ఆర్షధర్మం, హిందూత్వ, హిందూధర్మం, భారతీయత… ఈ పదాలు వింటే చాలు ఉన్మాదులైపోయే వ్యక్తులు, సంస్థలు ఈ భూగోళం మీద రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆ ద్వేషం విదేశాలలోనే కాదు, భారతదేశంలో కూడా ఉంది. ఈ వికృత ధోరణి ఈ మధ్య వేలం వెర్రిగా విస్తరిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశమంతటా ఆదరణ పొందడం, బీజేపీ బలపడడం, మొదట అటల్‌ ‌బిహారీ వాజపేయి, తరువాత నరేంద్ర మోదీ ఆ పార్టీ నుంచి ప్రధానులు కావడం, అయోధ్య తీర్పు హిందువులకు అనుకూలంగా రావడం, జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ‌రద్దు వంటి పరిణామాల తరువాత దేశంలో హిందూ వ్యతిరేకులు, ముస్లింలు, ఉదారవాదులు, సెక్యులరిస్టులు, విదేశాలలో హిందూ వ్యతిరేకులు, క్రైస్తవ మిషనరీల ఏజెంట్లు, ఉదారవాదులు అసలు సమూల హిందూత్వ ‘విధ్వంసం’ కోసం స్త్వైరవిహారం చేయడం ఆరంభించారు. కానీ దేశంలో వాస్తవంగా జరుగుతున్నదేమిటి? ప్రపంచ వేదికల మీద హిందుత్వ మీద వినిపిస్తున్న భాష్యాలలో నిజమెంతో పరిశీలించాలన్న తార్కిక దృష్టి బొత్తిగా నశించిపోయింది. ఈ మధ్యనే హిందూత్వ మీద కొందరు ముస్లిం నాయకులు చేసిన ప్రకటనలు చూస్తే చాలు, హిందూత్వ మీద వీళ్లంతా వెళ్లగక్కుతున్న ద్వేషం, చిమ్ముతున్న విషం ఎంత అసంబద్ధమో అర్థమవుతుంది. ఇక్కడ ఉదహరిస్తున్నవి కొన్ని ప్రముఖ ఉదంతాలు. ఇవి కాక హిందువుల మీద ద్వేషంతో జరిగే కార్యకలాపాల గురించి సామాజిక మాధ్యమాలలో వస్తున్న సమాచారం చూస్తే రక్తం ఉడికిపోతుంది. అవే కొన్ని వేలు.

1990, డిసెంబర్‌ ‌మాసంలో ఒక్క రాత్రిలోనే కశ్మీర్‌ ‌లోయ నుంచి కొన్ని వేలమంది పండిట్‌లను తరిమివేశారు. చంపారు. లైంగిక అత్యాచారాలు చేశారు. తమ సొంత గడ్డను విడిచిపెట్టి ఫుట్‌పాత్‌ల మీద, పునరావాస శిబిరాలలోను దశాబ్దాలపాటు తలదాచుకున్న పండిట్‌లు ఆ దురంతం 32 ఏళ్లు గడచిన సందర్భాన్ని బాధగా తలుచుకున్నారు. భారతదేశంలో మైనారిటీల కోసం గొంతు చించుకునే ఈ మేధావులు, అంతర్జాతీయ వేదికలు కశ్మీర్‌లో ఈ మైనారిటీలకు పట్టిన దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదు?

పౌర సవరణ చట్టం గురించి భారతదేశంలో ముస్లింలు, ఉదారవాదులు, సెక్యులరిస్టులు చేసిన హంగామా ఎవరూ మరవరు. షాహీన్‌బాగ్‌లో వినిపించిన దేశ వ్యతిరేక ప్రసంగాలు, దేశ విభజన నినాదాలు కూడా గుర్తుండే ఉంటాయి. పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా గుల్బర్గాలో జరిగిన సభలో మాజీ మజ్లిస్‌ ‌శాసనసభ్యుడు వారిస్‌ ‌పఠాన్‌ ‌వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాలి. ఆ వివాదాస్పద రాజకీయ పార్టీ, అంతకు మించి దాని వివాదాస్పద నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలోనే పఠాన్‌ ‘‌ముస్లిము లంతా ఏకమై, స్వాతంత్య్రం తెచ్చుకోవలసిన సమయం వచ్చేసింది’ అన్నాడు. ఈ దేశంలో ముస్లింలు 15 కోట్లే కావచ్చు. కానీ వారు ఈనాటికీ 100 కోట్ల హిందువుల మీద వారే ఆధిపత్యం చెలాయిస్తారు అని కూడా వ్యాఖ్యానించాడు. ఇది మధ్య యుగాల నాటి దురాక్రమణదారుల మనస్తత్వం కాదా? ముస్లింలంటేనే భయపడే హిందువులు, వారు ఘర్షణకు దిగితే ఏమౌతుందో ఆలోచించాలి అని కూడా సవాలు విసిరాడు.

2020 ఏప్రిల్‌లోనే హిందుస్తాన్‌ ‌లైవ్‌ ‌ఫర్హాన్‌ ‌యాహియా అనే చానల్‌ ఒక వీడియో ప్రసారం చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అమానుతుల్లా ఖాన్‌ ‌చేసిన వ్యాఖ్య ఇందులో ఉంది. సమస్యను పరిష్కరించుకునే క్రమంలో ఉన్నారు కాబట్టి ముస్లింలు మౌనంగా ఉన్నారు. ముస్లింలే రోడ్డెక్కితే ఇక ఉత్పాతమే. ప్రవక్తను అవమానిస్తే ముస్లింలు సహించరు… అన్నాడు ఖాన్‌. ‌దేశంలో ఇప్పుడు ప్రవక్తను ఎవరు అవమానించారు? ఎమ్మెల్యే కూడా అయిన అమానుతుల్లా ఈ దేశంలో చట్టం ఒప్పుకోదు కాబట్టి కానీ, లేకపోతే స్వామి యతి నరసింగానంద సరస్వతి తల నరుకుతానని బెదిరించాడు.

ఎంఐఎం నాయకుడే అక్బరుద్దీన్‌ 2012‌లో చేసిన బెదిరింపు ఇప్పటికీ ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారు. 15 నిమిషాలు పోలీసులు పక్కకి తప్పుకుంటే వంద కోట్ల హిందువులను తుద ముట్టిం చెయ్యగలమని అన్నాడు. తాను తన బెదిరింపులో వెనక్కి తగ్గలేదని 2019లో మళ్లీ అతడు అవే మాటలు చెప్పాడు.

అక్బరుద్దీన్‌ ‌సోదరుడు అసదుద్దీన్‌ ‌హిందువులను బెదిరించడానికి అవకాశాన్ని సృష్టించుకుంటూ ఉంటాడు. దేశంలో ముస్లింలకు గౌరవం లేదని అంటాడు ఇతడు. ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్‌ ‌మెమెన్‌ ఉరిశిక్షను ఎందుకు ఆపలేక పోయామంటే, ముస్లింలు అధికారంలో లేకపోవడం వల్లనే అని తేల్చాడు. భారత రాజ్యాంగం మీద, భారత సార్వభౌమాధికారం మీద మజ్లిస్‌కు ఉన్న గౌరవం ఏపాటిదో, హిందువుల పట్ల ఉన్న గౌరవం ఎంతటిదో ఈ వ్యాఖ్యలు చెప్పడం లేదా? పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాలు తమను తిరస్కరిస్తే జిహాద్‌ ‌నిర్వహిస్తామని మౌలానా జర్జిస్‌ అన్సారి హఫీజుల్లా  చేసిన హెచ్చరికను ఎంకె ఇస్లామిక్‌ అనే చానెల్‌ ‌ప్రసారం చేసింది.

ముంబైలో పుట్టి, దేశంలో మత విద్వేషం చిమ్మి ప్రస్తుతం విదేశాలలో ఉన్న జకీర్‌ ‌నాయక్‌ ‌ఘనత తెలిసిందే. ముస్లిం దేశాలన్నీ కలసి, భారతదేశంలో ఉన్న ముస్లిం వ్యతిరేకుల జాబితాలు సేకరించాలనీ, వాళ్లు ఆయా ముస్లిం దేశాలలో అడుగు పెడితే వెంటనే అరెస్టు చేయాలని జకీర్‌ ‌పిలుపునిచ్చాడు. పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ‌పఖ్తున్‌క్వాలో ఒక పురాతన కృష్ణాలయాన్ని ముస్లిం మతోన్మాదులు కూల్చినప్పుడు జకీర్‌, ‌ముస్లిం భూభాగాల మీద హిందూ దేవాలయాలు ఉండకూడదని ప్రకటించాడు. ఇవి కొన్ని ఉదాహరణలు.

సీఏఏ వ్యతిరేక ఆందోళనలలో భాగంగానే ఉత్తర ప్రదేశ్‌కి చెందిన తౌకీర్‌ ‌రజాఖాన్‌ ఆ ‌చట్టాన్ని ఉపసంహరించకుంటే దేశంలో రక్తపుటేరులు పారించాలని పిలుపునిచ్చాడు. ఇటీవల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తూ, ముస్లిం యువకులు ఆయుధాలు చేపడితే హిందువులకు దాక్కోవడానికి కాస్త చోటు కూడా ఉండదని బాహా•ంగా వ్యాఖ్యానించాడు. అజయ్‌ ‌వర్మ అనే కాంగ్రెస్‌ ‌నాయకుడు సీఏఏపై ఒక చానెల్‌ ‌పెట్టిన చర్చలో మాట్లాడుతూ 25 కోట్ల మంది భారతీయ ముస్లింలకు పాకిస్తాన్‌ ‌వలెనే ఒక దేశాన్ని ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చాడు. ఈ దేశంలో మసీదులు తగలబెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే కనీసం 50 కోట్ల మంది హిందువులు ఈ వైరస్‌ (‌కరోనా)తో చచ్చిపోవాలని శపించాడు పీర్జాదీ అబ్బాసుద్దీన్‌ ‌సిద్ధికి అనే మౌల్వీ. అన్నట్టు ఇతడు కూడా కాంగ్రెస్‌ ‌మద్దతుదారుడే. కాంగ్రెస్‌ ‌నాయకుడు సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ ‌హిందువులను తాలిబన్‌, ‌బోకొహరాం ఉగ్రవాదులతో పోల్చి చెప్పాడు.

రాముడు అయోధ్యలో జన్మించాడు అన్న సారాంశంతో ఉన్న ఒక భజన్‌ను దూరదర్శన్‌లో పాడుతూ ఉంటే మాలిని అశ్వత్థ్ అనే గాయనని వెంటనే పాడకుండా అపేశారు. ఇది యూపీఏ హయాంలో జరిగింది. మొన్న సెప్టెంబర్‌లో ఆమె ఈ విషయం బయటపెట్టారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మౌలికంగానే హిందూ వ్యతిరేక, ముస్లిం అనుకూల పార్టీ అని ఉత్తర ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాకేశ్‌ ‌సింగ్‌ ‌చెప్పారు. ఇక తమిళనాడులో ద్రవిడ పార్టీల హిందూ వ్యతిరేక నినాదాలు, ప్రకటనలు కోకొల్లలు. క్రైస్తవ మిషనరీలు, మత గురువులు చేసిన ప్రకటనలు కూడా తక్కువేమీ కాదు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram