– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌కంటికి కనిపించని ఆ జీవి అలా రూపాలు మార్చుకుంటూ, ప్రపంచాన్ని వణికిస్తూ మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది. ఇప్పుడు కరోనా వైరస్‌ ‌కొత్త అవతారం పేరు ఒమిక్రాన్‌. ‌మళ్లీ భూగోళం మీద అదే కంగారు. మళ్లీ పాఠశాలు మూత. కొన్ని దేశాలలో లాక్‌డౌన్‌ ‌కోసం యోచన. రాత్రి కర్ఫ్యూతో సరిపెట్టే ఆలోచన. వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం పెంపునకు ఆదేశాలు. రెండు డోసులు వేసుకున్న కరోనా బారిన పడ్డామంటూ ఆందోళనలు మరొకవైపు. ఈ నేపథ్యంలోనే పిల్లల కోసం వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం మొదలయింది. కరోనా పాత రూపాల కంటే వేగం గలదిగా పేర్గాంచిన ఒమిక్రాన్‌ను చూసి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందే. మరీ ముఖ్యంగా  నిపుణుల అభిప్రాయం ప్రకారం గతంలో కరోనాకు గురైన వారు  ఒమిక్రాన్‌ ‌బారిన పడడానికి అవకాశాలు ఎక్కువ. ఇది బాగా అందోళన కలిగిస్తున్నది.

నవంబర్‌ 24, 2021‌న తమ దేశంలో కొత్త రకం వేరియంట్‌ను కనుగొన్నామని  దక్షిణ ఆఫ్రికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియచేసింది. దానికే చివరికి ఒమిక్రాన్‌ అన్న పేరు ఖరారయింది. మరునాడే దక్షిణ ఆఫ్రికా ఆరోగ్యమంత్రి జో ఫాహ్లా ఇంకొన్ని వివరాలు తెలియచేశారు. ఒమిక్రాన్‌నే బి.1.1.529 అని కూడా పిలిచారట. ఏ రాయి అయితేనేం, పళ్లు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు, దీని పేరు ఏదైనా అది కరోనా కుటుంబంలోనిదే. దానికీ ఆ కుటుంబ లక్షణాలే ఉన్నాయి.బోట్స్వానా నుంచి హాంకాంగ్‌ ‌వెళ్లిన ఒక వ్యక్తిలో దీనిని కనుగొన్నారు. అప్పుడే అధికారికంగా నవంబర్‌ 26‌న ఒమిక్రాన్‌ అనే పేరు స్థిరపడింది (ఒమిక్రాన్‌ అం‌టే గ్రీకు వర్ణమాలలోని 15వ అక్షరం పేరు. బి.1.1.617.2. వంటి శాస్త్ర సంకేతాలతో చెప్పడం, వివరించడం కష్టం కాబట్టి ఈ పేరు తీసుకున్నారు). ఇది ఆందోళన కలిగించేదేనని కూడా ముద్ర వేసింది. దీనితో అంతర్జాతీయ ప్రయాణాల మీద ఆంక్షలు మొదలయి నాయి. దీనికి వేగం ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్పిన మాటను నిజం చేస్తూ అది ఇంతలోనే యూరప్‌కు పాకింది. ఇజ్రాయెల్‌, ఆ‌స్ట్రేలియా, కెనడాలకు కూడా పాకిపోయింది. అంటే 2019 నాటి భయాందోళనలు యథా ప్రకారం చుట్టుముట్టేశాయి. ఇంత ఆధునిక కాలంలో, ఇంత అనుభవం తరువాత కూడా ప్రపంచం ఆలోచన పదునెక్కడం లేదు. కరోనా వైరస్‌కు ఉన్న వేగం, మనిషి బుద్ధికి లేదనిపిస్తున్నది. నిజానికి దక్షిణాఫ్రికాలో నవంబర్‌ 24‌న కనుగొన్న కొత్త వైరస్‌ ఆనవాళ్లు నవంబర్‌ 9‌న కనుగొన్నవే. ఇది జరిగి నెల కాకుండానే అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ ‌నిర్ధారణ అయిపోయింది. నవంబర్‌ 22‌న దక్షిణాఫ్రికా నుంచి కాలిఫోర్నియా వచ్చిన ఒక  వ్యక్తిలో ఈ వైరస్‌ ఉన్నట్టు రుజువైంది. ఆపై సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

కరోనా మహమ్మారి నుంచి యావత్‌ ‌ప్రపంచం క్రమంగా కుదుటపడుతున్న తరుణంలో ఇలా అనూహ్యంగా వెలుగుచూసిన ఒమిక్రాన్‌ అం‌తర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని అధిగమించే మార్గాలపై ప్రభుత్వాలు అన్వేషణలు ప్రారంభించాయి. నివారణ చర్యలు, జాగ్రత్తలు, సంసిద్ధతపై అన్ని దేశాలు ఇప్పుడు దృష్టి సారిస్తు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‌ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఒమిక్రాన్‌ ‌పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ప్రజల్లో, ఆయా దేశాల్లో వ్యక్తమవుతోంది. కొత్త సంవత్సర ప్రారంభ వేళ కొత్త మహమ్మారి ప్రభావంపై వివిధ రకాల విశ్లేషణలు, అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక పక్క ఇది మరీ అంత ప్రమాదకారి కానప్పటికీ అప్రమత్తత అవశ్యమని నిపుణులు వివరిస్తున్నారు. అదే సమయంలో ఇది క్రమక్రమంగా అన్ని దేశాలకూ వ్యాపిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌పాత రికార్డులను తిరగరాస్తుందన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. కొవిడ్‌ ‌నుంచి కోలుకున్నవారికి, రెండు డోసులు తీసుకున్నవారికి సైతం ఒమిక్రాన్‌ ‌సోకడం ఆందోళన కలిగించే అంశం. దక్షిణాఫ్రికాలో నెలరోజుల క్రితం ఒమిక్రాన్‌ ‌తొలిసారి వెలుగు చూడటానికి ముందు ప్రపంచవ్యాప్తంగా గల క్రియాశీలక కేసులతో పోలిస్తే ఇప్పడు కేసులు 50 శాతానికి పైగా ఉన్నాయి. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ 70 ‌రెట్లు వేగవంతంగా సంక్రమిస్తుందని కొన్ని అధ్యయనాలు చాటుతున్నాయి. అయితే ఇందులో ఊరట కలిగించే అంశం ఒకటుంది. వ్యాధి విస్తరణ వేగంగా ఉన్నప్పటికీ బాధితులకు తీవ్ర అనారోగ్యం, మరణం ముప్పు తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువమందికి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. కొంతమందికి వైరస్‌ ‌సోకిన విషయమే తెలియడం లేదు. ఇలాంటివారి ద్వారా వైరస్‌ ‌విస్తరించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి విస్తరణ వేగంగా ఉండటం, ఎక్కువమందికి సోకడం వల్ల వైద్యులు, వైద్యశాలలపై ఒత్తిడి ఉంటుంది. అందుకే అనేక దేశాలు ఆంక్షలు, అప్రమత్తత, సంసిద్ధత… కోణంలో ముందుకు సాగుతున్నాయి. మరొక అంశం – కొవిడ్‌-19 ఇం‌తకు ముందటి వేరియంట్‌లకు ఉపయోగించిన వ్యాక్సిన్‌ ఒమిక్రాన్‌ను నిరోధిస్తుందా? ఇది కూడా ఒక ప్రశ్నగా మిగిలి ఉంది. ఈ అంశం మీద ప్రస్తుతం అధ్యయనం జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఆఫ్రికాలో కనుగొన్న ఆ వైరస్‌ ‌గురించి శాస్త్ర వేత్తలలో చాలా ఆందోళనలు ఉన్నాయి. దీని వ్యాప్తి మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలిఫోర్నియాలో కనుగొన్న తొలి ఒమిక్రాన్‌ ‌లక్షణాలు ఉన్న వ్యక్తి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌తీసుకున్నవారే కావడం విశేషం. కానీ ఇక్కడ సంతోషించవలసిన విషయం ఒకటి ఉంది. ఇతడితో సన్నిహితంగా ఉన్నవారిలో నెగిటివ్‌ ‌వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్‌ ఇప్పటికే 50కి పైగా రూపాలు సంతరించుకుని ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ఇప్పుడు చాలా దేశాలు మాస్కు ధారణ, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలను ఆదరా బాదరా తప్పనిసరి చేశాయి. అమెరికా, బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌ల్లో కేసులు భారీగా నమోదవు తున్నాయి. గతంలో కన్నా ఈ దేశాల్లో 11 శాతం పెరిగినట్లు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. డిసెంబరు 20- 26 మధ్యలో 49 లక్షల మందికి పైగా వైరస్‌ ‌సోకింది. ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న కేసుల్లో సగానికి పైగా ఒక్క ఐరోపాలోనే ఉండటం గమనార్హం. ఫ్రాన్స్‌లో గత నెల చివరి వారంలో ఒక్కరోజే 2.08 లక్షల కేసులు నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలు, ఇతర పర్యాటకులు, ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, లేనట్లయితే 135 యూరోల జరిమానా విధిస్తామని పేర్కొంది. కొవిడ్‌ ‌తొలుత వెలుగుచూసిన చైనా సైతం ఆందోళనలో ఉంది. తన దేశంలో సుదీర్ఘ కాలం లాక్‌డౌన్‌లో ఉన్న షియాన్‌ ‌నగరంలోని కోటీ 30 లక్షల జనాభాకు అవసరమైన నిత్యావసరాలను ఇంటివద్దకే సరఫరా చేస్తోంది.

ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అగ్రరాజ్యమైన అమెరికాలోని లాస్‌ ‌వేగాస్‌లో కరోనా కేసులు పెరుగు తుండటం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. డిసెంబరు 25తో, ముగిసిన వారంలో నమోదైన వాటిల్లో 58.6 శాతం ఒమిక్రాన్‌ ‌కేసులే ఉండటం గమనార్హం. పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో ఒమిక్రాన్‌ ‌తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ 50 లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు అంచనా. ఒమిక్రాన్‌ ‌కారణంగా దేశంలో విమానాల రాకపోకలపై నియంత్రణ విధించారు. కొన్నింటిని రద్దు చేయగా మరికొన్నింటిని వాయిదా వేశారు. డెల్టా కంటే ఒమిక్రాన్‌ ‌వేగంగా విస్తరిస్తుంది. సమీప భవిష్యత్తులో కేసుల సునామీ తప్పకపోవచ్చు. దీనివల్ల వైద్య ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్‌ అధనోమ్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు.

మన దేశంలోనూ ఒమిక్రాన్‌ ‌ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌ఢిల్లీ, రాజస్తాన్‌, ‌తెలంగాణ, గుజరాత్‌, ‌కేరళ వంటి రాష్ట్రాల్లో పరిస్థితిని ఉన్నతాధి కారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లోనే కేసుల పెరుగుదల కనపడుతోంది. వీటిల్లో ఢిల్లీ, మహరాష్ట్రలో అత్యధికంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వైద్యులు, వైద్యశాలలు, ఔషధాల పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రయాణ సాధనాలపై ఆంక్షలు విధించారు. రైళ్లు, బస్సుల్లో సగం మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆటోలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంది. ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‘ఎల్లో అలర్ట్ ’‌ను ప్రకటించారు. ఇందులో భాగంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. బార్లు, రెస్టారెంట్లు సగం సామర్థ్యంతోనే పని చేస్తున్నాయి. ప్రైవేట్‌ ‌కార్యాలయాల్లో సగం మంది సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. విద్యాసంస్థలు, జిమ్‌లు, థియేటర్లను మూసివేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌బోధన కొనసాగుతోంది. శుభ, అశుభ కార్యక్రమాలకు 20 మందిని మించి అనుమతించడం లేదు. మాల్స్ ‌నిత్యావసరాలు కాని దుకాణాలను రోజు విడిచి రోజు తెరుస్తున్నారు. ఢిల్లీలో జన్యు పరీక్షలు చేపడుతున్న నమూనాల్లో 38 శాతం ఒమిక్రాన్‌వే ఉంటున్నాయి.

దేశ వాణిజ్య రాజధాని మహారాష్ట్ర రాజధాని ముంబయి మహా నగరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డిసెంబరు 10 నాటికి రాష్ట్రంలో 6,543 క్రియాశీల కేసులు ఉండగా 28 నాటికి 11,492కు పెరగడం ఇందుకు నిదర్శనం. ఒమిక్రాన్‌ ‌వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ ‌తొపే తెలిపారు. అదే సమయంలో ఈనెల 7వరకు 144 వ సెక్షన్‌ ‌విధించారు. ముంబయిలో బీచ్‌లు, పార్కులు, గార్డెన్లు తదితర ప్రాంతాలలో పోలీసులు రోజుకు 12 గంటలపాటు నిషేధం విధించారు. సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. ఈనెల 15 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పది మంది మంత్రులు, 20 మంది శాసనసభ్యులు కరోనా బారిన పడ్డారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌ ఈ ‌విషయాన్ని వెల్లడించారు. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత శరద్‌ ‌పవార్‌ ‌కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియ సూలె కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాలను సైతం కుదించిన విషయం తెలిసిందే. వర్ష గైక్వాడ్‌, ‌యశోమతి ఠాకూర్‌, ‌కేసీ పాడవి, జితేంద్ర అవ్హాద్‌, ‌ధనంజయ్‌ ‌ముండే, దిలీప్‌ ‌వాల్సె పాటిల్‌ ‌తదితర మంత్రులకు పాజిటివ్‌గా తేలింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలోనూ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కరోనా ప్రభావిత రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోనూ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. కేసుల్లో పెరుగుదల కనపడుతోంది. దీంతో బ్రిటన్‌ ‌సహా కరోనా ముప్పున్న దేశాల నుంచి నేరుగా వచ్చే విమానాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్‌, ‌హరియాణాల్లో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయి. డిసెంబరు 28న 6,358, 29న 9,195, 30న 13,091, 31న 16,764, జనవరి 1న 22,775 కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. పాజిటివిటీ రేటు వరుసగా 0.61 శాతం, 0.79 శాతం, 1.10 శాతం, 1.34 శాతం, 2.05 శాతం నమోదు కావడం ఆందోళనకర పరిణామం.

ఒమిక్రాన్‌ ‌విస్తృతి, వేగం, శక్తి గురించి అనేక శేషప్రశ్నలు ఉండవచ్చు. కానీ కరోనా కుటుంబం నుంచి వచ్చినదే కనుక, అది చేయగలిగిన నష్టం మాత్రం తక్కువేమీ ఉండదు. దీనిని నివారించడానికి వెంటనే చేయవలసినదీ, చేయగలిగేదీ ఒక్కటే- అప్రమత్తత. ఇప్పటికే రెండు దశలను, వాటిలోని తీవ్రతను అనుభవించిన ప్రపంచం జాగ్రత్తతోనే ఒమిక్రాన్‌ ‌నుంచి రక్షణ పొందాలి. ఇందులో మొదటి మెట్టు అప్రమత్తత. అనుమానితులు పరీక్షలు చేయించుకోవడం. విదేశాలకు వెళ్లవలసి వస్తే, ఆ దేశాన్ని బట్టి, స్థలాన్ని బట్టి ముందు జాగ్రత్త చర్యలతో మాత్రమే ప్రయాణం చేయాలి. వ్యాధి బారిన తొందరగా పడే అవకాశం ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ ‌వెంటనే జరిపించడం ప్రభుత్వాల విధి. ఇవన్నీ పాత నిబంధనలే అని అనిపించవచ్చు. పాతవే కూడా. వైరస్‌ ‌కూడా పాతదే. రూపం మార్చుకుంది అంతే.

ఒమిక్రాన్‌ను అధిగమించేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌భల్లా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌ ‌లేఖలు రాశారు. పండగ వేళల్లో ప్రజలు గుంపులుగా చేరడంపై ఆంక్షలు విధించాలని, కరోనాపై పోరులో అలసత్వానికి తావివ్వరాదని వారు పేర్కొన్నారు. కేసులను గుర్తించడం, వ్యాక్సిన్‌ అం‌దించడం, కొవిడ్‌ ‌నిబంధనలను పాటించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవా లని, హోం ఐసొలేషన్‌ ‌రోగుల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. రోగులకు తగిన సూచనలు చేసేందుకు ప్రత్యేక కాల్‌ ‌సెంటర్లు, కంట్రోల్‌ ‌రూములు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ నెల 3 నుంచి టీకాల కార్యక్రమం ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ ‌పక్రియ ప్రారంభించింది. తల్లితండ్రులు తమ చిన్నారుల పేర్లను కొవిన్‌ ‌యాప్‌ ‌లో నమోదు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్‌ ‌మాండవీయ సూచించారు. మొదటి డోసు వేయించుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా వీరు దాదాపు ఏడున్నర కోట్ల మంది ఉంటారని అంచనా. అరవయ్యేళ్లు దాటి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రికాషన్‌ ‌డోసు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈనెల 10 నుంచి వీరికి టీకా అందివ్వనున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 141 కోట్ల డోసులను పంపిణీ చేశారు. వీరిలో 90 శాతం మంది ఒక్క డోసు స్వీకరించారు. 62 శాతం మంది రెండో డోసు తీసుకున్నారు.

మరోపక్క అత్యవసర వినియోగం కోసం కొత్తగా మరో రెండు టీకాలకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. పుణె లోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా తయారు చేసిన కొవొవ్యాక్స్, ‌బయలాజికల్‌-ఈ- ‌సంస్థ తయారు చేసిన కార్పెవాక్స్ ‌వినియోగానికి అనుమతించింది. మోల్ను పిరవిల్‌ ఔషధం అత్యవసర వినియోగానికి కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశంలో మొత్తం 8 రకాల టీకాలు అందుబాటులోకి వచ్చినట్లయింది. కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్, ‌స్పుత్నిక్‌ -‌వి, జైకొవ్‌-‌డి, మోడెర్నా, జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌, ‌కొవొవాక్స్, ‌కార్పెవాక్స్ …‌టీకాలు ప్రస్తుతం వినియోగంలోకి వచ్చాయి. దీంతో ఒమిక్రాన్‌ను అధిగమించవచ్చనే ఆశాభావం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరోనా మొదటి, రెండో దశల అనుభవాల నేపథ్యంలో తాజాగా వెలుగుచూసిన ఒమిక్రాన్‌ను అడ్డుకోవచ్చు. కొన్ని దేశాల్లో కరోనా కేసులు నియంత్రణలో ఉండటం ఆశావాహ పరిణామం. టోంగా, మైక్రోనేషియా, సెయింట్‌ ‌హెలేనా, సమోవా, మార్షల్‌ ఐలాండ్స్, ‌వనాటు, పలావ్‌, ‌పశ్చిమ సహారా, ఎంఎస్‌ ‌జాండ్యామ్‌ ‌వంటి దేశాల్లో కరోనా కేసులు సింగిల్‌ ‌డిజిట్‌ ‌కే పరిమత మవడం విశేషం.

ఒమిక్రాన్‌ను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టింది. 15నుంచి 18ఏళ్ల లోపు పిల్లలు, ఆరు పదులు నిండిన వారు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌కు బూస్టర్‌ ‌డోస్‌ అం‌దించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్యమంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. కేంద్రం నిర్దేశం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం కూడా ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొదటి డోసు సగటు 90 శాతం కాగా, తెలంగాణలో వంద శాతం, రెండో డోసు జాతీయ సగటు 61 శాతం కాగా రాష్ట్రంలో 64 శాతం నమోదైంది. మొత్తానికి ఒమిక్రాన్‌ ‌పై అన్ని విధాలా సమరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు, అధికార యంత్రాంగం లోనూ ఎదుర్కోగలమన్న ధీమా వ్యక్తమవుతోంది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram