుటుంబానిదే పెత్తనం.

మహారాష్ట్రలో

సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాంతీయ పార్టీల్లో శివసేన ఒకటి. దీని భావజాలం మరీ సంకుచితం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠీలకే సింహభాగం దక్కాలన్న నినాదంతో 1966లో ఈ పార్టీ పురుడు పోసుకుంది. దీనిని భూమిపుత్రుల ఉద్యమంగా అప్పట్లో వ్యవహరించేవారు. నినాదం అదే అయినా పార్టీ కనీసం మొత్తం మరాఠీలకూ ప్రాతినిథ్యం వహించడం లేదు. ముంబయి, పుణె వంటి చుట్టుపక్కల ప్రాంతాలకే పార్టీ పరిమితం. ఏనాడూ సగం అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేదు. సిద్ధాంతం ఏదైనా పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ‌ఠాక్రే ఉన్నంత కాలం దానికే కట్టుబడి పని చేసింది. ప్రస్తుతం ఆయన కుమారుడు ఉద్ధవ్‌ ‌ఠాక్రే నాయకత్వంలో పని చేస్తున్న పార్టీకి అధికార యావ తప్ప మరొకటి లేదు. ఇందుకోసం ప్రవచిత సిద్ధాంతాలను పక్కన పెట్టి బద్ద విరోధి కాంగ్రెస్‌ ‌సహకారంతో సర్కారు నడుపుతుండటం కాల వైచిత్రి. ఠాక్రే కుమారుడుగా తప్ప ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు ప్రత్యేక గుర్తింపు లేదు. శాసనమండలి ద్వారా చట్టసభలో ప్రాతినిధ్యం పొంది సీఎం పీఠం కాపాడుకున్నారు. బాల్‌ ‌ఠాక్రే మరో దగ్గరి బంధువు రాజ్‌ ‌ఠాక్రే కూడా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేరుతో మరో రాజకీయ కుంపటి పెట్టుకున్నారు. కుటుంబంలో గల ఆధిపత్య రాజకీయ పోరాటమే ఈ పరిస్థితికి దారితీసింది.

శరద్‌ ‌పవార్‌ ‌సారథ్యంలోని నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ (ఎన్‌సీపీ)జాతీయ/ కుటుంబ పార్టీగా పేరు గాంచింది. పవార్‌ ‌కూతురు సుప్రియా సూలె, మేనల్లుడు అజిత్‌ ‌పవార్‌ ‌పార్టీలో చక్రం తిప్పు తుంటారు. ఢిల్లీ కేంద్రంగా పవార్‌, ‌కూతురు, మేనల్లుడు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను గుప్పెట్లో పెట్టుకున్నారు. సుప్రియా సూలె పవార్‌ ‌సొంతగడ్డ బారామతి పార్లమెంటు సభ్యురాలు. అజిత్‌ ‌పవార్‌ ‌మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో ఉప ముఖ్యమంత్రి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విదేశీయత అంశంపై బహిరంగంగా విభేదించి బయటకు వచ్చిన పవార్‌ ‌తిరిగి అదే పార్టీతో పొత్తు పేరుతో అంటకాగి కేంద్రంలో అనేక పదవులు చేపట్టారు. ఇప్పుడూ అదే పార్టీ మద్దతు గల మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులోనూ పవార్‌ ‌పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. పవార్‌ ‌పార్టీకి ప్రత్యేక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. అధికారమే పరమావధి.

ఉత్తర ప్రదేశ్‌లో…

ఉత్తర ప్రదేశ్‌ ‌రాజకీయాలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దేశానికి ఎక్కువ పర్యాయాలు ఆ రాష్ట్రం నుంచి ప్రధానులు వచ్చారు. అంతటి ప్రభావం ఆ రాష్ట్రానిది. కానీ ఆ రాష్ట్రం మీద అత్యంత హీనంగా కులం నీడ పడింది. దానికి మైనారిటీ బుజ్జగింపు రోగం అంటుకుంది. కుటుంబ, కుల పార్టీకి మారుపేరు సమాజ్‌ ‌వాదీ (ఎస్పీ) పార్టీ. ఉత్తర ప్రదేశ్‌ ‌కేంద్రంగా దేశ రాజకీయాలలో అనేక వికృతాలకు కారణమైన దుష్ట సంప్రదాయాలను నెలకొల్పిన ఈ పార్టీకి ఆద్యుడు ములాయం సింగ్‌ ‌యాదవ్‌. 1992‌లో ఆవిర్భవించిన పార్టీకి ములాయం సామాజిక వర్గమైన యాదవులే కీలకం. యాదవులతో పాటు ముస్లిం ఓటుబ్యాంకు ఆధారంగా ఈ పార్టీ నిలబడింది. ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్‌ ‌ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. ఇప్పుడు అఖిలేశ్‌ ‌తండ్రిని పక్కనపెట్టి పార్టీని గుప్పెట్లో పెట్టుకున్నారు. పార్టీలో కుటుంబ కలహాల ప్రభావం ఉంది. పార్టీపై పెత్తనం చేజిక్కించు కున్న అఖిలేశ్‌ ‌ములాయం మొదటి భార్య కుమారుడు. ములాయం సోదరుడు శివపాల్‌ ‌సింగ్‌ ‌యాదవ్‌, ‌ములాయం బంధువు రామ్‌గోపాల్‌ ‌యాదవ్‌ ‌తొలి రోజుల్లో వైభవం చూశారు. ఇప్పుడు వారు అఖిలేశ్‌తో విభేదించారు. అఖిలేశ్‌ ‌భార్య డింపుల్‌ ‌యాదవ్‌ ‌పార్టీపై కొంతకాలం పెత్తనం సాగించారు. ములాయం రెండో భార్య కుమారుడి భార్య అపర్ణా యాదవ్‌ను అఖిలేశ్‌ ‌రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడు తున్నారు. దీంతో ఆమె బీజేపీలో చేరారు. ఒక్క అపర్ణా మాత్రమే కాకుండా కొంతమంది ములాయం కుటుంబ సభ్యులు సైతం అఖిలేశ్‌ ‌పెత్తనానికి తలొగ్గలేక బీజేపీలో చేరిపోయారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొనేందుకు అఖిలేశ్‌ ‌సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికీ ఆయన నమ్ముకుంటున్నది కులం, మతం పాచికలనే. హిందువులపై విషం కక్కే అఖిలేశ్‌ ఇప్పుడు ఉదార హిందూవాదాన్ని తలకెత్తుకున్నారు.

యూపీలోనే మరో ప్రాంతీయ/జాతీయ పార్టీ బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ (బీఎస్పీ). దివంగత కాన్షీరామ్‌ ‌సారథ్యంలో పురుడు పోసుకున్న ఈ పార్టీ ప్రస్తుతం ఆయన శిష్యురాలు మాయావతి నాయకత్వంలో సాగుతోంది. 1984 ఏప్రిల్‌ 14‌న అంబేడ్కర్‌ ‌జయంతి నాడు ప్రస్థానం ప్రారంభిం చింది. దళితుల సంక్షేమం, వారి ప్రయోజనాల పరమావధిగా పార్టీ నడుస్తోంది. గతంలో నాలుగు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి ప్రస్తుతం రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటు న్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లు సాధించిన పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కానుంది. తొలి రోజుల్లో దళితుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రచారం చేసిన మాయావతి యూపీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించలేకపోయారు. అప్పట్లో బ్రాహ్మణ, బనియాలపై విరుచుకుపడిన మాయావతికి క్రమంగా రాజకీయం అర్థమైంది. అన్ని వర్గాలనూ కలుపుకొని పోనట్లయితే రాజకీయంగా మనుగడ కష్టమని గ్రహించారు. అందుకనే సర్వ ధర్మ సమభావ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఫలితంగా నాలుగోసారి యూపీలో సంపూర్ణ ఆధిక్యంతో అధికారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని మరో కుటుంబ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ). దీనిని కూడా కుటుంబ, కుల పార్టీ అని చెప్పడం తొందర పాటు కాదు. ఇది ఉప ప్రాంతీయ పార్టీ అని చెప్పవచ్చు. పశ్చిమ యూపీలోనే దీనికి పట్టుంది. ముఖ్యంగా సంపన్న జాట్‌ ‌రైతులే వెన్నెముక. దివంగత మాజీ ప్రధాని చరణ్‌ ‌సింగ్‌ ‌మనవడు జయంత్‌ ‌సింగ్‌ ‌చౌదరి దీనికి సారథి. చరణ్‌సింగ్‌ ‌కుమారుడైన అజిత్‌సింగ్‌ ‌కమారుడు జయంత్‌. ఇలా తాత, తండ్రి వారసత్వంతో రాజకీయంగా జయంత్‌ ‌కిందామీదా పడుతున్నారు. జయంత్‌ ‌తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకుని రాజకీయ మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధాని పదవి కోసం తాను జీవితాంతం వ్యతిరే కించిన ఇందిరాగాంధీతో చేతులు కలిపిన చరిత్ర చరణ్‌సింగ్‌ది. ఆయన తనయుడు అజిత్‌ ‌సింగ్‌ ‌సైతం కేంద్రంలో మంత్రి పదవి కోసం రాజకీయ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు.

హరియాణాకు చెందిన ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ)కు ప్రాంతీయ పార్టీగా సుదీర్ఘ చరిత్రే ఉంది. జనతాదళ్‌ ‌హయాంలో వీపీ సింగ్‌ ‌మంత్రివర్గంలో ఉప ప్రధానిగా పనిచేసిన దేవీలాల్‌ ‌దీని వ్యవస్థాపకుడు. దేవీలాల్‌ ఆ ‌రాష్ట్ర ముఖ్య మంత్రిగా చక్రం తిప్పారు. జనతాదళ్‌లో చీలికతో ఐఎన్‌ఎల్‌డీ పేరిట సొంత పార్టీని 1996లో ప్రారంభించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఓం ప్రకాశ్‌ ‌చౌతాలా పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌతాలా 2013లో టీచర్ల రిక్రూట్‌మెంట్‌ అ‌క్రమాలలో జైలుకెళ్లారు. ప్రస్తుతం ఐఎన్‌ఎల్‌డీ నామమాత్రం ఉంది. దేవీలాల్‌ ‌ముని మనవడు, ఓం ప్రకాశ్‌ ‌చౌతాలా మనవడు దుష్యంత్‌ ‌చౌతాలా జననాయక్‌ ‌జనతా పార్టీ పేరుతో ప్రత్యేక పార్టీ స్థాపించారు. అక్కడి బీజేపీ సర్కారులో దుష్యంత్‌ ఉప ముఖ్యమంత్రి. తాత, తండ్రి, మనవడు, ముని మనవడు… ఇలా కుటుంబంలోని నాలుగో తరం కూడా పార్టీపై పట్టు సాగించడం ప్రాంతీయ పార్టీల్లోనే సాధ్యం.

మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ (‌టీఎంసీ) ఇతర ప్రాంతీయ పార్టీలకు నకలు. బెంగాల్లోని సీపీఎం సర్కారుపై పోరాటంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తనకు స్వేచ్ఛ ఇవ్వడం లేదంటూ జనవరి 1, 1998న మమతా బెనర్జీ పార్టీ ప్రారంభించారు. కర్త, కర్మ, క్రియ మొత్తం మమతే. పార్టీలో, ప్రభుత్వంలో ఆమె మాట వేదవాక్కు. మమత అవివాహిత. అయిన్పటికీ టీఎంసీ కూడా కుటుంబ పార్టీగా ముద్ర పడింది. మేనల్లుడు అభిషేక్‌ ‌బెనర్జీ మమత తరఫున పార్టీ వ్యవహారాలు చక్కబెడు తుంటారు. మూడు పదుల అభిషేక్‌ ‌ముందు సీనియర్లు సైతం చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. డైమండ్‌ ‌హార్బర్‌ ‌నియో జకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తు న్నారు.

జనతా పార్టీ ముక్కలు

జనతా పార్టీ కాంగ్రెస్‌ ‌పాలనకు బీటలు వారించింది. ఆ మేరకు దేశానికి గొప్ప మేలు చేసినా, తరువాత ఆ పార్టీ నుంచి పేలికలు ఫెడరల్‌ ‌వ్యవస్థకు హాని చేసే తీరులో రూపాంతం చెందాయి. లాలూ ప్రసాద్‌, ‌ములాయం నాయకత్వం లోని పార్టీలు అందుకు తిరుగులేని ఉదాహరణ. ఆ పార్టీని స్థాపించిన సోషలిస్టు నేతల, జేపీ వంటి నాయకుల కలలను నిలువునా దహనం చేసిన ఘనత జనతా చీలిక వర్గాలకే చెందుతుంది. బిహార్‌కు చెందిన మరో కుటుంబ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ). ఒక ప్రాంతీయ పార్టీ ఎంత ప్రమాదకారో, ఎంత అవినీతిమయం కాగలదో, కుటుంబ జేబు సంస్థ కాగలదో చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఈ పార్టీయే. దాణా అక్రమాల ఆరోపణలతో జైలు పాలైన లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌ ‌దీనికి ఆద్యుడు. జనతా, జనతాదళ్‌ ‌పార్టీల చీలిక నేపథ్యంలో 1997లో ఆర్‌జేడీ పేరుతో లాలూ సొంతంగా రాజకీయ కుంపటిని ప్రారంభించారు. యాదవుల సంక్షేమం, ప్రయోజనాలే దీని పరమావధి. యాదవులు, ముస్లింల ఓటుబ్యాంకు ఆధారంగా రాజకీయంగా మనుగడ సాగిస్తోంది. పశుదాణా కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ అరెస్టు కావడంతో, అధికారాన్ని తన భార్యకు రబ్రీదేవికి బదిలీ చేశారు. అప్పటికి రబ్రీకి రాజకీయ అనుభవం శూన్యం. పరిపాలన అనుభవం అసలే లేదు. ఇప్పుడు మూడోతరంలో లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ ‌పార్టీకి సారథిగా ఉన్నారు. ఆయనకు పార్టీ పగ్గాలు లభించడానికి గల ఏకైక కారణం లాలూ కుమారుడు కావడమే. ప్రాంతీయ పార్టీల్లో నాయ కత్వానికి, పదవులకు అర్హత ప్రతిభ, తెలివితేటలు, సమర్థత కానేకావు. కేవలం వారసత్వమే ప్రధాన ప్రాతిపదిక. బిహార్‌కు చెందిన మరో ప్రాంతీయ పార్టీ లోక్‌ ‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)దీ ఇదే పరిస్థితి. జనతాదళ్‌ ‌నుంచి విడిపోయిన దివంగత దళిత నాయకుడు రామ్‌ ‌విలాస్‌ ‌పాశ్వాన్‌ ‌పార్టీకి మూల పురుషుడు. నితీశ్‌తో విభేదాల కారణంగా పాశ్వాన్‌ అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో సొంత కుంపటిని ప్రారంభించారు. పాశ్వాన్‌ ‌మరణా నంతరం ఆయన సోదరుడు, తనయుడు చిరాగ్‌ ‌పాశ్వాన్‌ ‌మధ్య పార్టీ పగ్గాల కోసం పోరు జరిగింది. చివరికి చిరాగ్‌కే పార్టీపై పట్టు లభించింది. రాష్ట్రానికే చెందిన మరో ప్రాంతీయ పార్టీ జనతాదళ్‌ (‌యునైటెడ్‌). ‌దీనిని జనతాదళ్‌ (‌యు)అని కూడా వ్యవహరిస్తారు. జనతాదళ్‌ ‌ప్రయోగం విఫలం అనంతరం జార్జి ఫెర్నాండెజ్‌, ‌శరద్‌ ‌యాదవ్‌ ‌వంటి సీనియర్లు ఈ పార్టీని స్థాపించారు. దీని బలం బిహారుకే పరిమితం. పార్టీకి ప్రస్తుతం కర్త, కర్మ, క్రియ అంతా ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌. ‌కానీ వారసత్వ ఆరోపణలు లేవు. కర్ణాటకలో జేడీ(ఎస్‌)  ‌దేవెగౌడ కుటుంబం ఏలుబడిలో వర్ధిల్లుతోంది. జేడీ కుమారస్వామి ప్రస్తుతం పార్టీని నిర్వహిస్తున్నారు.

దక్షిణ భారతదేశంలో

దక్షిణ భారతదేశానికి వస్తే ద్రవిడ పార్టీలు కనిపిస్తాయి. ద్రవిడ కళగం అనే ఒక్క పార్టీ నుంచి, దాని సిద్ధాంతం నుంచి చీలికలు పేలికలైన పార్టీలే ఇవన్నీ. అందులో ప్రధానమైనవి డీఎంకే, అన్నాడీఎంకే. రెండు పార్టీలు ఆశయాలకీ, ఆచరణకీ సుదూరంగా ఉంటాయి. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాజకీయ అధికారం, ఆత్మ గౌరవ నినాదంతో వచ్చిన ఈ పార్టీలు చివరికి వాటికి పార్టీలో చోటు లేకుండా చేశారు. ఇందులో డీఎంకే మరీ సిగ్గు విడిచిన పార్టీ. రామస్వామి నాయకర్‌ ‌నుంచి అన్నాదొరై, అన్నాదొరై నుంచి కరుణానిధి, కరుణానిధి నుంచి ఎంజీఆర్‌ ‌పార్టీలను చీల్చుకుంటూ వచ్చారు. అన్నాడీఎంకేలో భార్యల ఆధిపత్యం కనిపిస్తుంది. డీఎంకేలో కొడుకుల ఆధిపత్యం. అభ్యుదయం, హిందూ వ్యతిరేకత కరుడగట్టిన డీఎంకే అధినేత కరుణానిధికి ముగ్గురు భార్యలు. మొగలుల రాజకీయ ఆధిపత్య పోరును గుర్తుకు తెస్తూ వారి సంతానం మధ్య అధికార పోరాటం మొదలయింది. చివరికి ఎంకె స్టాలిన్‌ ‌విజయం సాధించారు. అళగిరి, కనిమొళి వెనుక ఉండిపోయారు. ఈ రెండు పార్టీల మీద ఉన్న అవినీతి ఆరోపణలకు కొదవే లేదు. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరిపడని వ్యక్తి పూజ ఈ పార్టీలలో పరమ జుగుప్సాకరంగా విస్తరించింది.

కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా, ఆంధప్రదేశ్‌ అభివృద్ధి అన్న నినాదాలతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అచ్చంగా వాటిలోనే కూరుకు పోయింది. ఎన్‌టీఆర్‌, ‌చంద్రబాబునాయుడు ఇంతవరకు ఆ పార్టీకి నాయకత్వం వహించారు. 1982 నుంచి మరొకరు ఎవరూ నాయకత్వ హోదాకు రాలేదు. నాయకత్వం కోసం పోటీ పడినవారు కూడా లక్ష్మీపార్వతి, డాక్టర్‌ ‌దగ్గుపాటి వెంకటేశ్వరరావులు మాత్రమే. ఇప్పుడు లోకేశ్‌ ఇప్పటికే చంద్రబాబు అప్రకటిత వారసునిగా రాజ్యమేలుతున్నారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నిజానికి ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ. కానీ తాను పదవి ఇవ్వక పోవడం వల్లనే కేసీఆర్‌ ఈ ‌పార్టీ స్థాపించారని చంద్రబాబు ఒకసారి అన్నారు. ఇది చిదంబర రహస్యం. చంద్రబాబు మీద ఆగ్రహంతోనే కేసీఆర్‌ ‌పార్టీని స్థాపించారు. అయితే ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్‌ను కూడా ఆశ్రయించారు. ఇప్పుడు ఈ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ కూడా బంధుప్రీతి. అవినీతి కూడా. కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌కవిత, హరీశ్‌రావు కీలక బాధ్యతలలో ఉన్నారు. చాలా ప్రాంతీయ పార్టీల మాదిరిగానే ఏళ్లు గడచిపోతున్నా ఒకే నినాదంతో తెలుగునాట ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడానికి చూస్తున్నాయి. తమను ఎవరో వెనుకబాటుకు గురిచేశాయన్న నినాదంతోనే నడుస్తున్నాయి. ఈ పార్టీలకు కీలకమైన గడ్డు సమస్య వస్తే మళ్లీ వెనుకటి నినాదాలనే ఆశ్రయించడం పరిపాటి.

ఇక వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ఏక వ్యక్తి పార్టీ. వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి ఒక రాజకీయ వారసత్వం ఉన్నవారే. ఈ పార్టీ మీద అదనంగా క్రైస్తవ అనుకూల ముద్ర పడింది. ఒక కులానికి కొమ్ము కాస్తున్నాయన్న ఆరోపణ ఈ మూడు పార్టీల మీద సమంగానే ఉంది. చిరకాలం కేవలం హైదరాబాద్‌ ‌నగరానికి పరిమితమై, ఇప్పుడు విస్తరణ బాట పట్టిన ఎంఐఎం దేశంలోనే అత్యంత మతతత్వ పార్టీలలో ఒకటి. దీని నేతలు సలావుద్దీన్‌ ఒవైసీ, అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ‌వీరంతా రక్త సంబంధీకులే. ఎంఐఎం, తెరాస టామ్‌ అం‌డ్‌ ‌జెర్రీ తరహాలో వ్యవహరిస్తూ ఉంటాయన్నది బహిరంగ సత్యం.

ఎనిమిదో దశకంలో ప్రపుల్ల కుమార్‌ ‌మహంతా నాయకత్వంలో ఈశాన్యంలో అసోంలో అసోం గణ పరిషత్‌ (ఏజీపీ) పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది. బంగ్లాదేశ్‌ ‌చొరబాటుదారుల నుంచి అస్సామీయుల ప్రయోజనాలను, ఉద్యోగాలను కాపాడటం దీని ప్రధాన లక్ష్యం. తొలిరోజుల్లో పార్టీపై మహంతా, ఆయన భార్య పెత్తనం కొనసాగింది. ఇందులో అంతర్గత కలహాలు ఎక్కువ. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఏజీపీ ప్రభావం నామమాత్రమే. అసోంకే చెందిన మరో ప్రాంతీయ పార్టీ ఏఐయూడీఎఫ్‌ (ఆలిండియా యునైటెడ్‌ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌). ‌సుగంధ ద్రవ్యాల వ్యాపారి బద్రుద్దీన్‌ అజ్మల్‌ ‌దీని వ్యవస్థాపకుడు. దీనిని ప్రాంతీయ పార్టీ అని చెప్పడం కూడా సరికాదు. ఉప ప్రాంతీయ పార్టీ. ఇది ముస్లింల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్య మిస్తుంది. పార్టీపై అజ్మల్‌ ‌కుటుంబ ప్రభావం అపరిమితం. పార్టీ సంకుచిత భావజాలంతో పని చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలకు లెక్కలేదు. జిల్లాకో పార్టీ, డివిజన్‌ ‌కో పార్టీ అక్కడ మనుగడ సాగిస్తుంటాయి. వాటికి నిర్దిష్ట భావజాలం అంటూ ఏమీ ఉండదు. పార్టీని నడిపే వ్యక్తి, కుటుంబ ప్రయోజనాలే వాటికి ముఖ్యం. ఏ ఎండాకా గొడుగు పట్టడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అంతిమంగా అధికారంలో కొనసాగడం, లేదా కనీసం అధికారానికి దగ్గరగా అయినా ఉండటం వాటి లక్ష్యం. అంతే తప్ప భావజాలం, సిద్ధాంతాలు, విలువలు వంటి బాదరబందీ వంటివి వాటికేమీ ఉండదు. ఇలాంటి వ్యక్తులు నడిపే పార్టీల వల్ల దేశానికి మేలు జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకమే. దేశం ఎటుపోతే వాటికేమీ పట్టదు. వ్యక్తిగతంగా తమకు తమ కుటుంబానికి మేలు జరగడమే వాటికి కావలసింది. అధికారం కోసం ప్రాంతీయ పార్టీలు అవాంఛనీయ శక్తుల ప్రాపకం కోసం ప్రయత్నిం చడం సర్వసాధారణంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌లో మమత విచ్ఛిన్నకర శక్తులకు స్వేచ్ఛనిచ్చి, వారి గెలుపు కోసం బాటలు వేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో రొహింగ్యాల ఉనికిని ఎంఐఎంతో బంధాన్ని బట్టి తెరాస పట్టించు కోవడం లేదన్న ఆరోపణ బలంగానే ఉంది. కొన్ని జాతీయ పార్టీలు కూడా తమ ప్రాంతం వైపు కేంద్రం చూడకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. కేరళలో సీపీఎం ప్రభుత్వం అందుకు మంచి ఉదాహరణ. మమత వైఖరి కూడా ఇందుకు భిన్నం కాదు. ఆ ప్రాంతాల మీద తమదే పూర్తి ఆధిపత్యమన్న రీతిలో, నియంతల ధోరణిలో వీరు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రాంతీయ పార్టీలకు మార్గదర్శకమవుతున్నది. ప్రాంతీయ పార్టీలు ఉండరాదని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. వాటిపై నిషేధం ఏమీ లేదు. కానీ అవి బాధ్యతాయుతంగా, సమాఖ్య విధానాన్ని గౌరవించి, దానికి కట్టుబడి పని చేయడం అవసరం. రాజకీయాలను పక్కనపెట్టి దేశ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో కలసి నడవాలి. అప్పుడే సమాఖ్య విధానం పరిఢవిల్లు తుంది. భారత స్వాతంత్య్ర యోధుల ఆశయాలలో ఒకటైన విశాల భారతానికి ప్రాంతీయ పార్టీలు ముప్పు తెచ్చే విధంగా వ్యవహరించడం మహా తప్పిదమవుతుంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram